🙏 *సప్తగిరుల సమారోహమైన తిరుమలక్షేత్రం లోని ఏడవ శిఖరం “వేంకటాద్రి” పై నెలకొన్న ఆనందనిలయంలో శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు.* 🙏
🌈 *తిరుమలకు నడక మార్గాలు*
💫 తిరుమల క్షేత్రం చేరుకోడానికి అనాదిగా నాలుగు ముఖ్యమైన మార్గాలున్నాయి:
🌹 చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక స్థలమైన తలకోన నుండి అరణ్యమార్గంలో దాదాపు నలభై కిలోమీటర్లు ప్రయాణించి తిరుమలకు చేరుకోవచ్చు. కాలాంతరాన ఈ మార్గం పూర్తిగా కనుమరుగై పోయింది.
🌹 రెండవమార్గం కడప జిల్లా నుండి వచ్చేవారికి అనుకూలంగా ఉండేది. ఈ మార్గం కడప పట్టణంలో ప్రస్తుతం *"దేవునిగడప"* గా ప్రాచుర్యం పొందిన వేంకటేశ్వరుని ఆలయం నుండి ప్రారంభమయ్యేదని చెబుతారు. అచ్చటి నుండి కుక్కలదొడ్డి, మామండూరు గ్రామాల మీదుగా కనుమలతో కూడుకున్న అడవుల్లో సాగిపోయే ఈ మార్గం ప్రస్తుతం చాలావరకు శిథిలమైపోయింది. అయితే, ఈ దారిలో పురాతన సోపానమార్గపు ఆనవాళ్లు, కొన్ని విశ్రాంతి మంటపాలు ఇప్పటికీ కనిపిస్తాయి. తిరుమలక్షేత్ర మందు పాపనాశనం వెళ్లే దారిలోని *"గోగర్భం"* ఆనకట్ట ప్రక్కన ఉన్న *"ఈతకాయల మంటపం"* వాటిలో ఒకటి. ఇప్పటికీ అప్పుడప్పుడు కొందరు ఔత్సాహికులు అటవీశాఖ వారి ప్రత్యేక అనుమతితో, విశేష సందర్భాలలో ఈ మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అపాయాలతో కూడుకున్న, జనసంచారం లేని ఈ మార్గంలో ఒంటరిగా ప్రయాణించడం ఒకరకంగా సాహసయాత్రే!
🌹 మూడవది మనలో చాలామందికి సుపరిచితమైన తిరుపతి పట్టణం లోని *"అలిపిరి"* నుండి మొదలయ్యేది.
🌹 నాలుగవ మార్గం చంద్రగిరి పరిసర ప్రాంతం నుండి బయలుదేరి తిరుమలకు చేరుకుంటుంది. దీనినే *"శ్రీవారిమెట్లు'* గా పిలుస్తారు. -
💫 ఇవే కాకుండా, తిరుమల క్షేత్రానికి నలుదిక్కుల నుంచి ఇంకా అనేక మార్గాలు ఉన్నట్లుగా చెబుతారు. పురాణాల ననుసరించి కపిలతీర్థం ఆలయం నుండి ఒక రహస్యమైన సొరంగమార్గం కూడా ఉండేది. తొండమాన్ చక్రవర్తి ఆ మార్గం గుండా వెళ్లి స్వామిని సేవించుకునే వాడు.
💫 ప్రస్తుతం *"అలిపిరి"* మరియు *"శ్రీవారిమెట్లు"* నడకమార్గాలు లేదా మెట్ల మార్గాలు మాత్రమే (వాహనాలు వెళ్ళి వచ్చే రెండు ఘాట్ రోడ్ లు కాకుండా) వాడుకలో ఉన్నాయి.
