పద్మావతి.శ్రీనివాసుల పరిణయం ⛩️
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"
💫 భృగుమహర్షి వృత్తాంతానంతరం శ్రీమహాలక్ష్మి జాడ తెలియని శ్రీమహావిష్ణువు, కృతయుగాంతంలో భూలోకంలోని వేంకటాచల శ్రేణుల యందు ఒక వల్మీకంలో (పుట్ట) తల దాచుకుంటాడు.
💫 ఇంతవరకు "ఆదివరాహస్వామి ఆలయం" ప్రకరణంలో ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం.
💐 శ్రీనివాసుడు – ఆదివరాహస్వామి కలయిక 💐
💫 ఆ విధంగా చాలాకాలం పుట్టలో గడిపిన శ్రీనివాసునికి కలియుగారంభంలో తాను ఒకనాడు పుట్టలో నుంచి బయటకు వచ్చి సంచరిస్తుండగా తన పరివారంతో విహరిస్తూ వృద్ధాప్యదశలో ఉన్న ఆదివరాహస్వామి తారసపడతాడు. శ్రీమహావిష్ణువే ఆదివరాహస్వామి అవతారంలో భూమండలాన్ని రక్షించి దేవతల కోర్కెపై ఈ పర్వతం మీద శాశ్వతనివాసం ఏర్పరుచుకున్న ఉదంతం కూడా మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. అంటే, ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఒక అవతారమైన శ్రీనివాసుడు, మరో అవతార స్వరూపమైన ఆదివరాహస్వామితో భేటీ అయ్యారన్న మాట. శ్రీమహావిష్ణువు అనేక సందర్భాల్లో లోకకల్యాణార్థం పలు అవతారాలనెత్తడం మనకు విదితమే.
💫 ప్రథమ పరిచయంలోనే ఈ క్షేత్రం ఆదివరాహుని అధీనంలో ఉన్నట్లు తెలుసుకున్న శ్రీనివాసుడు, తన నివాసనిమిత్తం కొంత స్థలం అనుగ్రహించాల్సిందిగా ఆదివరాహస్వామిని ప్రార్థిస్తాడు. కలియుగధర్మానుసారం, వరాహుడు స్థలం ఉచితంగా ఇవ్వడం కుదరదని, తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని శెలవిస్తాడు. అప్పుడు శ్రీనివాసుడు ప్రస్తుతానికి తన వద్ద ద్రవ్యం లేదని చెబుతాడు. అంతేకాకుండా, ముందు ముందు కోట్లాది భక్తులు తన దర్శనార్థం వస్తారని, అప్పుడు ప్రథమదర్శనం, ప్రథమపూజ, ప్రథమనైవేద్యం వరాహస్వామికే చెందుతాయని వాగ్దానం చేస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం, స్వామిపుష్కరిణికి దక్షిణం వైపున ఉన్న నూరు చదరపు గజాల ప్రదేశం శ్రీనివాసుని శాశ్వతనివాస నిమిత్తం కేటాయించ బడుతుంది.
💫 శ్రీనివాసుడు ఒంటరిగా ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకున్న వరాహస్వామి, సపరిచర్యల నిమిత్తం "వకుళాదేవి" అనే దాసిని కూడా శ్రీనివాసునితో పంపుతాడు. ఈ సందర్భంలో వకుళాదేవి పూర్వజన్మ వృత్తాంతం కొద్దిగా తెలుసుకోవాలి.
🙏 వకుళాదేవి పుర్వజన్మ వృత్తాంతం 🙏
💫 ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు దేవకీవసుదేవులకు జన్మించినప్పటికీ, అతని బాల్యమంతా యశోద వద్ద ముద్దు మురిపాలతో, ఆలమందలతో, వెన్నముద్దలతో గడిచింది. శ్రీకృష్ణుని బాల్యలీలలన్నీ చూడటానికి నోచుకున్న యశోదాదేవి, కంస వధానంతరం శ్రీకృష్ణుడు తిరిగి దేవకీవసుదేవుల వద్దకు చేరుకోవడంతో శ్రీకృష్ణుని కళ్యాణం చూడలేకపోయింది. అష్టభార్యలున్న శ్రీకృష్ణ పరమాత్ముని ఒక్క వివాహమైనా యశోదమ్మ సమక్షంలో జరగలేదు. ఆ విషయమై చింతిస్తూ ఉన్న యశోద మనసునెరిగిన శ్రీకృష్ణుడు, ద్వాపరం నాటి యశోదమ్మ కలియుగంలో వకుళమాతగా జన్మిస్తుందని, అప్పుడు పద్మావతీదేవితో జరిగే తన వివాహాన్ని కన్నులారా తిలకించ వచ్చునని అభయమిస్తాడు. నాటి యశోదామాతయే నేడు వకుళమాతగా జన్మించిందన్న మాట.
💫 ఈ విధంగా శేషాచలంగా పిలువబడే వరాహక్షేత్రంలో, ఆదివరాహునిచే దాసిగా నియమింప బడిన వకుళమాత సపర్యలలో కొంత ఉపశమనం పొందుతూ శ్రీనివాసుడు కాలం వెళ్లబుచ్చుతున్నాడు.
