🙏 శ్రీవారి సంవత్సర సేవలు 🙏
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"
💫 వెండివాకిలిని దాటి మనం ఇక మూడవ ప్రదక్షిణం, అంటే "విమానప్రక్షిణమార్గం" లోనికి చేరుకోవడమే తరువాయి.
💫 అయితే, ఆ ప్రదక్షిణం చేసే ముందుగా కొన్ని శ్రీవారి ఉత్సవాల గురించి తెలుసుకుందాం.
💫 నిత్య, వార, మాస ఉత్సవ విశేషాలను ముందుగానే చెప్పుకున్నాం కాబట్టి, కొన్ని "సంవత్సరోత్సవాల" గురించి కూడా రేపటి భాగంలో తెలుసుకుందాం.
💫 ఉత్సవాలకు నెలవైన తిరుమల క్షేత్రంలో, ప్రతినిత్యం లెక్కకు మిక్కిలిగా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో దైనందిత, వార, మాస లేదా నక్షత్ర ఉత్సవాలన్నింటి గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన సంవత్సరోత్సవాల గురించి తెలుసుకుందాం.
🌈 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనోత్సవం 🌈
💫ఆ తిరుమల కొండపై ఉన్న ప్రతి చెట్టూ-పుట్టా, రాయీ-రప్పా, తీర్థాలూ, సమస్త జంతుజాలం, అన్నీ కారణజన్ములైన దేవతలు, సిద్ధిపొందిన మునిపుంగవులే. వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు కలియుగంలో ఆవిర్భవించటంతో ఆ దేవదేవునికి సపర్యలు చేయటం కోసం, లోక కళ్యాణార్థం శ్రీవారు చేపట్టే కార్యాలకు సహాయ సహకారాలు అందించటం కోసం స్వర్గవాసులందరు వివిధరూపాలు ధరించి తిరుమలక్షేత్రంలో కొలువై ఉన్నారు.
💫 ఆ కారణంగా తిరుమలను ఎల్లప్పుడూ అత్యంత పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచటం అనూచానంగా వస్తున్న సాంప్రదాయం. ఆలయ పరిసరాలు, తిరుమల పట్టణమంతా పరిశుభ్రతకు మారుపేర్లు.
💫 అలాగే, ఆలయాంతర్భాగాన్ని కూడా సతతం శుభ్రపరుస్తూ, పరిశుభ్రత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతారు. అయితే, దైవసన్నిధిలో జరిగేది కనుక ఈ ప్రక్రియనంతా శాస్తోక్తంగా, భక్తిభావంతో, క్రమశిక్షణతో పూర్తిచేయాలి.
✅ సంవత్సరంలో నాలుగు సార్లు, అనగా:
💐 ఉగాది
💐 ఆణివార ఆస్థానం (ఇదివరకు ఆలయ వార్షికలెక్కల ముగింపు),
💐 బ్రహ్మోత్సవాలు
💐 వైకుంఠ ఏకాదశి
💫 ఈ పండుగలకు ముందు వచ్చే మంగళవారాల్లో జరిగే ఈ "శుద్ధికార్యక్రమాన్నే" , కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం" గా పిలుస్తారు. శ్రీవారికి జరిగే ఆర్జిత సేవల్లో ఇదో ముఖ్యమైన సేవ!
💫 ఈ "కోయిల్" అంటే ఆలయం. "ఆళ్వార్" అంటే విష్ణుభక్తుల్లో గొప్పవారు. "తిరుమంజనం" అంటే పవిత్రమైన శుద్ధికార్యక్రమం. ఆలయంలో జరిగేది కాబట్టి ఈ శుద్ధికార్యక్రమాన్నే "అభిషేకం" గా భావిస్తారు. వెరసి, ఈ పదానికి అర్థం - "ఆలయంలో విష్ణుభక్తులు జరిపించే పవిత్రమైన అభిషేకం."
💫 ఈ ఉత్సవం జరిగే రోజుల్లో, దైనందిత సేవలైన సుప్రభాతం, తోమాలసేవ, అర్చనల తరువాత, గర్భాలయంలోని మూలమూర్తికి ఆసాంతం "మలైగుడారం" అనే వస్త్రాన్ని కప్పి, దుమ్మూ ధూళీ పడకుండా చూస్తారు. ఇదే గుడారంలో భోగశ్రీనివాసుణ్ణి కూడా ఉంచుతారు.
