శ్రీ భగవద్రామానుజాచార్యులు
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"
💫 1017వ సంవత్సరంలో తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో జన్మించిన శ్రీరామానుజులు, తన 120 ఏళ్ల సుదీర్ఘ జీవితకాలంలో మూడుసార్లు తిరుమలయాత్ర చేశారు. శ్రీవేంకటాచలక్షేత్రాన్ని సాక్షాత్తు శ్రీనివాసుని ప్రతిరూపంగా భావించి ఆ దివ్యక్షేత్ర మహాత్మ్యాన్ని పలువిధాలుగా లోకానికి తెలియ జెప్పారు.
🌈 ఐతిహ్యం 🌈
💫 పురాణాలను అనుసరించి త్రేతాయుగంలో లక్ష్మణునిగా, ద్వాపరయుగంలో బలరామునిగా అవతరించిన ఆదిశేషుడు కలియుగంలో రామానుజుల రూపుదాల్చాడు. రామ+అనుజుడు అంటే, శ్రీరామునికి తమ్ముడని అర్థం. ఆ విధంగా రామానుజులు సార్థక నామధేయుడయ్యాడు.
🌈 తిరుమలక్షేత్ర సందర్శనం - నాందీ ప్రస్తావన 🌈
💫 తిరుమల క్షేత్రానికి, రామానుజుల జీవితానికి విడదీయరాని అనుబంధం ఉంది.
🌈 రామానుజాచార్యులు తిరుమలను సందర్శించడానికి అనేక కారణాలున్నాయి:
🚩 తన మేనమామ, గురువు అయిన తిరుమలనంబి ద్వారా మరియు శిష్యుడయిన అనంతాళ్వార్ ద్వారా; అప్పటికే సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన తిరుమల లోని శ్రీవారి ఆలయంలో అర్చన, ఉత్సవ, కైంకర్యాది కార్యాలు వైఖానస ఆగమశాస్త్రానుసారం జరగడం లేదన్న విషయాన్ని తెలుసుకున్న రామానుజాచార్యులు అక్కడి పరిస్థితులను చక్కదిద్దాలనుకున్నారు.
🚩 రామానుజ ప్రచలిత, విశిష్టాద్వైతానికి ఆధారగ్రంథమైన దివ్యప్రబంధంలో, శ్రీవేంకటేశ్వరునకు సంబంధించిన పాశురాలు చదివి ఉత్తేజితుడయ్యాడు.
🚩 అంతకు మునుపే, తనకు ఆప్తుడైన తిరుమలనంబి తిరుమలలో స్థిరనివాసం ఏర్పరచుకుని కైంకర్యాదులు నిర్వహిస్తున్నారు.
🚩 శ్రీరంగం లాంటి వైష్ణవాలయాలలో పూజాకార్యక్రమాలు జరగటానికి నియమావళిని ఏర్పాటుచేసిన రామానుజులు, తిరుమలలో కూడా అలాంటి వ్యవస్థను నిర్వహించదలచారు.
🚩 వైష్ణవులయినవారు తమ జీవితకాలంలో ఒక్కసారైనా వేంకటాచలక్షేత్రాన్ని వీక్షించి తరించాలని కోరుకుంటారు.
💫 పై వాటన్నింటి వల్ల, శ్రీరామానుజులు వారు తిరుమల క్షేత్రాన్ని దర్శించాలని దృఢంగా సౌకల్పించారు.
🌈 గోవిందరాజస్వామి ఆలయ నిర్మాణం 🌈
💫 తిరుమల యాత్రలో మొదటి మజిలీగా తిరుపతి చేరుకున్న రామానుజులు, భగవత్కార్యాన్ని అక్కడే ప్రారంభించారు.
💫 దక్షిణాదిన శైవమత ప్రాబల్యం అధికంగా ఉన్న రోజుల్లో కుళోత్తుంగచోళుడనే శైవారాధక పాలకుడు విష్ణుద్వేషిగా మారి; కావేరీ తీరంలో, చిత్రకూట ఆలయం నందున్న గోవిందరాజస్వామి విగ్రహాన్ని సముద్రంలో పారవేశాడు. "క్రిమికంఠుడని" కూడా పిలువబడే ఆ చోళరాజు, ఆ సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాన్ని శైవక్షేత్రంగా మార్చాడు. నాటి చిత్రకూటమే తమిళనాడు లోని ఇప్పటి "చిదంబరం". విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన ఆ విగ్రహం సముద్రం పాలు కావడంతో పాలకుని విష్ణుద్వేషానికి కలత చెందిన కొందరు వైష్ణవులు, ఆ ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను తీసుకుని వెళ్ళి తిరుపతి క్షేత్రంలో భద్రపరిచారు.
