🙏 శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 1 🙏
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"
"తిరువీధుల మెరసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారముల తోడను"
లక్షలాది మంది భక్తుల గోవిందనామ స్మరణతో దిక్కులు పిక్కటిల్లుతుండగా, అడుగడుగు దండాలతో ఆబాలగోపాలం హారతి పడుతుండగా, సర్వాలంకారశోభితుడైన శ్రీవారు వివిధ వాహనారూఢుడై మాడవీధుల్లో ఊరేగే మహత్తర ఘట్టాల సమాహారమే "శ్రీవారి బ్రహ్మోత్సవాలు". వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
🌈 పౌరాణిక నేపథ్యం
💫 ఈ బ్రహ్మోత్సవాలను తొలిసారిగా సాక్షాత్తూ బ్రహ్మదేవుడే తన తండ్రిగారైన, కలియుగంలో శ్రీవేంకటేశ్వరుని రూపంలో ఆవిర్భవించిన శ్రీమహావిష్ణువుకు జరిపించినట్లు భవిష్యోత్తరపురాణంలో చెప్పబడింది. అందుకే అవి "బ్రహ్మోత్సవాలు" గా ప్రసిద్ధికెక్కాయి.
💫 అయితే, తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే ఇవి చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి కాబట్టి వీటిని "బ్రహ్మోత్సవాలు" అంటారని కొందరు భావిస్తారు. ఏది ఏమైనా భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ; మహమ్మదీయ, క్రైస్తవపాలకుల హయాంలో కూడా నిరంతరాయంగా కొనసాగుతూ, ఈ "బ్రహ్మోత్సవాలు" తమ వైశిష్ట్యాన్ని చాటుకుంటున్నాయి.
"నానాదిక్కుల నరులెల్లా
వానలలోనే వత్తురు గదలి..."
అంటూ, అన్నమాచార్యుల వారు బ్రహ్మోత్సవాలను సందర్శించటానికి భక్తులు నలు దిక్కుల నుండి ఎండవానలను లెక్కజేయకుండా, తండోపతండాలుగా ఎలా కదలి వస్తారో వివరించారు.
🌈 చారిత్రక నేపథ్యం
💫 చారిత్రకాధారాలు లభ్యమైనంత వరకూ, మొట్టమొదటగా బ్రహ్మోత్సవాల ప్రస్తావన 614వ సం. లో వచ్చింది. అప్పట్లో, తమిళ నెల "పెరటాసి" మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలలో భోగశ్రీనివాసుణ్ణి ఊరేగించేవారు. 966వ సం. లో, పది రోజులపాటు జరుపబడే బ్రహ్మొత్సవాల చివరి రోజును "తీర్థవారి దినం" గా పిలిచేవారు. తరువాతి కాలంలో నిడివిని మరో రోజు పొడిగించి, 11వ రోజున "విదయాత్ర" పండుగ నిర్వహించేవారు.
💫 వివిధ పాలకుల హయాంలో ఈ బ్రహ్మోత్సవాలను వివిధ పేర్లతో పిలిచినప్పటికీ, రోజుల సంఖ్యలో కొద్ది మార్పులున్నటికీ, ఈ ఉత్సవాలు దాదాపు 1400 సం. లుగా తమ మౌలికస్వభావాన్ని యథాతథంగా ఉంచుకో గలిగాయి. తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలుడు "ఆడితిరునాళ్ళు" పేరుతోనూ, వీరప్రతాపదేవరాయలు "మాసి తిరునాళ్ళు" పేరుతోనూ, అచ్యుతరాయలు "అచ్యుతరాయ బ్రహ్మోత్సవం" పేరుతోనూ, ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారు.
💫 l1583వ సం. లో నెలకో సారి జరిగే బ్రహ్మోత్సవాలు,1638వ సంవత్సరంలో 11 సార్లు నిర్వహించబడ్డాయి. ఒక్కోసారి 3 నుంచి 5 రోజులవరకూ ఈ ఉత్సవాలను జరిపించేవారు. బ్రహ్మోత్సవాల్లో ఏ రోజు ఏ వాహనం మీద స్వామిని ఊరేగించాలనే విషయం ఆగమశాస్త్రంలో నిర్దిష్టంగా చెప్పబడలేదు. ఆయా కాలాల్లో అప్పటి నిర్వాహకులు, అర్చకస్వాములు కలిసి ఏ ఏ వాహనాలను ఏ ఏ రోజుల్లో ఉపయోగించాలో నిర్ణయించేవారు.
💫 కాలక్రమేణా ఉత్సవాల స్థాయి, వైభవం పెరుగుతూ, రోజుల సంఖ్య తగ్గుతూ వచ్చి, ప్రస్తుతం ఈ ఉత్సవాలను సంవత్సరానికో సారి, తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తున్నారు. అదే, అధికమాసం వచ్చిన సంవత్సరంలో మాత్రం రెండు సార్లు నిర్వహిస్తారు. ఆ వివరాలు తరువాత తెలుసుకుందాం.
🌈 బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
💫 పూర్వకాలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పంపించే ఆహ్వానం ఆసక్తికరంగా ఉండేది. శ్రీవారి ఆలయద్వారం ముందుగా పెద్దశబ్దం వచ్చేట్లు బాణాసంచా పేల్చేవారు. తరువాత మహంతుల కాలంలో భక్తులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ; చుట్టుప్రక్కల పల్లెలు, పట్టణాలు, తిరుమల గ్రామంలో "దండోరా" వేసేవారు. ఈ మధ్య కాలం వరకూ తిరుమల గ్రామప్రజలు తమ ఇళ్ళను కొబ్బరి, అరటి, మామిడి ఆకులతో అలంకరించుకుని, దేవాలయాన్ని కూడా శోభాయమానంగా అలంకరించి; ఇతరగ్రామాల్లో ఉన్న తమ బంధుమిత్రులను స్వంత ఇంట్లో శుభాకార్యానికి ఆహ్వానించినట్లు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేవారు. దేవాలయ పరిశుభ్రత, భద్రత, యాత్రికులకు వసతి, భోజనం, మంచినీటి సౌకర్యం లాంటి ఏర్పాట్లన్నీ తిరుమల గ్రామప్రజలే స్వయంగా నిర్వహించేవారు.
🌈 బ్రహ్మోత్సవాల్లో రకాలు
💫 నిర్ధారిత మాసంలో, నిర్ధారిత నక్షత్రంలో 3, 5, 7, 9, 11, 13 రోజులపాటు జరిగేవాటిని "నిత్యబ్రహ్మోత్సవాలు" అంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఈ బ్రహ్మోత్సవాల గురించే!
💫 కరువులు, వ్యాధులు, దుష్టగ్రహకూటములు సంభవించినప్పుడు ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలను "శాంతి బ్రహ్మోత్సవాలు" అంటారు.
💫 భక్తులెవరికైనా కోరిన కోర్కెలు నెరవేరిన సందర్భంగా, స్వంతధనం వెచ్చించి జరిపించుకునేవి "శ్రద్ధా బ్రహ్మోత్సవాలు". శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ జరిగే. "ఆర్జిత బ్రహ్మోత్సవాలు" ఈ కోవలోకే వస్తాయి.
💫 ఇవన్నీ కాకుండా, తిరుమలలో సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే జరిగే మరో మూడు బ్రహ్మోత్సవాలున్నాయి. అవి రథసప్తమినాడు జరిగే "ఆర్షము", కైశిక ద్వాదశి రోజున జరిగే "రాక్షసం", ముక్కోటి ఏకాదశి నాడు జరిగే "దైవికం".
🌈 పుష్ప, విద్యుద్దీపాలంకరణ
💫 బ్రహ్మోత్సవాల సందర్భంగా, ఉద్యానవన విభాగ ఆధ్వర్యంలో తిరుమలప్రధాన ఆలయాన్ని, ఉత్సవ వాహనాలను, పరిసరాలను, మాడవీధులను, ఇతర దేవాలయాలను, మండపాలను, కూడళ్ళను, రహదార్లను రంగు రంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరిస్తారు. ఇందు నిమిత్తం పోయిన బ్రహ్మోత్సవాల్లో సుమారు 40 టన్నుల సాంప్రదాయపుష్పాలు, రెండు టన్నుల కట్ ఫ్లవర్సు, 50 వేల ఆ కాలంలో మాత్రమే దొరికే పుష్పాలను వినియోగించారు. ఇంతే కాకుండా వందలకొద్దీ విద్యుత్ కార్మికులు వారాల తరబడి శ్రమించి కళ్ళు మిరుమిట్లు గొలిపేలా; లక్షలాది విద్యద్దీపాలతో అనేక పౌరాణిక పాత్రలు, భారత భాగవత ఘట్టాలు, వన్యప్రాణులు, దేవతలు మున్నగువాటిని ఆవిష్కరింప జేస్తారు.
🌈 కళాకార్ల బృందాలు
💫 వివిధ కళారూపాలతో స్వామివారిని కొలుస్తూ భక్తులకు కనువిందు చేయటంకోసం, 2019 బ్రహ్మోత్సవాలకు 18 రాష్ట్రాలనుండి, 357 బృందాలుగా, 8200 మంది కళాకారులు విచ్చేశారు. ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. మాడవీధుల్లో స్వామివారి వాహనానికి ముందుండి ఈ కళాకారులందరూ వివిధరకాల విన్యాసాలు, దేవతామూర్తుల వేషధారణ, అభినయం, కోలాట ప్రదర్శన, కోయనృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం, అస్సాంకు చెందిన బిహు నాట్యం, ఉత్తరాఖండ్ కు చెందిన చోలియా నృత్యం, తమిళనాడుకు చెందిన టపాటం, గరగాటం, బయలాటం, సయ్యాండిమేళం, కొక్కిల్ ప్రదర్శనలతో భక్తులను అలరిస్తారు. దాదాపుగా భారతదేశంలో నుండే అన్ని కళారూపాలను మనం బ్రహ్మోత్సవాల సందర్భంగా, మాడవీధులలో చూసి ఆనందించవచ్చు. ఆలయానికి నాలుగు ప్రక్కలా ఉన్న మాడవీధుల గ్యాలరీల్లో కూర్చుని సుమారు రెండు లక్షలమంది భక్తులు ఈ ఉత్సవాల్ని కన్నులపండువగా వీక్షిస్తారు. వివిధ మాధ్యమాల ద్వారా ఈ ఉత్సవాల్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
🐘 గజరాజుల సేవ 🐘
💫 పద్మ, పెద్దపద్మ, లక్ష్మి, మహాలక్ష్మి అనే నలుగురు గజరాజులను మావటీలు ముందుగా శుభ్రం చేసి, ముస్తాబు చేసి, శరీరం కాంతివంతంగా మెరిసిపోవడానికి నువ్వలనూనెతో మర్దనా చేస్తారు. వీటి నుదుటన తెల్లనినామాలు, మధ్య సింధూరంతో అలంకరించి ఆలయం వద్దకు తీసుకుని వస్తారు. అలాగే, అలంకరించిన వృషభాలను కూడా తోడ్కొని వస్తారు.
🌈 నూతన గొడుగుల వితరణ
💫 శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నైకు చెందిన హిందూమహాసభ సభ్యులు గత ఎనిమిది సంవత్సరాలుగా శ్రీవారికి ఈ క్రింది వాటిని లాంఛనప్రాయంగా సమర్పిస్తున్నారు:
12 జానల శ్వేత గొడుగులు: 2
10 జానల పట్టుగొడుగులు : 2
6 జానల శ్వేత గొడుగులు : 2
💫 ఈ గొడుగులన్నింటినీ వైభవోత్సవమండపానికి తీసుకుని వచ్చి, అక్కడినుండి ఆలయ అధికారులతో కలసి వాటిని ఆలయంలోనికి తీసుకు వెళతారు.
💫 స్వామివారి వాహనానికి వెనుకగా, "ఘటాటోపం" అనబడే ఒక గుడారాన్ని పరిచారకులు మోసుకుంటూ వెళ్లారు. అకస్మాత్తుగా వర్షం వస్తే స్వామివారి వాహనానికి ఇది రక్షణ కల్పిస్తుంది.
🌈 దర్భ సమర్పణ
💫 బ్రహ్మోత్సవాల సందర్భంగా తి.తి.దే. అటవీ శాఖాధికారులు, ఆలయ అధికారులకు దర్భను సమర్పిస్తారు. ధ్వజారోహణపర్వంలో; ఆలయం నందు నిర్వహించే సేవలు, కైంకర్యాలు, హోమాల్లో ఈ దర్భను వినియోగిస్తారు. ఈ దర్భతో తయారు చేయబడిన చాప, తాడు ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆలయాధికారులకు అందజేస్తారు. ఈ దర్భను తిరుమలలోని కళ్యాణ వేదికకెదురుగా ఉండే తి.తి.దే. అటవీ విభాగం నర్సరీల్లోనూ, తిరుపతి సమీపం నందున్న వడమాలపేట గ్రామంలోని పొలంగట్ల నుండి సేకరిస్తారు. ఇలా సేకరించిన దర్భలను పదిహేను రోజులు నీడలో ఆరబెడతారు. ఆ దర్భతో తయారు చేసిన కొడితాడు, చాప, విడిగా సుమారు 10 కిలోల దర్భను అధికారులకు అందజేస్తారు.
🌈 రవాణా సదుపాయాలు
💫 తిరుపతి-తిరుమల మధ్య రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడిపే తొలి బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, బస్సులన్నింటినీ అరటి పిలకలు, మామిడి తోరణాలు, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు సుమారు 400 బస్సులతో, 2000 ట్రిప్పులతో, రెండు లక్షలమంది భక్తులను కొండపైకి చేరవేస్తారు. గరుడవాహనం రోజున ఈ సంఖ్య దాదాపుగా రెట్టింపవుతుంది.
🌈 భోజన సదుపాయాలు
💫 బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్యం సుమారు మూడు లక్షల మందికి ఉచిత భోజనం అందజేస్తారు. గరుడసేవ రోజున రాత్రి 1:30 గం. వరకూ, భోజనాలు వడ్డిస్తుంటారు. ప్రధాన అన్నదాన కేంద్రమైన తరిగొండ వెంగమాంబ భవనంలోనే కాకుండా, తిరుమలలోని వివిధ కూడళ్ళలో కూడా అన్నదానం చేస్తుంటారు. భోజన ఏర్పాట్లు ఏ స్థాయిలో జరుగుతాయంటే క్రితం బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున రెండు లక్షల పులిహోర పొట్లాలు, లక్షా డెబ్బయ్యెదు వేల పళ్ళాల టమాటా అన్నం, సాంబారన్నం సరఫరా చేశారు. మొత్తం 32,500 కిలోల బియ్యం, 20 వేల లీటర్ల పాలు, 8000 కిలోల ఉప్మారవ్వను ఉపయోగించారు. దాదాపుగా ఈ మొత్తం సరుకుల్ని దాతలే సమకూర్చారు.
🌈 వివిధ విభాగాల సేవలు
💫 వేలకొద్దీ పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తూ, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తారు. అలాగే, డజన్ల కొద్దీ వైద్యసిబ్బంది అహోరాత్రులు వైద్యసేవల నందిస్తుటారు. వేలకొద్దీ పోలీసులతో బాటుగా, వందలాది మంది ఆలయ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తారు. వేలాదిమంది శ్రీవారి సేవకులు, స్కౌట్లు క్యూల నిర్వహణతో బాటు, భక్తులకు ఇతర సేవల నందిస్తుంటారు. "వాహనబేరర్లు" రెండు పూటలూ కలిపి సుమారుగా రోజుకు ఐదు గంటల పాటు స్వామివారి వాహనాల్ని మోస్తుంటారు. బ్రహ్మోత్సవాల్లో లడ్డూ మొదలగు ప్రసాదాల్ని కూడా భారీగా తయారు చేయిస్తారు.
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"
🌈 ఉత్సవాలు, ఊరేగింపులు ఎందుకు జరుగుతాయి? 🌈
💫 అశౌచం, అంగవైకల్యం, అనారోగ్యం, వృద్ధాప్యం, సమయాభావం లేదా మరే ఇతర కారణాల చేతనైనా గుడిలోని దేవుణ్ణి దర్శించుకోలేని వారికోసం దైవమే స్వయంగా, ఉత్సవమూర్తుల రూపంలో, ఆలయం వెలుపలికేతెంచి భక్తులను అనుగ్రహించటం కోసం; ఆగమశాస్త్రానుసారం ఉత్సవాలు, ఊరేగింపులు ప్రవేశ పెట్టబడ్డాయి.
💫 దేవతలు, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషులూ, మానవులే కాకుండా అనేక వన్యమృగాలు, పక్షులు కూడా స్వామివారి సేవలో తరించాయి. అవి వేర్వేరు సమయాల్లో స్వామివారికి సమర్పించిన సేవలకు గుర్తుగా బ్రహ్మోత్సవాల్లో స్వామివారు జంతు మరియు ఖగ (పక్షి) వాహనాలపై ఊరేగుతారు.
🌈 తిథి - నక్షత్రాలు 🌈
💫 సాధారణంగా, ప్రతి ఆలయంలో ఉత్సవాలను ప్రారంభ తిథికి అనుగుణంగా మొదలుపెడతారు. కానీ తిరుమలలో మాత్రం ముగింపు రోజును పరిగణనలోకి తీసుకుని ఉత్సవాలను ప్రారంభించే సాంప్రదాయం అనాదిగా ఉంది.
💫 కన్యారాశిలో శ్రవణా నక్షత్రం నాడు "అవభృధము" లేదా "చక్రస్నానం" నిర్ణయించి, దానికి తొమ్మిది రోజుల ముందుగా బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు.
💫 సాధారణ సంవత్సరాల్లో - అంటే అధికమాసం లేని సంవత్సరాల్లో ఈ బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ మాసమందు దసరా నవరాత్రుల్లో ఒక్కసారి మాత్రమే వస్తాయి. వీటిని "సాలకట్ల బ్రహ్మోత్సవాలు" అంటారు. ఉత్తరభారతీయ భాషల్లో "సాల్" అంటే సంవత్సరం, "కట్ల" లేదా "కట్టడి" అనే తెలుగు పదానికి "సాంప్రదాయం" అని అర్థం. మహంతుల కాలం నుండి ఈ పదం వాడుకలోనికి వచ్చింది.
