🙏 శ్రీవారి వారోత్సవాలు-1 🙏
💫 “ఎన్ని జన్మల పుణ్యమో - నీకిన్ని సేవలు చేయగా! ఏడుకొండల దేవరా – ఈ భాగ్యమంతా మాదిరా!”
💫 తిరుమల లోని శ్రీవారి ఆలయం, లెక్కకు మిక్కిలి ఉత్సవాలు, సేవలతో వైకుంఠాన్ని తలపిస్తుంది. ఈ సేవలను ఆచరించే వారు యజ్ఞఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. ఉత్సవప్రియుడైన స్వామి సేవలలో ఉన్న పరమార్థాన్ని వేయి నోర్లు, రెండువేల నాలుకలు కల ఆదిశేషుడు, ఆయన నాభికమలంలో ఉద్భవించిన బ్రహ్మ, వక్షోవిహారిణి అయిన అమ్మవారు కూడా చెప్పలేక సతమతమయ్యారట. అంతటి మహత్తరమైన సేవలను వర్ణించటానికి మనమెంతటి వారం? అయినా, ఆ స్వామి వారి మీద భారం ఆ సేవల సారాంశాన్ని లేశమాత్రంగా తలుచుకుందాం.
💫 సుప్రభాతసేవ నుంచి ఏకాంతసేవ వరకూ ప్రతిరోజూ జరిగే "నిత్యసేవలను" మనం ముందే చెప్పుకున్నాం. ఇక వారంలో ఒక రోజు మాత్రం జరిగే "వారోత్సవాల" గురించి తెలుసు కుందాం.
💫 శ్రీవారి పాదపద్మాలకు జరిగే అష్టదళపాద పద్మారాధన తో "వారోత్సవాలు" వాటి విశేషాలను తెలుసుకుందాం.
🙏 అష్టదళ పాద పద్మారాధన 🙏
💫 ప్రతి మంగళవారం, ఉదయం ఆరు గంటలకు, రెండవ అర్చనగా, నూట ఎనిమిది బంగారు కమలాలతో మూలవిరాట్టు పాద పద్మాలకు, సుమారు 20 నిముషాల పాటు జరిగే సేవా కార్యక్రమమే ఈ అష్టదళ పాద పద్మారాధన. ప్రతిరోజూ, స్వామివారి పాదాలకు తులసిదళాలతో ఏకాంతంగా అర్చన జరుగుతుంది. కైంకర్యపరులకు తప్ప వేరెవరికీ అది చూసి తరించే భాగ్యం లేదు. కానీ మంగళవారం మాత్రం "అష్టదళ పాద పద్మారాధన" ఆర్జిత సేవలో పాలు పంచుకొనే భక్తులందరూ ఈ అర్చనను చూసి తరించవచ్చు.
🙏 ముస్లిం భక్తుడు? 🙏
💫 1984 సం. లో, తి.తి.దే. స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ సేవ ప్రారంభించబడింది. హైదరాబాదు, గుంటూరు వాస్తవ్యుడైన ఓ మహమ్మదీయ భక్తుడు ఇందుకు అవసరమైన 108 బంగారు పద్మాలను శ్రీవారికి కానుకగా సమర్పించాడు. స్వామివారు ఒక మతానికో, ప్రాంతానికో పరిమితం కాని అఖిలాండ, బ్రహ్మాండ నాయకుడనటానికి ఇంతకంటే చక్కటి నిదర్శనం ఏం ఉంటుంది?
💫 కొంతకాలం తరువాత ఇది ఆర్జిత సేవగా రూపు దిద్దుకుంది. అయితే, అన్ని ఇతర సేవా కైంకర్యాల లాగా ఈ అర్చన యొక్క మూలాలు కూడా ప్రాచీన కాలం నాటి ఆగమశాస్త్రం లోనే ఉన్నాయి.
🌈 ఈ సేవ, ఎప్పుడు - ఎలా ప్రారంభమైంది! 🌈
💫 దీని విషయమై ఒక ఆసక్తికరమైన, అద్భుతమైన, ఈ మధ్యకాలంలోనే జరిగిన యదార్థ సంఘటన ఉంది.