💫 ఈ వృత్తాంతాన్ని తెలుసుకుని విషణ్ణుడైన రామానుజులు సముద్రం పాలైన గోవిందరాజస్వామి మూలవిరాట్టు ప్రతిరూపాన్ని తిరుపతిలో ప్రతిష్ఠింప జేసి, తన శిష్యుడైన యాదవరాజుతో అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడేలా సమున్నతమైన ప్రాకారాలు, ఆకాశాన్ని చుంబించే గోపురాలతో, సువిశాలమైన గోవిందరాజస్వామి ఆలయాన్ని నిర్మింపజేశాడు. తిరుపతి పట్టణం నడిబొడ్డున, రైల్వే స్టేషన్ సమీపంలో ఇప్పుడు మనం చూస్తున్న గోవిందరాజస్వామి ఆలయం అదే!
దానికి కొంత దూరంలో ఆలయనిర్మాణం కాక మునుపే ఉన్న ఓ విశాలమైన పుష్కరిణిని కూడా నేడు చూడవచ్చు. తిరుమల యాత్రికులు ముందుగా గోవిందరాజస్వామిని దర్శించుకునే సాంప్రదాయం నేటికీ ఉంది.
💫 తిరుపతి పట్టణంలో, ఈనాడు "మంచినీటి కుంట" గా పిలువబడే "నరశింహ క్షేత్రం" ఒడ్డున; ఆలనా పాలనా లేకుండా ఈనాడు కూడా పడి ఉన్న శయనముద్ర లోని గోవిందరాజస్వామి విగ్రహం, ఆనాడు సముద్రంలో పారవేయబడిన విగ్రహమేనని చరిత్రకారుల అభిప్రాయం. ఆ మూర్తిని చిత్రకూటం నుండి రవాణా చేస్తున్నప్పుడు కొద్దిగా దెబ్బ తిని ఆరాధనకు అనర్హమవ్వడం వల్ల దానిని ఈ ప్రదేశానికి తరలించినట్లు చెబుతారు. ఈసారి తిరుపతి యాత్రలో, చూడచక్కగా, జీవకళతో ఒప్పారుతూ ఉండే, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఆ విగ్రహాన్ని తప్పక దర్శించండి.
🌈 పాదాలమండపం 🌈
💫 తిరుమల క్షేత్రాన్ని దర్శించుకోవటానికి పూర్వం కొంతకాలం తిరుపతిలో నివాసం ఉండిన రామానుజులు, తన గురువుగారైన తిరుమలనంబి ద్వారా శ్రీమద్రామాయణం లోని ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోదలిచారు. రామానుజుల కోర్కె మేరకు, తిరుమలక్షేత్రంలో నివాసముండే తిరుమలనంబి ప్రతిరోజు ఉదయం శ్రీవారి కైంకర్యాలు ముగించుకొని, అలిపిరి నడక మార్గానికి ప్రారంభంలో ఉన్న తన తింత్రిణీవృక్షం (చింతచెట్టు) వద్దకు వచ్చేవారు. అదే సమయానికి గోవిందరాజస్వామిని సేవించుకొని రామానుజులవారు ఆ ప్రదేశానికి చేరుకుని, తిరుమలనంబి ద్వారా రామాయణకావ్య రహస్యాలు తెలుసుకునేవారు. సాయం సమయానికి తిరుమలనంబి తిరుమలక్షేత్రం తిరిగి చేరుకునేవారు. ఆ విధంగా ఒక్క సంవత్సర కాలంలో 18 పర్యాయాలు, 18 రకాలుగా, రామాయణ రహస్యాలను చర్వితచరణం కాకుండా తిరుమలనంబి, రామానుజులకు విశదీకరించారు.