💫 అదే అధికమాసం వచ్చిన సంవత్సరాల్లో బ్రహ్మోత్సవాలు రెండుసార్లు జరుగుతాయి. ఈ సంవత్సరాల్లో కన్యాశ్రవణం భాద్రపదమాసంలో వస్తుంది. ఈ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలను "వార్షికబ్రహ్మోత్సవాలు" అని పిలుస్తారు. ఇవి ముఖ్యమైనవి. ఆ సంవత్సరంలో రెండవసారి, ఆశ్వయుజమాసంలో జరిగే ఉత్సవాలను "నవరాత్రి బ్రహ్మోత్సవాలు" గా పిలుస్తారు.
👉 ఈ సందర్భంలో, అధికమాసం గురించి కొద్దిగా చెప్పుకోవాలి.
💫 తమిళులు ఎక్కువగా అనుసరించే, సంవత్సరానికి 365 రోజులు గల సౌరమానంలో అధికమాసాలు లేవు. కానీ, తెలుగువారు అధికంగా అనుసరించే చంద్రమానంలో సంవత్సరానికి 354 దినాలు. అంటే చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కంటే 11 రోజులు తక్కువగా ఉండటంతో చంద్రమానంలో సూర్య సంక్రమణం లేని మాసం వస్తుంది. అదే అధికమాసం. సౌరమానం మరియు చంద్రమానాన్ని సమన్వయ పరచడం కోసం ఏర్పాటు చేయబడిన ఈ అధికమాసం ప్రతి మూడవ సంవత్సరంలో వస్తుంది. ఇలా సమన్వయించక పోతే, ఋతుచక్రం కొంత కాలానికి గతి తప్పుతుంది.
💫 సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు, "అంకురార్పణ', 'ధ్వజారోహణం' తో ప్రారంభమై "ధ్వజావరోహణం" తో ముగుస్తాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఇవి ఉండవు. ఇంకో ముఖ్యమైన తేడా ఏమిటంటే వార్షిక బ్రహ్మోత్సవాల్లో రథోత్సవానికి "కొయ్యతేరు" ను ఉపయోగిస్తారు. అదే, నవరాత్రి బ్రహోత్సవాల్లో కొయ్యతేరుకు బదులు మొదట్లో వెండి రధాన్ని, ప్రస్తుతం బంగారు రథాన్ని ఉపయోగిస్తున్నారు.
🌈 బ్రహ్మోత్సవాల పరమార్థం 🌈
💫 బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు జరిగే అంకురార్పణ పర్వం నుండి తొమ్మిదవ రోజున జరిగే చక్రస్నానం వరకు జరిగే ప్రతి వేడుక, ప్రతి ఉత్సవం, స్వామివారు అధిరోహించే ప్రతి వాహనం సందేశాత్మకమే. వాహనాలపై విహరించే మలయప్పస్వామిని దర్శించుకుంటే అశ్వమేధయాగం చేసినంత ఫలితం వస్తుందని పురాణాల్లో చెప్పబడింది.
🌈 అంకురార్పణ ఘట్టం 🌈
💫 ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల యందు అర్చకుల్లో ఒకరిని "కంకణ భట్టాచార్యులు" గా నియమిస్తారు. అంకురార్పణఘట్టం నుండి చక్రస్నానం వరకు వాహనసేవల్లో, యాగశాలలో, ఇతర పూజాదికాల్లో ఆయనే ప్రధానపాత్ర వహిస్తారు. ఆగమశాస్త్ర ప్రకారం ఉత్సవాలు పూర్తయ్యేంత వరకూ వీరు పొలిమేర దాటి వెళ్ళరాదు.
💫 వైఖానస ఆగమ సాంప్రదాయ క్రతువుల్లో తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావటంకోసం తొలిగా జరిపించే "అంకురార్పణం" లేదా "బీజావాపనం" అత్యంత ముఖ్యమైన ఘట్టం.
💫 ఈ ఘట్టం ఆరంభంలో, స్వామివారి సేనాధిపతి అయిన విష్వక్సేనుడు నాలుగు మాడ వీధుల్లో ఊరేగే సన్నివేశాన్ని అన్నమయ్య ఇలా వర్ణించాడు -
"అది వచ్చె నిది వచ్చె నచ్యుత సేనాపతి
పది దిక్కులకు నిట్టె పార లో యసురులు".
💫 తాత్పర్యమేమంటే, "విష్ణుదేవుని యొక్క సేనాధిపతి అయిన విష్వక్సేనుని రాక దానవులందరికీ భయం కలిగించింది." బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడానికి ముందురోజున, విష్వక్సేనులవారు పంచాయుధధారియై తన తిరుచ్చి వాహనంపై ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి నాలుగు మాడ వీధుల్లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఇందులో భాగంగా పడమర వీధి లోని నైఋతి మూలన ఉన్న వసంతమండపం లోకి విచ్చేస్తారు. ఆ తరువాత నిర్ణీత ప్రదేశంలో భూదేవి ఆకారాన్ని చిత్రించి, అందులోని లలాట, బాహు స్థన ప్రదేశాల నుండి మట్టిని తీసి ఆలయం లోనికి తీసుకు వస్తారు. దీన్నే "మృత్సంగ్రహణం" లేదా "పుట్టమన్ను సేకరించటం" అంటారు.
💫 ఆలయంలోని యాగశాలకు సమీపంలో అంకురార్పణ జరిగే ప్రదేశాన్ని ముందుగా ఆవుపేడతో శుద్ధిచేసి, తరువాత సేనాధిపతికి ఆ ప్రదేశంలో "బ్రహ్మపీఠాన్ని" ఏర్పాటు చేస్తారు. తదుపరి, అగ్ని ద్వారా – బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ • దేవతలను ఆహ్వానిస్తారు.
💫 ముందుగా సేకరించి నటువంటి, మట్టితో నింపిన 9 పాళికల్లో శాలి, వ్రీహి, యువ, ముద్గ (పెసలు), మాష (మినుములు), ప్రియంగు (కొర్రలు) వంటి నవధాన్యాలను చల్లి, వరుణ మంత్రాన్ని పఠించి నీరు చిలకరిస్తారు. ఈ పాళికలను నూతన వస్త్రాలతో అలంకరించి పుణ్యాహవచనం చేస్తారు. ప్రతిరోజు ఈ పాళికల్లో నీరు పోస్తూ పచ్చగా మొలకలు వచ్చేలా చూస్తారు. అందుకే ఇది "అంకురార్పణ కార్యక్రమం" గా పిలువ బడుతుంది. ఈ కార్యక్రమానికి సోముడు లేదా చంద్రుడు అధిపతి. పాళికలలోని నవధాన్యాలు శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. ఆ తరువాత సోమరాజమంత్రాన్ని, విష్ణుసూక్తాన్ని పఠిస్తారు. ఖగోళశాస్త్రనుసారం ఔషధాధిపతి చంద్రుడు కాబట్టి, రాత్రి సమయంలోనే విత్తనం నాటడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా వేడుకగా, శాస్త్రయుక్తంగా సమకూరే అంకురార్పణ కార్యక్రమంతో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు మొదలవుతాయి.
🌈 ధ్వజారోహణం 🌈
💫 బ్రహ్మోత్సవాల తొలిరోజు సాయం సమయాన జరిగే ఉత్సవం "ధ్వజారోహణం". ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి వారికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు. ఆ తరువాత స్వామి వారిని ధ్వజస్తంభం వద్దకు చేరుస్తారు.
💫 ఈలోగా ఆగమశాస్త్రానుసారం కంకణధారణ, అష్టదిక్కుల్లో అర్చకుల బలినివేదన, శాస్తోక్తంగా జరిపి ధ్వజపటాన్ని మాడవీధుల్లో ఊరేగిస్తూ ఆలయం వద్దకు తీసుకొస్తారు.
మలయప్పస్వామి వారి సమక్షంలో, వేదగానాల మధ్య మంగళవాద్యాలు మ్రోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజం లేదా ధ్వజపటం ఎగురవేస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, గరుడుని బొమ్మ చిత్రీకరించిన క్రొత్తవస్త్రమే ధ్వజపటం లేదా గరుడధ్వజం. కొడిత్రాడు సాయంతో దాన్ని ధ్వజస్తంభ శిఖరానికి చేరుస్తారు. గగనతలాన ఎగిరే ఈ గరుడ పతాకమే సకల దేవతలకు, అష్టదిక్పాలకులకు, భూత-ప్రేత-యక్ష-రాక్షసగంధర్వగణాలకు ఆహ్వానం పలుకుతుంది. ఈ ఆహ్వానం అందుకుని ఉత్సవాలకు విచ్చేసిన ఆహ్వానితులందరికీ, నైవేద్య రూపంలో బలిని సమర్పిస్తారు. ఈ సందర్భంగా, "ముద్గాన్నం" అనబడే పెసరపులగం నివేదించ బడుతుంది. దీన్ని స్వీకరిస్తే స్త్రీలు సంతానవతులవుతారని భక్తుల విశ్వాసం.
💫ప్రస్తుతం సాయంకాలాలలో జరుపబడే ధ్వజారోహణం నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బేడి ఆంజనేయస్వామి వారి సన్నిధి నుండి ఊరేగింపుగా వచ్చి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. దాంతో బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే! ఆ రాత్రి నుండే స్వామివారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేర్వేరు వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
🌈 వాహనోత్సవ క్రమం 🌈
✅ వాహనోత్సవక్రమం ఈ విధంగా ఉంటుంది:
💫 బ్రహ్మోత్సవాల ముందు రోజు – అంకురార్పణ ఘట్టం
✳️ మొదటి రోజు సాయంత్రం ధ్వజారోహణం, వెనువెంటనే పెద్దశేషవాహనం.
✳️ రెండవ రోజు ఉదయం చిన్న శేష వాహనం, సాయంత్రం హంసవాహనం
✳️ మూడవ రోజు ఉదయం సింహవాహనం, సాయంత్రం ముత్యపుపందిరి వాహనం
✳️ నాల్గవ రోజు ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహనం
✳️ ఐదవ రోజు ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గరుడవాహనం
✳️ ఆరవ రోజు ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, తదుపరి గజవాహనం
✳️ ఏడవ రోజు ఉదయం సూర్యప్రభవాహనం, సాయంత్రం చంద్రప్రభవాహనం.
✳️ ఎనిమిదవ రోజు ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనం.
✳️ తొమ్మిదవ రోజు ఉదయం పల్లకి ఉత్సవం, మధ్యాహ్నం తిరుచ్చి ఉత్సవం, తదనంతరం 6 గంటలకు చక్రస్నానం.
💫 ఇలా మొత్తం పదిహేడు వాహనాలెక్కి ఊరేగుతుండడం వల్లనే స్వామివారు భక్త జనులకు ప్రీతిపాత్రుడయ్యాడట. అందుకే అన్నమయ్య - స్వామివారిని ఈ విధంగా కీర్తించాడు.
"ఎట్టు నేరిచితివయ్య ఇన్ని వాహనములెక్క
గట్టిగా నిందుకే హరి కడు మెచ్చేమయ్యా ! "
🌈 తండ్రిగారికి తనయుడు చేసే సేవ 🌈
💫 బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఉత్సవ వాహనాల ముందుగా "బ్రహ్మరథం" వెళుతూ ఉంటుంది. ఎందుకంటే, శ్రీవారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మదేవుని నేతృత్వంలో, ఆయన సమక్షంలో జరుగుతున్నాయని లోకాలకు తెలియపరచడం కోసం!
💫. శ్రీవారి వాహనానికి ముందు, శోభాయమానంగా అలంకరించిన ఓ చిన్న రథంలో, నిరాకార నిర్గుణ స్వరూపంలో బ్రహ్మదేవుడు వేంచేసి ఉత్సవాలకు ఆధ్వర్యం వహిస్తాడు. కానీ ఒక్క రథోత్సవం నాడు మాత్రం అదృశ్యంగా స్వామివారి రథం యొక్క పగ్గాలను స్వయంగా పట్టి లాగుతూ రథోత్సవంలో పాల్గొంటాడు. అందుకే ఆరోజు స్వామివారి వాహనం ముందు, బ్రహ్మదేవుడు వేంచేసి ఉండే చిన్న రథం ఉండదు.
💫 లోక కళ్యాణార్థమై ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసిన బ్రహ్మను గుర్తుకు తెస్తూ, శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో - "ఓం బ్రహ్మకృతోత్సవాయ శ్రీవేంకటేశాయ నమః" అనే నామం చేర్చబడింది. దీని అర్థం, 'బ్రహ్మచే ఏర్పాటు చేయబడిన మహోత్సవాలను స్వీకరించిన శ్రీవేంకటేశ్వరునికి ప్రణామం."
💫 బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారు అధిరోహించే ప్రతి వాహనానికి జన్మజన్మల ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ప్రతి జన్మలోనూ వాటికి శ్రీవారితో విడదీయరాని అనుబంధం ఉంది. ఒక్కో వాహనం ఒక్కో సందేశాన్నిస్తుంది. ఆ పదిహేడు వాహనాల చరిత్ర, అవి మనకందించే సందేశాలు ఇప్పుడు వివరంగా చూద్దాం.
🌈 పెద్దశేష వాహనం 🌈
💫 అన్నమయ్య, బ్రహ్మోత్సవాల్లో శేషవాహన శోభను ఈ విధంగా వర్ణించాడు:
వీడుగదే శేషుడు శ్రీ వేంకటాద్రి శేషుడు
వేడుక గరుడునితో బెన్నుద్దెన శేషుడు ||
పట్టుపు వాహనమైన బంగారు శేషుడు
చుట్టు చుట్టుకొనిన మించుల శేషుడు
నట్టుకొన్న రెండువేల నాలుకల శేషుడు
నెట్టిన వారి బొగడ నెరుపరి శేషుడు ||
💫 ధ్వజారోహణ జరిగిన రోజు, అంటే బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు రాత్రివేళలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి వారికి ఏడు పడగల బంగారు "పెద్దశేషవాహనం" పై ఉత్సవం జరుగుతుంది. కృతయుగంలో అనంతునిగా, త్రేతాయుగంలో లక్ష్మణునిగా, ద్వాపరంలో బలరామునిగా, కలియుగంలో భగవద్రామానుజాచార్యులుగా అవతరించి; శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితునిగా ప్రసిద్ధికెక్కినవాడు ఆదిశేషుడు.
💫 శారీరక దృఢత్వం మరియు బుద్ధిబలం సమృద్ధిగా, సమపాళ్ళలో కలిగిన ఈ ఆదిశేషుడు, శ్రీ మహావిష్ణువుకు - సింహాసనంగా, శయ్యగా, పాదుకలుగా, వస్త్రంగా, ఛత్రంగా, ఆనుకునే దిండుగా - ఇలా సమస్తసేవలు ఎల్లవేళలా అందిస్తున్నాడు. ఆదిశేషుడు నాగజాతికి అధిపతి.
💫 ఆదిశేషునికి సంబంధించి ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఒకానొకప్పుడు, కశ్యప ప్రజాపతి భార్యలైన వినతి-కద్రువల మధ్య ఒక వివాదం ఏర్పడింది. ఇంద్రుని ఉచ్ఛైశ్రవం వాస్తవంగా స్వచ్ఛమైన శ్వేతవర్ణంతో ఏ విధమైన మచ్చలు లేకుండా ఉంటుంది. దాని తోకపై ఓ నల్లటి మచ్చ ఉందని, ఒకవేళ అది నిజమైతే వినతి తనకు దాస్యం చేయాలని, లేకుంటే తానే వినతికి దాస్యం చేస్తానని కద్రువ, వినతితో పందెం కాసింది. అయితే, ఉచ్ఛైశ్రవం మీద ఏ విధమైన మచ్చ లేదని తరువాత తెలుసుకున్న కద్రువ తన కుమారులైన నాగులను పిలచి, ఎవరైనా ఒక నాగు ఉచ్ఛైశ్రవం తోకకు చుట్టుకుని దాన్నే నల్లటి మచ్చగా భ్రమింపజేసి తనను పందెంలో గెలిపించాలని కోరింది. అటువంటి అనైతిక కార్యం సాకారం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. తనయుల ధిక్కారంతో ఆగ్రహం చెందిన కద్రువ, వారందరూ తల్లి మాట వినని కారణంచేత జనమేజయుని సర్పయాగంలో మాడిమసైపోతారని శపించింది. నాగుల్లో ఒకడైన కర్కోటకుడనే వాడు మాత్రం శాపానికి భయపడి, తల్లి మాట ననుసరించి ఉచ్ఛైశ్రవం తోకను చుట్టుకొని ఆమెను పందెంలో గెలిపింపజేశాడు.
💫 మిగిలిన నాగుల్లో ఒకడైన ఆదిశేషుడు తన తల్లి, సోదరుడు చేసిన అనైతిక కార్యానికి విరక్తి చెంది బ్రహ్మను గూర్చి దీర్ఘతపస్సు చేశాడు. అతని ధర్మనిరతి, సత్యనిష్ఠకు సంతృప్తి చెందిన బ్రహ్మదేవుడు, ఆదిశేషునికి భూమిని ధరించే మహత్తర కార్యాన్ని అప్పగించాడు. ఆ ప్రకారం అపరిమిత బలసంపన్నుడైన ఆదిశేషుడు, తన పడగలపై భూభారాన్నంతటినీ నిరంతరం మోయసాగాడు. అత్యంత కష్టతరమైన ఆ కార్యాన్ని ఎంతో శ్రద్ధగా, త్యాగనిరతితో నిర్వహిస్తున్న ఆదిశేషుణ్ణి చూసి సంతోషించిన శ్రీమహావిష్ణువు అతన్ని తన శయ్యగా, సింహాసనంగా ఎంచుకున్నాడు. ఈ వాహనసేవను చూసి తరించిన భక్తులకు ఆదిశేషుని కున్నంత సహనం, త్యాగనిరతి, ధర్మనిష్ఠ, శ్రీనివాసుని ఎడల అచంచలమైన భక్తి కలుగుతాయని ప్రతీతి.
💫 ఉభయనాంచారులతో కూడిన మలయప్పస్వామిని పుష్పమాలాలంకృతుణ్ణి చేసి, వాహనమండపంలో ఉన్న ఆదిశేషునిపై అధిరోహింపజేసి, మాడవీధుల్లో జరిపించే ఊరేగింపును బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైనదిగా పరిగణిస్తారు. మొదట్లో తొమ్మిదవ రోజు ఉదయం ఊరేగింపునకు ఉపయోగించే ఈ వాహనం, కారణాంతరాల వల్ల ఇప్పుడు మొదట్లోనే వినియోగించబడుతోంది.
