🙏 శ్రీవారి భక్తాగ్రేసరులు -2 🙏
🙏 కుమ్మరి భీమన్న 🙏
💫 పూర్వం ఆకాశరాజు (శ్రీనివాసునికి మామగారు) తమ్ముడైన "తొండమానుడు" అనే చక్రవర్తి శ్రీవారి పాదాలకు అనునిత్యం బంగారు తులసిదళాలతో డాంబికంగా సహస్రనామార్చన చేస్తూ, తన లాంటి భక్తుడెక్కడా ఉండడని గర్వపడుతూ ఉండేవాడు. మనం ఈనాడు చూస్తున్న, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు నివసించే ఆనందనిలయాన్ని నిర్మించిన మహానుభావుడే ఈ చక్రవర్తి.
🌻 సువర్ణపుష్పాల స్థానంలో మట్టిపువ్వులు🌻
💫 ఒక రోజు ఉదయాన్నే తొండమానుడు స్వామివారి దర్శనానికి వచ్చినపుడు తన బంగారుపుష్పాల స్థానంలో, బంకమట్టి పూలు కనిపించాయి. దానితో ఖంగుతిన్న తొండమానుడు ఒకింత నిరాశతో శ్రీనివాసుణ్ణి ఇదేమని ప్రశ్నించగా, శ్రీవారు కుమ్మరి భీమన్న వృత్తాంతాన్ని తొండమానునికి విశద పరిచారు.
[ ఆ రోజుల్లో భక్తులతో మానవభాషలో సంభాషించే శ్రీనివాసుడు తరువాతి కాలంలో తొండమానునిపై అలక వహించి ప్రత్యక్షంగా మాట్లాడడం విరమించారు. ఆ వృత్తాంతాన్ని మరో సారి ప్రస్తావించు కుందాం.]
🙏 శ్రీనివాసుడు ఉటంకించిన భీమన్న భక్తితత్పరత 🙏
💫 శ్రీవారికి అత్యంత ఆప్తులైన భక్తుల్లో ఒకడైన "భీమన్న" అనే కుమ్మరివాడు ఆలయానికి అవసరమైన కుండలను తయారు చేస్తూ, తన ఇంటిలోనే స్వామివారిని కొయ్యబొమ్మగా ప్రతిష్ఠించి, తన చేతి వ్రేళ్ళకు అంటినట్టి మట్టితో చేసిన పువ్వులతో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీనివాసుణ్ణి నిత్యం పూజించేవాడు. ఉదయం నుండి రాత్రి వరకూ ఏ పని చేస్తున్నా స్వామినే ధ్యానించేవాడు. అతని ధ్యాసంతా శ్రీవారికి కావలసిన కుండలు తయారు చేయడం మీదనే ఉండేది. రెక్కాడితే గానీ డొక్కాడని భీమన్న నిరుపేదతనం శ్రీనివాసుని పట్ల అతనికున్న అపారమైన భక్తిని, సమర్పణాభావాన్ని ఏమాత్రం సడలించలేక పోయింది.
💫 ప్రతిరోజూ చద్ది ఆరగించి, నీవే ఈ పని చేయించుకుంటున్నావంటూ శ్రీవారికి నమస్కరించి పని ప్రారంభించేవాడు. అతను తయారు చేస్తున్న ప్రతి కుండలో స్వామివారు ఆరగిస్తున్నట్లు భావించి, అత్యంత భక్తిశ్రద్ధలతో తన పని చేసుకునేవాడు. ప్రతిరోజూ కుండలను స్వయంగా కొండమీదికి తెచ్చి సమర్పిద్దామనుకునే వాడు కానీ, మరునాటికి కావలసిన క్రొత్త కుండలు తయారు చేయలేనేమోననే బెంగతో, వేంకటాచలం మీదకు వెళ్ళే కార్యక్రమాన్ని వాయిదా వేసుకునే వాడు.