💫 మిగతా ఉత్సవమూర్తులు, పరివారదేవతలు, శ్రీ వారికి నిత్యం అలంకరింపబడే సాలగ్రామాలను ఘంటామండపం లోకి; వెండి, బంగారు పాత్రల్ని బంగారుబావి వద్దకూ; స్వామివారి వెండి మంచం, వెండి ఆభరణాలను విమానప్రదక్షిణ మార్గంలోనికి భక్తి పూర్వకంగా తరలిస్తారు.
✡️ ఉత్సవమూర్తులు, సాలగ్రామాలను, అర్చకులు ఘంటామండపంలో తెరలు కట్టి అభిషేకిస్తారు.
✡️ బంగారుబావి వద్దకు తెచ్చిన వస్తువులన్నింటినీ చింతపండుతో శుభ్రపరుస్తారు.
✡️ అర్చకులు గర్భాలయాన్ని;
✡️ పరిచారకులు, ఏకాంగులు కులశేఖరపడి ముందున్న ప్రాంతాన్ని; ఆలయ ఉద్యోగులు మిగతా దేవలయం అంతటినీ, ఉపాలయాలనూ శుభ్రంచేసి శీకాయనీళ్ళతో కడుగుతారు.
✡️ అభిషేకం అందుకున్న ఉత్సవమూర్తులు, పరివారదేవతా మూర్తులకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
✡️ రంగనాయక మండపంలోని వెండి, బంగారు వాహనాలకు మెరుగు పెడతారు.
✡️ నామంకోపు, గడ్డకర్పూరం, శ్రీచూర్ణం, గంధంపొడి, కుంకుమ ఖచిలిగడ్డ లను కలిపి లేహ్యంలా తయారుచేసిన "పరిమళం" అనబడే మిశ్రమాన్ని ముందురోజు రాత్రే గంగాళాల్లో సిద్ధంగా వుంచుకుంటారు.
✡️ గర్భాలయంలో స్వామివారి పైకప్పు భాగానికి కట్టే మఖమల్ వస్త్రాన్ని "కురాళం" అంటారు.
✡️ పరిమళాన్ని, కురాళాన్ని తీసుకుని జియ్యంగార్లు, ఆలయ ఉన్నతాధికారులు మంగళవాయిద్యాలతో, ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా వచ్చి అర్చకులకు అందజేస్తారు.
✡️ అర్చకులు కురాళాన్ని యథాస్థానంలో (గర్భాలయపు ఉపరితల భాగంలో) అమర్చి, "పరిమళాన్ని గర్భాలయ మరియు ఇతర ముఖ్య ఉపాలయాల గోడలకు లేపనంలా పూస్తారు.
✡️ తరువాత నేలనంతా కడిగి, ఉత్సవమూర్తులను, పూజాసామగ్రిని వారివారి స్థానాలకు చేరుస్తారు.
✡️ అనంతరం బంగారువాకిళ్ళకు నూతన పరదాలు కట్టి, తెరవేసి, మూలమూర్తిని కప్పి ఉంచిన మలైగుడారాన్ని తొలగించి, రోజువారీ సేవాకార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తారు.
💫 ఈ సేవను మొట్టమొదటగా "వంగపురం నారాయణశెట్టి" అనే తిరుపతికి చెందిన వర్తకుడు, 1544వ సం. లో, తన ఖర్చుతో జరిపించాడు.
💫 ఈ సేవాకార్యక్రమం నందు పరిమళద్రవ్యాలను అధిక మొత్తంలో ఉపయోగించటం వల్ల గవాక్షాలు లేని ఆనందనిలయంలో గాలి పరిశుభ్రంగా, సువాసనా భరితమై ఉండటమే కాకుండా, లోనికి క్రిమికీటకాదులు రాకుండా ఉంటాయి. ఈ సేవలో పాల్గొనే భక్తులు, వ్యక్తికి ₹300 చొప్పున చెల్లించాలి.
💫 తిరుమలలో పరిశుభ్రత గురించి ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి. "అన్నం పరబ్రహ్మ స్వరూపం" - అటువంటి టన్నుల కొద్దీ అన్నాన్ని ప్రతిదినం లక్షకు పైగా భక్తులకు వండి వడ్డించే, తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాదకేంద్రంలో; ఒక్క ఈగను కానీ, పదార్థాల్లో ఒక్క వెంట్రుకను గానీ ఎప్పుడైనా, ఎవరైనా చూశారా? అంకితభావంతో పనిచేసే వంటశాల సిబ్బంది అవిశ్రాంత కృషికి శ్రీనివాసుని సంపూర్ణ కటాక్షం తోడవటం వల్లనే ఇది సాధ్యం!