💫 శేషవాహనం దాస్య భక్తికి నిదర్శనం. ఆ భక్తితో అంకితభావం పెంపొంది, పశుత్వం నశించి, క్రమంగా మానవత్వం, అందుండి దైవత్వం, దానిద్వారా పరమపదం సిద్ధిస్తాయని నమ్మిక.
💫 మామూలు రోజుల్లో ఈ వాహనాన్ని సంపంగి ప్రదక్షిణ మార్గంలోని రంగమండపంలో మనం దర్శించుకోవచ్చు.
🌈 చిన్నశేషవాహనం 🌈
💫 రెండవరోజు ఉదయం మలయప్పస్వామి వారు ఒంటరిగా చిన్నశేషవాహనంపై, మురళీకృష్ణునిగా లేదా నవనీత గోపాలునిగా దర్శనమిస్తారు.
💫 మునుపటి రోజున స్వామివారు అధిరోహించిన "పెద్దశేషవాహనం" విష్ణుమూర్తి సింహాసనమైన ఆదిశేషుని ప్రతిరూపం కాగా; ఈరోజు ఉదయం శ్రీవారు ఊరేగే "చిన్నశేషవాహనం" క్షీరసాగరమథనంలో మంథరపర్వతానికి కవ్వపుత్రాడుగా వ్యవహరించిన "వాసుకి" యొక్క ప్రతిరూపం.
💫 ఆదిశేషుడు "నాగజాతి" కి రాజైతే, వాసుకి "సర్పజాతి" కి పాలకుడు. ఆదిశేషునికి నిత్య సాన్నిధ్య భాగ్యం కలిగించిన విష్ణువు సాగరమంథన కార్యానికి తోడ్పడ్డ వాసుకికి మాత్రం "చిన్నశేషవాహనం" గా మారి బ్రహ్మోత్సవాల్లో తన సేవచేసుకునే అదృష్టాన్ని కల్పించాడు.
💫 శేషుడు, వాసుకి, ఇద్దరూ చైతన్యశక్తికి సంకేతాలు. కావున ఈ రెండు వాహనాల దర్శనంతో, భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుంది. యోగశాస్త్రంలో సర్పాన్ని కుండలినీ శక్తికి సంకేతంగా భావిస్తారు. కావున ఈ వాహనాన సేవలను దర్శించిన భక్తులకు కుండలినీ యోగఫలం సిద్ధించి, మానవుడు, మాధవునికి నిజమైన సేవకుడయ్యే అవకాశం లభిస్తుంది.
💫 తరిగొండ వెంగమాంబ ఈ రెండు వాహనాలను ఈ విధంగా వర్ణించింది:
అలఘ శేషవాహనోత్సవంబును,
మరునాడుదయంబు నందు లఘుశేషవాహనోత్సవంబును
🌈 హంసవాహనం 🌈
హంస వాహనముపైన హరి నేడు చూడరు
వీణాపాణియై వేయి రాగాలతో
అందరి గుండెలోను అమృతం కురియగా...
💫 రెండవరోజు సాయంత్రం, శ్రీవారు వీణాపాణి, ధవళ వస్త్రధారి, చల్లని వెన్నెలలొలికించే తెల్లని పుష్పాలు ధరించిన చదువులతల్లి రూపంలో, బంగారు హంసవాహనారూఢుడై మాడవీధులలో విహరిస్తారు.
💫 పురాణాల ప్రకారం ఒకప్పుడు లోకాలన్నీ అజ్ఞానతిమిరంలో మునిగిపోయి ఉండగా; దేవతల కోర్కెపై, విష్ణువు హంసవాహనమెక్కి హయగ్రీవునిగా లోకాలకేతెంచి తిమిరాన్ని పారద్రోలుతాడు. అలాగే, బ్రహ్మోత్సవాలలో స్వామివారు హంసవాహన మెక్కి "అన్ని కళలకూ, సర్వవిజ్ఞానానికి కారణభూతుణ్ణి నేనే, అన్నీ నా ద్వారానే సిద్ధిస్తాయి!" అన్న సందేశమిస్తారు.
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే
- అన్న శ్లోకంతో మొదలయ్యే "హయగ్రీవస్తోత్రం" సారాంశమిదే.
💫 చదువులతల్లి సరస్వతి రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే, అజ్ఞానతిమిరం తొలగిపోకుండా ఉంటుందా? సృష్టికర్తయైనట్టి బ్రహ్మదేవుని వాహనమైన హంసకు, వేరెవ్వరికీ లేనటువంటి ఓ అద్భుతమైన విచక్షణాశక్తి ఉంది.
గుంభనమున దుగ్ధజీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవసారము
- అనగా, ఓ పాత్రలో క్షీరనీర మిశ్రమాన్ని ఉంచితే, హంస పాలను మాత్రం గ్రహించి, నీటిని త్యజిస్తుంది. అలాగే, సృష్టిలో విచక్షణాజ్ఞానం కలిగి ఉన్న ఏకైకజీవి మానవుడు, నిరంతర సాధన చేస్తూ, చరాచర విశ్వంలో సమ్మిళితమై ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని ఆకళింపు చేసుకుని, ఐహిక వాంఛలన్నీ పరిత్యజించాలి. నిస్సారమైన ప్రాపంచిక పాశాలలో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న ఆత్మసాక్షాత్కారాన్ని ఆవిష్కరింప జేసుకోవాలి. హంసవాహనా రూఢుడైన శ్రీవారు అందించే సందేశ మిదే!
🌈 సింహవాహనం 🌈
💫 బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం మలయప్పస్వామి ఒక్కరే సింహవాహనంపై ఊరేగుతారు.
"మృగాణాం చ మృగేంద్రో అహం" అంటూ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు తనను తాను "మృగాల్లో సింహరాజుగా" అభివర్ణించు కున్నాడు. అపరిమితమైన "సింహబల" మంత భక్తి గలవారిని స్వామి అనుగ్రహిస్తారనే సందేశం ఈ వాహనసేవ ద్వారా పంపబడుతుంది
💫 సింహానికీ – శ్రీవారికి అనేక సారూప్యాలు, అత్యంత సాన్నిహిత్యం ఉన్నాయి -
💫 శ్రీవారి నిలయమైన ఆనందనిలయ విమానంపై నలుదిక్కులా, సింహప్రతిమలు వేంచేసి ఉంటాయి.
💫 విష్ణుసహస్రనామ పారాయణంలో సింహనామం రెండు పర్యాయాలు వస్తుంది (శ్లోకాల సంఖ్య 22 మరియు 52).
💫 దశావతారాల్లో నృశింహావతారము నాలుగవది. అలాగే, బ్రహ్మోత్సవాల్లో కూడా సింహవాహనం నాల్గవది కావడం విశేషం.
💫 యోగశాస్త్రంలో సింహం సహనశక్తికీ, గమనశక్తికి ప్రతీకగా చెప్పబడుతుంది. సింహాన్ని చూసి ఇతర జంతువులు భయపడినట్లు, సింహవాహనాన్ని అధిష్ఠించిన శ్రీవారిని చూచి సమస్త మానవులు "తప్పు చేసినచో భగవంతుని దండన తప్పదు" అనే భయం కలిగి విచక్షణాజ్ఞానంతో వ్యవహరిస్తారు. యోగా నరసింహస్వామి గా సింహవాహనంపై ఊరేగుతున్న స్వామివారు దుష్టజనసంహార, భక్తజన సంరక్షణ సంకేతాలు జనియింప చేస్తారు.
💫 హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన నరసింహావతారాన్ని ఆళ్వార్లు ఎంతో భక్తితో పూజించారు. ఈ సింహం ప్రహ్లాదుని ప్రార్థనకు పూర్వం అదృశ్యశక్తిగా రాక్షసభవన స్తంభంలో దాగి ఉంది. శ్రీహరి పరమభక్తుడైన ప్రహ్లాదుడు "హరి ఎందెందు వెదకిన అందందే గలడు" అంటూ తన తండ్రికి ధైర్యంగా సమాధాన మిచ్చాడు. ఆ బాలభక్తుని వాక్కు సాకారం చేయడం కోసం; సకల చరాచర సృష్టిలో నిక్షిప్తమై ఉన్నటువంటి శ్రీహరి స్తంభాన్ని చీల్చుకుని, నారసింహుని రూపంలో ప్రత్యక్షమై, దుష్టుడైన హిరణ్యకశిపుణ్ణి అంతమొందించాడు.
💫 కృతయుగంలో ఆ నాస్తికస్తంభాన్ని ఛేదించి వెలికి వచ్చి దుష్టసంహారం గావించినట్లు; ఈ కలియుగంలో నాస్తికత్వాన్ని పటాపంచలు చేసి మానవుల హృదయాలలో భక్తిభావాన్ని పెంపొందించి వారిని సన్మార్గంలో నడిపించడానికై స్వామివారు సింహవాహనంపై ఊరేగుతారు.
జయజయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద!! మిహిర శశినయన మృగన రవేష
బహిరంతస్థల పరిపూర్ణ అహినాయక సింహాసన రాజిత
బహుళ గుణగణ ప్రహ్లాద వరద!!!
💫 ప్రతి సంవత్సరం వాహనాలు స్థిరంగా ఉంటాయి గానీ, అందులోని మలయప్పస్వామి వేషధారణలో మాత్రం స్వల్ప మార్పులు ఉంటాయి. ఉదాహరణకు, ఒక సంవత్సరం నవనీత గోపాలుడయితే, మరో సంవత్సరం కాళీయమర్దనుడు అవుతాడు.
🌈 ముత్యపుపందిరి వాహనం 🌈
💫 మూడవరోజు రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీదేవి భూదేవిలతో కూడిన మలయప్పస్వామి వారు తిరుమల మాడ వీధుల్లో విహరిస్తారు. వాహనాన్ని నిండుగా ముత్యాల సరాలతో అలంకరించి, వాటి చివర్ల పట్టుకుచ్చులు అమర్చి, కళ్యాణ శోభ ఉట్టిపడేలా తీర్చిదిద్దుతారు. వాహనానికి నలువైపులా కట్టబడి యున్న సరిగంచు పట్టుపరదాలకు, శ్వేత వర్ణంతో తణుకులీను తున్న ముత్యాలను ఒద్దికగా పేర్చి ఫల, పుష్ప, జంతు, వస్తు ఆకృతులను సృష్టిస్తారు.
💫 చల్లని ముత్యాల పందిరిలో వేంచేసియున్న శ్రీనివాసుని దర్శనం, భక్తుల మదిలోని తాపత్రయాలను తొలగించి, జీవితాలకు అలౌకిక ప్రశాంతత చేకూర్చుతుంది. స్వచ్ఛతకు, నిర్మలత్వానికి, అసమాన సౌందర్యానికి ప్రతీక అయిన ముత్యం, స్వాతికార్తెలో పడిన వర్షపు చినుకు ద్వారా సముద్రగర్భం లోని ముత్యపు చిప్పలో ఉద్భవిస్తుంది. సాగరం ప్రసాదించే మేలి వస్తువుల్లో "ముత్యం" ముఖ్యమైనది.
💫 అంతటి ప్రాశస్త్యం ఉన్న ముత్యాలకు – శ్రీమహావిష్ణువుకు ఉన్న అనుబంధం యుగయుగాలుగా కొనసాగుతోంది:
✳️ ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు "నాసాగ్రే నవమౌక్తికం" - అనగా "ముక్కుకొనలో నూతన ముత్యాన్ని ధరించిన వాడుగా" కీర్తించబడ్డాడు.
✳️ కలియుగంలో శ్రీనివాసుడు "మౌక్తిక సగ్వి" అంటే, "ముత్యాలహారాన్ని ధరించినవాడు" అని ప్రస్తుతింపబడ్డాడు.
✳️ స్వామి వారు అనునిత్యం ధరించే అనేకానేక ఆభరణాలలో మేలుజాతి ముత్యాలు పొదగబడి ఉంటాయి. పద్మపురాణంలో ముత్యాలతో చేయబడిన ఓ ఛత్రం విష్ణుమూర్తికి నీడనిచ్చినట్లుగా చెప్పబడింది. కృతయుగంలో శ్రీమహవిష్ణువు "ముత్తాత ప్రతితానంత మండలుడు" అంటే "ముత్యాల గొడుగుల రూపంలో ఉన్న ఆదిశేషుని యొక్క వేయి పడగల క్రింద విశ్రాంతి తీసుకుంటున్నట్లు" వర్ణించబడింది. నేడు కలియుగంలో ఈ ముత్యాల పందిరి స్వామివారికి నీడనిస్తూ, చల్లదనం చేకూరుస్తుంది.
💫 శరన్నవరాత్రులలో నిర్మలాకాశంలో మెరుస్తున్న నక్షత్రాలతో పోటీ పడుతూ, విద్యుద్దీపాల కాంతిలో ప్రకాశిస్తున్న ముత్యాల పందిరి వాహనం రసరమ్య భరితంగా ఉంటుంది. శ్రీనివాసుని భక్తిలో ఓలలాడిన భక్తులందరూ పులుకడిగిన ముత్యంలా స్వచ్ఛమైన మనస్సుతో ఆవిష్కరింపబడతారు.
🌈 కల్పవృక్షవాహనం 🌈
💫 బ్రహ్మోత్సవాలలో నాల్గవరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి, కల్పవృక్షవాహనంపై విహరిస్తూ భక్తులను అలరిస్తారు. కాండము, శాఖలు, పత్రాలు, పుష్పాలు, లతలు, ఇలా: వృక్షభాగాలన్నింటినీ మేలిమి బంగారంతో, కళాకౌశలం ఉట్టిపడేలా, సృజనాత్మకంగా తీర్చిదిద్దుతారు.
💫 ప్రకృతికి శోభనిచ్చేది వృక్షం. సృష్టిలోని వృక్షాలన్నింటికీ మేటి కల్పవృక్షం. క్షీరసాగరమధనంలో ఉద్భవించిన ఈ కల్పవృక్షం మనోవాంఛా ఫలాలను సిద్ధిస్తుంది.
ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై కోరివచ్చువారి కోర్కులు నీనెడు వేల్పుమాను పాలివెల్లి బుట్టె
💫 అంటే దేవతలు, రాక్షసులు క్షీరసముద్రాన్ని అమృతం కోసం చిలుకుతున్నప్పుడు: అన్ని ఋతువులలోనూ పచ్చగా నుండి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం ఉద్భవించింది.
💫 ఆది ఐహిక సుఖాలను మాత్రమే అందిస్తుంది. కానీ, ఆ వాహనాన్ని అధివేష్ఠించి ఉన్న శ్రీనివాసుడు ఐహిక, ఆముష్మిక సుఖాలను కూడా ప్రసాదిస్తాడు.
అన్నమయ్య రామావతారుడైన శ్రీమహావిష్ణువును కోర్కెలు తీర్చే కల్పవృక్షము, కామధేనువు, చింతామణిగా ఇలా వర్ణించాడు -
గౌతము భార్యాపాలిటి కామధేను వితడు,
ధాతల కౌశికుపాలి కల్పవృక్షము,
సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు,
ఈతడు దాసులపాలి ఇహపరదైవము ||
💫 కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు సత్యభామ కోర్కె తీర్చడం కోసం పారిజాతవృక్షాన్ని దివి నుంచి భువికి తెచ్చి ప్రతిష్ఠించాడు. ఇప్పుడు కలియుగంలో ఆశ్రిత భక్తజన వాంఛితాలను యీడేర్చడం కోసం శ్రీవారు కల్పవృక్షవాహనంపై విహరిస్తున్నారు.
💫 వృక్షం అనంతమైన జీవజాలానికి ఆలవాలం. చెట్టు తొర్రలు, బొరియలు, వ్రేళ్ళు, శాఖలు సమస్తం పక్షులకు, చీమలకు, పాములకు ఇంకా అనేక రకాల క్రిమికీటకాలకు ఆవాసం కల్పిస్తాయి. చెట్లు మానవజాతికి ఫల, పుష్పాదులను ప్రసాదించడమే గాకుండా, జీవం కోల్పోయిన తర్వాత కూడా కలప నిచ్చి శాశ్వత నివాసం కల్పించడానికి తోడ్పడతాయి. అనేక ఔషధాలు చెట్ల నుండి తయారవుతాయి. అదేవిధంగా, కల్పవృక్షవాహనంలో కొలువైన శ్రీవారిని దర్శించుకుంటే... "పండిన పెరటి కల్పము వాస్తవ్యుండు" అన్నట్లు స్వామి వారు కల్పవృక్షంలా భక్తుల కోర్కెలను కాదనకుండా తీర్చుతారు.
🌈 సర్వభూపాలవాహనం 🌈
💫 బ్రహ్మోత్సవాల్లో నాల్గవనాటి రాత్రి మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవిలతో సర్వభూపాలవాహనంపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తారు. మేలిమి బంగారంతో, అచ్చెరువొందే శిల్పకళా సోయగంతో, ఇంద్రభవనాన్ని తలపించే రాజప్రాసాదాన్ని ఈ వాహనంపై ఆవిష్కరిస్తారు. అన్ని వాహనాల్లో కెల్లా అత్యంత బరువైన ఈ సర్వభూపాల వాహనం వెయ్యి కిలోలకు పైగా ఉంటుంది.
💫 "సర్వభూపాల" అంటే "రాజులందరూ" అని అర్థం. దిక్కులను కాచే అష్టదిక్పాలకులు కూడా ఈ కోవకే చెందుతారు. విష్ణు అంశ లేనిదే రాజభోగం లభించదు. "రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే" అనే వేదస్మృతి ననుసరించి, శ్రీహరి రాజాధిరాజు. మిగిలిన రాజులందరూ శ్రీనివాసుణ్ణి తమ భుజస్కంధాలపై మోస్తూ ఆదరిస్తున్నారు. లోకపాలకులందరూ శ్రీవారి పాదాక్రాంతులై, వారి కనుసన్నల్లో మెలుగుతూ ఉన్నట్లుగా ఈ ఉత్సవం ద్వారా మనకు గోచరిస్తుంది. సమస్తలోకాలలో ఉన్న రాజులందరికీ విశేషమైన అధికారాలు ఉంటాయి. వాటి సహాయంతో, దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావిస్తూ మనోరంజకంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు. ఆ అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే, వారికి శ్రీవారి పట్ల అపరిమితమైన భయభక్తులు కలిగి ఉండాలి. సర్వభూపాలవాహన వీక్షణం ద్వారా రాజులందరూ ఈ సద్గుణాలను పుణికిపుచ్చుకొనటం వల్ల పరిపాలన సజావుగా సాగుతుంది. ఈ సేవను దర్శించడం ద్వారా భక్తులు తమ అహంకారం నశింపజేసుకొని, శాశ్వత ఫలితాన్ని పొందుతారు. ఇతిహాసాల్లో చెప్పబడినట్లు, సాటి నరుడు కోపిస్తే రాజు రక్షిస్తాడు. రాజు కోపిస్తే, దేవుడు రక్షిస్తాడు. అంటే, దేవుని కృప ఉంటే వేరెవ్వరూ మనకేమాత్రం హాని తలపెట్ట లేరు.