🌈 *నడక మార్గంలో మెట్లు*
💫 1850వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం యాత్రికుల సౌలభ్యం కోసం కొండమీదకు ఉన్న నడకదారిలో మెట్లను నిర్మించింది. 1953వ సంవత్సరంలో ఆలయం తి.తి.దే. ఆధ్వర్యం లోకి వచ్చిన తర్వాత, 26 వేల రూపాయల ఖర్చుతో ఆ మెట్ల మార్గం అభివృద్ధి చేయబడింది. ఈ మెట్లు నిర్మించక ముందు, అంటే దాదాపుగా 150 సంవత్సరాల క్రితం, తిరుమల యాత్ర దుర్గమంగా ఉండేది. మార్గమధ్యంలో తరచుగా తారసపడే చిరుతలు, ఎలుగుబంట్ల వంటి క్రూర జంతువులను పారద్రోలటానికి డప్పులు వాయించేవారు; రాత్రులందు మంటలు కూడా వేసేవారు. దొంగల భయం అధికంగా ఉండడం చేత యాత్రికులు సమూహాలుగా మాత్రమే వెళ్లేవారు. భక్తులు లోయలు, రాళ్ళు, రప్పలు, ముళ్ళపొదలు, క్రిమికీటకాలతో నిండిన అరణ్యమార్గంలో అత్యంత ప్రయాసతో సపరివార సమేతంగా ప్రయాణిస్తూ ; మధ్యలో వంటా-వార్పు చేసుకునే వారు. మధ్య మధ్యలో మంచినీటి కోసం దిగుడు బావులు, విశ్రాంతి తీసుకోవడానికి *'ఠాణాలు"* గా పిలువబడే మండపాలు ఉండేవి. ఎందరో మహారాజులు, జమీందార్లు వారి పేరు మీదా లేదా వారి కుటుంబ సభ్యుల పేరు మీదా ఈ మంటపాలను నిర్మించి, *"మానవసేవే మాధవసేవ"* యని ఆనాడే చాటిచెప్పారు. అంగవైకల్యం కలవారిని, వయోవృద్ధులను పల్లకీలా ఉండే డోలీల ద్వారా కొండకు చేర్చడానికి ప్రత్యేకంగా కూలీలు ఉండేవారు. అందుకుగాను మనిషికి పది అణాలు, అంటే కేవలం 60 పైసలు, కూలి వసూలు చేసేవారు. ఈ డోలీలు నిలుపుకోవడానికి, ఆలయ సమీపంలో ఒక *"డోలీ మంటపం"* కూడా ఉండేది. ఈ ప్రదేశాన్ని ఇప్పుడు *"డోలీ మంటపం బ్లాకు"* లేదా *"డి ఎం బి"* గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి నుండి సన్నిధివీధి మీదుగా వెళ్లి ఇప్పుడున్న క్యూ కాంప్లెక్సుతో ఏమాత్రం సంబంధం లేకుండా నేరుగా మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి దర్జాగా శ్రీవారిని దర్శించుకునే వారు.
🌈 *ఘాట్ రోడ్డు నిర్మాణం*
💫 భక్తుల సంఖ్య క్రమంగా పెరగటంతో, 1940వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమీదకు రోడ్డు మార్గం వేసే నిమిత్తం బ్రిటిష్ అధికారులతో సర్వే జరిపించింది. అనేక ఇబ్బందులను అధిగమించిన తరువాత 1944వ సంవత్సరం, ఏప్రిల్ నాటికి అలిపిరి నుండి తిరుమల వరకు ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. అప్పట్లో అదో మహాద్భుతం!
💫 తెలుగువారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. శ్రీవేంకటేశ్వరుడు తమకు చేరువై పోయినట్లు, తమ నట్టింట్లో కొలువై ఉన్నట్లు అనుభూతి చెందారు. మ్రొక్కులు, ముడుపులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోయాయి.
💫 అప్పటి మద్రాస్ రాష్ట్ర గవర్నర్ ఆర్థర్ హోప్ లాంఛనప్రాయంగా ఆ రోడ్డును ప్రారంభించారు. మొదట్లో ఎడ్లబండ్లు, జట్కాబండ్లు మాత్రమే తిరిగేవి. తరువాతి కాలంలో తి.తి.దే. వారు తిరుమల తిరుపతి మార్గంలో బస్సు సర్వీస్ ప్రారంభించడంతో యాత్రికుల సంఖ్య విపరీతంగా పెరిగి, తదనుగుణంగా బస్సుల సంఖ్య కూడా పెంచాల్సి వచ్చింది. 1974వ సంవత్సరంలో రెండో ఘాట్ రోడ్డు వేసి, బస్సుల రాక పోకలకు వేరు వేరు మార్గాలను నిర్ధారించారు, దాంతో ప్రయాణం మరింత సురక్షితం, వేగవంతం అయ్యింది.
💫 శ్రీవారి భక్తులు భారతదేశ మంతటా, విదేశాల్లోనూ వ్యాపించి ఉన్నప్పటికీ తిరుమలకు విచ్చేసే వారిలో సింహభాగం దక్షిణ భారతీయులే ఉంటారు. వారిలో కూడా తెలుగు, తమిళ, కన్నడ యాత్రికులు; సంఖ్యను బట్టి వరుసగా మొదటి, రెండవ, మూడవ స్థానాల్లో ఉంటారు. తెలుగువారికి తిరుమల యాత్రకు సంబంధించి నిర్దిష్టమైన విధివిధానలేవీ పెద్దగా లేవు. శ్రీవేంకటేశ్వరుని అత్యంత ఆప్తునిగా, తమ కుటుంబసభ్యుల్లో ఒకనిగా భావించే తెలుగువారు ఎప్పుడనుకుంటే అప్పుడు శ్రీవారిని సాదా సీదాగా, శుచి-శుభ్రతలతో గుండెలనిండా భక్తితో దర్శించుకుంటారు. కానీ, తమిళులు, కన్నడిగులు మాత్రం విలక్షణమైన రీతిలో తమ తమ సాంప్రదాయాల కనుగుణంగా తిరుమల యాత్ర చేపడతారు.