✅ ఆత్మ, శరీర, పరిసరాల పరిశుభ్రతే పరమపద సోపానానికి తొలిమెట్టు.
🌈 సాలకట్ల తెప్పోత్సవం 🌈
💫 వేసవికాలంలో తాపం తీర్చుకోవడానికి మనం చల్లని ప్రదేశాలను, ఈతకొలనులను సందర్శించినట్లే; ఆ వేంకటేశుడు కూడా సతుల సమేతంగా నౌకావిహారానికి వెళతాడు.
💫 వేసవి ప్రారంభంలోని (ఫిబ్రవరి-మార్చి) పున్నమిరోజుల వెన్నెల కాంతుల్లో, స్వామిపుష్కరిణి యందలి చల్లటి నీళ్ళలో జరిగే ఈ ఉత్సవాల్ని "సాలకట్ల తెప్పోత్సవాలు" గా వ్యవహరిస్తారు.
💫 ఏటా ఫాల్గుణమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ప్రారంభమై, ఐదు రోజులపాటు రాత్రి 7 నుంచి 8 గం. ల మధ్య జరిగే ఈ ఆర్జితసేవలో పాల్గొనటం కోసం వ్యక్తికి ₹500 చొప్పున చెల్లించాలి.
💫 తిరుమలలో అతి ప్రాచీనకాలం నుండి జరుగుతున్న తెప్పోత్సవాల్ని మరింత ఘనంగా నిర్వహించటానికి, 1468వ సం.లో, పుష్కరిణి మధ్యభాగం నందు "నీరాళి మంటపాన్ని" సాళువ నరశింహరాయలు నిర్మించాడు.
💫 సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పుష్కరిణిలో, విద్యుద్దీపాలంకార శోభితమైన తెప్ప యందు స్వామివారు విహరించే ఈ తెప్పోత్సవం ఇలా సాగుతుంది -
🙏 మొదటి రోజు —
సీతాలక్ష్మణ ఆంజనేయస్వామి సమేతంగా శ్రీరామచంద్రమూర్తి పుష్కరిణిలో మూడుసార్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు.
🙏 రెండవరోజు -
రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణుడు మూడు సార్లు విహరిస్తారు.
🙏 మూడవరోజు -
ఉభయ నాంచార సమేతులైన మలయప్పస్వామి వారు పుష్కరిణిని మూడు సార్లు చుట్టివస్తారు.
🙏 నాల్గవరోజు –
మలయప్పస్వామి వారు మరలా ఐదు సార్లు విహరిస్తారు.
🙏 ఐదవరోజు —
చివరిసారిగా, మలయప్పస్వామి వారు ఏడు మార్లు నౌకావిహారం చేస్తారు.
🎼 తాళ్ళపాక అన్నమయ్య ఈ తెప్పోత్సవ శోభను హిందోళరాగంలో ఇలా కీర్తించాడు -
"దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ
వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా!!"
"తెప్పగా మర్రాకు మీద తేలెడువాడు
ఎప్పుడు లోకములెల్ల నేలేటి వాడు!!"
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"
🙏 ప్రణయకలహోత్సవం 🙏
💫షికారుకి వెళ్ళొచ్చిన శ్రీవారిపై సతీమణి అలక బూనటం, శ్రీవారు సంజాయిషీలిచ్చుకొని సతీమణిని బుజ్జగించటం, ఇవన్నీ ఈనాడు మొదలైన ముచ్చట్లు కావు. శ్రీనివాసుడే ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి ఉంటాడు.
అదెలా అంటే....
💫ఏటా వైకుంఠ ఏకాదశికి ఆరోరోజు, అంటే అధ్యయనోత్సవాల్లో 17వ రోజున (అధ్యయనోత్సవాల గురించి తరువాత తెలుసుకుందాం) రెండవఘంట నివేదన తరువాత, మలయప్పస్వామి వారు పల్లకీ ఎక్కి ఒంటరిగా మహాప్రదక్షిణ మార్గంలోని స్వామి పుష్కరిణి వద్దకు వేంచేస్తారు. ఇంతలో ఇద్దరు అమ్మవార్లూ చెరొక పల్లకిపై అప్రదక్షిణంగా వచ్చి స్వామివారికి ఎదురుగా నిలుచుంటారు.