💫 ఈ వాహనం దర్శించడం ద్వారా దేవదేవుని కృపను సంపూర్ణంగా పొందవచ్చు.
🌈 మోహిని అవతారం 🌈
💫 ఐదవ నాటి ఉదయం శ్రీవేంకటేశ్వరుడు మోహిని రూపం ధరించి, రాక్షసులను మోహింప చేసిన జగన్మోహినిగా బంగారుపల్లకిలో సోయగాలు ఒలకబోస్తూ దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడు దంతపు పల్లకి పై స్వామివారిని అనుసరిస్తూ ఊరేగుతాడు. మోహిని అవతారం ప్రత్యేకత ఏమిటంటే మిగతా అన్ని వాహనాలు వాహనమండపం నుండి మొదలైతే, ఈ వాహనం మాత్రం శ్రీవారి ఆలయం నుండి ప్రారంభమవుతుంది.
💫 శ్రీ మహావిష్ణువు యొక్క మోహిని అవతార ప్రసక్తి పురాణాల్లో అనేకసార్లు గోచరిస్తుంది -
✳️ మొదటగా, క్షీరసాగర మధనంలో శ్రీహరి జగన్మోహిని వేషధారియై రాక్షసులను తన ముగ్ధమోహన అవతారంతో మైమరిపింపజేసి అమృతభాండాన్ని అమరులకు అందజేస్తాడు.
✳️ మరోసారి, భోళాశంకరుడిచ్చిన వరగర్వంతో విర్రవీగుతూ ముల్లోకాలలో కల్లోలం సృష్టించిన భస్మాసురుణ్ణి శ్రీహరి జగన్మ్మోహన రూపంతో సమ్మోహింప జేసి ఆ దానవుడి పీచమణుస్తాడు.
✳️ మూడవసారి, దారుకావనం నందు జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణువును చూసి మోహించిన శివునితో జరిగిన సంగమం వల్ల శాస్తా ఉద్భవం జరిగింది.
💫 మోహిని అవతారంలో, మలయప్పస్వామి కూర్చున్న భంగిమలో కనిపిస్తారు. స్త్రీలు ధరించే సర్వాభరణాలు శ్రీవారికి అలంకరింప బడతాయి. మోహిని వేషధారణలో ఉన్న మలయప్ప స్వామికి పట్టు చీర, రవిక, కిరీటం స్థానంలో రత్న ఖచ్చితమైన సూర్య-చంద్ర-సావేరిలను అలంకరిస్తారు. స్వామివారికి వజ్రపు ముక్కుపుడక, ముత్యాల బులాకీని సైతం ధరింపజేస్తారు. సాధారణంగా, వరదభంగిమలో ఉండే స్వామివారి కుడి చెయ్యి మోహిని అలంకరణలో కొన్నిసార్లు రాచిలుక తోనూ, మరికొన్ని సార్లు అభయ హస్తంగానూ దర్శనమిస్తుంది.
💫 జగత్తంతా మాయా మోహానికి లొంగబడి ఉంటుంది. తన భక్తులు కానివారు మాయాధీనం కాక తప్పదని గీతలో శ్రీ కృష్ణ భగవానుడు సెలవిచ్చారు. మాయాఅధిరోహింప ప్రపంచం నుండి తన భక్తులను రక్షించడానికి తిరుమలేశుడు మోహిని వేషధారియై తిరువీధుల్లో దర్శనమిస్తున్నాడు.
*బలగర్వితులు, అహంకారులు కార్య ఫలితాన్ని పొందలేరని, వినయవిధేయతలతో భగవంతుని ఆశ్రయించినవారే కృషి ఫలితాన్ని సంపూర్ణంగా పొందగలరు" అనే సందేశం - మోహినీ అవతారం ద్వారా ప్రకటితమవుతుంది.
🙏 గరుడవాహన సేవ 🙏
కపిలాక్షం గరుత్మంతం సువర్ణసదృశప్రభమ్
దీర్ఘ బాహుం బృహత్ స్కంధం వందే నాగాంగభూషణం ||
💫 తిరుమల బ్రహ్మోత్సవాలలో ఐదవనాటి రాత్రి జరిగే గరుడోత్సవం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఉత్సవంలో మలయప్పస్వామివారు ఒక్కరే, వారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడవాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో విహరిస్తారు.
💫 తిరుమల బ్రహ్మోత్సవాల్లో మిగతా వాహన సేవలన్నీ ఒక ఎత్తయితే, గరుడవాహనం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ వాహనసేవను వీక్షించడానికై తిరుమల క్షేత్రానికి విచ్చేసిన అశేష భక్తజన సందోహాన్ని చూస్తుంటే ఒడలు పులకరించి పోతుంది.
గరుడ గమన గోవిందా! గరుడ గమన గోవిందా!! గరుడ గమన గోవిందా!!!
😊💫 బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు గరుత్మంతుడు ఉత్సవాలను పర్యవేక్షిస్తూ, ఉత్సవ నిర్వాహకుడైన బ్రహ్మకు సహాయకుడిగా ఉంటాడు.
💫 గరుత్మంతుని ఇరు రెక్కలు కర్మ-భక్తికి సంకేతాలు. నాసిక-జ్ఞానానికి ప్రతిరూపం. ఇలా, కర్మ-భక్తి- జ్ఞాన సంయోగమైన వేదమే ఆ గరుత్మంతుని రూపంలో స్వామివారిని మోస్తున్నది. స్వామివారు వేదమయుడు, వేదరూపుడు, వేదవేదాంత వేద్యుడు. కనుక, వేదమే ఆయనను భరిస్తోందన్న మాట.
💫 "ఓం పక్షిస్వాహా!" అన్న గరుడపంచాక్షరి మంత్రంలో ఐదు అక్షరాలు ఉన్నాయి. కనుక "పంచవర్ణరహస్యం" గా పేర్కొనబడే ఈ గరుడోత్సవం, బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు జరగటం శ్రీవారి సంకల్పమే కానీ, యాదృచ్ఛికం కాదు.
"శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం" అంటూ, శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలో కీర్తించబడే సప్తగిరులలో 'గరుడాచలం' ఒకటి. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రోడ్డుమార్గంలో, వినాయకుని మందిరం సమీపాన, ఓ పర్వతసానువు "గరుడపక్షి" ఆకారంలో కనిపిస్తుంది. కొనదేలిన నాసిక, విశాలమైన నుదురు, రెక్కలు, చెవులు ఈ విధంగా, గరుత్మంతుడి శరీర భాగాలన్నీ ఆ పర్వతశిఖర పార్శ్వభాగాన గోచరిస్తాయి. "శ్రీనివాసుడు గరుడాద్రిపై కొలువై ఉన్నాడు" అని చెప్పటానికి ఇంకేం ఆధారం కావాలి?
కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం గరుడాచలమ్ ద్వాపరే శేషాచలం చ వెంకటాద్రి కలౌ యుగే ||
- అన్న సంస్కృత శ్లోకాన్ని బట్టి శేషాచలానికి, త్రేతాయుగంలో గరుడాద్రి అనే పేరు ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. పౌరాణిక మూలాల్లోకి వెళితే, కృతయుగంలో శ్రీమహావిష్ణువు మరో అవతారమైన ఆదివరాహుని ఆదేశం మేరకు వైకుంఠం లోని క్రీడాచల పర్వతాన్ని తెచ్చి, సువర్ణముఖి నది ఉత్తరతీరాన నిలిపింది. 'గరుడుడే'. అందువల్లనే వేంకటాద్రిని గరుడాద్రిగా వ్యవహరిస్తారని మార్కండేయ పురాణం లోని ఈ శ్లోకం వివరిస్తుంది -
వైకుంఠలోకాత్ గరుడేన విష్ణోః
క్రీడాచలో వెంకటనామధేయః ఆనీయ చ సర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణునివాస హేతోః
💫 గరుత్మంతుడు తన తల్లి వినతి యొక్క దాస్యాన్ని, క్లేశాన్ని పోగొట్టడం కోసం స్వర్గలోకానికి వెళ్లి అక్కడి వారందరినీ చాకచక్యంగా ఏమార్చి, అమృతభాండాన్ని చేజిక్కించు కుంటాడు. అమృత సేవనంతో జరామరణాలు ఉండవని తెలిసికూడా, స్వయంగా సేవిద్దామనే ప్రలోభానికి ఏమాత్రం లోను గాకుండా, తన తల్లి దాస్యవిముక్తే ఏకైక లక్ష్యంగా కార్యోన్ముఖుడవుతాడు. ఎంతో నిర్లిప్తంగా మాతృకార్యాన్ని నిర్వహించిన గరుత్మంతుని కార్యదీక్ష, త్యాగనిరతి, వినయశీలత, శారీరక దృఢత్వం వంటి మంగళకరమైన లక్షణాలకు ముగ్ధుడైన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోవలసిందిగా శెలవిస్తాడు. అప్పుడు గరుత్మంతుడు కోరుకున్న కోరిక పరమాద్భుతం. అమృతం సేవించక పోయినా జరామరణాలు లేకుండా, తానెంతటి బలవంతు డైనప్పటికీ పరమ వినయ విధేయతలతో విష్ణుమూర్తి సేవ చేసుకునే భాగ్యం కలగాలని కోరుకుంటాడు. గరుత్మంతుని నిస్వార్థ సేవాభావానికి అచ్చెరువొందిన వైకుంఠనాథుడు అతనికి రెండు వరాలిస్తాడు. వాటిననుసరించి గరుడుణ్ణి విష్ణుమూర్తి తన వాహనంగా స్వీకరించి, తన పతాకంపై ఎల్లప్పుడూ గరుడుని చిహ్నం ఉంచుకుంటాడు. "తాను అత్యంత ప్రీతిపూర్వకంగా అధిరోహించే వాహనం గరుత్మంతుడే" అని కూడా శ్రీహరి పలుమార్లు పెక్కు సందర్భాల్లో పేర్కొన్నాడు.
💫 శ్రీమహావిష్ణువు ఆదేశం మేరకు గరుత్మంతుడు శ్రీవారి సన్నిధిలో, సరిగ్గా బంగారువాకిలికి ఎదురుగా, నమస్కారముద్రలో నిలుచుని; భక్తులకు శ్రీవారి దర్శనమార్గాన్ని, విధానాన్ని సూచిస్తుంటాడు.
💫 శ్రీమహావిష్ణువు వరాలనొసగిన నాటినుండి వైనతేయుడు శ్రీమహావిష్ణువుకు దాసునిగా, ప్రియసఖుడిగా, విసనకర్రగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, ధ్వజపటంగా అనేకానేక సేవలు అందిస్తున్నాడు.
దాసో మిత్రం తాళ వృంతం వితానం
పీఠం వాసో వాహనం చ ధ్వజశ్చ
ఏవం భూత్వా అనేకథా సర్వథా సః
శ్రీ శం శ్రీమాన్ సేవతే వైనతేయః ||
💫 గరుత్మంతుడు విష్ణువుకు ధ్వజపటం కూడా అవ్వటం చేత బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమై, ధ్వజావరోహణంతో ముగుస్తాయి.
🙏 ఇప్పుడు, గరుడుని అధిరోహించిన స్వామి వారిని అవలోకిద్దాం. 🙏
💫 స్వామివారు స్వర్ణ కిరీటం ధరించి శోభాయమానంగా దర్శనమిస్తుంటారు. ఆ కిరీటం మధ్య భాగంలో మిలమిలా మెరుస్తున్న పచ్చ, కిరీటానికి వ్రేలాడుతున్న ముత్యాలు, కిరీటానికి పొదిగినటువంటి రత్నాలు; కంఠసీమ యందు కేవలం గరుడోత్సవం నాడు తప్ప తక్కిన సర్వకాల సర్వావస్థల యందు మూలమూర్తికి మాత్రమే పరిమిత మయ్యుండే - శ్రీవెంకటేశ్వరసహస్రనామమాల, మకరకంఠి, లక్ష్మీహారాలు; ఉదరభాగాన మరో అందమైన పచ్చ, దివ్యంగా అలంకరింపబడిన పూలమాలలు ఇలా స్వామి నయనానందకరంగా, భక్తజన రంజకంగా అలరారుతుంటారు. గరుత్మంతుడు కొనదేలిన నాసికతో, పదునైన చేతి గోళ్ళతో, తిరునామాలతో ఓ ప్రక్క వైభవోపేతంగా, మరోపక్క అరివీర భయంకరంగా దర్శనమిస్తారు.
💫 ఒక్క గరుడసేవలో మాత్రమే శ్రీవారు ఈ ఆభరణాలన్నింటినీ ధరిస్తారు. గరుడసేవలో, ధ్రువమూర్తి అయిన శ్రీవెంకటేశ్వరస్వామికి - ఉత్సవమూర్తియైన మలయప్పస్వామికి వ్యత్యాసం లేదన్న విశ్వాసం కారణంగా, ఆనాడు మాత్రం మూలమూర్తికి అలంకరింప బడే ఆభరణాలన్నీ మలయప్ప స్వామి చెంత చేరుతాయి.
గోదా సమర్పిత సుభాషిత పుష్పమాలాం
లక్ష్మీహార మణిభూషిత సహస్రనామ్నాం
మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః
శ్రీవేంకటాద్రి నిలయో జయతి ప్రసన్నః ||
💫 తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు ఆలయంలో గోదాదేవికి అలంకరించి తొలగించిన పూమాలలను తిరుమలకు తెప్పించి స్వామివారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన మైనటువంటి గరుడసేవ నాడు స్వామి వారికి అలంకరిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామికి సమర్పించిన స్వర్ణాభరణాలు, మడిమాన్యాలు చాలా వరకు కనుమరుగై నప్పటికీ వారి హయాంలో ప్రవేశపెట్ట బడిన ఆముక్తమాలల సమర్పణ, అలంకరణ సాంప్రదాయాలు మాత్రం నేటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నాయి. "ఆముక్తమాల" లంటే, రాయల విరచిత "ఆముక్తమాల్యద" గ్రంథంలో పేర్కొన్నట్టి "గోదాదేవి అలంకరించు కొని తీసివేసి శ్రీరంగనాథునికి ధరింప జేసిన పూమాలలు" అని అర్థం.
💫 రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే నూతన పట్టు వస్త్రాలను కూడా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరిస్తారు. అలాగే, గరుడోత్సవం నాడు చెన్నపట్టణం లోని హిందూధర్మార్థ సమితి వారు నూతన ఛత్రాలకు విశేషపూజలు గావించి, చెన్నై నుండి కాలినడకతో ఊరేగింపుగా తిరుమలకు తీసుకొని వచ్చి స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు. ఈ గొడుగులతో పాటుగా, శ్రీవారికి పూలంగి కపాయి, కొల్లాయి; వక్షస్థల లక్ష్మీదేవికి పావడాలు; తిరుచానూరు పద్మావతి అమ్మవారికి గొడుగులు, పసుపు, కుంకుమ, చందనం మొదలైన వాటిని "శ్రీవారిసారి" గా పేర్కొంటూ ఒక వెదురుబుట్టలో పెట్టి శాస్తోక్తంగా సమర్పిస్తారు.
💫 అంగరంగ వైభోగంగా సాగుతున్న గరుడోత్సవ వైభవాన్ని చూచి పులకించిన అన్నమాచార్యులు ఉత్సవశోభను ఈ విధంగా వర్ణించాడు -
పల్లించి గరుడునిపై నీవుబ్బున నెక్క..
బంగారు గరుడునిపై నీవు వీధులేగ
చెంగట శ్రీవెంకటేశ్వర సిరులు మూగే
సంగతి నలమేల్మంగ సంతసాన విర్రవీగే
పొంగారు దేవదుందుభులు పై పై వాగె ||
💫 గరుడోత్సవంలో, విష్ణుమూర్తి, గరుడుని మందారవర్ణపు చిగుళ్ల పొట్లాల వంటి రెండు అరచేతులపై ఎర్రతామరలవలె ఉన్న తన రెండు పాదాలను పెట్టి వైభవం ఒలకబోస్తూ దర్జాగా కూర్చుని ఉంటాడు.
💫 గరుడ వాహనారూఢుడైన విష్ణుదేవుని దర్శించి మైమరచిపోయిన పెరియాళ్వార్ (విష్ణుచిత్తుడు) "పల్లాండు-పల్లాండు" అంటూ మంగళాశాసనం చేశాడు. I
"గరుడగమనా రారా! నన్ను కరుణనేలు కోరా!!' అంటూ రామదాసు ప్రార్థించాడు.
💫 గరుడసేవ రోజున తిరుమల క్షేత్రం అంతా లక్షలాది భక్తులతో క్రిక్కిరిసి ఉంటుంది. కొండ నిండిపోవడంతో ఇక రావద్దంటూ తి.తి.దే. అధికారులు మొత్తుకుంటున్నా భక్తులు మెట్లమార్గాల ద్వారా, ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలపై తిరుమలకు పోటెత్తుతూనే ఉంటారు. ఎటు చూసినా అలౌకిక ఆధ్యాత్మికానుభూతికి లోనై హారతులిస్తూన్న భక్తులతో, తిరుమల జనసంద్రంగా గోచరిస్తుంది. గోవిందనామస్మరణతో సప్తగిరులు మార్ర్మోగి పోతాయి. తిరుమల పట్టణమే కాకుండా, దాదాపుగా చిత్తూరు జిల్లా అంతా పండుగ వాతావరణం ఉట్టిపడుతుంది.
💫 దేశవిదేశాల నుండి కళాకారుల బృందాలు తరలి వచ్చి తమ తమ కళాకృతుల్ని ముగ్ధమోహనంగా ప్రదర్శిస్తాయి. -
💫 దాదాపు రెండు లక్షల మంది పట్టే మాడ వీధుల్లోని ప్రేక్షక గ్యాలరీలన్నీ వాహనవీక్షణ కోసం ఎండనక, వాననక నిరీక్షిస్తున్న భక్తజనులతో పొంగి పొరలుతుంటాయి. ఆరోజు ఉదయం నుండీ, గంటల తరబడి భక్తులు శ్రీవారికై ఎదురుచూస్తూ, కళావిన్యాసాలను తిలకిస్తూ ఉంటారు. గరుడోత్సవం నాడు ఇంద్రుడు, వరుణుడు చిరుజల్లులతో స్వామివారిని తప్పక దర్శించు కుంటారని స్థానికుల నమ్మకం అందుచేత, తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులందరూ తమతో పాటుగా చత్రాలు తీసుకెళ్తారు.