💫 రామాయణ పారాయణం ఇలా కొనసాగుతున్న తరుణంలో, ఒకసారి తిరుమలనంబి తాను ఉభయ సంధ్యలలో మాత్రమే శ్రీవారిని దర్శించుకో గలుగుతున్నానని, అలిపిరిలో ఉండిపోవడం వల్ల మధ్యాహ్న సమయంలో శ్రీవారి దర్శనభాగ్యం కలగడం లేదని వాపోయారు. భక్తుని యొక్క ఆర్తిని అర్థం చేసుకున్న శ్రీనివాసుడు, రామాయణ ఉపదేశం జరుగుతున్న ప్రదేశం లోనే తన పాదపద్మాలు ప్రత్యక్షమయ్యేట్లు చేశారు. అప్పటినుండి అపరాహ్ణసమయంలో కూడా, రామాయణ ప్రసంగం మధ్యలో తిరుమలనంబి, రామానుజులు వార్లు శ్రీవారి పాదదర్శనం చేసుకుంటూ ఉండేవారు. అలిపిరి నడక మార్గం ప్రారంభంలో ఈనాడు మనం "శ్రీవారి పాదమండపం" గా చెప్పుకునే దేవాలయంలో విరాజిల్లుతున్న పాదపద్మాలు అవే. ఆ దేవాలయాన్ని సందర్శించుకునే భక్తులను శ్రీవారి లోహపాదుకలతో అర్చకులు ఆశీర్వదించే సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.
🌈 త్రోవభాష్యకార్లనన్నిథి 🌈
💫 రామానుజుల కలం నుంచి వెలువడిన ఆణిముత్యాలలో, శ్రీభాష్యం విశిష్టమైంది. అందువల్లనే రామానుజులవారు "భాష్యకారులుగా" ప్రసిద్ధికెక్కారు. వైష్ణవాలయాలన్నింటిలో, "భాష్యకార్లసన్నిధి" యందు కొలువై ఉండే రామానుజులవారిని మనం దర్శించుకోవచ్చు.
💫 ఒకసారి రామానుజులవారు తిరుమల క్షేత్రానికి పయనమై తన పాదాలతో వేంకటాచలాన్ని అపవిత్రం చేయడానికి మనస్కరించక, మార్గ మధ్యలో ఉన్న వేంకటాద్రిగా భావింపబడే మోకాళ్ళపర్వతాన్ని తన మోకాళ్ళతో అధిరోహించ సాగారు. మోకాలి చిప్పలు గాయ పడడంతో, మోకాళ్ళపర్వతం మధ్యభాగంలో కొంత సేపు విశ్రమించారు. విషయాన్ని తెలుసుకున్న అనంతాళ్వార్, తిరుమలనంబి, కొండపై నుండి కొంత దూరం దిగి వచ్చి, రామానుజుల వారి కెదురేగి, స్వామివారి ప్రసాదం అయిన మామిడి పండ్లను రామానుజులకు సమర్పించారు. వారు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించగా, క్రిందపడిన ఉచ్ఛిష్టం (ఫలాలను తినగా మిగిలన టెంకలు) మొలకెత్తి కొన్నాళ్లకు పెద్దవయ్యాయి. తరువాతి కాలంలో, ఆ పవిత్రస్థలంలో ఓ మందిర నిర్మాణం జరిగి, అందులో భగవద్రామానుజుల మూర్తి ప్రతిష్ఠించబడింది. ఆ ఆలయాన్ని, తిరుపతి-తిరుమల "త్రోవలో" ఉన్న కారణం చేత, "త్రోవభాష్యకార్లసన్నిధిగా" పిలుస్తారు. అలిపిరి నడకమార్గంలో, దాదాపు మూడొంతులు ప్రయాణం చేసిన తర్వాత వచ్చే "మోకాళ్ళపర్వతం" మధ్యభాగంలో ఈ ఆలయాన్ని నేడు కూడా చూసి తరించవచ్చు.
🌈 తిరుమల క్షేత్ర ఆగమనం 🌈
💫 మోకాళ్ళపర్వతం మెట్లన్నీ మోకాళ్ళపై అధిరోహించి తిరుమల చేరుకున్న రామానుజాచార్యులు, తదనంతర కాలంలో ఆలయాభివృద్ధికి అవిరళ కృషిచేశారు. శ్రీకృష్ణరాయలు ఆలయాన్ని భౌతికంగా అభివృద్ధి చేస్తే, అంతకు ఐదు శతాబ్దాల క్రితమే రామానుజులు శ్రీవారి ఆనందనిలయానికి ఆధ్యాత్మిక సొబగులు చేకూర్చి, నిర్జనారణ్యంలా ఉండే దేవాలయ పరిసరాల్ని ఆవాసయోగ్యంగా అభివృద్ధి పరచి, ఆలయనిర్వహణను, వైదిక కైంకర్యాలను క్రమబద్ధీకరించి, భక్తుల కొంగుబంగారమైన శ్రీవారి ఆలయాన్ని భద్రంగా భావితరాల కందించారు.