💫 పురాణపఠనం జరుగుతుండగా, అలక పూనిన అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు, వేటకు వెళ్ళివచ్చిన స్వామివారిని మూడు మార్లు పూలచెండ్లతో తాడించుతారు, స్వామివారు బెదిరినట్లు నటించి, తానేమీ తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు.
💫 జియ్యరు స్వాములు నమ్మాళ్వార్ విరచిత నిందాస్తుతి పాశురాలను గానం చేస్తుండగా అమ్మవార్లు శాంతించి, స్వామికి ఇరు పార్శ్వాలా చేరి కర్పూరనీరాజనాలు అందుకుంటారు. అనుభవజ్ఞులైన అయ్యంగార్లు, అర్చకస్వాములు రసవత్తరంగా, హావభావ ప్రదర్శన చేస్తూ ప్రణయఘట్టాన్ని రక్తి కట్టించే ఈ ఉత్సవం, ఆర్జిత సేవ కాదు.
ఏడాదికోమారు శ్రీవారి బంగారు కవచాన్ని మార్చే అభిషేకం; దేశవిదేశాల నుండి తెప్పించిన, టన్నుల కొద్దీ, రంగురంగుల పరిమళభరిత పుష్పాలతో శ్రీవారికి చేసే యాగం; సుమారు ఐదువేల ఏళ్ళ క్రితం తిరుమలకు 30 కి. మీ. దూరంలో శ్రీవారికి పద్మావతి అమ్మవారితో జరిగిన వివాహాన్ని స్ఫురణకు తెచ్చే ఉత్సవం – ఇవన్నీ పఠనాసక్తితో బాటుగా, అలౌకికమైన ఆధ్యాత్మి కానుభూతులు కలిగించేవే!
🙏 జ్యేష్టాభిషేకం 🙏
💫 ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో, జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేటట్లుగా, మూడు రోజులపాటు సంపంగి ప్రదక్షిణం నందున్న కళ్యాణోత్సవ మంటపంలో శ్రీవారికి జరిగే అభిషేకాన్ని జ్యేష్టాభిషేకం (లేదా) అభిధేయక అభిషేకం గా వర్ణిస్తారు. అభిధేయకం అంటే "నశింపశక్యం గాని రక్షణకవచం."
💫 శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి విగ్రహాలు 800 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి. ఇవి ఇత్తడి, బంగారం, రాగి, వెండి, సీసంల మిశ్రమమైన పంచలోహంతో తయారు చేయబడ్డాయి. నిరంతరం అభిషేకాలు అందుకునే ఈ మూర్తులు అరిగిపోకుండా భద్రపరచడం కోసం ఎల్లవేళలా అవి బంగారుకవచంతో కప్పబడి ఉంటాయి. ఏడాదికో మారు ఈ బంగారు కవచాన్ని జాగ్రత్తగా తొలగించి, అభిషేకాదులు నిర్వహించి, అత్యంత భక్తిశ్రద్ధలతో కవచాన్ని తిరిగి ధరింప జేయటమే ఈ "అభిదేయక అభిషేకం". అలంకార కవచం లేకుండా మలయప్పస్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునే భాగ్యం, ఈ అభిషేకం సందర్భంగా మాత్రమే కలుగుతుంది.
💫 మొదటి రోజు
శ్రీమలయప్పస్వామికి ఉన్న బంగారు కవచాన్ని తొలగించి, హోమ, అభిషేక, పంచామృత స్నపన తిరుమంజనాదులు జరిపిన తరువాత శ్రీవారికి వజ్రకవచాలంకరణ చేసి పురవీధుల్లో ఊరేగిస్తారు. -
💫 రెండవరోజు
ముత్యాల కవచాన్ని ధరింపజేసి ఊరేగిస్తారు.
💫 మూడవరోజు
తిరుమంజనాదులు పూర్తిచేసి తిరిగి బంగారు కవచధారణ చేసి మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఈ కవచాన్ని ఏడాది తరువాత జ్యేష్ఠాభిషేక సందర్భంగానే మరలా తీస్తారు.