💫 గరుడవాహనం, వాహనమండపం నుంచి బయలుదేరగానే కొన్ని గరుడ పక్షులు గగనతలం మీద విహరిస్తూ స్వామివారిని చూసి తరిస్తాయి.
[పోయిన ఏడాది గరుడోత్సవం నాడు తిరుమల కొండపై జడివానలో పులకరిస్తూ, గరుడుల విహంగ వీక్షణాన్ని చూసి తరించుకునే భాగ్యం మాకు కలగటం మా పూర్వజన్మ సుకృతం. - రచయితలు )
💫 గరుడోత్సవం నాడు ఆకాశంలో కలిగిన అలజడిని చూసి అన్నమయ్య ఇలా వర్ణించాడు
ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన బగిలె ||
ఎగసిన గరుడని ఏపున 'థా' యని
జిగిదొలక చెబుకు చేసినను
నిగమాంతంబులు నిగమసంఘములు
గగనము జగములు గడగడవడికె ||
💫 గరుడవాహనం నాడు భోజన ఏర్పాట్లు, ప్రసాదాల తయారీ, భద్రతా సేవలు, క్యూల నియంత్రణ, వైద్య సదుపాయాలు, మొదలైనవన్నీ అత్యంత భారీ ఎత్తున, ఏవిధమైన లోటుపాట్లు లేకుండా చేపడతారు. మాడవీధుల్లో, తిరుమల పట్టణమంతా పెద్ద పెద్ద వెండి తెరలు ఏర్పాటు చేసి ఉత్సవ విశేషాలన్నింటినీ ప్రత్యక్ష ప్రసారం గావిస్తారు.
💫 గరుత్మంతుడు మాతృభక్తికి, విష్ణుభక్తికి, పరోపకార గుణానికి, నిష్కల్మషత్వానికి ప్రతీక. వైష్ణవసంప్రదాయంలో గరుడ వాహనాన్ని "పెరియ తిరువడి" వాహనంగా కీర్తిస్తారు. ఈ వాహన సేవ దర్శించినవారు, కాలసర్పదోషం నుంచి, సంతానలేమి నుంచి, ఆలస్యవివాహం నుంచి ముక్తులై, కష్టాలకడలి నుంచి గట్టెక్కుతారు.
💫 శ్రీస్వామివారు "సర్వకాల సర్వావస్థలయందు మీ రక్షణకై శంఖు-చక్రాయుధాలను ధరించి, గరుడ వాహనారూఢుడనై, సదా సన్నద్ధునిగా ఉంటాను. నా శరణువేడి, నా పాదాలను ఆశ్రయించి, మీ రక్షణ భారం నాకు వదిలేయండి. తప్పక రక్షింపబడతారు" అన్న హితాన్ని ఈ గరుడవాహన సేవ ద్వారా ఉపదేశిస్తారు.
🙏 గరుడ వాహన దర్శనం సర్వపాపహరం, సకలసంపత్కరం, శ్రేయోదాయకం!
🙏 హనుమంత వాహనం 🙏
💫 బ్రహ్మోత్సవాలలో ఆరవనాటి ఉదయం వరదహస్తం దాల్చిన శ్రీవారు, హనుమంతుణ్ణి వాహనంగా చేసుకుని మాడవీధుల్లో ఊరేగుతూ, "త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుణ్ణి నేనే" అని ప్రకటిస్తున్నట్లు వేంకటాద్రిరాముడి గా దర్శనమిస్తారు.
"కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే! ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్" అంటూ, ప్రతిరోజు ఆ శ్రీరాముని పేరుతోనే మేలుకొలుపులు పాడించుకుంటున్న శ్రీనివాసుడు "త్రేతాయుగంలోని శ్రీరాముణ్ణి నేనే" అన్న విషయాన్ని భక్తజనులకు పదే పదే జ్ఞాపకం చేయడం కోసం, హనుమద్వాహనారూఢుడై వేంకటరామునిగా ఉత్సవ సేవలో పాల్గొంటారు.
💫 హనుమ, భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. శ్రీమద్రామాయణంలో ఆంజనేయుని పాత్ర అద్వితీయమైనది. వేదవేదాంగ పారంగతునిగా, రావణదర్పదమనునిగా, భక్తాగ్రేసరునిగా వినుతికెక్కాడు.
💫 కేసరి భార్య అంజనా దేవి వేంకటాద్రిలోని ఆకాశగంగ సమీపాన ఉన్న "జాబాలి తీర్థం" లో తపస్సు చేసింది. ఆ తపఃఫలితంగా ఆంజనేయుడు జన్మించాడు. అంజనాదేవి తపస్సు చేయడం వల్ల ఆ పర్వతం "అంజనాద్రి" గా వినుతికెక్కి సప్తగిరుల్లో ఒకటిగా భాసిల్లుతోంది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా, శృంఖలాబద్ధుడైన "బేడి ఆంజనేయస్వామి" ఆలయాన్ని నేడూ చూసి తరించచ్చు. అంజనాదేవి పుత్రుడు అంజనాద్రీశునికి వాహనం అయినాడు.
💫 ఆంజనేయుడు లేనిదే రామాయణం లేదు. శ్రీ రామునితో పాటుగా, రామపరివారమంతటికీ ఆంజనేయుడు ఎనలేని మేలు గావించాడు. లక్ష్మణునికి ప్రాణదాత. జానకీశోక వినాశకుడు. అతని చేతుల్లో రక్కసి మూకలు దోమల్లా నలిగిపోయారు. హనుమంతుడు లోకాల్లో రామరాజ్యస్థాపనకు దోహదపడ్డాడు. రామ-రావణ సంగ్రామంలో రావణుడు రథంపై నుండి యుద్ధం చేస్తుండగా, శ్రీరాముడు మాత్రం హనుమంతుని భుజస్కంధాల నధిరోహించి రావణుని పరిమార్చాడు.
💫 భగవంతుని కంటే భగవన్నామస్మరణమే ముక్తిదాయకమని ఆంజనేయుడు చాటిచెప్పాడు. భారతదేశ నలుదిక్కులలో ఏ వూరు వెళ్ళినా, ఏ దిక్కు చూసినా హనుమంతుని చిన్నా, పెద్దా విగ్రహాలు లెక్కకు మిక్కిలిగా మనకు దర్శనమిస్తాయి. భారతదేశంలోని కోట్లాది కుటుంబాల్లో "హనుమాన్ చాలీసా" నేడు కూడా నిత్యం పఠిస్తారు.
💫 దాస్యభక్తుల్లో మేటియైన హనుమంతుడు, వేదవేదాంగాలు, ఉపనిషత్తులు, అష్టాదశపురాణాలు క్షుణ్ణంగా తెలిసినవాడు. హనుమంతుణ్ణి స్మరిస్తే బుద్ధి, బలం, యశస్సు, నిర్భయత్వం, ఆరోగ్యం, వాక్పటిమ సిద్ధిస్తాయి. హనుమంతుడు తన భక్తులతో "మీకు కావలసిన భౌతిక, ఆధ్యాత్మిక, ధార్మిక ఫలాలన్నీ నేనే ఇస్తా. మోక్షం మాత్రం నాస్వామి రామయ్యను సేవించి పొందండి" అంటూ, తాను సర్వశక్తి సంపన్నుడైనప్పటికీ, "రాముడే దేముడు" అనే విషయాన్ని వినయంగా లోకానికి చాటిచెప్పాడు. తన బలాన్ని స్వయంగా తెలుసుకోలేనంత నిగర్వి, వినయశీలి హనుమంతుడు. జాంబవంతాదులు నుడివిన తరువాతనే ఆ వాయుపుత్రునికి తాను సాగరాన్ని లంఘించగలననే విషయం తేటతెల్లమైంది. మూర్ఛిల్లిన లక్ష్మణుడు తెప్పరిల్లగానే, యుద్ధపరిసమాప్తి కాకుండానే ఎంత వేగంతో సంజీవని పర్వతాన్ని తీసుకుని వచ్చాడో, అంతే వేగంగా దాన్ని యథాస్థానంలో చేర్చేశాడు. భావితరాల ఔషధావసరాల రీత్యా, ఆ పర్వతరాజాన్ని సత్వరమే స్వస్థలానికి జేర్చిన, అపారమైన దూరదృష్టి కలవాడు హనుమంతుడు. ఈనాడు మనం చెప్పుకునే "పర్యావరణ సమతౌల్యత" ఆవశ్యకతను ఆనాడే క్షుణ్ణంగా ఆకళింపు చేసుకొని, అమలు పరచిన దార్శినికుడు.
💫 ఈనాటి వాహనమైన హనుమంత దర్శనంతో, ఇహలోక వాంఛలు సిద్ధించడమే కాకుండా, మోక్షం కూడా లభిస్తుంది. తాళ్ళపాక అన్నమయ్య హనుమంతుని సముద్రలంఘన, రావణవధ ఘట్టాల్ని ఇలా వర్ణించాడు -
ఇతడే యతడు గాబోలేలిక బంటు నైరి
మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు
జలధి బంధించి దాటె హనుమంతుడు
అలరి వూరకే దాటె హనుమంతుడు
అలుకతో రావణుని దండించె నితడు
తలచి మైరావణుని దండించె నితడు
💫 హనుమద్వాహన విధమైన క్షణంతో ప్రతి భక్తుడు ఆంజనేయునిలా నిష్కళంక హృదయం, నిస్వార్థ సేవాతత్పరత, ప్రభుభక్తి పరాయణత్వం, సచ్ఛీలత, భావితరాల సంక్షేమం పట్ల నిబద్ధత వంటి సద్గుణసంపద కలిగి, స్వామికృపకు సదా పాత్రులవుతారు.
🌈 స్వర్ణ రథోత్సవం 🌈
💫 ఆరవరోజు సాయంసంధ్యా సమయంలో అస్తమిస్తున్న సూర్యుని కిరణాలు ప్రసరిస్తుండగా, దివ్యకాంతులీనుతున్న స్వర్ణరథంలో ఇరువురు దేవేరులతో కలిసి మలయప్పస్వామి వారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు నేత్రానందం కలిగిస్తారు. పోయిన బ్రహ్మోత్సవాల్లో తన ప్రియభక్తుడు వాయిపుత్రునిపై, ధనుర్బాణాలు ధరించి, అయోధ్యాదీశునిగా, కటి-వరద హస్తాలతో, కలియుగ దైవంగా స్వామి దర్శనమిచ్చారు.
💫 బ్రహ్మదేవుని శూన్యరథం, గజ-అశ్వ-వృషభాదులు యధావిధిగా స్వర్ణరథోత్సవంలో కూడా పాల్గొంటాయి. దాసభక్తులనృత్యాలతో, భజనబృందాల కోలాహలంతో మాడవీధులు కడురమణీయతను సంతరించుకుంటాయి.
💫 స్వర్ణం అంటే, "మిక్కిలి ప్రకాశించేది" అని వ్యుత్పత్తి. బంగారం మహా శక్తివంతమైన లోహం. ఈలోహం శరీరాన్ని తాకుతుంటే దేహంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. అనేకానేక ఔషధోత్పత్తుల్లో స్వర్ణం వినియోగించ బడుతుంది. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించడంలో యుగయుగాల నుంచి ఈనాటివరకూ, స్వర్ణం పాత్ర వెలకట్టలేనిది. బంగారాన్ని తాకట్టు పెట్టో లేదా తెగనమ్మో, కష్టాల కడలి నుండి గట్టెక్కడం సత్యహరిశ్చంద్రునికాలం నుండి, ఆధునిక జగత్తులో కూడా మనం చూస్తూనే ఉన్నాం. వర్తక, వాణిజ్య, వినిమయాలకు సువర్ణ నాణాలను వినియోగించే సాంప్రదాయం, కలియుగారంభం నుండి, ఈ మధ్యకాలం వరకూ ఉండేది. పద్మావతీ పరిణయం సందర్భంగా శ్రీనివాసుడు కుబేరుణ్ణించి అప్పుగా తీసుకుంది సువర్ణముద్రికలే!
💫 స్వర్ణం లభ్యమయ్యేది భూమి నుంచే! భూదేవి సాక్షాత్తు శ్రీవారిలో భాగం. శ్రీవారి ఇల్లు బంగారం. ఆనందనిలయ గోపురం బంగారుమయం. ధ్వజస్తంభం బంగారు తాపడం చేయబడింది. ఇంటిలోని పాత్రలు బంగారువి. సింహాసనం బంగారుది. ధరించేది మేలిమి బంగారు నగలు. రాజాధిరాజుల నుండి సామాన్యుల వరకూ భక్తులందరూ స్వామివారికి హుండీలో సమర్పించుకునేది కనకమే!
💫 సకల సంపదలకు, ధనకనకాదులకు ఆధిపత్యం వహించేది శ్రీదేవిగా పిలువబడే లక్ష్మీదేవి. ఆమె కూడా శ్రీవారిలో భాగమే. బంగారంతో ఇంత ప్రగాఢమైన అనుబంధం కలిగిన శ్రీవారు ఇరువురు దేవేరులతో కలసి స్వర్ణరథంలో ఊరేగుతుండగా చూచి తరించటం ఓ అలౌకిక, ఆధ్యాత్మికానుభూతి.
💫 దేవేరులతో స్వామివారు స్వర్ణరథంపై ఊరేగే ఈ స్వర్ణరథోత్సవం శ్రీవారి మహోన్నతిని, సార్వభౌమత్వాన్ని, శ్రీపతిత్వాన్ని, భూదేవీనాథత్వాన్ని సూచిస్తుంది.
💫 స్వర్ణరథోత్సవంలో, కళ్యాణకట్ట సంఘంవారు సమర్పించిన బంగారు గొడుగును రథంపై అలంకరిస్తారు. కేవలం మహిళా భక్తులు మాత్రమే తేరును లాగటం ఈ స్వర్ణరథోత్సవ ప్రత్యేకత.
💫 ఈ రథోత్సవాన్ని "సువర్ణరంగ డోలోత్సవం" అని కూడా వ్యవహరిస్తారు. ఉయ్యాలసేవ ఈ రథోత్సవంలో అంతర్భాగం కావడం వల్ల, బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం జరిగే ఉయ్యాల సేవ స్వర్ణరథవాహనం నాడు జరగదు.
💫 స్వర్ణరథోత్సవ దర్శనం ద్వారా శ్రీదేవి కరుణతో సమస్త భోగభాగ్యాలు, అప్లైశ్వర్యాలు; భూదేవి కరుణతో భూసంపద, కనక, మణిమయాదులు, నవరత్నాలు, ధాన్యసంపద, పశుసంపద; శ్రీవారి కరుణతో సర్వ సుఖాలూ, శుభాలు చేకూరుతాయి.
🐘 గజవాహనం🐘
💫 బ్రహ్మోత్సవాల్లో ఆరవనాటి రాత్రి గజేంద్రమోక్ష ఘట్టానికి గుర్తుగా జరిగే "గజవాహనసేవ" లో మలయప్పస్వామివారు ఒక్కరే గజరాజుపై ఊరేగుతారు.
పూర్వకాలం నందు చతురంగబలాలలో గజబలం ఒకటి. "గజం" అంటే విశ్వాసానికి సంకేతం. రాజులకు పట్టాభిషేకం కావించేటప్పుడు వారిని గజాధిష్ఠితులుగా చేసి ఊరేగిస్తారు. ఓ విశిష్ట వ్యక్తిని ఘనంగా సత్కరించాలంటే, వారిని "గజారోహణ" చేయించే సాంప్రదాయం నేటికీ ఉంది.
💫 పూర్వం రాజుల శక్తిసామర్థ్యాలను, సేనాపాటవాన్ని గజబలంతో సూచించేవారు. ఎన్ని ఎక్కువ ఏనుగులుంటే అంత ఎక్కువ సైన్యబలం ఉన్నట్లు లెక్క. ఏనుగు కుంభస్థలం లక్ష్మీనివాసంగా అభివర్ణింప బడుతుంది.
💫 తిరుమల ఆలయ నిర్మాణంతో కూడా గజరాజులకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆలయనిర్మాణం జరిగేటప్పుడు ఆలయమండప స్తంభాలను క్రిందనే చెక్కించి వందలాది ఏనుగుల ద్వారా కొండపైకి చేర్చేవారు. మైళ్ళదూరం పైకి ఎక్కుకుంటూ వెళ్ళి ఆలయకుడ్యాలకు వాడిన టన్నుల కొద్దీ బరువైన అత్యంత భారీ రాతి ఇటుకలనూ, పైకప్పుకు ఉపయోగించే రాతిపలకలనూ, శిల్పస్తంభాలనూ గజరాజులు భద్రంగా కొండపైకి చేర్చాయి. ఒక్క వేయికాళ్ళ మండపానికే "వేయి" స్తంభాలుండేవంటే, మొత్తం ఆలయనిర్మాణానికి ఎన్ని స్తంభాలను వినియోగించారో ఊహించుకోవచ్చు!
💫 అంత శ్రమకోర్చి, శ్రీవారి ఆలయానికో రూపం ఇచ్చిన గజరాజుల ఋణం ఏమిచ్చి తీర్చుకోగలం?
💫 అంతేకాదు. తిరుమలను దర్శించుకున్న వందలకొద్దీ రాజులనూ, వారి పరివారాలను ఏనుగు అంబారీలే సురక్షితంగా పైకి చేర్చేవి.
💫 స్వామివారితో నిత్యం పాచికలాడే, వారి ప్రియభక్తుడైన "హాథీరాంబాబా" ను అప్పటి పాలకులు ఏవో నిందారోపణలపై ఖైదు చేయగా, శ్రీవారు ఏనుగు రూపంలో వచ్చి, రాత్రికి రాత్రే బండెడు చెరకుగడలను పిప్పి చేసి అతణ్ణి రక్షించి, ఆ పాలకులను కూడా పరమ భక్తులుగా మార్చిన చరిత్ర మనందరికీ చూచాయగా తెలుసు (వివరంగా మున్ముందు తెలుసుకుందాం). అందుకే ఆయన "హాథీ రాం" గా పిలువబడ్డాడు.