🌈 ఆలయసందర్శన 🌈
💫 మోకాళ్ళపై తిరుమల క్షేత్రం చేరుకున్న రామానుజులు, క్షేత్ర సాంప్రదాయాన్న నుసరించి మొట్టమొదటగా శ్రీభూసమేత ఆదివరాహ స్వామి ని దర్శించారు.
💫 కలియుగారంభంలో శ్రీనివాసునికి, వరాహస్వామికి జరిగిన ఒప్పందం ప్రకారం, మొదటిదర్శనం, మొదటి పూజ, మొదటి నైవేద్యం ఆదివరాహుడికే చెందాలన్న నియమాన్ని పునరుద్ధరించి, స్వామివారు ఆదివరాహునికి చేసిన వాగ్దానాన్ని చెల్లుబాటు చేశారు. ఈ ఒప్పంద వివరాలను "ఆదివరాహస్వామి ఆలయం" అనే ప్రకరణంలో ఇంతకుముందే తెలుసుకున్నాం. తరువాత ఆనంద నిలయంలోని శ్రీవారిని సందర్శించారు.
🌈 విష్ణువా? శివుడా? 🌈
💫 ఆ సమయంలో మూలమూర్తి శివుడని, అమ్మవారని, వీరభద్రుడని రకరకాల వాదనలుండేవి. వాగ్వాదాలు, సవాళ్ళు, ప్రతిసవాళ్ళతో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొని ఉండేది. అన్నింటికంటే, మూలమూర్తిని "శివునిగా" భావించే శైవులవాదం ప్రబలంగా ఉండేది. రామానుజులవారు అప్పటి పాలకుడు, తన శిష్యుడు అయిన యాదవరాజు సమక్షంలో, పురాణేతిహాసాల ప్రామాణికంగా, హేతుబద్ధమైన తర్కంతో, ఆ మూలమూర్తి విష్ణుమూర్తి అవతారమైన వేంకటేశ్వరుడేనని సాక్ష్యాధారాలతో నిరూపించారు. రామానుజులవారి తర్కాన్ని యాదవరాజు విశ్వసించాడు గాని, కరుడు గట్టిన శైవులు మాత్రం నమ్మలేదు. వాదోపవాదాలతో విసిగిపోయిన యాదవరాజు, రామానుజుల చొరవతో వైష్ణవులు, శైవులను సమావేశపరచగా, వారిద్దరూ ఓ ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం ఒకరోజు, సుదర్శనచక్రం, శంఖం వంటి వైష్ణవచిహ్నాలను చేయించి భగవంతుని సన్నిధిలో ఉంచారు. అలాగే త్రిశూలం, డమరుకం వంటి శైవచిహ్నాలను కూడా ఆలయంలో ఉంచారు. ఆనాటి రాత్రి కట్టుదిట్టమైన కాపలాతో, ఆలయ ద్వారాలు మూసి ఉంచారు. తెల్లవారేసరికి స్వామి ఏ చిహ్నాలను ధరిస్తే అదే అవతారంగా అందరూ అంగీకరించాలని నిర్ణయించుకున్నారు.
💫 ఆరోజు రాత్రి తన తపఃశ్శక్తితో శ్రీనివాసుణ్ణి సాక్షాత్కారం చేసుకున్న రామానుజులు, శంఖు - చక్రాలను స్వీకరించాల్సిందిగా శ్రీవారిని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. మరునాడు ఉదయం ఆలయద్వారాలు తెరిచేటప్పటికి స్వామివారు కరుణించి, ఉభయహస్తాలతో శంఖు-చక్రాలు ధరించి దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. దాంతో శైవుల వాదం వీగిపోయింది. రామానుజులవారు ఆలయానికి మహాసంప్రోక్షణ గావించి, తిరుమల నిర్ద్వందంగా వైష్ణవ క్షేత్రమేనని, అందులో కొలువుండేది సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీనివాసుడేనని దేశమంతటా ప్రచారం గావించాడు.