💐 వేటకు వెడలిన శ్రీనివాసుడు 💐
💫 ఒకనాడు వేటకు వెళ్లాలన్న సంకల్పంతో, శ్రీనివాసుడు అశ్వరూపంలో ఉన్న వాయుదేవునిపై స్వారీ చేస్తూ, శేషాచలసానువుల్లో ఉన్న రమణీయ దృశ్యాలను ఆస్వాదిస్తూ మృగయావినోదం కొనసాగిస్తున్నాడు. ఆవిధంగా, నేడు "శ్రీవారిమెట్లు" గా పిలువబడే మెట్ల మార్గంలో చాలా దూరం వెళ్లిన శ్రీనివాసునికి "రక్షించండి! రక్షించండి!" అనే ఆర్తనాదాలు వినిపిస్తాయి. జగద్రక్షకుడైన శ్రీనివాసుడు విల్లంబులను సవరించుకుంటూ ఆ ఆక్రందనలు వచ్చిన దిశగా గుర్రాన్ని దౌడు తీయిస్తాడు. అక్కడ ఓ భయంకరమైన మదపుటేనుగు తరుము తుండడంతో ఆర్తనాదాలు చేస్తూ చెట్టుకొకరు పుట్టకొకరుగా పరుగులు తీస్తున్న కొందరు కన్యామణులు శ్రీనివాసుని కంట పడతారు. వెనువెంటనే శ్రీనివాసుడు "గజేంద్రా!" అని భీకరంగా గర్జిస్తూ, విల్లు ఎక్కుపెట్టి ఆ మత్తగజానికి ఎదురుగా వెళతాడు. దిక్కులు పిక్కటిల్లేలా ధ్వనించిన ఆ గర్జనకు బెదిరిపోయిన ఏనుగు కారడవిలోకి పారిపోవడంతో, యువతులందరూ ప్రాణాపాయం తప్పించుకుంటారు.
💐 పద్మావతితో తొలి సమాగమం 💐
💫 ప్రాణాపాయం నుంచి తప్పించుకొని కృతజ్ఞతా దృక్కులతో నిలుచుని ఉన్న కన్యారత్నాల మధ్య గంధర్వకన్యలా ప్రకాశిస్తున్న ఓ యువతిని చూసి, ఆమె అందచందాలకు మోహావేశుడై, ఆమెనే చూస్తూ అచేతనంగా ఉండిపోతాడు శ్రీనివాసుడు. ఆ యువతి కూడా శ్రీనివాసుని యెడ పరవశురాలై తదేకంగా చూస్తూ ఉండి పోతుంది. ఈ ఇరువురి వాలకాన్ని గమనించిన చెలికత్తెలు భయాందోళనలతో; ఆ యువతి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు గారి కుమార్తె పద్మావతీదేవి యని, ఆమెను ఆవిధంగా చూడటం ఎంత మాత్రం తగదని వారిస్తారు. అక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవలసిందిగా హెచ్చరిస్తారు. అంతట పద్మావతీదేవి తన చెలికత్తెలను వారిస్తూ, తమ ప్రాణాలను రక్షించిన ఆపద్బాంధవుణ్ణి ఆ రీతిలో తూలనాడడం తగదని, అతని పూర్తి వివరాలను తెలుసుకొమ్మనీ ఆజ్ఞాపిస్తుంది. దానితో కొంచెం తెప్పరిల్లిన శ్రీనివాసుడు చిరు మందహాసం చేస్తూ దేవకీవసుదేవులను తల్లిదండ్రులుగా, బలరాముణ్ణి సోదరునిగా గలిగిన తాను వేంకటాచలవాసినని, ఆ అందాలరాశిని తొలిచూపులోనే ప్రేమించానని, వారంగీకరిస్తే వివాహం చేసుకుంటానని తన అంతరంగాన్ని వెల్లడించాడు. ఈ వ్యవహారం శృతిమించడంతో కలవరపడ్డ చెలికత్తెలు అతని నుంచి పద్మావతీదేవిని రక్షించటానికి శ్రీనివాసుని రాళ్ళతో కొడుతూ తరమసాగారు.
💫 సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి అబలులైన ఆ మానవమాత్రులు ఏం చేయగలరు?
💫 శ్రీనివాసుని సంకల్పంతో, అశ్వరూపంలో ఉన్న వాయుదేవుడు చెలికత్తెల రాళ్ల దెబ్బలకు చనిపోయినట్లు నటించగా, పెనుగులాటలో చిరిగిపోయిన వస్త్రాలతో, చిందరవందరగా తయారైన కేశాలతో విషణ్ణవదనుడైన శ్రీనివాసుడు వేంకటాచలం లోని తన స్వగృహానికి చేరుకుంటాడు.
🌈 వకుళమాత ఓదార్పు 🌈
💫 ఈ స్వగృహానికి చేరుకున్న శ్రీనివాసుడు నిరాహారుడై, విరహతాపంతో బాధపడటం చూసిన వకుళమాత శ్రీనివాసుని ఆవేదనకు కారణం చెప్పమని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంది. జరిగిన వృత్తాంతాన్నంతా యథాతథంగా వివరించిన శ్రీనివాసుడు, నారాయణవనం పరిసర ఉద్యానవనంలో ఆకాశరాజు కూతురైన పద్మావతిని చూశానని, తొలిచూపులోనే తామిరువురు ప్రేమించుకున్నామని, ఆమె లేనిదే తాను జీవించలేనని తెలియజేశాడు. వకుళమాత శ్రీనివాసునికి అతని పూర్వజన్మను గుర్తుచేస్తూ, సామాన్యమానవుని వలె ఓ అజ్ఞాత మానవకాంతను ప్రేమించడం విచిత్రంగా ఉందని, ముందు వెనుకలాలోచించి ఓ సముచితమైన నిర్ణయం తీసుకోమని శ్రీనివాసుణ్ణి ప్రార్థిస్తుంది. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అవతారమైన తాను అనైతికంగా ప్రవర్తించనని, ఆకాశరాజు కుమార్తె అతిలోక సౌందర్యవతి అయిన "పద్మావతిదేవి" సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి అంశతో, తనను వివాహమాడటం కోసమే ఈ భూలోకంలో అయోనిజగా అవతరించిందని శెలవిస్తాడు. అంతే కాకుండా, ఈ భూలోకంలో తనకు వేరెవరూ లేరు కనుక, వకుళమాతే మధ్యవర్తిగా వ్యవహరించి ఈ శుభకార్యాన్ని నెరవేర్చాలని వేడుకుంటాడు. ఇంతటి మహత్కార్యం తన చేతుల మీదుగా సంపన్నం కావడం తన పూర్వజన్మ సుకృతంగా భావించిన వకుళాదేవి, ఆకాశరాజు చెంతకు వెళ్ళటానికి సిద్ధమై, శ్రీనివాసుని అనుజ్ఞకై ప్రార్థిస్తుంది.