💫 అంతటి ప్రశస్తిగాంచిన గజరాజుపై శ్రీనివాసుడు ఊరేగుతూ ఉంటే అత్యద్భుతమైన దృశ్యం ఆవిష్కరింప బడుతుంది. గజేంద్రమోక్షపురాణాన్ని అనుసరంచి ఒకనాడు జలక్రీడ లాడుతూ మొసలికి పట్టుబడ్డ గజేంద్రుడు దానితో చాలాకాలం పోరాడి, కడు దయనీయ స్థితిలో శ్రీ మహావిష్ణువును ఇలా ప్రార్ధించాడు -
లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె, బ్రాణంబులున్
తావుల్ దప్పెను, మూర్ఛ వచ్చె దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!
💫 గజేంద్రుని ఆక్రందన విన్న, శ్రీమహావిష్ణువు, "సిరికిన్ జెప్పకన్", అంటే సమక్షంలోనే ఉన్న శ్రీమహాలక్ష్మికి సైతం చెప్పకుండా, హుటాహుటిన అలవైకుంఠపురం వీడి, మొసలిని సంహరించి, గజరాజును కాపాడాడు. భక్తులను కాపాడాలనే విష్ణుమూర్తి ఆతృత అలాంటిది మరి.
💫 సంసారం ఒక సరస్సు. మొసలి కర్మకు సంకేతం. ప్రతి భక్తుడు గజేంద్రుడు. సంసారసాగరంలో కొట్టుమిట్టాడుతూ, "కర్మ" అనబడే మొసలి కోరలకు చిక్కి శరణు వేడిన వారికి కర్మ బంధాలనుండి విముక్తుని ప్రసాదించేవాడు శ్రీవేంకటేశ్వరుడు. ఎంతటి బలం గల ఏనుగైనా మావటివాని అంకుశానికి ఏ విధంగా లొంగిపోతుందో, అదే విధంగా, మానవుడు ఎంతటి బలవత్తరమైన ప్రాపంచిక విషయాల్లో చిక్కుకున్నా, శ్రీవారు నైపుణ్యం కలిగిన మావటివానిలా ఆ భవబంధాలను తొలగించగలరు.
💫 గజరాజులు ప్రతిరోజు శ్రీవారి వాహన సేవల్లో వాహనం ముందు ప్రత్యక్షంగా పాల్గొంటూనే ఉంటాయి. తమ పూర్వీకుడైన గజేంద్రుణ్ణి రక్షించినందుకుగాను తమ కృతజ్ఞతను ప్రదర్శించే అవకాశం కోసం, "స్వామివారు తమపై ఎప్పుడెప్పుడు అధిరోహిస్తారా !" అని ఆ మత్తేభాలు ఆశగా ఎదురు చూస్తుంటాయి.
💫 బ్రహ్మోత్సవాల్లో గజవాహనం నాడు గజరాజులకు ఈ పరమాద్భుతమైన అవకాశం లభిస్తుంది. తమ జాతిలో ఏ ఒక్క ఏనుగుకు ఆ అదృష్టం లభించినా జాతి మొత్తానికి సంతోషదాయకమే కదా! స్వామి శరణాగతవాత్సల్యానికి గజవాహనసేవ ఓ ప్రత్యక్ష తార్కాణం. భక్తితో ప్రార్ధిస్తే, గజేంద్రుణ్ణి రక్షించినట్లు మనని కూడా శ్రీవారు రక్షిస్తారని గజవాహనసేవ ద్వారా వ్యక్తం అవుతుంది.
💫 తాళ్ళపాక అన్నమయ్య గజవాహనోత్సవ వైభవాన్ని ఇలా మనోహరంగా వర్ణించాడు -
చొల్లపు జుట్టుతోడి చుంగుల రాజసముతో
వెల్లివిరిగా నేగి వెలదులు గొలువ
వీపు గుచాలు మోపి వెలది కౌగిలించగా
నేపున నేనుగు నెక్కి విదె దేవుడు
చేపట్టి యాపె చేతులు బిగె బట్టక
పైపై వీధుల వెంట బరువు దోలీని
💫 మూడు వాహనోత్సవాలతో అత్యంత ప్రత్యేకతను సంతరించుకున్న ఆరవరోజు బ్రహ్మోత్సవాలు ముగిశాయి. (మిగిలిన అన్ని రోజులూ రెండు వాహనసేవలు మాత్రమే జరుగుతాయి).
ఆరవరోజు ఉత్సవ కార్యక్రమం ఈ విధంగా ఉంటుంది
✅ హనుమంత వాహనం: ఉ. 9-11 గం.
✅ స్వర్ణరథోత్సవం : సా 4-6 గం.
✅ గజవాహనం : రా. 8-10 గం.
🌈 సూర్యప్రభ వాహనం 🌈
💫 బ్రహ్మోత్సవాల్లో ఏడవరోజు ఉదయం సప్తగిరీశుడు ఒక్కరే - ఏడు గుర్రాలు పూన్చిన రథంపై, ఏడంతస్తుల కనకపు సింహాసనాన్ని అధిష్టించి, వజ్రకవచధారియై; బాలభానుడు తన ఉదయపు లేలేత కిరణాలతో నమస్కారాలు సమర్పిస్తుండగా మాడ వీధుల్లో ఊరేగుతూ "సూర్య మండలం మధ్యనున్న నారాయణ మూర్తిని నేనే" - అని భక్తులకు సందేశమిస్తారు.
💫 "ధ్యేయస్సదా సవిత్రృమండల మధ్యవర్తి నారాయణః" అంటే, "సూర్య మండలం మధ్యలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ ధ్యానింప దగినవాడు" అని వేదశృతి. అందుకే హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజూ ఉదయం సూర్యనమస్కారాలు, సూర్యోపాసన చేసే సంస్కృతి ఉంది. గాయత్రీ మంత్రంతో సూర్యనారాయణుణ్ణి ఆరాధిస్తాము. సూర్యుడు తేజోనిధి. నిత్యం కంటికి కనిపించే ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడు ప్రకృతికి, జీవులకు చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల కలిగే పాడి పంటలు, చంద్రుడు అతని షోడశకళల వల్ల వృద్ధిచెందే ఔషధులు; అన్నీ సూర్యప్రసాదితాలే. సూర్యుడు కర్మసాక్షి,
💫 నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిని తట్టుకునే రోగనిరోధకశక్తి, లేలేత సూర్యకిరణాల ద్వారా లభించే "విటమిన్ డి" లో మెండుగా ఉంటుందని వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మయూరాదులు, సాంబుడు వంటి భక్తులు సూర్యోపాసనచేతనే శారీరక అనారోగ్యం నుండి విముక్తులైనట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
"ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్!!"
💫 శ్రీమహావిష్ణువుకు సూర్యుడు కుడికన్నుగా, చంద్రుడు ఎడమనేత్రంగా చెబుతారు. అందుకే విష్ణుమూర్తి దివారాత్రాలకు (పగలు, రేయి) అధిపతి.
💫 రాజవంశాలలో సూర్యవంశం ప్రథమం. శ్రీమహావిష్ణువు పుత్రుడు బ్రహ్మతో మొదలైన సూర్యవంశంలో ముప్పయ్యెనిమిదవ తరానికి చెందినవాడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మకు మరీచి, అతనికి కాశ్యపుడు, అతనికి సూర్యుడు జన్మించారు. రామ-రావణ సంగ్రామంలో శ్రీరామచంద్రుడు "ఆదిత్యహృదయం" పఠించి, తన పూర్వజుడు, వంశనామ కారకుడు అయిన సూర్యనారాయణుని ఆశీస్సులు పొంది, తద్వారా రావణసంహారం గావించాడు.
💫 సూర్యుడు నమస్కార ప్రియుడు. మనకు అంతులేని ఫలాలు ప్రసాదించినా, ఏ ప్రతిఫలం ఆశించడు. మనం త్రికరణశుద్ధిగా చేసే నమస్కారానికే ఆయన సంతృప్తి చెందుతాడు. "ఆరోగ్యం, కవిత్వం, విద్య, ఐశ్వర్యం, సంతానం - ఇవన్నీ సూర్యదేవుని అనుగ్రహం వల్ల సిద్ధిస్తాయి" అని సూర్యశతకం తెలియజేస్తుంది. సూర్యోపాసన, చక్షూరోగ (కంటి సంబంధిత వ్యాధులు) నివృత్తి గావిస్తుందని యజుర్వేదంలోని చాక్షూషోపనిషత్తు విదిత పరుస్తుంది. చర్మరోగగ్రస్తులు సైతం సూర్యనారాయణుని పూజించి బాధా విముక్తులవుతారు.
💫 ఇప్పుడు ఓసారి మలయప్పస్వామివారు అధిరోహించిన వాహనాన్ని దగ్గరనుంచి దర్శించుకుందాం. జపాకుసుమాలు ధరించిన స్వామి వాహనానికి, గరుత్మంతుని అన్నగారైన "అనూరుడు" సారథ్యం వహిస్తున్నాడు. రథాన్ని లాగుతున్న ఏడు గుర్రాలను ఏడు ఛందస్సులుగా పరిగణిస్తారు. గాయత్రి, బృహతి, ఉష్ఠిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అనేవి ఆ ఛందస్సుల పేర్లు. విష్ణుసహస్రనామంలో "అనుష్టుప్ ఛందః" అని పఠిస్తాం. అంటే "అనుష్టుప్ అనబడే ఛందస్సులో వ్రాయబడినది" అన్నమాట.
💫 అనూరుడు అంటే "ఊరువులు (తొడలు) లేకుండా జన్మించినవాడు" అని అర్థం. సూర్యరథసారథి అయిన అనూరుడు; తన తమ్ముడూ, విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుని వద్దకు వచ్చాడు.
💫 ఆహా, ఏమి ఆ అపూర్వ సంగమము!
💫 ఒకరేమో జగతి కాలచక్రాన్ని నిర్ధారించే సూర్యదేవుని రథానికి సారథి, మరొకరేమో జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుని ముల్లోకాలను విహరింపజేసే వాహనము!
💫 ఇంతటి ధన్యులైన ఇద్దరు పుత్రరత్నాలను కన్న "వినతి" చేసుకున్న పూర్వజన్మల పుణ్యఫలం ఎంత గొప్పదో కదా!
💫 సూర్యప్రభవాహనంపై శ్రీనివాసుని దర్శనం భక్తులకు పూర్ణ ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఈ వాహనసేవ దర్శనం ద్వారా భక్తకోటికి ఆరోగ్యం, ఐశ్వర్యం సంపూర్ణంగా సిద్ధిస్తాయి.
అదివో చూడరో అందరు మొక్కరో
ముదిగొనె బ్రహ్మము కోనేటి దరిని
రవిమండలమున రంజిల్లు తేజము
దివి చంద్రునిలో తేజము
భువి ననలంబున బొడమిన తేజము
వివిధంబులైన విశ్వతేజము
💫 అంటూ, ఆ శ్రీనివాసుడే సూర్యమండల మధ్యవర్తియగు శ్రీమన్నారాయణడని ధృవపరిచి, కీర్తించాడు, పదకవితా పితామహుడు అన్నమయ్య.
స్వయం ప్రకాశా గోవిందా!
ప్రత్యక్షదేవా గోవిందా!!
*దినకరతేజా గోవిందా
🌈 చంద్రప్రభ వాహనం 🌈
💫 ఏడవనాటి రాత్రి వేంకటేశ్వరుడు ఒక్కరే, తెల్లని వెన్నెలతో కూడుకున్న చల్లని వాతావరణంలో, చంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ దర్శనమిస్తారు. పగలు సూర్యప్రభ వాహనంపై ఊరేగిన విష్ణుదేవుడు; ఆనాటి రాత్రి నిశాకరుడై, అమృత కిరణాలు ప్రసరించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారు. శ్రీకృష్ణుడు తన విభూతులను తెలుపుతూ, "నక్షత్రాణా మహం శశి!" అంటూ, తనను తాను చుక్కల్లో చంద్రునిగా అభివర్ణించుకున్నాడు.
💫 "చంద్రుడు" అంటే అమృతానికి నిధి అని అర్థం. అమృతకిరణుడు, సుధాకిరణుడు, హిమకిరణుడు అయినటువంటి చంద్రప్రభవాహనంలో; ధవళ వస్త్రాలు, శ్వేతవర్ణపుష్పాలు ధరించి "ధన్వంతరి" అలంకారంలో అలరిస్తున్నారు మలయప్పస్వామి.
💫 క్షీరసాగరమధనంలో కల్పవృక్షము, కామధేనువు, శ్రీమహాలక్ష్మిలతో పాటుగా; చేతిలో అమృతకలశంతో ధన్వంతరి ఉద్భవించారు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతారం అయిన ధన్వంతరిని ఆయుర్వేదవైద్యానికి మూలపురుషుడిగా వర్ణిస్తారు. ఆయనను పూజిస్తే ఆరోగ్యం వృద్ధి చెందుతుందని ప్రతీతి. దీపావళికి రెండు రోజులు ముందు వచ్చేటటువంటి, ధన్వంతరి జన్మతిథి అయిన ధనత్రయోదశిని ఉత్తరభారతదేశంలో "ధంతేరాస్" పండుగగా జరుపుకుంటారు. అదే తిథిలో బంగారానికి ప్రతిరూపమైన లక్ష్మీదేవి సైతం క్షీరసాగరమథనంలో ఉద్భవించడం వల్ల ఆరోజు బంగారం కొనడం, లక్ష్మీదేవిని పూజించడం అనే సాంప్రదాయాలు అమల్లోకి వచ్చాయి. ఉత్తరభారతదేశంలో ఇదు రోజులపాటు జరుపుకునే అతి పెద్ద పండుగ "దీపావళి"లో మొట్టమొదటి రోజు "ధనత్రయోదశి". ఆరోజును భారత ప్రభుత్వం " జాతీయ ఆయుర్వేద దినం" గా ప్రకటించింది.
💫 ధన్వంతరి ఆయురారోగ్యాలకు అధిపతి అయినందున, ప్రస్తుత విపత్కర పరిస్థితుల దృష్ట్యా తిరుమల క్షేత్రంలో ప్రతిరోజూ ఉదయం యోగవాశిష్ఠం, తదుపరి ధన్వంతరి మహామంత్ర పారాయణం జరుపబడుతోంది. తిరుమల క్షేత్రం నుండి ఉదయం ఏడు గంటలకు శ్రీవేంకటేశ్వరా భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం గావించబడే ఈ స్తోత్రంపఠనంలో మనం కూడా శృతి కలిపి, కరోనా కట్టడికి ఉడుతాభక్తిగా మనవంతు కృషి చేద్దాం.
💫పురాణేతిహాసాల్లోకి వెళితే "కర్కటి" అనబడే బ్రహ్మరాక్షసి, ఘోరమైన తపస్సు గావించి బ్రహ్మ నుండో వరం పొందింది. ఆ వరం ప్రకారం, కర్కటి అత్యంత సూక్ష్మక్రిమిగా మానవశరీరాల్లోకి ప్రవేశించి, "విషూచికా" అనబడే విషజ్వరాన్ని వ్యాపింపజేసి, శరీరాంతర్భాగాల నన్నింటినీ ఛిద్రంగావించి, రోగగ్రస్త శరీరావశేషాలను సుష్టుగా భుజించి, తన క్షుద్బాధను తీర్చుకో గలుగుతుంది. మానవజాతి మొత్తాన్ని అప్రయత్నంగా, ఏకమొత్తంగా దిగమ్రింగాలని దాని పన్నాగం. సమస్తమానవాళికి మహమ్మారిలా దాపురించిన ఆ రక్కసి కోరల బారిన పడే మానవుల విపరీత లక్షణాలు, దాని నుండి తప్పించుకునే మార్గాంతరం, పఠించాల్సిన స్తోత్ర మంత్రాలను కూడా బ్రహ్మదేవుడే శెలవిచ్చారు. ఆ "విషూచికా" అనబడే విషజ్వరమే నేటి "కరోనా" అని విజ్ఞుల నమ్మకం. దాని కబంధహస్తాల నుండి మానవాళిని కాపాడడం కోసం, బ్రహ్మదేవుడు ఆనతిచ్చినట్లుగా,
- ప్రాణాపాయకరస్య, కరోనా నామకస్య....."
💫 అనే సంకల్పంతో మొదలై, యోగవాశిష్ఠ పారాయణం జరుగుతుంది. తరువాత,
"అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృతః
రోగాన్మో నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ||"
💫 అన్న శ్లోకంతో ప్రారంభమై, ధన్వంతరీ మహామంత్ర పారాయణం జరుగుతుంది. నిత్యం క్రమం తప్పకుండా ఈ మంత్రపారాయణం చేస్తే, ఉచ్ఛారణ శుద్ధి కావడంతో పాటుగా; ప్రాణాయమఫలం పొంది, ఊపిరితిత్తులు దృఢమై, శ్వాస సంబంధిత వ్యాధులనుండి రక్షింపబడతారని విజ్ఞుల ఉవాచ!
💫 చంద్రునితో తెలుగువారికి విశేషానుబంధం ఉంది. ప్రతి మాతృమూర్తి తన పిల్లలకు "చందమామరావే" అనే పాటతో చల్లనయ్యకు ఆప్యాయంగా మేనమామ వరుస కలుపుతూ, గోరుముద్దలు తినిపిస్తుంది. ప్రేయసీ-ప్రియులకు వెన్నెల రాత్రి విహారాలంటే ఎంతో ఇష్టం. అందమైన ముఖాన్ని చంద్రబింబం తో పోలుస్తారు. తెలుగు సాహిత్యంలో పున్నమి వెన్నెల మీద రాయబడినంత కవిత్వం, బహుశా మరే ఇతర ఇతివృత్తం పైనా వెలువడలేదంటే అతిశయోక్తి కాదు.
💫 "చంద్రమా మనసో జాతః " అంటే, చంద్రుడు భగవంతుని మనస్సు నుండి ఉద్భవించినట్లుగా పురుషసూక్తం చెబుతుంది. "పుష్టామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః" అని పురుషోత్తమ ప్రాప్తియోగంలో ప్రకటించబడింది. అంటే "చంద్రకిరణ స్పర్శతోనే ఔషధ మొక్క వృద్ధి చెందుతుంది" అని అర్థం. ఔషధాలు లేకపోతే మానవుని మనుగడ ప్రశ్నార్థక మవుతుంది గనుక, ఓషధీశుడైన చంద్రుడే మనకు జీవనాధారం!