🌈 *తమిళుల యాత్రావిధానం*
💫 తమిళులు ఎక్కువగా సౌరమానంలో వచ్చే *పెరటాసి మాసం* లో శ్రీవారిని సందర్శించుకుంటారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు, శ్రీవేంకటేశ్వరునిగా అవతరించిన మాసమిది. సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో వచ్చే ఈ పెరటాసి మాసపు మూడవ శనివారం తమిళులకు అత్యంత పవిత్రమైనది. తమిళులు ఎక్కువగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో శ్రీవారిమాల ధరించి, గోవిందనామాలు స్మరిస్తూ, వందలాది మైళ్లు ఏకధాటిగా నడుస్తూ తిరుమలకు చేరుకుంటారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పసుపు బట్టలు, గోవిందమాల ధారణతో ఉన్న తమిళ భక్తులతో చిత్తూరు జిల్లా వీధులన్నీ పసుపుపచ్చగా కనువిందు చేస్తాయి. పాదయాత్ర ద్వారా తిరుమల చేరుకునే భక్తులు ఎక్కువగా తిరువళ్ళూరు, తిరుత్తణి, వేలూరు, చెంగల్పట్టు, కాంచీపురం, పుదుచ్చేరి, చెన్నై తదితర ప్రాంతాల నుండి వస్తారు. నడచి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఆయా మార్గాలలో విజయనగర రాజుల హయాంలో విశ్రాంతి మండపాలు ఏర్పాటు చేయబడ్డాయి.
💫 ఈ భక్తులు నలభై రోజుల పాటు చన్నీళ్ల స్నానంతో, మద్యమాంసాలకు దూరంగా ఉండి, ఒంటిపూట భోజనంతో, నిత్య పూజలు నిర్వహిస్తూ, కఠోరదీక్ష వహిస్తారు. ఎండావానలను లెక్కచేయకుండా, పాదరక్షలు లేకుండా యాత్రను కొనసాగిస్తారు. పెరటాసిమాసంలో వచ్చే శనివారాలలో తలస్నానం చేయడం, తిరునామం ధరించడం, ఉపవాసదీక్ష చేయడం, పిండి దీపాలు వెలిగించడం తమిళ శిష్టాచారాలలో భాగాలు! ఈ మాసంలో తిరుమలక్షేత్ర మంతా ఊర్ధ్వపుండ్రాలు (తిరునామాలు) ధరించిన తమిళభక్తులతో సందడిగా ఉంటుంది.
🌈 *కన్నడిగుల తిరుమల యాత్ర*
💫 శ్రీవారి మహాభక్తులైన పురందరదాసు, కనకదాసు విజయదాసు వంటి వాగ్గేయకారుల కీర్తనలు పాడుకుంటూ, కోలాటమాడుతూ, భక్తిశ్రద్ధలతో ప్రతి మెట్టుకు పసుపు కుంకుమలు అలంకరిస్తూ, తిరుమలకు చేరుకోవడం కన్నడిగుల సాంప్రదాయం. దీనినే *"మెట్లోత్సవం"* అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు కన్నడిగులు కూడా తమిళుల వలెనే తమ తమ గ్రామాల నుండి గుంపులు గుంపులుగా నడుచుకుంటూ తిరుమలకు చేరుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం సుదూర ప్రాంతాల నుండి కన్నడిగులు కాలినడకన పెద్దగా రావడం లేదు. తిరుపతి పరిసర ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో నివసించే కన్నడిగులు మాత్రమే ఎక్కువగా నడక యాత్ర ద్వారా శ్రీవారిని దర్శించు కుంటున్నారు. బ్రహ్మోత్సవాలలో గరుడసేవకు, రథసప్తమి ఉత్సవానికి కన్నడిగులు అధికంగా హాజరవుతారు.
💫 భాష-ప్రాంతంతో సంబంధం లేకుండా, నడకదారి యందలి భక్తులందరిలోనూ అపరిమితమైన భక్త్యావేశాలు పెల్లుబుకుతూ ఉంటాయి. మెట్లమార్గ మంతా దిక్కులు పిక్కటిల్లే గోవిందనామ స్మరణతో మార్ర్మోగిపోతూ, అడుగడుగు దండాలతో తిరుణాళ్ళను తలపిస్తూ ఉంటుంది. మోకాళ్ళపై మెట్లెక్కే భక్తులు కొందరైతే, మెట్టుమెట్టుకు పసుపుకుంకుమలు అలంకరించే వారు మరికొందరు!
💫 ముక్కుపచ్చలారని పసివారు, అలవోకగా మెట్లెక్కే యువతీ యువకులు, ఆయాసంతో ఆపసోపాలు పడే నడివయస్కులు; మనుమల సాయంతో పళ్ళబిగువున నడకసాగించే వయసు మళ్ళినవారు ఇలా అన్ని వయసులవారు మనకు నడకయాత్రలో తారసిల్లుతారు.
No comments :