💫 అంత శ్రీనివాసుడు, వేంకటాచలక్షేత్రం నుంచి దక్షిణదిశగా వెడలి కపిలేశ్వరస్వామి [(ఈ కపిలేశ్వరస్వామి ఆలయం తిరుపతి పట్టణంలో అలిపిరి కి ఒక కిలోమీటరు దూరంలో ఉంది. నారాయణవనం తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలోనూ, అగస్తేశ్వర ఆలయం (దీనినే "ముక్కోటి" అని కూడా పిలుస్తారు) తిరుపతి పట్టణ పరిసర ప్రాంతాల్లోనూ ఉంటాయి.)]. ఆశీస్సులందుకొని, తరువాత అగస్త్యేశ్వరుని సందర్శించి, తదుపరి నారాయణవనం చేరుకుని, ఆకాశరాజు దంపతులను కలిసి కన్యాదానం కోరవలసిందిగా వకుళాదేవిని ఆదేశిస్తాడు. ఇంతటి మహత్తర కార్యాన్ని తన భుజస్కంధాలపై ఉంచటంతో అమితానందం చెందిన వకుళాదేవి, వరుసగా కపిలతీర్థాన్ని, మార్గమధ్యన ఉన్న శుకమహర్షి ఆశ్రమాన్ని, తరువాత అగస్త్యేశ్వర ఆలయాన్ని సందర్శించి శ్రీనివాసకళ్యాణం సాఫల్యం చేయాల్సిందిగా మ్రొక్కుకుంటుంది.
💫 శ్రీనివాసుని ఆదేశానుసారం అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న వకుళమాతకు, అదే సమయంలో అక్కడికి విచ్చేసిన పద్మావతీదేవి యొక్క చెలికత్తెలు తారసపడతారు. వారితో మాట కలిపిన వకుళాదేవికి, పద్మావతిదేవి వనంలో ఓ అజ్ఞాత వ్యక్తిని చూసిందని, తొలిచూపులోనే అతనిపై ప్రేమలో పడి విరహతాపానికి గురై జ్వరంతో మంచం పట్టిందని, కుమార్తె రుగ్మతకు కారణం తెలియని ఆకాశరాజు తన గురువుగారైన బృహస్పతిని సంప్రదించాడని, అతడు సూచించిన తరుణోపాయం మేరకు పద్మావతిదేవి ఆరోగ్యం కుదుటపడటం కోసం ఆమె తరఫున ఆలయంలో
పూజాదికాలు నిర్వహించడానికై తాము వచ్చామని చెలికత్తెలు చెబుతారు. భగవత్సంకల్పంతో ఎదురుపడ్డ చెలికత్తెల ననుసరించి, ఆకాశరాజు, ధరణీదేవి దంపతుల వద్దకు వెళ్లడానికి వకుళాదేవి ఉద్యక్తురాలవుతుంది.
🌈 ఎరుకలసాని వేషంలో శ్రీనివాసుడు 🌈
💫 అటు శ్రీ వేంకటాచలం పైనున్న శ్రీనివాసుడు, పద్మావతిదేవిపై బెంగతో, మానవసహజమైన ఆత్రుతతో, వికలమనస్కుడై ఉంటాడు. ఇప్పుడు తాను శ్రీమహావిష్ణువు కాదు మానవరూపధారియై ఉన్నాడు. కార్యసిద్ధి కోసం పూర్తిభారం వేరొకరిపై వేయకుండా, స్వశక్తిని కూడా నమ్ముకోవాలి కదా! సాధారణ మానవ మాత్రులందరూ తనపై భారం వేసి నిశ్చింతగా ఉంటారు. మరి తానెవరిపై భారం వేయాలి? వృద్ధురాలై, కొండకోనల్లో జీవితాన్ని సాగిస్తున్న వకళమాత ఇంతటి కార్యాన్ని సఫలం చేసుకు రాగలదా?
💫 ఇలా పరి పరి విధాలుగా ఆలోచించిన శ్రీనివాసుడు, వకుళాదేవి ప్రయత్నానికి తోడుగా తాను కూడా కార్యరంగంలోకి ప్రవేశించ దలుచుకుంటాడు. అనుకున్నదే తడవుగా, "ఎరుకలసాని" వేషధారణలో, గురువింద గింజల మాలను మెడలో ధరించి, భూమండలాన్నంతా తాటాకుబుట్టగా మార్చి, దానిని తలపై కెత్తుకుని, నారాయణవనం వీధుల్లో సంచరిస్తూ, తన విలక్షణమైన రూపంతో, వాక్చాతుర్యంతో, హావభావాలతో, పురజనులను విశేషంగా ఆకట్టుకుంటాడు. కుమార్తె అనారోగ్యంతో తల్లడిల్లుతున్న ధరణీదేవికి ఎరుకలసాని మాటలతో ఆశలు చిగురిస్తాయి. ఎరుకలసానిని రాజభవనంలోకి సాదరంగా ఆహ్వానించి "సోది" (భవిష్యవాణి) చెప్పవలసిందిగా కోరుతుంది. ఎరుకలసాని వేషంలో ఉన్న శ్రీనివాసుడు వృత్తిధర్మాన్ని అనుసరించి, బ్రహ్మాది దేవతలను, సమస్త పుణ్యక్షేత్రాలను స్మరించుకుంటూ సోది చెప్పడం ప్రారంభిస్తాడు.