💫 ఈ ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులను స్వామివారు అభేద్యమైన కవచంలా కాపాడతారని భక్తుల విశ్వాసం. అంటే అరిషడ్వార్గాలనే శత్రువులు మనపై దాడి చేయకుండా "ఆత్మనిగ్రహమనే" కవచాన్ని మనకు ప్రసాదిస్తారు. ఈ ఆర్జిత సేవా రుసుము, ప్రతి ఒక్కరికీ ₹400. (ప్రస్తుతం పెరిగి ఉండవచ్చు
🙏 పద్మావతీ పరిణయోత్సవాలు 🙏
💫 సుమారు ఐదు వేల ఏళ్ళ క్రితం, కలియుగారంభంలో శ్రీమహావిష్ణువు వైకుంఠం నుండి వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చి వేంకటాచలంలో కొలువై ఉన్నారు. ఆ సమయంలో "నారాయణవనం" రాజ్యాన్ని పరిపాలించే ఆకాశరాజు తన కుమార్తె అయిన పద్మావతీదేవిని వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారం, పూర్వఫల్గుణీ నక్షత్రలగ్నంలో, శ్రీనివాసునికి కన్యాదానం చేశాడు.
💫 తిరుపతి పట్టణానికి 30 కి. మీ. దూరాన ఉన్న "నారాయణవనం" అనే గ్రామంలో కళ్యాణ వేంకటేశ్వరుడి ఆలయాన్నీ, అందులో, పద్మావతీ పరిణయ సందర్భంలో పసుపు కొమ్ములు విసరటానికి ఉపయోగించిన పెద్ద తిరగలినీ, ఈనాడూ మనం చూడవచ్చు. పట్టుచీరెలకు ప్రసిద్ధిగాంచిన ఈ గ్రామాన్ని, అందున్న కళ్యాణ వేంకటేశ్వరుని మరియు సొరకాయలస్వామి ఆలయాలనూ, వాటితో పాటు మరెన్నో దేవాలయాలనూ ఈ సారి తప్పక దర్శించండి.
💫 వేంకటేశుడు-పద్మావతీల కళ్యాణానికి విచ్చేసిన ముక్కోటి దేవతలకు ఆకాశరాజు విలాసవంతమైన భవనాల్లో విడిది ఏర్పాటు చేశాడు. కొండలు-కోనల్లో ఉండటానికి ఇష్టపడే శివుని కోర్కెపై, శివపార్వతులకు మాత్రం సమీపంలోని, ఓ పర్వతగుహలో విడిది ఏర్పాటు చేశాడు. ప్రకృతి వడిలో పరవశిస్తూ "కైలాసకోన" గా పిలువబడే ఆ గుహను, అందులో ప్రతిష్ఠితమైన శివపరివారాన్నీ, కొండలమీద నుంచి జాలువారే తీర్థాన్ని నారాయణవనానికి కొద్ది దూరంలో నేడూ చూసి తరించవచ్చు.
[ శ్రీవేంకటేశ్వరుని కళ్యాణం గురించి మరోసారి వివరంగా తెలుసుకుందాం.]
💫 ఆనాటి కళ్యాణ వైభవానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమికీ, మూడురోజుల పాటు ఈ కళ్యాణోత్సవాలు జరుగుతాయి. "నారాయణవనానికి " ప్రతీకగా, తిరుమల లోని "నారాయణగిరి ఉద్యానవనం" లో ఈ వేడుకలు జరుపబడుతాయి. 1992వ సం. లో ఈ ఆర్జిత సేవా ఉత్సవాల్ని ప్రారంభించారు.
💫 ముందురోజు, అంటే, వైశాఖ శుద్ధ నవమి రోజు
సాయంత్రం మలయప్పస్వామి వారు, ఉభయనాంచారులు ప్రత్యేకమైన పల్లకీలలో కళ్యాణోత్సవ మంటపానికి వేంచేస్తారు.
💫 రెండవ, మూడవ రోజులైన దశమి, ఏకాదశి నాడు, వరుసగా, అశ్వవాహనం మరియు గజవాహనంపై కళ్యాణమంటపానికి సర్వలాంఛనాలతో చేరుకుంటారు. మూడు రోజులూ కళ్యాణవేడుకలు అత్యంత ఘనంగా నిర్వహింప బడతాయి.