💫 పురాణాలలో చంద్రుని ప్రస్తావన విస్తృతంగా లభిస్తుంది. చంద్రుడు కూడా క్షీరసాగరమథనం లోనే ఉద్భవించాడు. చంద్రుడు శివునికి శిరోభూషణం. హాలాహల సేవనంతో విపరీతమైన ఉష్ణతాపానికి గురైన గరళకంఠుడు, చల్లనైన చంద్రుణ్ణి శిరస్సున ధరించి తాపోపశమనం పొందుతాడు. శైవ సంప్రదాయానికి మూలమైన శివునికి శిరోభూషణంగా భాసిల్లే చంద్రుడు ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రమైన తిరుమలలో శ్రీవారికి చంద్రప్రభవాహనంగా ఉండటం అత్యంత విశేషం! శివకేశవుల కెంతమాత్రం తారతమ్యం లేదనటానికి మరో ప్రబల నిదర్శనం!
💫 చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగి చంద్రకాంతమణులను స్రవింపజేస్తాడు. "యత ప్రహ్లాదయాత్ చంద్రః" అంటే చంద్రుని వల్ల సంతోషం కలుగుతుంది. అదేవిధంగా, చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్త్యావేశాలు ఉప్పొంగి, పారవశ్యంతో భక్తుల నేత్రాలు వికసిస్తాయి. "సూర్యుని తీక్ష్మత్వం, చంద్రుని కోమలత్వం రెండూ తన స్వరూపమే" అని శ్రీనివాసుడు ఏడవరోజు జరిగే సూర్యప్రభ మరియు చంద్రప్రభ వాహనాల ద్వారా వెల్లడిస్తున్నారు.
💫 ఈ వాహన సందర్శనం ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనీ; అందువల్ల త్రివిధ తాపాలు నివారింప బడతాయని ప్రతీతి. చంద్రునిలాంటి చల్లనైన మనస్సు కలిగి, చల్లని వెన్నెల వంటి ప్రశాంతతను తన చుట్టూ ఉన్నవారికి పంచి పెట్టాలని ఈ వాహనం సందేశిస్తుంది. "
💫 చంద్రుని శోభను అన్నమయ్య ఈ విధంగా వర్ణించాడు -
చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడికోర వెన్నపాలు తేవో ||
నగుమోము చక్కనయ్యకు నలుగు పుట్టించిన తండ్రికి నిగములందుండే అప్పకు మా నీలవర్ణునికి
జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి ముగురికి మొదలైన ఘనునికి మాముద్దులమురారిబాలునికి
🛕 రథోత్సవం 🛕
💫 బ్రహ్మోత్సవాలయందు గరుడవాహనం తర్వాత అత్యంత వైభవంగా జరిగే "రథోత్సవం" లో, భక్తులు తేరు (రథం) యొక్క పగ్గాలను పట్టిలాగుతూ, ఉత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొనటం వల్ల ఇది అత్యంత జనాకర్షకమైన వాహనోత్సవంగా ప్రసిద్ధిగాంచింది. తక్కిన వాహనసేవ లన్నింటిలో భక్తులు కేవలం చూసి తరించగలరే గానీ, ప్రత్యక్షంగా పాలు పంచుకొనే అవకాశం లేదు.
💫 బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవరోజు ఉదయం ఉదయభానుని కిరణకాంతులలో, వివిధ వర్ణాల పరిమళ పుష్పాలతో అలంకృతమై మేరుపర్వత చందంగా ఉన్న రథంపై, శ్రీదేవి భూదేవి సమేతులైన మలయప్పస్వామివారు మాడవీధుల్లో విహరిస్తారు. ఈ రోజు శ్రీవారి వాహనం అశ్వసమానమైన వేగంతో దౌడు తీస్తుంది. స్వయంగా పాల్గొనే అవకాశం రావడంతో, భక్తులు రెట్టించిన ఉత్సాహంతో కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ, కోలాటనృత్యాలతో దిక్కులు పిక్కటిల్లేలా గోవిందనామ సంకీర్తనలు ఆలపిస్తూ; తమ అచంచలమైన భక్తిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.
💫 అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం దేవాలయ సిబ్బంది వారిస్తున్నప్పటికీ, నడుస్తున్న రథంపై భక్తులు ఉప్పు, మిరియాలు జల్లటం ఈ ఉత్సవంలో మరో ప్రత్యేకత.
💫 పురాణేతిహాసాలలో రథాలకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ప్రాచీనకాలంలో కాల్బలం, అశ్వబలం, గజబలంతో పాటుగా రథబలానికి కూడా చతురంగబలాల్లో సముచితమైన స్థానం ఉండేది. అనాదికాలం నుండి యుద్ధవిద్యల్లో రథసంచాలనం కూడా ఒకటి. కేవలం యుద్ధాలకే కాకుండా వేటకు, విహారానికి, వ్యాహ్యాళికి కూడా రథాలను విరివిగా ఉపయోగించేవారు. రథాలకు, వాటి సారథులకు, గుర్రాలకు చిత్రవిచిత్రమైన పేర్లుండేవి. ఉదాహరణకు సూర్యుని రథం పేరు "సప్త". అలాగే, కృష్ణుని రథసారథి పేరు "దారుకుడు". శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము అనేవి కృష్ణుని యొక్క నాల్గు గుర్రాలపేర్లు.
💫 రథాలకు యుద్ధాలకు అవినాభావ సంబంధం ఉంది. యుద్ధవిన్యాసాలలో, యోధుల యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి వారిని - రథి, అతిరథి, మహారథి, అతిమహారథి, మహామహారథిగా వర్గీకరించేవారు. "రథి" అంటే, రథారూఢుడై ఏకకాలంలో ఐదువేల మంది యోధులతో యుద్ధం చేయగల సమర్థుడు. "మహమహారథి" అత్యధికంగా, 20 కోట్ల 73 లక్షల 60 వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలిగినవాడు.
💫 ఉదాహరణకు ఉపపాండవులు, శకుని మొదలైనవారు "రథి" కోవలోనికి వస్తే; బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, దుర్గాదేవి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు "మహామహారథులు".
💫 దేవాలయాల ఉత్సవ వేడుకలలో కూడా రథాలకు చెప్పుకోదగ్గ పాత్ర ఉంది. దాదాపు అన్ని ప్రాచీన ఆలయాలలోనూ, ఈనాడు కూడా రథాన్ని, రథమండపాన్ని మనం చూస్తాం. ఆగమశాస్త్రానుసారం వైదికకర్మలు జరిగే ప్రతి ఆలయంలోనూ, రథోత్సవం నేడూ ఓ తప్పనిసరి వేడుక. జగద్విదితమైన, అత్యంత వైభవోపేతంగా జరిగే పూరీ జగన్నాథుని రథయాత్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.
💫 "రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే'
💫 రథంలో వేంచేసి ఉన్న విష్ణుదేవుని దర్శనం పునర్జజన్మరాహిత్యాన్ని కలిగిస్తుందనే విశ్వాసంతో భక్తులు రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొంటారు.
💫 స్వతహాగా యోధానయోధుడు, భక్తజన పరిపాలకుడు, మృగయావినోదుడు (వేట యందు ఆసక్తి గలవాడు), విహారప్రియుడు ఐనటువంటి స్వామివారికి, రథంతో సహజంగానే ఎంతో అనుబంధం ఉంది. నేడు "రథికుడు" అయిన స్వామివారు, కృష్ణావతారంలో అర్జునునికి "రథసారథి". ఈనాటి రథోత్సవం ద్వారా ఆ అనుబంధాన్ని శ్రీవారు లోకాలకు చాటి చెప్తున్నారు.
💫 రథోత్సవానికి ఓ విశిష్టమైన ఆధ్యాత్మిక పరమార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికి ఉండే సంబంధం రథసారూప్యతతో వివరించడం జరిగింది.
💫 "బుద్ధి" అనే సారథి సంచాలనంలో "మనస్సును" పగ్గాలుగా చేసుకుని, "ఇంద్రియాలు" అనబడే గుర్రాల సాయంతో చరిస్తున్న "శరీరమనే" రథాన్ని, "ఆత్మ" అనే రథికుడు అధిరోహిస్తాడు. ఈ రకంగా శరీరాన్ని రథంతో పోల్చడం వల్ల, స్థూల-సూక్ష్మశరీరాలు వేరని, ఆత్మ ఆ రెండింటికీ భిన్నమనే ఆధ్యాత్మిక విచక్షణాజ్ఞానం కలుగుతుంది.
💫 రథోత్సవాన్ని వర్ణిస్తూ, అన్నమయ్య, సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే సంచాలనం చేస్తున్నాడని పేర్కొన్నాడు.
దేవదేవుడెక్కెనదె దివ్య రథము
మా వంటి వారికెల్ల మనోరథము
మిన్ను నేలా నొక్కటైన మేటి తేరు
కన్నులపండువైన శ్రీకాంతుని తేరు
🌈 అశ్వవాహనోత్సవం 🌈
గక్కున నయిదవనాడు గరుడునిమీదను
యెక్కెను ఆరవనాడు యేనుగుమీద
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోను
యిక్కున దేరును గుర్ర మెనిమిదోనాడు
💫 బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవరోజు రాత్రి మలయప్పస్వామివారు ఒంటరిగా, కలిపురుషుని వేషధారణలో, శిరస్త్రాణభూషితుడై, నడుముకు కత్తి డాలు ధరించి, ఒక చేతియందు చర్నాకోల, మరో చేతితో గుర్రపు పగ్గాలు చేబూని, యుద్ధానికి సిద్ధంగా ఉన్న వీరాధివీరుని వలె, అశ్వవాహనంపై రాచఠీవి ఉట్టిపడేలా ఊరేగుతారు.
💫 అశ్వానికి చారిత్రక, పౌరాణిక, ఆధ్యాత్మిక, సమకాలీన ప్రాశస్త్యం విశేషంగా ఉంది. వేగానికి ప్రతీక అయిన అశ్వం చతురంగబలాలలో ప్రధానమైనది. యుద్ధాలలో సైనికులు గుర్రాలనెక్కి యుద్ధం చేస్తుండగా, దళాధిపతులు, రారాజులు తమతమ హోదాలను బట్టి అశ్వాలు పూన్చిన రథాలపై నుండి సమరం సాగించేవారు. విశ్వాసానికి మారుపేరైన అశ్వరాజాలు తమ యజమానులను కాపాడటం కోసం, తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఉదంతాలు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి.
💫 పురాణేతిహాసాల ననుసరించి శ్రీహరి శ్రీనివాసునిగా భూలోకంలోని వేంకటాచలంచేరి పద్మావతిదేవిని పరిణయమాడటం కోసం వేట నెపంతో, ఖడ్గధారియై, అశ్వంమీద నారాయణవనానికేతెంచారు. క్షీరసాగరమథనంలో పుట్టిన ఉచ్ఛైశ్రవము అనే అశ్వరాజ్యాన్ని ఇంద్రుడు తన వాహనంగా స్వీకరించాడు. శ్రీమహావిష్ణువు యొక్క జ్ఞానావతారాలలో మొదటిది "హయగ్రీవుని" అవతారం. హయగ్రీవుడంటే, "గుర్రం ముఖం కలిగిన దైవం" అని అర్థం.
💫 హయగ్రీవునికి గుర్రం ముఖం ఉండటం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది.
💫 ఒకానొకప్పుడు పదివేల ఏండ్లపాటు నిర్విరామంగా రాక్షసులతో యుద్ధం చేసి అలసిపోయిన శ్రీమహావిష్ణువు అల్లెత్రాడుతో (వింటినారితో) ఇరుకొనలూ బిగించి కట్టబడిన "శాబ్ధం" అనబడే ధనుస్సు యొక్క ఒక కొనను నేలపై నుంచి, మరొక కొనపై గెడ్డాన్ని ఆన్చి, నుల్చొని ఉండే నిద్రపోతాడు ( "...శాఙ్గధన్వా గదాధరః" అన్న 107వ విష్ణుసహస్రనామ శ్లోకాన్ని స్మరణకు తెచ్చుకోండి). ఆయనను నిద్రనుండి మేల్కొలపటానికి దేవతలు భయపడుతుంటే బ్రహ్మదేవుని ఆజ్ఞమేరకు ఓ "వమ్రి" (చెదపురుగు), వింటినారిని కొరికి శ్రీహరికి నిద్రాభంగం కావించే ప్రయత్నం చేస్తుంది. కానీ, దురదృష్టవశాత్తూ వింటినారి తెగడంతో, ధనుస్సు యొక్క కోపు అతివేగంగా వెళ్ళి విష్ణువు యొక్క తలను ఛేదించగా, ఆ శిరస్సు వెళ్ళి ముల్లోకాలకు ఆవల పడుతుంది. ఈ హఠాత్సంఘటనకు నివ్వెరబోయిన దేవతలు, లక్ష్మీదేవి యానతి ననుసరించి, ఓ అశ్వరాజాన్ని వధించి దాని శిరస్సును తీసుకుని వస్తారు. దేవశిల్పి గుర్రం తలను విగతజీవియైన విష్ణుమూర్తి మొండానికి అతికించగా, బ్రహ్మదేవుడు తిరిగి ప్రాణం పోస్తాడు. ఇదంతా, లోకకళ్యాణార్థం, పూర్వపు యుగాల శాపాలు-వరాల ననుసరించి జరుగుతుంది.
💫 సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి హయగ్రీవుని ఆలయం, ఉత్తరమాడవీధి చివరిభాగంలో, స్వామిపుష్కరిణి యొక్క ఈశాన్యదిక్కుకు ఎదురుగా స్థితమై ఉంది.
💫 బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటిదైన "పెద్దశేషవాహనం" కుండలినీ యోగానికి ప్రతీక అయితే, చిట్టచివరిదైన "అశ్వవాహనం" ఓంకారానికి సంకేతం.
💫 అసమాన శక్తికి, శారీరకదృఢత్వానికి కూడా అశ్వం పేర్గాంచింది.
💫 ఆధునికయుగంలో యంత్రశక్తిని "హార్స్ పవర్" లేదా "అశ్వికశక్తి" తో గణించటం మనందరికీ విదితమే!
💫 దాదాపు నూరు సంవత్సరాల పూర్వం వరకూ, బ్రహ్మోత్సవాలకై ఆహ్వానం పలకడం లోనూ అశ్వరాజాల పాత్ర ఎంతగానో ఉండేది. ఉత్సవ ప్రారంభానికి దాదాపు రెండు నెలల ముందుగానే బ్రహ్మోత్సవ చిహ్నమైన ధ్వజాన్ని చేబూని, 24 అశ్వికదళాలు మేళతాళాలు మ్రోగించుకుంటూ, ఉత్సవాలకై అట్టహాసంగా సమస్త జనులకూ ఆహ్వానం పలుకుతూ అన్ని దిక్కులలో బయలుదేరేవి. వారి తిరుగుప్రయాణంలో ఉత్సవాలకు విచ్చేసే భక్తుజనులందరూ, వారివారి వాహనాలలో అశ్వికదళాల ననుసరిస్తూ, వారి రక్షణలో తిరుమల క్షేత్రాన్ని చేరుకునేవారు. రాలేని భక్తులు వారి వారి కానుకలను అశ్వదళం ద్వారా శ్రీవారికి పంపేవారు.
💫 విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో చిట్టచివరిది "కల్కి" అవతారం. కలియుగాంతంలో కల్కిభగవానుడు ఖడ్గం చేబూని, అశ్వవాహనం ఎక్కి, దుష్టసంహారం గావించి ధర్మాన్ని పునరుద్ధరించుతాడని పురాణాలు చెబుతున్నాయి.
💫 శ్రీకృష్ణదేవరాయలు తన "ఆముక్తమాల్యద" గ్రంథంలో కల్కి అవతారం గురించి విశదంగా వర్ణించాడు.
💫 అశ్వం వేగానికి ప్రతీక అయితే, మనస్సు దాని కంటే వేగవంతమైనది. హరిని తలంచినంతనే జ్ఞానచక్షువులు వైకుంఠాన్ని దర్శిస్తాయి. ఇంద్రియాలను ఆలవాలంగా చేసుకొని మనస్సు అత్యంత వేగంతో పరిభ్రమిస్తుంది. అందుకే "మనోవేగము" అన్న నానుడి వాడుకలోకి వచ్చింది. అశ్వారూఢుడై ఊరేగుతున్న స్వామి నిరంతర సాధనతో ఇంద్రియాలపై విజయం సాధించి, దాని ద్వారా మనస్సు యొక్క వేగాన్ని నియంత్రించి పరమాత్మపై లగ్నం చేయాలని ఉపదేశిస్తున్నారు. యుగాంతంలో తాను జరుపబోయే దుష్టశిక్షణ కార్యక్రమానికి నాందీ ప్రస్తావన కూడా ఇప్పుడే పలుకుతున్నారు.
💫 "కలి" అనే శబ్దానికి పుణ్యం అని అర్థం. కృతయుగంలో ఒక సంవత్సరం పాటు చేసేటటువంటి తపస్సు, త్రేతాయుగంలో చేసినటువంటి యజ్ఞాలు, ద్వాపరయుగంలో కావించినటువంటి అర్చనలు, వీటి ద్వారా ఎంత ఫలితం వస్తుందో, అంతే ఫలితం కలియుగంలో ఒక్కరోజు, ఒక్కగంట నిశ్చలమైన మనస్సుతో భగవధ్యానం చేస్తే వస్తుందట!
💫 అందుకే కలియుగం అంత గొప్పది. ఈ యుగంలో జన్మించిన మనం పరమాత్మను సేవించుకుంటూ, కలిపురుషుని రక్షణలో, జన్మను సార్థకం చేసుకోవాలి. ధర్మానికి ఎప్పుడు హాని కలుగుతుందో, నిజమైన ధార్మికులు ఎప్పుడైతే కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతారో, అప్పుడు దుష్ట శిక్షణకు కల్కిభగవానుడు అవతరిస్తాడని అశ్వ వాహనం ద్వారా తెలుప బడుతోంది.
నీవు తురగముమీద నేర్పు మెరయ
వేవేలు రూపములు వెదచల్లి తపుడు
పదిలముగ నిరువంక పసిడి పింజల యంప
పొదల తరకసములొరవులు నెరపగా
గదయు శంఖము చక్రము ధనుఃఖడ్గములు
పదివేలు సూర్యబింబము లైనవపుడు
("తురగము " అంటే అశ్వము)
🌈 పల్లకి మరియు తిరుచ్చి ఉత్సవాలు 🌈
💫 బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదవ మరియు చివరిరోజు తెల్లవారు ఝామున మూడుగంటల నుంచి ఆరుగంటల వరకు, చక్రస్నానానికి ముందుగా దేవాలయంలో పల్లకి ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం జరుగుతాయి.