💫 పద్మావతిదేవి ఎడమచేతిని తన చేతిలోకి తీసుకుని ఎరుకల యాసలో కొండపైనున్న శ్రీనివాసుడనే వాడు పద్మావతిదేవి ప్రేమలో పడ్డాడని, ఈమె సైతం ఆ నామాలవాడిని ప్రాణప్రదంగా ప్రేమిస్తుందని, ఆ యువకుడు కారణజన్ముడు, అనితర శక్తిసామర్థ్యాలు కలవాడని, ఇరువురికి వివాహం జరిపిస్తే పద్మావతిదేవి ఆరోగ్యం కుదుటపడుతుందని, అంతేకాకుండా శ్రీనివాసునితో జరుగబోయే కళ్యాణం ద్వారా పద్మావతిదేవి అషైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తులతూగుతుందని కూడా నమ్మబలుకుతాడు.
💫 కొద్దిసేపట్లోనే ఓ వృద్ధురాలు ఆ శ్రీనివాసుని తరఫున వచ్చి కన్యాదానం చేయమని కోరుతుందని, పద్మావతిదేవి ఏ వ్యక్తినైతే మోహించిందో అదే వ్యక్తితో ఆమె వివాహం సాఫల్యం కాబోతోందని చెప్పి నిష్క్రమిస్తాడు.
🙏 జగన్నాటక సూత్రధారునికి లోకకల్యాణార్థం వింత వింత వేషాలు ధరించడం కరతలామలకమే!
🌈 వకుళమాత రాయబారం 🌈
💫 అగస్త్యేశ్వరస్వామి ఆలయంలోని తీర్థప్రసాదాలతో అంతఃపురాని కేతెంచిన చెలికత్తెలు, తమతో పాటుగా వచ్చిన వకుళమాతను ధరణీదేవికి పరిచయం చేస్తారు. వకుళమాత రాజదంపతులకు నమస్కరిస్తూ, తనను శ్రీనివాసుని తల్లిగా పరిచయం చేసుకుని, పద్మావతి, శ్రీనివాసులు ఒకరినొకరు తొలిచూపులోనే ప్రేమించుకున్నారని, కారణజన్ములైన వారిరువురికి వివాహం జరిపించాలని ప్రార్థిస్తుంది. ఎరుకలసాని ద్వారా అప్పటికే ఈ విషయాలన్నింటినీ విన్న ఆకాశరాజు దంపతులు, శ్రీనివాసుణ్ణి తమ అల్లునిగా పొందటం తమ జన్మజన్మల సుకృతంగా భావించి, పద్మావతినిచ్చి వివాహం చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరించి, త్వరలో ముహూర్తం నిశ్చయించి వివాహం జరిపిస్తామని వకుళమాతకు మాట ఇస్తారు. తన కార్యం సఫలం కావడంతో సంతృప్తి చెందిన వకుళాదేవి వేంకటాచలం చేరుకొని, శ్రీనివాసునికి శుభవార్తను చేరవేస్తుంది.
💫 ఆనంద పరవశుడైన శ్రీనివాసుడు వకుళమాతను ఆప్యాయంగా, మాతృవాత్సల్యంతో ఆలింగనం చేసుకుంటాడు.
🌈 వివాహాహ్వాన పనుల్లో ఆకాశరాజు 🌈
💫 పట్టరాని సంతోషంతో ఉద్విగ్నుడైన ఆకాశరాజు వెంటనే కార్యరంగంలోకి ఉరికి, తన పుత్రుడైన "వసుద" తో తమ గురువుగారైన దేవలోకవాసి "బృహస్పతి" కి కబురు పంపుతాడు. క్షీరసాగరమధనంలో లక్ష్మీదేవికి తమ్మునిగా పుట్టిన "చంద్రుడు", కలియుగంలో ఆకాశరాజు దంపతులకు, పద్మావతిదేవి అనుజునిగా జన్మిస్తాడు.
💫 వసుద ద్వారా ఆ శుభవార్త తెలుసుకున్న బృహస్పతి, పెండ్లి కుమారుడెవరో తన దివ్యదృష్టితో తెలుసుకొని పరమానందభరితుడై, అంతటి శుభకార్యం తనచేతుల మీదగా సఫలం కాబోవడం తన భాగ్యంగా భావించి పొంగిపోతాడు. కానీ, వెంటనే తన స్థాయిని గుర్తెరిగి భగవంతుని కళ్యాణం జరిపించగల సామర్థ్యం తనకు లేదని, తిరుచానూరుకు దగ్గరలోనున్న సరోవరంలో నివసిస్తున్న "శుకాచార్యులు" దానికి సమర్థుడని వసుదతో విన్నవించుకుంటాడు.
💫అంతట ఆకాశరాజు, తన తమ్ముడైన తొండమానునితో శుకాచార్యునికి వర్తమానం పంపుతాడు. ఆకాశరాజు విజ్ఞప్తిని విన్న వెంటనే సంతోషంతో ఉబ్బితబ్బిబ్బెన శుకాచార్యులవారు, తొండమానునితో నారాయణవనం చేరుకుంటారు. తన దివ్యదృష్టితో పూర్వాపరాలన్నింటిని తెలుసుకున్న శుక్రాచార్యుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీనివాసునిగా భూలోకంలో అవతరించాడని ఆకాశరాజుకు విశద పరిచి, వకుళాదేవి ద్వారా శ్రీనివాసుని జన్మనక్షత్రం, తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుంటారు. ఇరువురి జాతకాలు పరిశీలించిన శుకాచార్యుడు - వైశాఖమాసం, శుక్లదశమి, శుక్రవారం నాటి ఉత్తరఫల్గుణి నక్షత్రం అత్యంత శ్రేష్ఠమైన లగ్నంగా నిశ్చయించి – ఆ శుభఘడియలో పద్మావతి-శ్రీనివాసుల వివాహం జరగాలని వివాహ శుభలేఖను వ్రాయిస్తారు.