💫 స్వామి ప్రతిరోజూ ఆ కుమ్మరి సమర్పించిన మట్టి కుండలలో నైవేద్యం ఆరగించడమే కాకుండా, అతడు భక్తిపూర్వకంగా అర్పించిన మట్టిపూలను కూడా పరమానందంగా స్వీకరించేవారు. తొండమానునుకి ఆనందనిలయంలో స్వామిపాదాల చెంత, తన బంగారుపూలకు బదులుగా కనిపించినవి ఆ పుష్పాలే.
🌈 భీమన్న గృహానికి తొండమానుని ఆగమనం 🌈
💫 భీమన్న భక్తి తత్పరతను సాక్షాత్తు శ్రీనివాసుని ద్వారా విన్న తొండమానునికి అహంకారపు తెరలు తొలగిపోయాయి. ఆడంబరాల కంటే ఆత్మసమర్పణే ముఖ్యమని విదితమయ్యింది. శ్రీనివాసుని అనుగ్రహానికి అంతగా నోచుకున్న భీమన్నను చూడాలనే తీవ్రమైన కాంక్షతో, తన పరివారాన్నంతటినీ కొండపైనే వదలి, ఒంటరిగా, కాలినడకతో, అలిపిరి సమీపంలో ఉన్న భీమన్న గృహానికి వెళతాడు. తిరుమలకు వెళ్ళే అలిపిరి మెట్లదారిలో, "తలయేరుగుండు" దాటిన తరువాత, ఆ కాలంలో భీమన్న నివాసంగా చెప్పబడే ప్రాంతంలో, "కుమ్మరి సారె" గుర్తులున్న శిలాఫలకాలను, భీమన్న కుటుంబీకుల బొమ్మలను నేడు కూడా చూడవచ్చు. ఆకాలంలో, ఆ ప్రదేశంలో శ్రీవారి గుర్తుగా భీమన్న నిర్మించినట్లు చెప్పబడే "గోపురం", ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది.
💫 విరామం లేని ఒంటరి ప్రయాణం వల్ల, అలసి సొలసి తన ఇంటిముందు అచేతనంగా పడి ఉన్న చక్రవర్తిని చూసిన భీమన్న, తన వల్ల ఏం తప్పిదం జరిగిందా అని కలవరపడతాడు.
🙏 శ్రీనివాసుని సాక్షాత్కారం 🙏
💫 అంతలో, భీమన్న సపర్యలవల్ల సృహలోకి వచ్చిన తొండమానుడు చూస్తుండగానే, అక్కడ శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు. శ్రీవారి దివ్యమంగళరూపాన్ని గాంచిన భీమన్న ఆనందాశ్చర్యాలతో నోట మాట రాక తడబడతాడు. కొంత సేపటి తరువాత తెప్పరిల్లిన భీమన్న, శ్రీవారిని పరిపరి విధాలుగా తనదైన పామరభాషలో కీర్తిస్తాడు. మంత్రతంత్రాలు, పూజా విధానాలు తనకు తెలియనందున క్షమించమని శ్రీనివాసుణ్ణి ఆర్తిగా అర్ధిస్తాడు.
🌈 మట్టిమూకుడులో స్వామివారికి నైవేద్యం 🌈
💫 స్వామివారికి నివేదిద్దామని చూస్తే, ఆ నిరుపేద ఇంటిలో ఏమీ కనపడవు. అలా చింతాక్రాంతుడై ఉన్న భీమన్నను ఓదార్చుతూ, శ్రీనివాసుడు, "జపతపాల కన్నా అచంచలమైన భక్తే నాకు మక్కువ. నీవు తింటున్నదే నాకూ పెట్టు. అవే నాకు పంచభక్ష్య పరమాన్నాలు. నాకు ఆకలిగా ఉంది" అని భీమన్నను సమాధాన పరుస్తాడు.
