🙏 బంగారువాకిలి 🙏
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"
💫 శ్రీవారి ఆలయానికి మూడవది (మొదటిది "మహాద్వారం" లేదా "పడికావలి", రెండవది "వెండివాకిలి" లేదా "నడిమి పడికావలి"), అత్యంత ముఖ్యమైనది అయిన ఈ "బంగారువాకిలి" పేరుకు తగ్గట్లే, పసిడి కాంతులతో తళతళలాడుతూ, లక్ష్మీవల్లభుడైన శ్రీనివాసుని అనంతమైన ఐశ్వర్యాన్ని, వైకుంఠ వైభవాన్ని చాటుతూ ఉంటుంది.
[ Note: చిన్న మనవి: కొన్ని ఆర్జిత సేవలలో పాల్గొనేవారు, విఐపి బ్రేక్ దర్శనం అనుమతి ఉన్న భక్తులు మాత్రమే బంగారువాకిలి దాటి లోనికి ప్రవేశించగలరు. మిగతా భక్తులందరూ,ఇక్కడినుండే, "లఘుదర్శనం" ద్వారా శ్రీవారి దివ్యమంగళరూపాన్ని దర్శించుకుని, మహామణి మంటపానికి దక్షిణంగా ఉన్న కటకటాల ద్వారం నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.]
💫 బంగారువాకిలి గుమ్మం పైభాగాన, గుమ్మానికి ఇరుప్రక్కలా, జయ-విజయుల మధ్యనున్న ప్రదేశమంతా కడు రమణీయమైన పుష్పాలు, లతలు చెక్కబడి బంగారు తాపడంతో మెరుస్తూ ఉంటాయి. ఈ రెండు తలుపులు గళ్ళు - గళ్ళుగా విభజించబడి, ప్రతి గడిలోనూ ఒక్కో అద్భుతమైన ప్రతిమ అచ్చెరువు గొల్పుతూ ఉంటుంది. సుదర్శనచక్రం, శ్రీవేంకటేశ్వరుడు, మహావిష్ణువు, పాంచజన్యం, వాసుదేవుని విభిన్నరూపాలు, కేశవుని ద్వాదశమూర్తులు (కేశవుడు, నారాయణుడు, మాధవుడు, గోవిందుడు, విష్ణువు, మధుసూదనడు, త్రివిక్రముడు, వామనుడు, శ్రీధరుడు, హృషీకేశుడు, పద్మనాభుడు, దామోదరుడు), దశావతారరాలు కన్నులకింపుగా చెక్కబడి, సాక్షాత్తూ వైకుంఠమే ఇక్కడికి చేరుకున్నట్లుగా గోచరిస్తుంది. పై గడపకు ఇరుపార్శ్వాలలో గజరాజులచే పూజింపబడుతున్న గజమహాలక్ష్మి పద్మాసీనురాలై ఉంటుంది.
💫 బంగారువాకిళ్ళను సుప్రభాత సమయంలో "కుంచెకోల" అనే పరికరంతో, జియ్యంగార్లు, అర్చకులు, ఆలయ అధికారుల వద్దనున్న తాళంచెవులతో అందరి సమక్షంలో తెరిచే విస్తారమైన ప్రక్రియను మనం "సుప్రభాతసేవ" లో తెలుసుకున్నాం.
💫. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమలకు చేరుకున్న భక్తులు, పూటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉండి, మ్రొక్కుబడులు చెల్లించుకుని, బంగారువాకిలి వెలుపలి నుండే క్షణకాల దర్శనంతో సంతృప్తిపడి, శ్రీనివాసుని దివ్యమంగళమూర్తి నుండి దృష్టి మరల్చుకోలేక, రెప్పవేస్తే కన్నుల ముందున్న పెన్నిధి కనుమరుగవుతుందేమోనన్న బెంగతో, అతికష్టం మీద ముందుకు సాగిపోతారు.