💫 ఆకాశరాజు కోరికపై శుకాచార్యుడు శుభలేఖను స్వయంగా శ్రీనివాసునికి అందజేస్తాడు. ఆ శుభవార్త నిన్న శ్రీనివాసుడు అమితానందంతో శుభలేఖను శిరస్సుపై నుంచుకొని, శుకాచార్యుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. ఆకాశరాజు లేఖకు ప్రత్యుత్తరం రాసి, వివాహానికి లాంఛనప్రాయంగా తమ ఆమోదాన్ని తెలుపుతాడు.
🌈 పెండ్లి సంరంభంలో శ్రీనివాసుడు 🌈
💫 వివాహానికి ఆమోదం తెలిపిన కొద్ది సేపట్లోనే, కలియుగంలో మానవసహజమైన చిత్తచాంచల్యంతో శ్రీనివాసుని మనసు మారిపోతుంది. ఆయన వకుళాదేవిని పిలిచి తనకు ఈ వివాహం ససేమిరా వద్దంటాడు. నివ్వెరబోయిన వకుళాదేవి, పూర్వజన్మలో శ్రీకృష్ణుడు ఎనిమిది వివాహాలు చేసుకున్నప్పటికీ తల్లి అయిన యశోదకు ఒక్క వివాహం కూడా చూసే భాగ్యం కలుగలేదని, ఆ అదృష్టం ఈ జన్మలోనైనా కలగాలని గంపెడాశతో ఎదురు చూస్తున్నానని, ఎన్నో ప్రయాసలకోర్చి ఆకాశరాజు దంపతులను వివాహానికి ఒప్పించానని, తన ఆశలను వమ్ముచేయవద్దని పదేపదే ప్రాధేయ పడుతుంది.
💫 అందుకు సమాధానమిస్తూ, శ్రీనివాసుడు, ఆకాశరాజు అపరిమితమైన ఐశ్వర్యం కలవాడని; ఎందరో బంధుమిత్రులు, పరివారం, మందీమార్బలం కలవాడని; తాను మాత్రం ఎవరూ లేని నిరుపేదనని; కయ్యానికైనా వియ్యానికైనా సమఉజ్జీ ఉండాలి కదా అంటూ తన మనసులోని సంకోచాన్ని వెల్లడిస్తాడు. అందుకు వకుళాదేవి, శ్రీనివాసుడు సకల లోకాలకు సార్వభౌముడని, ఆకాశరాజు పేరుకే రాజని, సాధనసంపత్తులలో ఆ రాజు శ్రీనివాసునికి ఎంతమాత్రం సరితూగడని, శ్రీనివాసుడు ఆజ్ఞాపించినంతనే బ్రహ్మాది దేవతలు శిరసావహిస్తారని విన్నవించుకుంటుంది.
💫 వకుళాదేవి వాక్కులతో అద్వితీయమైన తన వైకుంఠ వైభవాన్ని స్మరణలోకి తెచ్చుకున్న శ్రీనివాసుడు, వెంటనే కళ్యాణ ఏర్పాట్లకు సన్నద్ధుడవుతాడు. పెండ్లిపనులను బ్రహ్మాది దేవతలకు, తన సేవకులైన గరుత్మంతుడు, ఆదిశేషునికి పురమాయిస్తాడు. వార్త విన్న మరుక్షణం ముక్కోటి దే…
🕉️🕉️🕉️🕉️
🙏 పద్మావతీ - శ్రీనివాసుల పరిణయం -3 🙏
🙏 ఓం నమో వేంకటేశాయ🙏
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"
🙏 ముక్కోటి దేవతలకు విందుభోజనాలు 🙏
💫 కుబేరుడు అరువుగా ఇచ్చిన ఆభరణాలను, నూతన వస్త్రాలను శోభాయమానంగా అలంకరించుకున్న శ్రీనివాసుడు, కుమారధార తీర్థానికేతెంచి, తమ కులదైవమైన శమీవృక్షానికి పూజాదికాలు గావిస్తాడు. ఆ వృక్షరాజం యొక్క శాఖను తెచ్చి ప్రక్కనే ఉన్న వరాహస్వామి ఆలయంలో ప్రతిష్ఠించి ఆ దైవాన్ని ఆరాధిస్తాడు. స్వయంగా తన వివాహానికి ఆహ్వానించిన శ్రీనివాసునితో, ఆదివరాహుడు "తాను వృద్ధాప్యం వల్ల పెండ్లికి రాలేనని, తన ఆశీర్వాదం శ్రీవారికి ఎన్నడూ తోడుగా ఉంటుందని" శెలవిస్తాడు.
💫 అంతలో, శ్రీ నివాసునికి భోజనాల ప్రసక్తి గుర్తుకొస్తుంది. పనులైతే పురమాయించాడు గానీ, లక్షలాది మందికి షడ్రశోపేతమైన భోజనం ఏర్పాటు చేసే ఆర్థికస్తోమత, కొండకోనల్లో నివసించే తనకెక్కడిది? ఖర్చు కోసం చింతిస్తున్న శ్రీనివాసుణ్ణి పరమశివుడు ఓదార్చి, తన మధ్యవర్తిత్వంతో కుబేరస్వామి నుంచి కావలసిన ధనాన్ని అరువుగా, కలియుగాంతం వరకు వడ్డీ తీర్చే షరతుపై ఇప్పిస్తాడు.
💫 చేతిలో రొక్షం సమకూరింది సరే! అంతమందికి వండివార్చాలంటే మాటలా? ఎన్నెన్ని ఏర్పాట్లు చేయాలి? ఎల్లవేళలా లోకకళ్యాణం కోసం పరితపించే స్వామి, తన కళ్యాణం గురించి ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోలేక పోయాడు!
💫 అంత భారీగా వంటలు చేయడానికి తగ్గ పాత్రలు తనవద్ద లేవంటాడు, వంటపని బాధ్యత తీసుకున్న అగ్నిదేవుడు. వాస్తవానికి ఈ కార్యం అగ్నిదేవునికి సునాయాసం! ఆయన శ్రీవారి లీలలను చూచి తరించాలనుకున్నాడంతే!