🌈 చక్రస్నానం 🌈
💫 తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలలో జరిగినటువంటి అన్ని సేవలు సఫలమై లోకాలన్నీ క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖశాంతులతో వర్థిల్లడానికి, శ్రవణా నక్షత్రం నాడు "చక్రస్నానం" జరుగుతుంది. యజ్ఞాంతంలో క్రతుకర్త చేసే స్నానాన్ని "అవభృథస్నానం" అంటారు. బ్రహ్మోత్సవాలు ఓ మహాయజ్ఞమే కనుక, చివరి రోజున అవభృథస్నానం చేస్తారు. స్వామివారి సేవకుడు, పంచాయుధాల్లో ఒకరైన సుదర్శనచక్రం (లేదా చక్రత్తాళ్వార్) ఈ స్నానమాచరించటం వల్ల ఇది "చక్రస్నానం" అయ్యింది.
💫 స్వామిపుష్కరిణికి వాయువ్య భాగంలో, తిరుమల క్షేత్రంలో మొట్టమొదటిదైన "ఆదివరాహస్వామి" ఆలయం కొలువై ఉంది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి తొమ్మిదవరోజు ఉదయం ఈ ఆలయ ప్రాంగణం చేరుకుంటారు. వారితో పాటుగా, వేరే పల్లకిలో చక్రత్తాళ్వార్ (సుదర్శన చక్రం) కూడా వేంచేస్తారు. మొదటగా స్వామివారికి దేవేరులకు స్నానవస్త్రాలు ధరింపజేసి, ఆర్ఘ్య, పాద్య, ఆచమనాదులు జరిపి, శుధ్ధోదక స్నానం చేయిస్తారు. తదుపరి, ఆవుపాలు దాని తరువాత శుద్ధజలంతో అభిషేకం జరుగుతుంది. ఆ తరువాత వరుసగా – పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో - అభిషేకం చేస్తారు. ఒక ద్రవ్యంతో అభిషేకం చేసిన తరువాత ప్రతిసారి, శుద్ధజలంతో విగ్రహశుద్ధి గావిస్తారు. తదనంతరం ధూప, దీప, కర్పూర నీరాజనాలు సమర్పించి; దేవతామూర్తులకు చందనసంస్కారం, తిలకధారణ గావించి; తులసిమాలలతో అలంకరిస్తారు. వరుసగా - కుంభహారతి, నక్షత్ర హారతి, సహస్రాభిషేకం - జరుపబడతాయి.
💫 ఈ వైదికప్రక్రియ జరుగుతున్నంతసేపు... శ్రీ సూక్తం, పురుషసూక్తం, భూసూక్తం పఠిస్తారు. తరువాత స్వామివారి అభిషేకజలంతో అర్చకులు తమ శిరస్సును సంప్రోక్షించుకొని, ఆ జలాన్ని భక్తుల మీద జల్లుతారు.
💫 తదనంతరం, చక్రత్తాళ్వార్ కు మాత్రమే స్వామి పుష్కరిణిలో "చక్రస్నానం" లేదా "అవభృథస్నానం" లేదా "పవిత్రస్నానం" జరుగుతుంది.
💫స్థూలంగా చెప్పాలంటే, ఉత్సవవైభోగం, యజమాని అయిన శ్రీవేంకటేశ్వరస్వామికి, అవభృథస్నానం సేవకుడైన చక్రత్తాళ్వార్ లేదా సుదర్శన చక్రానికి అన్నమాట.
💫 ఆ దివ్యాయుధ స్పర్శవల్ల పవిత్రమైన పుష్కరిణీ జలాల్లో భక్తులు, అర్చకులు, ఆచార్యపురుషులు, జియ్యంగార్లు అందరూ స్నానంచేసి పవిత్రులవుతారు. తరువాత స్వామివారు, దేవేరులు, చక్రత్తాళ్వార్ ఊరేగింపుగా ఆలయంలోకి పునఃప్రవేశం చేసి, యథాస్థానాన్ని అలంకరిస్తారు. శ్రవణా నక్షత్రం నాడు సుదర్శనచక్రంతో పాటుగా స్వామిపుష్కరిణిలో స్నానం చేసినవారు పూర్వజన్మల పాపాలు తొలగించుకుని సుఖసంతోషాలతో వర్ధిల్లుతారు.
శ్రవణంబునందు నా చక్రంబుతో గూడ
స్వామి పుష్కరిణిలో స్నానములను
సల్పువారలు పూర్వజన్మంబులను జేయు
పాపంబులను బాసి
భాగ్యవంతులై యిహపరములయందు సుఖింతురు
నా పల్కు నిజముగా నమ్ముడని
💫 స్వామిపుష్కరిణిలో ఉన్న మహత్తు ఏమిటంటే మూడు దివ్యమైన మార్గాలద్వారా అందులోకి జలం చేరుతూ ఉంటుంది:
💐 మొదటిది: భూస్పర్శ.
పుష్కరిణిలో ఉన్న అనేక ఊటబావుల నుండి ఎల్లవేళలా జలం ఊరుతూ, పుష్కరిణి నిండుగా ఉంటుంది. అంటే, భూదేవి, పుష్కరిణిని నింపడానికి తనవంతు ప్రయత్నం నిర్విరామంగా చేస్తుందన్నమాట.
💐 రెండవది: ఇంద్రుని సమర్పణ.
వర్షపుధారల ద్వారా వచ్చిన నీటితో పుష్కరిణి నిండుతుంది.
💐 మూడవది: విరజానది
స్వర్గలోకం నుండి భువికి దిగివచ్చి స్వామిపాదాల క్రిందుగా ప్రవహిస్తూ పుష్కరిణిలో చేరుకుంటున్న "విరజానది".
💫 త్రిపథ జల సంగమమైనది కాబట్టే ఈ పుష్కరిణి పరమపవిత్రమైనదిగా విరాజిల్లుతోంది.
💫 ఈ పుష్కరిణి చుట్టూ దేవతలు కొలువై ఉంటారని భక్తుల విశ్వాసం. ప్రాచీనకాలంలో ఎందరో మహర్షులు పుష్కరిణి ఒడ్డున తపస్సు చేసి సిద్ధి పొందారు. సంస్కృతంలో "నీరము" అంటే నీరు లేదా జలము అని అర్థం. ఉదకం సాక్షాత్తు ఆ శ్రీహరి స్వరూపం కనుక, ఆ స్వామి "నారాయణుడు" అయ్యాడు.
💫 ఈ సందర్భంలో తీర్థక్షేత్రాల గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి:
⚛️ పుష్కరిణిలు, నదులు, ఏ ఇతర సహజ జలసదుపాయం లేకుండా ఉన్నటువంటి దేవాలయాన్ని క్షేత్రం అంటారు.
⚛️ దేవాలయం లేకుండా కేవలం సహజ జలసదుపాయం ఉంటే వాటిని తీర్థం అంటారు.
⚛️ పుష్కరిణి లేదా నది మరియు ఆలయం - ఈ రెండూ కలిసి ఉంటే దాన్ని తీర్థక్షేత్రం అంటారు.
తిరుమల అన్ని తీర్థ క్షేత్రాలకు తలమానికం.
💫 దేవాలయాల్లో కూడా వాటి ఆవిర్భావాన్ని బట్టి ఐదు రకాలున్నాయి:
⚛️ 'భగవంతుడే "స్వయంగా" అవతరిస్తే అవి స్వయంవ్యక్త క్షేత్రాలు.
⚛️ దేవతలచే నిర్మింపబడినవి దివ్యక్షేత్రాలు.
⚛️ పురాణ ప్రసిద్ధి గాంచినవి పురాణ క్షేత్రాలు.
⚛️ మునిపుంగవుల ద్వారా ఏర్పాటు చేయబడినవి సిద్ధ క్షేత్రాలు లేదా ఆర్షములు
⚛️ భక్తులు, రాజులచే నిర్మించబడినవి మానుషక్షేత్రాలు
💫 భారతదేశంలో ఉన్న ఎనిమిది స్వయంవ్యక్త క్షేత్రాలలో తలమానికమైనది తిరుమల క్షేత్రం. జీవితంలో ఎనిమిదిసార్లు తిరుమల క్షేత్రాన్ని దర్శించుకుంటే, మిగతా ఏడు స్వయంవ్యక్త క్షేత్రాల్లో ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి దర్శించినంత ఫలం లభిస్తుంది.
💫 తిరుమల క్షేత్రంలో, ఆదివరాహస్వామి ఆలయ ప్రాంగణం నందు విరాజిల్లుతున్న స్వామిపుష్కరిణిలో స్నానమాచరించటం ఎన్నో జన్మల సుకృతం. ఈ పుష్కరిణిలో సంవత్సరానికి నాలుగు సార్లు చక్రస్నానం జరుగుతుంది.
🌈 భాద్రపదశుద్ధచతుర్దశి – అనంతపద్మనాభ వ్రతం నాడు.
🌈 ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తొమ్మిది రోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో చివరిరోజు
🌈 వైకుంఠ ద్వాదశి ఉదయం
🌈 రథసప్తమినాటి మధ్యాహ్నం
💫 స్వామివారి పరివారదేవతలైన గరుత్మంతుడు, హనుమంతుడు, జయవిజయులు, సుదర్శనుడు మొదలగు వారిని దర్శిస్తే స్వామివారు పరమానందభరితుడవుతారు. అలాగే, బ్రహ్మోత్సవాల్లో ఆయన పరివార సదస్యుడైన సుదర్శనచక్రాన్ని సందర్శించుకొని వారితో బాటు చక్రస్నానం గావిస్తే స్వామివారు మరింత సంతృప్తి చెందుతారు.
చక్రమా హరి చక్రమా వక్రమన దనుజుల వక్కలించవో ||
చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని
చట్టలు చీరిన వో చక్రమా
పట్టిన శ్రీహరిచేత పాయక ఈ జగములు
ఒట్టుకొని కావగదవొ ఓ చక్రమా ||
🌈 అలంకార తిరుమంజనం 🌈
💫 ఇది వాహనోత్సవం కాదు.
💫 శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉత్సవ - ఊరేగింపు కార్యక్రమాలయందు స్వామివారికి ఏదైనా తెలియని శ్రమ కలిగితే దానిని పోగొట్టి, నూతనత్వాన్ని, కాంతిమత్వాన్ని ఆపాదింపచేయటమే "స్నపనతిరుమంజన ఉత్సవం" లేదా "అలంకార తిరుమంజనం" యొక్క లక్ష్యం. ఈ సాంప్రదాయం అనాదిగా వస్తోంది.
💫 రంగనాయక మండపాన్ని శోభాయమానంగా అలంకరించి, మొదటగా ఉత్సవర్లను స్వర్ణపీఠంపై వేంచేపు చేస్తారు. తరువాత తీర్థం (కుంకుమపువ్వు, యాలకలు, జాపత్రి, లవంగాలు, పచ్చకర్పూరం కలిపిన జలం) తో తిరుమంజనం లేక అభిషేకం చేస్తారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో, ఒకదాని తరువాత ఒకటిగా, జియ్యంగార్లు శంఖనిధి-పద్మనిధి బంగారు పాత్రలలో అందిస్తుండగా, కంకణభట్టాచార్యులైన అర్చకులు, ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. చివరగా సహస్రధారపాత్రతో అభిషేకం గావిస్తారు.
💫 ఒక్కో ద్రవ్యంతో అభిషేకం జరిగిన తర్వాత, ఉత్సవమూర్తులకు ఒక్కో రకం మొత్తం తొమ్మిది రకాల మాలలు, కిరీటాలు, జడలను - స్వామివారు, అమ్మవార్లకు అలంకరిస్తారు. వీటిని యాలకులు, ఎండుద్రాక్ష, వట్టివేళ్ళు, గులాబీ రేకులతో; వీటితో పాటుగా, కొన్నిసార్లు విలక్షణంగా శనగఫలాలు, చిక్కుడుకాయలు, చెర్రీ ఫలాలు, పొగడపూలు తులసీపత్రాలతో ఆకర్షణీయంగా తయారుచేస్తారు. ప్రత్యేకంగా తయారు చేయబడిన విసనకర్ర, అద్దం, ఛత్రం వీటిని కూడా అందుబాటులో ఉంచుతారు. పోయిన సంవత్సరం విసనకర్రను ముత్యాలతో, నెమలిపింఛాలతో తయారు చేశారు. అలాగే, అద్దాన్ని ముత్యాలు-తామరపువ్వుల గింజలతో, గొడుగును మంచిముత్యాలతో రూపొందించారు.
💫 స్నపనతిరుమంజనం జరుగుతున్నంతసేపు, మధ్యమధ్యలో ఉత్సవమూర్తులకు నివేదనలు సమర్పిస్తారు. ఒక సంవత్సరం జరిగిన స్నపనతిరుమంజనంలో ఆస్ట్రేలియా, సింగపూర్ భక్తులు సమర్పించిన నారింజ, కివి; జపాన్, థాయిలాండ్, అమెరికాకు చెందిన ప్లమ్ ఫలాలు; న్యూజిలాండ్ నుంచి తెచ్చిన గోల్డెన్ యాపిల్ ఫలాలు; భారతదేశంలోని సుదూరప్రాంతాల నుంచి వచ్చిన స్ట్రాబెర్రీ, దానిమ్మ ఫలాలను నైవేద్యంగా సమర్పించారు.
💫 స్నపనతిరుమంజన కార్యక్రమం జరుపబడే రంగనాయకమండపాన్ని థాయిలాండ్, ఇండోనేషియా దేశాల నుండి తెప్పించిన ఆర్కిడ్స్, గ్లాడియోలస్, ఓరియంటల్ తులిప్స్ తో కన్నుల పండువగా అలంకరించారు.
🌈 ధ్వజావరోహణం 🌈
💫 బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదవనాటి రాత్రి ఆలయంలోని వెండివాకిలి ముందు "ధ్వజావరోహణం" జరుగుతుంది.
💫 శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి బంగారుతిరుచ్చిలో సాయంత్రం ఏడు గంటలకు ధ్వజస్తంభం వద్దకు చేరుకుంటారు. రాత్రి తొమ్మిది గంటలకు పూజాదికాలు ముగించుకొని, వేదపారాయణం చేస్తుండగా, మంగళ వాద్యాలు, భేరీనినాదాలు మార్ర్మోగుతుండగా, ఉత్సవాలకు విచ్చేసినట్టి బ్రహ్మాదిదేవతలు, అష్టదిక్పాలకులకు వీడ్కోలు చెబుతూ, మరుసటి బ్రహ్మోత్సవాలకు ఇపుడే తొలి ఆహ్వానం పలుకుతూ, గరుడకేతనాన్ని ధ్వజస్తంభం మీద నుండి అవనతం చేస్తారు.
💫 ఈ సందర్భంగా గరుడధ్యానం, భేరీ పూజ, భేరీతాడనం, గరుడగద్యం, దిక్పాలకగద్యం, గరుడలగ్నాష్టకం, గరుడచూర్ణిక – అనే ఏడు మంత్రాలను జపించి, బ్రహ్మాత్సవాలు ముగిసినట్లుగా అర్చకస్వాములు ప్రకటిస్తారు.
💫 ఈ విధంగా గరుడకేతనాన్ని ఎగురవేస్తూ ముల్లోకవాసులను ఆహ్వానించడంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు, గరుడధ్వజాన్ని దించివేస్తూ అతిథులందరికీ వీడ్కోలు చెప్పడంతో పరిసమాప్తి అవుతాయి.
💫 ఈ వీడ్కోలుపర్వాన్ని అన్నమయ్య అత్యంత సహజంగా, హృద్యంగా, ఆప్యాయంగా, అహూతులందరికీ పేరు పేరునా వీడ్కోలు చెబుతూ, ఈ విధంగా వర్ణించాడు:
భోగీంద్రులును మీరు పోయి రండు
వేగనమీదటి విభవాలకు ||
హరుడ పోయిరా అజుడ నీవునుంబోయి
తిరిగి రా మీదటి తిరునాళ్ళకు
సురలు మునులును భూసురులు పోయిరండు
అరవిరి నిన్నాళ్ళు అలసితిరి ||
💫 బ్రహ్మోత్సవాల్లో తెలియక జరిగిన లోటుపాట్లకు, తప్పిదాలకు ప్రాయశ్చిత్తంగా, క్షమాభిక్ష కోరుతూ, అంగరంగ వైభవంగా, టన్నుల కొద్దీ పువ్వులనుపయోగించి, చక్రస్నానానికి సరిగ్గా నెలరోజుల తరువాత, కార్తీకమాసంలో వచ్చే శ్రవణా నక్షత్రంలో, సంపంగిప్రాకారంలోని కళ్యాణోత్సవమండపంలో జరిగే "పుష్పయాగం" గురించి శ్రీవారి సంవత్సరోత్సవాల వివరణలో ఇంతకుముందే తెలుసుకున్నాం.
💫 శ్రీకృష్ణుడు అర్జునునితో తన విభూతులను తెలుపుతూ ఇలా అంటాడు:
"అర్జునా ! నేను జ్యోతిస్వరూపాలలో సూర్యుణ్ణి, నక్షత్రాలలో చంద్రుణ్ణి, పర్వతాలలో హిమాలయాన్ని, వృక్షాలలో కల్పవృక్షాన్ని, అశ్వాలలో ఉచ్ఛైశ్రవాన్ని, గజాలలో ఐరావతాన్ని, గోవులలో కామధేనువును, నాగులలో అనంతుణ్ణి, మృగాలలో సింహాన్ని, పక్షుల్లో గరుత్మంతుణ్ణి" అని శెలవిచ్చాడు.
💫 మాడవీధుల్లో జరిగిన సూర్యప్రభ, చంద్రప్రభ, కల్పవృక్ష, గరుడ, పెద్దశేష, అశ్వ, గజవాహనాలన్నీ, శ్రీకృష్ణ భగవానుని విభూతిలన్నింటిని ఒక్కటొకటిగా విశద పరుస్తున్నాయి.
💫 మరో కోణంలో చూస్తే, బ్రహ్మోత్సవాలు సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలలో జరిగినటువంటి భాగవత, రామాయణ, భారత పౌరాణిక ఇతిహాసాలు మరియు సమకాలీన సంఘటనల సమాహారం. అంతటి మహా మహిమాన్వితమైన బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటం లేదా పఠనం చేయడం లేదా శ్రవణం చేసి తరించటం జన్మ జన్మల సుకృతం.
🙏 బ్రహ్మోత్సవాలు సుసంపూర్ణం. 🙏
No comments :