💫 స్వామివారిని ఎన్నెన్నో కోర్కెలు కోరుదామని వచ్చిన భక్తులు ఆనందాతిశయంతో, భక్తిపారవశ్యంతో, తన్మయంతో తమను తాము మైమరచిపోతారు.
మనం కోరుకోగలిగింది అత్యల్పం, స్వామివారు ప్రసాదించ గలిగింది అనంతం! భక్తుని మానసం భగవంతు డెరుగడా?
💫 కొండంత దేవుడిని కోటి కోర్కెలతో కష్టపెట్టకుండా, క్షణకాల దర్శనంలో ఆ చిన్మయానంద రూపాన్ని గుండె గుడిలో పదిలంగా కొలువుంచు కోవడం శ్రేయస్కరం!
🌈 స్నపనమండపం 🌈
💫 బంగారువాకిలి దాటగానే మనం మొట్టమొదటగా ప్రవేశించే ఓ ఇరుకైన, చిరుచీకటిగా వుండే నాలుగుస్తంభాల మంటపమే "స్నపనమండపం." ఈ మంటపం యొక్క శిలాస్తంభాలపై వివిధ ఆకృతుల్లో ఉన్న శ్రీకృష్ణుని, యోగానరసింహుని శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. 614వ సంవత్సరం నందు, ఆలయానికి మరమ్మత్తులు జరుగుతున్న సమయంలో, పల్లవరాణి "సామవై" మూలమూర్తికి నకలుగా భోగశ్రీనివాసమూర్తి వెండి ప్రతిమను చేయించి, ఈ మంటపంలో ప్రతిష్ఠ చేయించి నందున, దీన్ని "బాలాలయం" అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం కొలువు శ్రీనివాసమూర్తికి ప్రతినిత్యం తెల్లవారు ఝామున జరిగే "దర్బారు" ఈ మంటపంలోనే నిర్వహింప బడుతుంది. స్వామివారికి అలంకరించే అమూల్యమైన ఆభరణాలన్నీ ఈ మండపంలోని బీరువాలలో, అర్చకులు, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో భద్రపరుస్తారు. శ్రీవారి ఆభరణాల గురించి ముందు ముందు వివరంగా తెలుసుకుందాం.
🌈 రాములవారి మేడ 🌈
💫 స్నపనమంటపం దాటగానే మనం మరో ఇరుకైన మంటపంలోకి ప్రవేశిస్తాం. ఈ మండపంలో దక్షిణం వైపున ఉన్న అరుగుపై – ఉత్తరాభిముఖంగా సీతారామలక్ష్మణులు; రాములవారి పరివార దేవతలైన హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు - కొలువై ఉండేవారు. అలాగే, ఉత్తరం వైపున ఉన్న అరుగుమీద, దక్షిణాభిముఖంగా శ్రీవేంకటేశ్వర పరివార దేవతలైన — గరుత్మంతుడు, విష్వక్సేనుడు, అనంతుడు – కొలువై ఉండేవారు. ఎప్పటినుంచో రామపరివారం వేంచేసి ఉండటం వల్ల ఈ మంటపాన్ని "రాములవారి మేడ" గా వ్యవహరిస్తారు.
💫 కాలాంతరంలో, సీతారామలక్ష్మణుల విగ్రహాలను గర్భాలయంలోకి, మిగిలిన మూర్తులన్నింటిని విమానప్రదక్షిణ మార్గంలోనున్న "అంకురార్పణ మంటపం" లోనికి తరలించారు. ఈ మండపం గురించి తరువాత తెలుసుకుందాం.
💫 రాత్రి ఏకాంతసేవ సమయంలో తాళ్లపాక వంశీయులు రాములవారిమేడ నుండే తుంబురనాదం వినిపిస్తూ జోలపాట పాడుతారు. 13వ శతాబ్దానికి పూర్వం, ఈ మంటపం ముక్కోటి ప్రదక్షిణమార్గంలో కలిసిపోయి, నాలుగో ప్రదక్షిణ మార్గంగా ఉండేది. తరువాత ఇరుపార్శ్వాలలో గోడలు నిర్మించడం వల్ల, ఇదో మంటపమై పోయింది.