💫 తిరుమల వైష్ణవ క్షేత్రమేనని నిరూపింపబడటంతో, వైఖానస ఆగమకైంకర్యాలు పూర్తిస్థాయిలో జరగడం మొదలయ్యాయి. రామానుజులు "పాంచరాత్ర" ఆగమసాంప్రదాయానికి చెందినవాడైనప్పటికీ, ఏవిధమైన పక్షపాతం చూపకుండా, అనూచానంగా వస్తున్న ఆలయ ఆచారం ప్రకారం, "వైఖానస" ఆగమసాంప్రదాయాలనే కొనసాగిస్తూ వచ్చాడు.
🌈 మూలమూర్తికి మరిన్ని సొబగులు 🌈
💫 వీరనరసింహరాజు అనే ఓ ప్రభువు ఎప్పుడో శ్రీవారికి ఒక నాగాభరణం సమర్పించాడు. శ్రీవారి మరో హస్తం ఖాళీగా ఉండడంతో, రామానుజులు స్వామివారి రెండవ చేతికి కూడా నాగాభరణం చేయించారు. ఇప్పుడు స్వామివారు ఇరుహస్తాలకు నాగాభరణ భూషితుడై దర్శనమిస్తారు.
💫 స్వామివారి మూలవిరాట్టు ఎల్లప్పుడూ పట్టుపీతాంబరాలతో, వజ్రవైడూర్యఖచిత స్వర్ణాభరణాలతో, పూలమాలలతో అలంకరింపబడి ఉండటంవల్ల స్వామివారి వక్షస్థలలక్ష్మిని కేవలం శుక్రవారం అభిషేకసమయంలో మాత్రమే దర్శించుకోగల్గుతాం. మిగిలిన సమయాల్లో కేవలం స్వామిదర్శనంతోనే సంతృప్తి పడాల్సి రావడం భక్తులకు తీరని లోటుగా భావించిన రామానుజులు, ఒక బంగారు అలమేల్మంగ ప్రతిమను తయారు చేయించి స్వామివారికి కుడివైపున అలంకరింప జేశారు. తరువాతి కాలంలో భూదేవికి ప్రతిరూపంగా మరో బంగారుప్రతిమ శ్రీవారి మెడలో సమర్పింపబడింది. అప్పటినుండి రెండు బంగారుప్రతిమలు శ్రీవారి ఉదరభాగంలో అలంకరింపబడి దర్శనమిస్తున్నాయి.
💫 అప్పటిపాలకులను ప్రేరేపించి శిథిలావస్థలో ఉన్న ఆనందనిలయ విమానాన్ని, గర్భాలయ కుడ్యాలను జీర్ణోద్ధారణ గావించారు. నిత్యకైంకర్యాలు, నైవేద్యసమర్పణలు నిరాటంకంగా కొనసాగటంకోసం అప్పటి పాలకులు, భక్తులనుండి భూములను దేవదేయాలుగా ("దేవదత్తం" అంటే దేవుడు మనకు ప్రసాదించేది. "దేవదేయం" అంటే, భక్తులు దేవునికి సమర్పించుకునేది) సమీకరించి, ఆ వివరాలను శిలాశాసనబద్ధం గావించి, వాటి ద్వారా వచ్చే ఆదాయంతో శాశ్వత ఏర్పాట్లు చేశారు. వెయ్యేళ్ళ క్రితం భక్తులు శ్రీవారికి సమర్పించుకున్న అనేక భూములు ఇంకా అన్యాక్రాంతం కాకుండా ఉండటానికి, దూరదృష్టితో రామానుజులవారు ఆనాడే చేపట్టిన ఈ చర్యలన్నీ ఎంతో దోహదపడ్డాయి. నేటికీ తిరుపతి పరిసరప్రాంతాలలో వేలాది ఎకరాల "మఠం" భూములు, తి.తి.దే. ఆధ్వర్యంలోనే ఉన్నాయి. "మఠం" అంటే "మహంతుమఠం" అన్నమాట. మహంతులంటే శ్రీవారి మహాభక్తుడు "హాథీరాంబాబా" వంశస్థులు. ఈ భక్తాగ్రేసరుని గురించి మున్ముందు తెలుసుకుందాం.