💫 పాత్రల అవసరం లేకుండా, వేంకటాచలం నందున్న తీర్థాలలోనే వంటలు వండమని శ్రీనివాసుడు సలహా ఇస్తాడు. స్వామివారి యానతి ప్రకారం, స్వామి పుష్కరిణిలో అన్నం వండబడింది. పాపనాశనం తీర్థంలో పప్పు, ఆకాశగంగ తీర్థంలో పులుసు, తుంబురతీర్థంలో చిత్రాన్నం, పాండవ తీర్థంలో తింత్రిణీరసం (చారు), మిగిలిన తీర్థాలన్నింటిలో రకరకాల పచ్చళ్ళు, ఇతర కమ్మనైన పిండి వంటలు తయారు చేయబడ్డాయి. సిద్ధాన్నాన్ని ముందుగా అహోబిల నరసింహస్వామికి నైవేద్యం చేసి, అతిథులందరూ భోజనానికి ఉపక్రమించారు. భోజనపంక్తులు శేషాచల పర్వతసానువుల్లో, వేంకటాచలం నుంచి శ్రీశైలం వరకు బారులు తీరాయి. అతిథులందరూ సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత శ్రీనివాసుడు బ్రాహ్మణులకు, వేదాంతులకు, బ్రహ్మచారులకు శాస్త్రానుసారం తాంబూలం, దక్షిణ సమర్పించుకున్నాడు. తదనంతరం పెండ్లి పెద్దలైన బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి, ఆదిశేషుడు, గరుడునితో కలిసి శ్రీనివాసుడు భోజనం ముగించేటప్పటికి సూర్యాస్తమయం అయింది.
🌈 నారాయణవనానికి పయనం 🌈
💫 ఆ రాత్రి మయుడు, విశ్వకర్మచే వేంకటాచలంపై నిర్మించబడ్డ భవనాల్లోనే గడిపిన అతిథులందరూ, మరునాడు ఉదయం మంగళ వాయిద్యాలతో నారాయణవనం బయలుదేరారు. పెండ్లిబృందం మార్గమధ్యంలో ఉన్న పద్మసరోవరాన్ని సమీపిస్తున్న తరుణంలో, శుకాచార్యులవారు శ్రీనివాసునికి ఎదురేగి, బంధుమిత్ర సపరివార సమేతంగా తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరతాడు. ఈ వివాహాన్ని ఖాయపరచడంలో శుకాచార్యుల పాత్రను స్మరణకు తెచ్చుకున్న శ్రీనివాసుడు, ఆతని ఆతిథ్యం స్వీకరించటానికి సమ్మతిస్తాడు. ఆప్యాయంగా ఆహ్వానించాడే గానీ, సర్వసంగపరిత్యాగి అయిన శుకచార్యుడు కోట్ల కొద్దీ ఉన్న అతిథిగణానికి కేవలం పులుసన్నం మాత్రమే వడ్డించగలుగుతాడు. సాక్షాత్తు శ్రీనివాసునికి, అమరులైన తమకు అంత సాధారణమైన భోజనం వడ్డించడం అవమానకరంగా భావించిన దేవతలందరూ, శుకాచారిని శపించచడానికి ఉద్యుక్తులవుతారు. ఇది గమనించిన శ్రీనివాసుడు ఒక్క "హుంకారం" తో అతిథులందరికీ చవులూరించే భోజనం చేసిన అనుభూతిని కలిగిస్తాడు. శపించడానికి సిద్ధ మవుతున్న దేవతలందరు, అత్యంత స్వల్ప వ్యవధిలో అంత కమ్మని భోజనం పెట్టిన శుకాచారిని ప్రశంసిస్తారు. ఆవిధంగా శ్రీ నివాసుడు తన భక్తుడైన శుకమహర్షిని గట్టెక్కించాడు. తన భక్తులను కష్టాలకడలి నుంచి కడతేర్చటం శ్రీనివాసునికి కొత్తేమీ కాదు కదా!
💫 పద్మసరోవరం నుంచి నవమినాడు బయల్దేరిన శ్రీనివాసుడు సపరివార సమేతంగా నారాయణపురం చేరుకోగానే ఆకాశరాజు ఎదురేగి, భక్తిపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తాడు. వారి వారి హోదాలకు తగ్గట్లుగా, విశ్వకర్మచే నిర్మించ బడిన హర్మ్యాలలో విడిది ఏర్పాటుచేసి విందుభోజనాలతో అతిథులందరినీ అలరింపజేస్తాడు.
⛩️ పద్మావతీ పరిణయ ఘట్టం ⛩️
💫 ఆరోజు సాయంత్రం ఆకాశరాజు తన భార్య ధరణీదేవితో కలిసి, తమకు అల్లుడు కాబోతున్న శ్రీనివాసుడి పాదపద్మాలను స్వామిపుష్కరిణి నుండి తెప్పించిన పవిత్రజలంతో కడిగి, ఆ ఉదకాన్ని తమ శిరస్సుపై జల్లుకొని రాజ్యమంతటా సంప్రోక్షణ గావించాడు. తదుపరి రాజదంపతులు శ్రీనివాసునికి దివ్యపూజ గావించి, సుగంధద్రవ్యాలతో తాంబూలాన్ని సమర్పించారు. శ్రీనివాసుణ్ణి భద్రగజంపై నెక్కించి, మంగళవాద్యాలతో, వేదపారాయణంతో సాదరంగా రాజభవనానికి తోడ్కొని వెళ్ళారు. రత్నఖచిత సింహాసనంపై శ్రీనివాసుని ఆసీనుణ్ణి గావించారు. అంతకుముందే పద్మావతీదేవి సర్వాలంకార భూషితురాలై, సుమంగళులైన స్త్రీల పర్యవేక్షణలో గౌరీపూజ గావించి వివాహానికి సిద్ధంగా ఉంది. లోకకళ్యాణార్థం జరుగబోతున్న వివాహ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించడానికి సకల చరాచర జగత్తులోని జీవులన్నీ తరలివచ్చాయి.