🌈 శయనమండపం 🌈
💫 రాములవారి మేడ దాటగానే శయనమండపం లోనికి ప్రవేశిస్తాం. గర్భాలయానికి అనుసంధానించి, దానికి ఎదురుగా ఉండే ఈ మండపాన్ని ఆగమశాస్త్ర పరిభాషలో "అంతరాళం" గా పిలుస్తారు. ఈ మంటపం శ్రీవారికి శయనమంటపంగా మరియు భోజనశాలగా కూడా ఉపయోగపడుతుంది. వెన్న, పాలు, పెసరపప్పు (వడపప్పు), స్వామివారికి తొలినైవేద్యంగా సమర్పించబడే మాత్రాన్నం మరియు అతికొద్ది ముఖ్యమైన ప్రసాదాలు తప్ప, మిగిలిన సమస్త ప్రసాదవిశేషాలను శయనమంటపం నుంచే స్వామివారికి నివేదిస్తారు. ఈ మంటపంలోనే భోగశ్రీనివాసమూర్తిని, వెండి గొలుసులతో వ్రేలాడ దీయబడిన బంగారు పట్టెమంచం పైనున్న పట్టుపరుపుపై శయనింపజేసి, ఏకాంతసేవ జరుపుతారు. తోమాలసేవ సమయంలో ఆళ్వారుల దివ్యప్రబంధగానం, శ్రీసూక్తపురుషసూక్త పఠనం, ఈ మండపం నుండే జరుగుతాయి. తోమాలసేవ, సహస్రనామార్చన, అష్టదళ పాదపద్మారాధన, శుక్రవారాభిషేకం వంటి ప్రముఖమైన ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు మాత్రమే శయనమంటపంలో కూర్చుని తనివితీరా స్వామివారిని దర్శించుకునే భాగ్యం దక్కుతుంది. ఇంత సమీపం నుండి స్వామివారిని వీక్షించుచుకునే మహదవకాశం, అత్యంత అరుదుగా మాత్రమే లభిస్తుంది.
🌈 కులశేఖరపడి 🌈
💫 పన్నెండుమంది ఆళ్వార్లలో ఒకరైన "కులశేఖరాళ్వార్", 767వ సం., కుంభమాసాన, పునర్వసు నక్షత్రంలో, కేరళదేశము నందలి "కళి" అనే పట్టణంలో, "దృఢవ్రతుడ" నే రాజుకు, శ్రీమహావిష్ణువు యొక్క కౌస్తుభరత్నాంశతో జన్మించారు.
💫 104 పాటలతో ఆయన రచించిన "పెరుమాళ్ తిరుమొళి" అనే గీతమాలికలోని 11 పాటలలో తిరుమలేశుణ్ణి వర్ణించబడింది. లోకప్రసిద్ధమైన ఈ పాటలను విని, ఆనందపరవశులై తిరుమలేశుని దర్శనార్థం వేంకటాచలానికి వచ్చిన భక్తులు ఎందరో ఉన్నారు. ఒక పాశురంలో ఆయన స్వామివారిని ఈ విధంగా వేడుకొన్నారు:
పడియాయ్ కెడందు ఉన్
పవళవాయ్ కాన్ బేనే"
💫 అంటే, "ఓ వెంకటేశా! నీముందు రాతిగడపగా పడి ఉన్నట్లైతే నీ ముఖారవిందాన్ని నిత్యం దర్శించుకోవచ్చు కదా!" భగవద్భక్తి పూరితమైన 'ముకుందమాల' అనే గ్రంథాన్ని కూడా ఈయన రచించారు.