💫 అన్నమయ్య తన "శ్రీరాగ" కీర్తనలో పెండ్లి ముచ్చట్లను, పెడ్లికూతురి సిగ్గును, నగలను, తలంబ్రాలవేడుకను ముగ్ధమనోహరంగా వర్ణించాడు:
"పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు కొంత
పెడమరలి నవ్వేనీ పెండ్లికూతురు
పేరుకల జవరాలి పెండ్లికూతురు పెద్ద
పేరుల ముత్యాల మెడ పెండ్లికూతురు
పేరంటాండ్ల నడుమ పెండ్లికూతురు
విభు పేరుకుచ్చ సిగ్గుపడే పెండ్లి కూతురు!!!
💫 ఈ కళ్యాణోత్సవ వేడుకలు దర్శించిన భక్తుల గృహాల్లో శుభకార్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఆర్జిత సేవలో పాల్గొనటానికి ప్రతి వ్యక్తికీ ₹ 1000 చెల్లించాలి.
💐 పుష్పయాగం 💐
💫 "పుష్పమండపం" గా పేరొందిన తిరుమల, పరిమళాలు వెదజల్లే రంగురంగుల పుష్పాలకు పెట్టింది పేరు. తిరుమల - నాడూ, నేడూ కూడా అనేక పూలతోటలతో శోభిల్లుతూ ఉంది. ఆగమశాస్త్రానుసారం స్వామివారికి నిర్వహించే పూజాదికాలయందు విరులకో ప్రత్యేకస్థానముంది.
💫 పుష్పార్చన ద్వారా, పంచఫలాలైన - శ్రీవారి అనుగ్రహం, పుష్టి (శారీరక దృఢత్వం), వృష్టి (సకాల వర్షాలు), ఐహిక సంపద (ధనధాన్యాలు, భోగభాగ్యాలు), ఆధ్యాత్మిక సంపద (మోక్షం) - పొందవచ్చని పెద్దలు చెపుతారు.
💫 ఆ దేవదేవునికి ప్రకృతివల్ల, క్రిమికీటకాలవల్ల, మానవ తప్పిదాలవల్ల జరిగే అసౌకర్యానికి పరిహారార్థం, దాదాపు అయిదు శతాబ్దాలుగా ఈ పుష్పయాగం నిర్వహింపబడుతోంది.
💫 తిరుమలలో అత్యంత కోలాహలంగా జరుపబడే అతి పెద్ద వేడుక - లక్షాలాది భక్తులు విచ్చేసే తొమ్మిది రోజుల "బ్రహ్మోత్సవాలు". అంత భారీస్థాయిలో, అనేక విభాగాల సమన్వయంతో జరిగే ఉత్సవాల్లో, ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ, తెలిసో తెలియకో కొన్ని తప్పులు దొర్లుతాయి. ఆ దోష పరిహారార్థం, బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత వచ్చే, స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం నాడు, సంపంగి ప్రదక్షిణమార్గంలోని కళ్యాణోత్సవమంటపంలో, ఈ పుష్పయాగం నిర్వహించబడుతుంది.
💫 15వ శతాబ్దంలో ప్రారంభమైన పుష్పయాగం ఆలయ ఆదాయవ్యయాలపై ఎక్కువ దృష్టిపెట్టిన ఈస్టిండియా కంపెనీ హయాంలో, రెండు శతాబ్దాల క్రితం అర్థంతరంగా ఆగిపోయింది. 1980 సం. లో, అప్పటి తి.తి.దే. ఆస్థాన విద్వాంసులైన జగన్నాథాచార్యులు, శ్రీమాడబాకం ఆచార్యులు ఈ ఉత్సవాన్ని పునరుద్ధరించారు.
💫 పుష్పయాగానికి ముందు రోజున జరిగే "అంకురార్పణ" ఘట్టంలో భాగంగా శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనులవారిని ఊరేగిస్తూ, వసంతమంటపంలో పుట్టమన్ను సేకరించి, ఆ మట్టితో ఆలయం చేరుకుని, కళ్యాణోత్సవ మండపంలో 'బీజావాపం' (నవధాన్యాలను మొలకెత్తించటం) చేస్తారు. పుష్పయాగం జరిగే రోజున రెండో అర్చన, నివేదనానంతరం, ఉభయనాంచారుల సమేతంగా మలయప్పస్వామివారు, ఉదయం తొమ్మిది గంటలకు కళ్యాణోత్సవమంటపానికి వేంచేస్తారు.
💫 తొలుతగా స్వామివారికి పంచామృత ద్రవ్యాలతో స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. తరువాత పంచగవ్యప్రాసనం, రక్షాబంధనం, హోమం, రాజోపలాంఛనాలు, నక్షత్ర హారతి సమర్పిస్తారు.