💫 అంతకుపూర్వం స్వామివారికి సన్నటి రేఖలతో కూడుకున్న తిరునామాలుండేవి. వాటిస్థానంలో, కస్తూరి, పచ్చకర్పూరం దట్టంగా అద్ది, ఇప్పుడు మనం చూసే వెడల్పాటి ఊర్ధ్వపుండ్రం ఎల్లవేళలా శ్రీవారి నుదుటి నలంకరించి ఉండే ఏర్పాటు చేసింది రామానుజుల వారే! శ్రీవారి నిజ నేత్రదర్శనానికి వీలుగా, శుక్రవార అభిషేక సమయంలో మాత్రం నామాలను చిన్నగా ఉంచే సాంప్రదాయాన్ని కూడా రామానుజులవారే ప్రవేశపెట్టారు.
💫 విమానప్రదక్షిణ మార్గంలో ఈశాన్యదిక్కున యోగానరసింహస్వామి విగ్రహప్రతిష్ట చేయించి, నిత్యపూజా నివేదన కట్టడి చేశారు. వ్యాఖ్యానముద్రలో ఉన్న తన శిలావిగ్రహాన్ని స్వయంగా ఆలింగనం చేసుకొని, దానిని అనంతాళ్వార్ కు బహూకరించారు. ఈ విగ్రహం విమాన ప్రాకారంలోనే ఉన్న భాష్యకార్లసన్నిధిలో ప్రతిష్ఠించబడింది. ఈ మందిరంలో ఉన్న రామానుజులవారి పాదుకలు కల్గిన "శెఠారి" కి తన పేరు పెట్టుకొని రామానుజుల పట్ల తనకున్న అపారమైన భక్తిని చాటుకున్నాడు ధన్యజీవి "అనంతాళ్వార్".
🌈 ఇతర సాంప్రదాయాలు 🌈
💫 నమ్మాళ్వార్ విరచిత పాశురాల ద్వారా స్వామివారు పుష్పప్రియుడని తెలుసుకుని, తన శిష్యుడైన అనంతాళ్వార్ ను ప్రేరేపించి తిరుమలలో పుష్పకైంకర్యం కొనసాగింపు చేశారు. పుష్పమండపంగా పేరుగాంచిన తిరుమల క్షేత్రంలో పుష్పాలన్నీ స్వామివారికి మాత్రమే చెందాలనే మహత్తరలక్ష్యంతో, కొండపై ఎవ్వరూ పువ్వులు ధరింపరాదని, పూజానంతరం కూడా ఆ నిర్మాల్యాన్ని ఎవ్వరికి ప్రసాదించకుండా, పూలబావిలో నిక్షిప్తమైవున్న భూదేవికి సమర్పించాలనే కట్టడి చేశారు. శ్రీవారి మరోభక్తుడు తిరుమలనంబిని శ్రీనివాసుడు "తాతా" అని పిలిచిన రోజుకు గుర్తుగా, ప్రతిసంవత్సరం జరిగే "తన్నీరుముదు” ఉత్సవానికి కూడా రామానుజులవారే శ్రీకారం చుట్టారు. ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా "తిరుప్పావై" పఠనాన్ని, తోమాలసేవలో "దివ్యప్రబంధ" పారాయణాన్ని, ఇతర ఉత్సవ సమయాల్లో "శాత్తుమురై" గానాన్ని సైతం రామానుజులవారే ప్రవేశపెట్టారు.
💫 అంతకు పూర్వం, బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరిగేవి కాదు. మొదటి రోజు ధ్వజారోహణ మాత్రం తిరుమలలో జరిపి, మిగతా ఉత్సవాలన్నీ తిరుచానూరులో జరిపించేవారు. కీకారణ్యంతో కూడుకున్న తిరుమలలో ఆ ఉత్సవాలకు కావలసిన సాధన-సంపత్తులు, వసతులు లేకపోవడమే దానికి కారణం. స్వామివారికి చెందిన ఉత్సవాలన్నీ తిరుమలలోనే జరగాలనే లక్ష్యంతో తిరుమల మాడవీధులను విశాలంగా తీర్చిదిద్ది, అర్చకులకు, జియ్యంగార్లకు ఆలయసమీపంలోనే నివాసగృహాలు ఏర్పరిచి, అప్పటినుండి తిరుమలలోనే బ్రహ్మోత్సవాలన్నీ జరిగేలా ఏర్పాట్లు చేశారు. తిరుమల క్షేత్రం అంతా పూదోటలు ఏర్పాటుచేసి స్వామివారి నిత్యకైంకర్యాలకు పూలను విరివిగా ఉపయోగించే సాంప్రదాయాన్ని అమల్లోకి తెచ్చారు. ఆలయనిర్వహణ, కైంకర్యాదులు సజావుగా సాగడం కోసం రామానుజులవారు ప్రవేశపెట్టిన ఏకాంగివ్యవస్థ గురించి, తదనంతర కాలంలో అదే జియ్యంగార్ల వ్యవస్థగా మార్పు చెందటం గురించి ఇంతకుముందే తెలుసుకున్నాం.