💫 1982వ సంవత్సరంలో తి.తి.దే. బోర్డు సమావేశం జరుగుతున్నప్పుడు, షేక్ మస్తాన్ అనే ముస్లిం భక్తుడు అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి వి ఆర్ కే ప్రసాద్ గారిని కలుసుకునే నిమిత్తం తి.తి.దే. కార్యాలయానికి వచ్చారు. సమావేశంలో వ్యస్తుడై వుండటంవల్ల శ్రీ ప్రసాద్ గారు అఇష్టంగానే ఆ భక్తుణ్ణి కలుసుకున్నారు. ఆ భక్తుని కథనం ఇలా ఉంది -
💫 "అయ్యా! గుంటూరు జిల్లాకు చెందిన మా అన్నదమ్ముల మందరం ఉమ్మడి కుటుంబంలో కలసి మెలసి ఉంటూ ఓ చిన్నపాటి వ్యాపారం చేసుకుంటున్నాం. మాది ఓ మధ్యతరగతి కుటుంబం. తరతరాలుగా మేము శ్రీవారి భక్తులం. మా గృహంలో శ్రీవెంకటేశ్వర సుప్రభాతం, మంగళాశాసనం, శ్రీవేంకటేశ్వరగద్యం వీటి పఠనం నిత్యం జరుగుతుంది. ప్రతి మంగళవారం నాడు అష్టోత్తర శతనామార్చన కూడా భక్తితో జరుపబడుతుంది. మా తాతగారు, తన స్వార్జితంతో 108 స్వర్ణపుష్పాలు చేయించి శ్రీవారికి సమర్పిస్తానని మొక్కుకున్నారు. కానీ కొన్ని పద్మాలు చేయించగానే అస్వస్థతతో కాలం చేశారు. దాంతో ఆ మ్రొక్కు తీర్చుకునే బాధ్యత మా తండ్రిగారు భుజానికెత్తుకుని, మరికొన్ని పుష్పాలు చేయించి, వారు కూడా స్వర్గస్తులయ్యారు. ఇప్పుడా బాధ్యత మా మూడోతరం వారిపై పడింది. ఆ బాధ్యతను ఆనందంగా స్వీకరించి, ఆర్థికంగా అంతంత మాత్రమే స్థోమత గల మేమందరం ఎన్నో వ్యయప్రయాసల కోర్చి, ప్రతి పైసా కూడబెట్టి, ఎన్నో ఏళ్లుగా స్వర్ణకమలాలు తయారు చేయిస్తున్నాము. ఒక్కొక్కటి 23 గ్రాముల బరువు గల 108 కమలాలు ఈ మధ్యనే పూర్తయ్యాయి. తమరు దయతో వీటిని స్వీకరించి స్వామివారి కైంకర్యంలో ఏదోవిధంగా వినియోగిస్తే, మన తండ్రి, తాత గార్ల ఆత్మలు శాంతిస్తాయి. మా కుటుంబ సభ్యులందరికీ ఎనలేని ఆనందం చేకూర్చిన వారవుతారు. ఈ విషయం తమతో ప్రత్యక్షంగా విన్నవించు కోవడానికి, 54 మంది సభ్యులు గల మా పరివారమంతా, కాలినడకన బయలు దేరి కొండకు చేరుకున్నాం."
💫 ఆ మహమ్మదీయ భక్తుడి ఆవేదనను, ఆర్తిని ఆసాంతం విన్న బోర్డు సభ్యులకు నోటమాట రాలేదు. మరో రెండేళ్ల తర్వాత జరుగబోయే తి.తి.దే. స్వర్ణోత్సవాలు చిరకాలం గుర్తుండిపోయే విధంగా ఏ సేవను ప్రవేశపెట్టాలా! అని తర్జనభర్జన పడుతున్న బోర్డు సభ్యులకు ముస్లిం భక్తుని విన్నపం, వెదకబోయిన తీగ, శ్రీవారి కృపతో కాలికి తగిలినట్ల నిపించింది. అంతే! బోర్డు సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించి, 1984 సంవత్సరంలో జరిగిన స్వర్ణోత్సవాల సందర్భంగా "అష్టదళ పాద పద్మారాధన" అనబడే, ప్రతి మంగళవారం జరిగే, నయనా నందకరమైన ఆర్జిత సేవను ప్రవేశపెట్టారు. అప్పటినుండి ఈ సేవ నిరాటంకంగా జరుప బడుతోంది.
🙏 పద్మారాధన మహత్యం 🙏
💫 పురాణేతిహాసాల్లో ఉటంకించిన దాని ప్రకారం, గర్భాలయంలో మూలవిరాట్టుకు జరిగే ఈ సేవ అత్యంత మహత్తరమైనది. మన మనస్సనే పద్మాన్ని స్వామివారి పాదపద్మాలకు సమర్పిస్తున్నామనే భావం భక్తులను పరవశింపజేస్తుంది. స్వామివారి పాదాలు, హస్తద్వయం, ముఖము, నేత్రాలు, పద్మంలో ఉన్నటువంటి వక్షస్థల లక్ష్మీ అమ్మవారు సమస్తం పద్మమయమే! వేంకటేశుని ఆ పద్మతత్వం మనలను ధర్మమార్గం వైపు నడిపిస్తుంది. కాబట్టే, ఈ పద్మారాధనకు అంతటి ప్రాముఖ్యం ఉంది.