💫 రెండు సార్లుగా జరిగే ఈ ఉత్సవంలో, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు అనేక రకాలకు చెందిన, సుమారుగా ఏడు టన్నుల సుమాలతో ఈ యాగం నిర్వహిస్తారు.
💫 ప్రకృతి ప్రసాదితమైన మల్లె, గులాబీ, చామంతి, కనకాంబరం, గన్నేరు, తెల్లగులాబీ, సంపంగి, నందివర్ధనం, జాజులు, కలువతామరలు; వాటితో బాటు దవనం, మరువం, తులసిదళాలతో స్వామివారిని పూజిస్తారు. వీటితో పాటుగా అనేక రకాలైన, విదేశాలనుండి దిగుమతి చేసుకున్న పూలతో ఈ యాగం సర్వాంగ శోభితమోతుంది.
💫 పుష్పయాగానికి వినియోగించే కుసుమాలన్నింటికీ, ఉద్యానవన కార్యాలయంలో ఆలయాధికారులు శాస్త్రోక్త పూజలు నిర్వహిస్తారు. అనంతరం అధికారులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారిసేవకులు, భక్తులు ఊరేగింపుగా ఈ పూలన్నింటినీ ఆలయం వద్దకు చేర్చుతారు. పుష్పయాగం సందర్భంగా, శ్రీవారి ఆలయం మొత్తాన్ని, ముఖ్యంగా కళ్యాణోత్సవమంటపాన్ని పుష్పాలతో, విద్యుద్దీపాలతో అత్యంత కళాత్మకంగా అలంకరిస్తారు. అంతే కాకుండా, ఆలయ ముఖద్వారం వద్ద, నయనానందకరంగా, పుష్పాలతో స్వామివారి రూపాన్ని ఏర్పాటు చేస్తారు. సాధారణంగా పుష్పాలకు, అలంకారాలకు అయ్యే ఖర్చంతా భక్తులైన దాతలే భరిస్తారు.
💫 అన్నిరకాల పుష్పాలను, అంత పెద్ద మొత్తంలో, బహుశా ప్రపంచంలో మరెక్కడా చూడబోము. నేత్రానందాన్నీ, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తూ శ్రీవారి వైభవానికి, శ్రీవారి సేవలో పుష్పాలకున్న ప్రాశస్త్యానికి అద్దం పట్టే పుష్పయాగాన్ని చూసి తరించవలసిందే!
💫 ఆరోజు తిరుమల క్షేత్రమంతా పూల పరిమళంతోనూ, అపరిమిత భక్తిభావంతో పుష్పాలను గంపలతో దేవాలయానికి చేర్చే ఆలయ సిబ్బంది భక్తులసందడి తోనూ, పులకితమవుతుంది.
💫 ఆ యాగాన్ని తిలకించి పరవశిస్తున్న భక్తుల మదిలో మెదిలేది ఒకే ఒక్క తలంపు - అన్ని కోట్ల పుష్పాలలో తానూ ఒకరై, స్వామివారి పూజా భాగ్యాని కెందుకు నోచుకోలేదూ? ఆ భాగ్యం పొందాలంటే మరెన్ని జన్మలెత్తాలి?
💫 జియ్యరు స్వాములు భక్తిపూర్వంకంగా పుష్పాలను అందిస్తుండగా అర్చకస్వాములు, శ్రీవారి అమ్మవారి హృదయాలను తాకే వరకూ పూజ చేసి ఆ తరువాత పుష్పాలను తొలగిస్తారు. మరల పుష్పాలతో పూజిస్తారు. ఈ విధంగా 20 సార్లు చేసి, పుష్పాలకు అధిపతియైన "పుల్లుడు" అనే దేవతను ఆవాహన చేస్తారు. ఈ ఆర్జిత సేవకు 7700/-'రుసుము చెల్లించాలి.
"పూజలందరు జేసేదే పుష్పయాగము
ఆజి నర్జునుడు చేసినది పుష్పయాగము!!"
"తొరలి అలమేల్మంగతురుమున విరులే నీకు
పొరసి నీయురముపై పుష్పయాగము
సిరులతో మునులెల్ల శ్రీ వేంకటాద్రీశ నీకు
పొరి పొరి జేసేరు పుష్పయాగము!!"
✅ ప్రతీ ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీవారి దర్శనభాగ్యం కలుగజేస్తారు. ✅
No comments :