💫 అప్పుడా కుమ్మరి భార్య, ఇంట్లో సిద్ధంగా ఉన్న ఒక పగిలిన పెంకులో సంకటి పెట్టి స్వామివారిని ఆరగించ వలసిందిగా వేడుకొంటుంది. ప్రేమతో ఆ ఆహారాన్ని స్వీకరించిన స్వామి యొక్క పాదాలకు నమస్కరించగానే, ఆ పరమ పవిత్రస్పర్శతో భీమన్న దంపతులు దివ్యశరీరాలు ధరించి, దేవదుందుభులు మ్రోగుతుండగా, పుష్పకవిమానంలో వైకుంఠానికి పయనమవుతారు.
🙏 తొండమానుని పశ్చాత్తాపం 🙏
💫 ఈ ఉదంతాన్ని కళ్ళారా కాంచిన తొండమానుడు భీమన్న నిరాడంబరమైన భక్తిని శ్లాఘిస్తూ, తాను అహంకారాన్ని విడనాడానని, తన తప్పిదాన్ని మన్నించి తనను కూడా తరింపజేయమని శ్రీనివాసుణ్ణి ప్రార్థిస్తాడు. సంతృప్తి చెందిన స్వామివారు, తొండమానునుకి దివ్యోపదేశం గావిస్తూ, నిర్మలమైన బుద్ధితో తపఃస్సాధన సాగిస్తే మరుజన్మలో మోక్షం సిద్ధిస్తుందని వరమిస్తాడు. ఆ తరువాత, తొండమానుడు నిరాడంబర భక్తితో స్వామిని చాలా కాలం సేవించి, మరు జన్మలో మోక్షాన్ని పొందుతాడు.
💫 ఇప్పటికీ, శ్రీవారు ఆ మహాభక్తుడైన కుమ్మరి భీమన్న గుర్తుగా, మట్టి పెంకులో (సగం పగిలిన కొత్త మట్టి కుండ) పెరుగు అన్నాన్ని రోజూ ప్రాతఃసంధ్య వేళలో తొలి నైవేద్యంగా స్వీకరిస్తూ, భీమన్నను, అతని వారసులను అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఈ ఒక్క నైవేద్యాన్ని మాత్రమే కులశేఖరపడి దాటి, గర్భాలయం లోనికి తీసుకు వెళ్ళి నివేదిస్తారు. వాడిన కుండ మళ్ళీ వాడకుండా, ప్రతిరోజూ కొత్త కుండలో నైవేద్యం సమర్పిస్తారు. అన్నమయ్య, శ్రీవారిని "తోమనిపళ్ళాల వాడని" కీర్తించడంలోని అంతరార్థం అదే!
💫 మిగిలిన సమస్త నైవేద్య విశేషాలన్నింటనీ, గర్భాలయం బయటనుంచే నివేదిస్తారు. అదీ శ్రీవారు తన భక్తుల యెడ చూపించే వాత్సల్యం!
💫 తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య, మనందరికీ సుపరిచితమైన "కొండలలో నెలకొన్న... కుమ్మర దాసుడైన కురువరతి నంబి" అంటూ, కుమ్మరి భీమన్నను తన కీర్తనలో చిరంజీవిని చేశాడు.
💫 ఆవిధంగా, తొలి దర్శనం ఓ గొల్లవానికిచ్చే గోవిందుడు, తొలినైవేద్యం కుమ్మరితో తయారు చేయబడ్డ కుండపెంకులో ఆరగిస్తాడు.
💫 అల్పసంతోషి అయిన ఆ అఖిలాండ నాయకునికి ఆడంబరాలు, అట్టహాసాలు అవసరమా? నిరాడంబరమైన భక్తితో ఆయన్ను ధ్యానిస్తూ, ఆయన సృష్టిలో భాగమైన ఓ అన్నార్తునికి పట్టెడన్నం పెట్టడం శ్రీవారికి నిజమైన సేవ కాదా?
No comments :