🌈 ఆరాధనా విధానం 🌈
💫 ఉదయం 6 గం. లకు, వైఖానస అర్చకులు గర్భాలయ మూర్తికి ఆర్ఘ్య, పాద్య, ఆచమనాదులు నిర్వహించడంతో ఈ సేవ మొదలవుతుంది. తరువాత, "శ్రీవేంకటేశాయనమః" అనే ఉచ్ఛారణతో ప్రారంభమైన అష్టోత్తర శతనామావళి పఠనంతో బాటుగా, శ్రీవారి పాదాలకు, ఒక్కో నామానికి ఒక్కో స్వర్ణపద్మ సమర్పణతో అర్చన కొనసాగుతుంది. శ్రీవారి పాదాల ముందుంచిన ఓ ఐదంచెల వర్తులాకార పీఠంపై ఈ పద్మాలను ఒకటొకటిగా ఉంచుతారు. ఈ 108 నామాలలో శ్రీవారి ఘనతనూ, దివ్యచరితనూ, లీలలనూ, పరాక్రమాన్నీ, అవతార విశేషాలను కొనియాడతారు.
🌈 ఐతిహ్యం 🌈
💫 పూర్వయుగాల్లో బ్రహ్మదేవుడు సమస్త దేవగణ సమేతుడై, స్వర్గంలో ప్రవహించే మందాకిని అనబడే గంగానదిలో వికసించే బంగారు పద్మాలతో, స్వామి వారి పాదాలకు అర్చన చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. బ్రహ్మ స్వయంగా విష్ణువు కుమారుడు. అంటే, ఇది కొడుకు తండ్రికి చేసేటటువంటి పాదపూజ. నాడు బ్రహ్మదేవుడు శ్రీకారం చుట్టిన ఈ సేవ నేటికీ తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రాతఃసంధ్యలో, తల్లి తండ్రుల పాద సేవనంతో దినచర్య ప్రారంభించాలని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే స్వయంగా ఆచరణలో చూపించి, యుగ-యుగాలలో తన సంతతి కంతటికీ మార్గదర్శకు డయ్యాడు.
💫 ఈ సేవలో పాల్గొన్న భక్తులందరికీ, శ్రీవారి కటాక్షంతో, అప్లైశ్వర్యాలు చేకూరడంతో బాటు, వంశాభివృద్ధి కలుగును
🙏 సహస్రకలశాభిషేకం 🙏
💫 సప్తగిరి సార్వభౌముని సహస్రకలశాభిషేకం! బుధవార మహోత్సవం - భువన-భూమి వైభవం!
💫 ప్రతి బుధవారం ఉదయం 6 గం. లకు బంగారువాకిలి ముందు ఘంటామండపం లో జరిగే ప్రధాన సేవే సహస్రకలశాభిషేకం. 1511వ సం. కు పూర్వం నుంచే ఈ సేవ జరగుతూ ఉన్నట్లు చారిత్రకాధారాలున్నాయి.
💫 సాధారణంగా, భోగశ్రీనివాసుని అర్చారూపం మూలవిరాట్టు పాదాల వద్ద, కొద్దిగా ఈశాన్యం వైపు తిరిగి ఉంటుంది. స్థానాన్ని "జీవస్థానం" అంటారు (తాత ముత్తాతల నుండి ఉంటున్న స్థానమే జీవస్థానం). ఆ స్థానం లోని భోగశ్రీనివాసుణ్ణి గర్భాలయం నుంచి బయటకు తెచ్చి ఓ చూడ చక్కనైన వేదికపై తూర్పు ముఖంగా వేంచేపు చేస్తారు. మరోప్రక్క ఉత్తరదిక్కుగా, శ్రీదేవి భూదేవీ సహిత మలయప్పస్వామిని వేరొక వేదిక మీద వేంచేపు చేస్తారు. దక్షిణదిశగా, ఆంటే మలయప్పస్వామి వారికి అభిముఖంగా ఉండేట్లు విష్వక్సేనుల వారిని నెలయింప చేస్తారు. ఇలా, మూడు మూర్తులూ అర్థవృత్తాకారంలో, కన్నుల పండువగా సమావేశం అయ్యేటటువంటి అద్భుత ఘట్టం మనకు సహస్రకలశాభిషేక సందర్భంగా గోచరిస్తుంది.
💫 మరో ప్రక్క, ధాన్యపు గింజలతో ఒత్తుగా పరచబడిన పాన్పుపై 1008 వెండి చెంబులను పేర్చి, వాటిని సుగంధద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాలతో నింపి, నాలుగు మూలలా వస్త్రంతో కప్పి, వాటిని మంత్ర పూర్వకంగా ఆవాహన చేస్తారు. మంగళకరంగా ఉండేందుకు గానూ, వీటిపై మామిడాకులు కూడా ఉంచుతారు.