🌈 రామానుజుల పేరిట ఉత్సవాలు 🌈
💫 శ్రీనివాసునికి, ఆనందనిలయానికి, తిరుమల క్షేత్రానికి రామానుజుల వారందించిన అనిర్వచనీయమైన సేవలకు గుర్తుగా, ఈనాటికీ ఆనందనిలయంలో రామానుజుల వారి పేరున కొన్ని ఉత్సవాలు జరుగుతాయి. రామానుజుల జన్మనక్షత్రమైన "ఆర్ధ్రానక్షత్రం" నాడు జరిగే మాసోత్సవం గురించి ఇంతకు ముందే తెలుసుకున్నాం. వైశాఖమాసంలో శ్రీరామానుజ జయంతి సందర్భంగా జరిగే పదిరోజుల ఉత్సవాల యందు, భాష్యకార్లసన్నిధిలో ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. స్వామివారి శేషహారతి, తీర్థ-చందనాలు రామానుజులవారికి ప్రసాదిస్తారు.
🌈 సంస్కరణలు 🌈
💫 అప్పట్లో కొందరికి మాత్రమే పరిమితమై ఉన్న వైష్ణవమతాన్ని అందరికీ ఆమోదయోగ్యం చేస్తూ, సమాజంలోని అత్యున్నతస్థాయి నుండి అట్టడుగున ఉన్న వారందరికీ వైష్ణవమతాన్ని స్వీకరించే అర్హత కల్పించారు. హైందవ సంస్కృతికి గుళ్ళూ గోపురాలు ఆయువుపట్లని విశ్వసించిన శ్రీరామానుజులు, దేశం నలుమూలలా సంచరించి ఎన్నో వైష్ణవాలయాలను పునరుద్ధరించి వాటిలో నిత్యకైంకర్యాలకు శాశ్వత ఏర్పాట్లు చేశారు. అప్పటివరకు అస్తవ్యస్తంగా ఉన్న అర్చారీతులన్నింటినీ తీర్చిదిద్ది సక్రమమైన ఆలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అటువంటి క్షేత్రాల్లో శ్రీవేంకటాచలక్షేత్రం ప్రధానమైనది.
💫 మధ్వాచార్యులు ద్వైతమతానికి, ఆదిశంకరులు అద్వైతమతానికి కృషి చేసినట్లే, విశిష్టాద్వైత వ్యాప్తికి ఎంతగానో కృషి చేసిన రామానుజాచార్యులు, అనేకానేక ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా రచించారు. వాటిలో శ్రీభాష్యం, గీతా భాష్యం, వేదాంతదీపం, వేదాంతసారం, శ్రీరంగగద్యం, శరణాగతిగద్యం, వైకుంఠగద్యం ముఖ్యమైనవి.
💫 కలియుగ సంవత్సరం 4118, పింగళవర్షం, చైత్రమాసం, ఆర్ధానక్షత్రం, శుక్లపంచమి తిథి నాడు (ఏప్రిల్ 13, 1017 సం.), తమిళనాడులోని భూతపురంలో (నేటి శ్రీపెరంబుదూరు), ఆసూరి కేశవాచార్యులు, కాంతిమతి పుణ్యదంపతులకు జన్మించిన శ్రీమద్రామానుజులు, 120 వసంతాలు జీవించి; 1237 సం. లో, శ్రీరంగం నందు తుదిశ్వాస విడిచారు.
(ఈ లెక్క ప్రకారం, క్రీ. పూ. 3101 సం. లో కలియుగం ప్రారంభమైనట్లు).
అన్నమయ్య, రామానుజులను "పలికేదైవం" గా కీర్తించాడు:
గతులన్ని ఖిలమైన కలియుగమందును
గతి యితడే చూపె ఘన గురు దైవము.
వెలయించె నీతడె కా వేదపురహస్యము
చలిమి నీతడే చూపె శరణాగతి
నిలిపి నా డీతడె కా నిజముద్రాధారణము
మలసి రామానుజులే మాటలాడే దైవము.
No comments :