🌈 కట్నకానుకలు 🌈
💫 వివాహసందర్భంలో అల్లుడికి ఆకాశరాజు కోటి స్వర్ణనాణాలను కానుకగా ఇచ్చాడు. అంతేకాకుండా విశేషమైన, అముల్యాభరణాలను కూడా శ్రీనివాసునికి కట్నం కింద సమర్పించుకున్నాడు. భవిష్యోత్తరపురాణంలో ఆ ఆభరణాల వర్ణన ఇలా ఉంది:
💫 నూరుతులాల బంగారు కిరీటం, నూరుతులాల నడుము పట్టీ, భుజకీర్తులు, నూపురములు, నాగభూషణం, ముత్యాల కంఠాభరణాలు, ముత్యాలు-నవరత్నాలు పొదగబడిన హస్తకంకణాలు, పది అంగుళీయకాలు, వజ్రాలు పొదిగిన మొలత్రాడు, బంగారు పాదుకలు, భోజన నిమిత్తం బంగారుపళ్ళెరాలు, పానీయాలు సేవించడానికి వెండిచెంబులు, పట్టువస్త్రాలు.
💫 కలియుగవేంకటేశ్వరుని అంగరంగ వైభవం ఆనాడే మొదలైంది. పద్మావతీదేవి శ్రీనివాసుని నట్టింట కాలిడిన వేళా విశేషం – చేతిలో చిల్లిగవ్వలేని శ్రీనివాసుడు, ఆనాటినుండి ఈనాటివరకు అప్లైశ్వర్యాలతో తులతూగుతున్నాడు. -
🙏 గోత్ర ప్రవర 🙏
💫 ఆకాశరాజు తరఫున పద్మావతిదేవి గోత్ర వివరాలను దేవగురువు బృహస్పతి ఈ విధంగా విశదపరిచాడు:
"అత్రిమహర్షి గోత్రంలో జన్మించిన సుధీరచక్రవర్తి మునిమనుమరాలు, సుధర్ముని మనుమరాలు, ఆకాశరాజు కూతురు అయిన పద్మావతిని శ్రీనివాసునికి సంపూర్ణంగా, సంతోషంగా సమర్పిస్తున్నాం. ధర్మపత్నిగా స్వీకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం",
💫 శ్రీనివాసుని తరఫున పురోహితుడైన వశిష్ఠులవారు, శ్రీనివాసుని గోత్ర వివరాలను ఈ విధంగా తెలియజెప్పారు:
"యయాతిరాజు యొక్క మునిమనవడు, శూరసేనచక్రవర్తి యొక్క మనుమడు, వసుదేవుని పుత్రుడు, వశిష్ట గోత్రీకుడు అయిన శ్రీనివాసుడు, ఆకాశరాజు పుత్రిక అయిన పద్మావతిదేవిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అమితానంద పరవశులమై మేమీ కన్యారత్నాన్ని స్వీకరిస్తున్నాం."
💫 ఈనాడు కూడా తిరుమలక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరునికి, తన పూర్వావతారమైన శ్రీకృష్ణుని గోత్రనామాలతోనే సంకల్పం చెప్పే సాంప్రదాయం ఉంది.
🌹 మంగళసూత్ర ధారణ 🌹
💫 గోత్ర ప్రవరానంతరం కంకణధారణ, వేదపండితుల ఆశీర్వాదం మొదలైన వివాహతంతులన్నీ శాస్తోక్తంగా జరిగాయి. వైశాఖ శుక్లపక్షం, దశమి, శుక్రవారం, పూర్వఫల్గుణి నక్షత్ర శుభముహూర్తంలో శ్రీనివాసుడు పద్మావతిదేవి మెడలో మంగళసూత్రధారణ గావిస్తుండగా, దేవలోకం నుంచి పుష్పవర్షం కురిసింది. దేవదుందుభులు మ్రోగించబడ్డాయి.
💫 ఈ విధంగా నాలుగు రోజుల వివాహకార్యక్రమం అత్యంత వైభవోపేతంగా, "నభూతోనభవిష్యతి" అన్న చందంగా జరిగిన తరువాత, అయిదవ రోజున ఆకాశరాజు - ధరణీదేవి దంపతులు పద్మావతిని శ్రీనివాసునికి లాంఛనప్రాయంగా అప్పగించారు.
🌈 ఆకాశరాజు పంపిన సారె 🌈
💫 అప్పగింతల సందర్భంగా ఆకాశరాజు పద్మావతిదేవితో పాటుగా పంపిన "సారె" ఈ విధంగా ఉంది:
💐 మూడు వందల మేకలు,
💐 ఐదు వేల ఆవులు,
💐 వందలకొద్దీ దాస దాసీజనం,
💐 పట్టు పీతాంబరాలు,
💐 రత్నఖచిత మంచంతో పాటుగా పట్టుపరుపులు, దిండ్లు,
💐 మూడువందల పుట్ల పెసలు.
💐 మహాభారం కలిగిన బెల్లం,
💐 ఒకభారం చింతపండు,
💐 భూరిమొత్తంలో మెంతులు, ఉప్పు, ఇంగువ, ఆవాలు,
💐 వెయ్యి కడవల పాలు,
💐 నూరు కుండల నిండా పెరుగు.
💐 పదిహేనువందల చర్మపాత్రల నిండా నెయ్యి
💐 రెండువందల కుండల నిండా చక్కెర
💐 రెండువందల కుండలనిండా తేనె
💐 గుమ్మడికాయలు, అరటిగెలలు, మామిడిపండ్లు, ఉసిరికాయలు.
💫 వీటన్నింటినీ క్షేమంగా వెంకటాచలం చేర్చటానికి వెయ్యి అశ్వాలు, వెయ్యి ఏనుగులు
💫 తన గారాలపట్టిపై ఆకాశరాజుకు గల ఆప్యాయతానురాగాలకు అంతే లేదు.