👉 ✅ ఇక్కడో రహస్యం ఉంది!
💫 భోగశ్రీనివాసుడుకి స్నానం చేయిస్తూంటే, ఆ కైంకర్యాలన్నీ గర్భగుడిలో ఉండే వేంకటేశ్వరస్వామి కెలా చేరుతాయి? మూలవిరాట్టుకు అంత శక్తి ఎలా వస్తుంది? గర్భగుడి లోని మూలమూర్తికి ఏ రోజూ 1008 కలశాలతో అభిషేకం జరగట్లేదు కదా? వందల, వేల సంవత్సరాల తరబడి, అనేకానేక భక్తులు శాస్త్రానుసారం, చిత్తశుద్ధితో చేసే సేవల వల్లే దేవతా మూర్తులకు వర్ఛస్సు, తేజస్సు, శక్తి సమకూరుతాయని వైదిక గ్రంథాల్లో చెప్పబడింది.
💫 సహస్రకలశాభిషేకం వల్ల ఉత్సవమూర్తులకు చేకూరే శక్తిని మూలమూర్తికి చేర్చడం కోసం, భోగశ్రీనివాసుణ్ణి మరియు గర్భగుళ్ళోని మూలవిరాట్టును కలుపుతూ ఓ పట్టు దారం కడతారు. దీన్ని అనుసంధాన తోరణం అంటారు. అభిషేకం జరుగుతున్నప్పుడు, ఈ 1008 కలశాల్లో ఉన్నటువంటి అభిషేకజలం యొక్క పవిత్రశక్తి ఈ పట్టుదారం ద్వారా గర్భగుడిలో ఉన్న స్వామివారిలో మమేకమౌతుంది. అప్పుడు శ్రీవారు మరింత శక్తిమంతులై, భక్తులను సంరక్షిస్తూ ఉంటారు.
💫 మనం కూడా ఏవైనా పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు ముంజేతికి కంకణం కట్టుకుంటాం. దీని వల్ల కంకణధారులకు అంతులేని అదృశ్యశక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.
💫 దీనికి ముందుగానే, అర్చామూర్తులను ఉంచే ప్రదేశానికి స్థలశుద్ధి చేసి, మలయప్పస్వామి మరియు ఇద్దరమ్మవార్లకు కంకణధారణ గావిస్తారు. తరువాత విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరుగుతుంది. విష్వక్సేనుడు శ్రీవారి సేనాపతి కావున, ముందుగా ఆయన్ను పూజించే సంప్రదాయం ఉంది. అగ్నిప్రతిష్ఠ చేసి, హోమకార్యక్రమా నంతరం, 1008 రజత కలశాల జలంతో ఉత్సవమూర్తులకు అభిషేకం చేస్తారు. పురుషసూక్తంతో ప్రారంభమై, స్వామివారికి - పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు - ఈ అయిదు ద్రవ్యాలతో, విడి విడిగా అభిషేకం చేస్తారు. ప్రతి ద్రవ్యంతో అభిషేకం జరిగిన తరువాత, మూర్తులు శుభ్రపడం కోసం వాటిని మంచినీటితో స్నాన మాచరింప జేస్తారు. లేత కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేస్తారు.
💫 చివరగా, సహస్రధార పాత్ర, అంటే వెయ్యి రంధ్రాలు గల వెండి పాత్ర (వెండి జల్లెడగా చెప్పుకోవచ్చు) మీదుగా, శంఖధార, చక్రధారలుగా చెప్పబడే ప్రత్యేక పాత్రల ద్వారా జలాభిషేకం జరిపించడంతో, సహస్రకలశాభిషేకం పూర్తవుతుంది. అభిషేక జలం వెయ్యి ధారలతో, స్వామివారి మీద జడివానలా కురుస్తుంటే, చూపరులకు బహుచక్కనైన దృశ్యకావ్యం ఆవిష్కార మవుతుంది. సేవ చివరిగా, పాల్గొన్న భక్తులందరి మీదా అభిషేక జలాన్ని ప్రోక్షిస్తారు. ఈ ఆర్జిత సేవ సమాప్తమవగానే, భక్తులందరినీ శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
💫 ఈ ఆభిషేకం ద్వారా, తేజస్సు, ఓజస్సు, జ్ఞానము, వైరాగ్యం, మేధస్సు లభిస్తాయి. ఇంకా, సకల తీర్థ జలాలతో
💫స్వామివారికి జరిగే అభిషేకం కనులారా దర్శించటం ద్వారా, భక్తులకు పుణ్యనదులు కలిసేటటువంటి సాగరంలో పవిత్రస్నాన మాచరించిన పుణ్యం కూడా కలుగుతుందని ప్రతీతి.
🙏 సర్వేజనాః సుఖినోభవంతు! 🙏
No comments :