💫 వివాహానంతరం శ్రీమహాలక్ష్మి కొల్హాపూర్ కు తిరిగి వెళ్ళిపోయింది. నూతన వధూవరులైన పద్మావతి-శ్రీనివాసులు మూడు రోజులపాటు నారాయణవనం లోనే ఉండి, సర్వసౌఖ్యాలను అనుభవించారు. మూడు నిద్రల అనంతరం, లాంఛనప్రాయంగా అప్పగింతలు జరిగిన తర్వాత, ఆకాశరాజు ఇచ్చిన సారెతో నూతన వధూవరులు వేంకటాచలానికి బయలుదేరారు.
🌈 అగస్త్యాశ్రమ సందర్శన 🌈
💫 పద్మావతీ శ్రీనివాసులు మార్గమధ్యలో సువర్ణముఖీ నదీ తీరాన ఉన్న అగస్త్యముని ఆశ్రమంలో ఆగి, వారిని, ఋషిపత్ని యైన లోపాముద్రను దర్శించుకున్నారు. భక్తిప్రపత్తులతో ఆతిథ్యం ఇచ్చిన అగస్త్యుడు శాస్త్రనియమానుసారం కొత్త దంపతులు ఆరునెలల వరకు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శించరాదని; అందుచేత ఆరుమాసాల పాటు తమ ఆతిథ్యం స్వీకరించి తదనంతరమే శ్రీవేంకటాచలానికి తిరిగి వెళ్లాలని అభ్యర్థించాడు. అగస్త్యుని ప్రార్థనను మన్నించిన శ్రీనివాసుడు ఆ ఆశ్రమంలోనే ఆరు నెలలు గడపటానికి నిశ్చయించుకున్నాడు.
🌈 ఆనందనిలయ నిర్మాణం 🌈
💫 శ్రీనివాసుడు ఈలోగా ఆకాశరాజు తమ్ముడైన తొండమానుని పిలిచి, ఈ ఆరునెలల వ్యవధిలో వేంకటాచలంపై తాము నివసించడానికి ఓ అద్భుతమైన భవనాన్ని వాస్తు ప్రకారం నిర్మించి ఇమ్మని ఆదేశించాడు. ఆ భవనంలో తాము కలియుగాంతం వరకు నివసిస్తామని, తద్వారా తొండమానుని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని కూడా శెలవిచ్చాడు. శ్రీవారి ఆనతిని శిరసావహించిన తొండమానుడు అత్యంత స్వల్పసమయంలో, తిరుమల క్షేత్రంలో స్వామిపుష్కరిణికి దక్షిణభాగాన, తూర్పు ముఖంగా, ఆదివరాహుడు శ్రీనివాసునికి ఆవాసనిమిత్తం ఇచ్చిన స్థలంలో, మూడు ప్రాకారాలు, ఏడు ప్రవేశ ద్వారాలు, బంగారు గోపురం, ధ్వజస్తంభ పరివేష్ఠితంగా ఓ అద్భుతమైన భవనాన్ని నిర్మింపజేశాడు. అదే ఈనాడు తిరుమలలో సర్వాంగ సుందరంగా, నిత్యకళ్యాణం పచ్చతోరణంగా శోభిల్లే "ఆనందనిలయం" అనబడే ముఖ్యాలయం. అందులోనే శ్రీవారు అర్చామూర్తి రూపంలో, దేవేరులిద్దరితో ఈ నాటికీ కొలువై ఉన్నారు.
💫 భవననిర్మాణం పూర్తికాగానే, గృహప్రవేశం చేయవలసిందిగా శ్రీవేంకటేశ్వరునికి వర్తమానం అందింది.
🌈 శ్రీనివాస మంగాపురం - ముక్కోటి 🌈
💫 శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా శ్రీవరాహక్షేత్రానికి బయలుదేరుతూ, అగస్త్యుని ఆతిథ్యానికి సంతుష్టుడై, ఆరునెలల పాటు తాము నివసించిన ఆ ప్రదేశం తమ దంపతు లిరువురి పేరునా, "శ్రీనివాస మంగాపురం" గా ప్రసిద్ధిగాంచుతుందని, అందులో తాను "కళ్యాణ వేంకటేశ్వరుని" గా కొలువై ఉంటానని శెలవిస్తాడు.
💫 మనందరికీ సుపరిచితమైన ఈ "శ్రీనివాస మంగాపురం" ఆలయం గురించి మరోసారి వివరంగా తెలుసుకుందాం.
💫 అయితే, స్థానికుల కథనం ప్రకారం, పద్మావతీ శ్రీనివాసులు, ఆ ఆరునెలల్లో పగటిపూట అగస్త్యుని ఆశ్రమంలోను, రాత్రివేళల్లో శ్రీనివాసమంగాపురంలో ఉన్న మరో ఆశ్రమం లోనూ నివసించేవారట! తిరుపతికి సమీపంలో, సువర్ణముఖి నదీతీరాన, నేటి "తొండవాడ" గ్రామంలో, "ముక్కోటి" గా పిలువబడే దేవాలయమే పద్మావతీశ్రీనివాసులు కొలువున్న ఆశ్రమం. ఈ విషయం ఆ ఆలయ కుడ్యాలపై చిత్రించబడి ఉంది. ఈ ఆలయాన్ని నేడు కూడా మనం చూసి తరించవచ్చు.
🙏 శుభమస్తు 🙏
💫 పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టం భక్తిశ్రద్ధలతో ఎవరు విన్నా, చదివినా, పారాయణం చేసినా; వారి వివాహమహోత్సవం ఎవరు జరిపించినా, శ్రీనివాసుని అనుగ్రహంతో వారింట సర్వశుభాలు కలుగుతాయని తరతరాల నమ్మిక.
💐 శుభప్రదము, సర్వమంగళకరము అయిన "పద్మావతి పరిణయం" ఇక్కడితో ముగిసింది.
No comments :