💫 ఈ చిన్ని పదబంధంతో కులశేఖరుని ఆర్తిని, ఆకాంక్షను, భావోద్వేగాన్ని, శ్రీవారి పట్ల వారికుండే అనన్య భక్తిని అవగతం చేసుకోవచ్చు. ఆయన కోరికను తీర్చటానికా అన్నట్లు, స్వామివారికి అత్యంత సమీపంలో ఉండే గడప "కులశేఖరపడి" గా పిలువ బడుతుంది. "పడి" అనగా "గడప" లేదా "మెట్టు" అని అర్థం.
💫 ఈ గడపకు పైన, క్రింద, ఇరుపార్శ్వాల యందు బంగారు తాపడం చేయబడి ఉంటుంది. స్వామివారి వైఖానస ఆగమ అర్చకులు మరియు జియ్యంగార్లకు తప్ప, వేరెవ్వరికీ ఈ గడప దాటి గర్భాలయం లోనికి ప్రవేశించే అధికారం లేదు. కోటీశ్వరులైనా, దేశాధినేతలైనా, ఈ గడప వెలుపలనుండి వెనుదిరిగాల్సిందే!
🌈 గర్భాలయం 🌈
💫 కులశేఖరపడికి లోపల, స్వామివారి మూలమూర్తి కొలువై ఉండే ఇరుకైన ప్రదేశమే "గర్భాలయం". దీన్నే "ఆనందనిలయం" గా కూడా వ్యవహరిస్తారు. బంగారు తాపడం కలిగిన ఆనందనిలయ "విమానం" లేదా "గోపురం" ఈ గర్భాలయం ఉపరితలం పైనే ప్రతిష్ఠించబడి ఉంటుంది.
💫 చారిత్రక ఆధారాల ననుసరించి, ఈ గర్భాలయం 900వ సంవత్సరానికి పూర్వమే నిర్మించబడగా, మిగిలిన కట్టడాలన్నీ 11వ శతాబ్దా నంతరమే, అంచెలంచెలుగా రూపు దిద్దుకున్నాయి.
💫 సంవత్సరానికి నాలుగు మార్లు జరిగే "కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం" ఆర్జిత సేవలో భాగంగా, గర్భాలయ అంతర్భాగాని కంతటికీ సుగంధద్రవ్యాల మిశ్రమమైన "పరిమళం" అనబడే పదార్థాన్ని పూయడం ద్వారా, గాలివెలుతురు లేకపోయినప్పటికీ, గర్భాలయం అంతటా, ఏ విధమైన క్రిమి-కీటకాలు లేకుండా, సువాసనలతో గుబాళిస్తుంది.
💫 ఈ గర్భాలయం, పన్నెండు అడుగుల తొమ్మిది అంగుళాల పొడవు, వెడల్పులతో చతురస్రంగా ఉంటుంది. గర్భాలయానికి ఆగమశాస్త్రం అనుమతించిన అత్యధిక వైశాల్యం ఇదే! స్వామివారు స్ఫురద్రూపు లవ్వడంచేత, వారికి తగ్గట్లుగా ఇంత విశాలమైన గర్భాలయం నిర్మించబడింది.
💫 పల్లవరాజుల కాలంలో నిర్మింపబడిన ఆలయాలన్నింటిలో గర్భాలయగోడలు దాదాపు మూడు-నాలుగు అడుగుల మందం కలిగి ఉంటాయి. దానికి భిన్నంగా, శ్రీవారి గర్భాలయ కుడ్యాలు ఏడు అడుగులకు పైగా మందం కలిగి ఉన్నాయి. వివిధ రాజుల కాలంలో స్వామివారి గర్భాలయానికి చుట్టూ ఉన్న అసలు గోడను అనుసంధానించి వేర్వేరు లక్ష్యాలతో కొత్త గోడలు నిర్మించుకుంటూ పోవడమే దీనికి కారణం. అంతకు ముందు (వెలుపలి గోడ నిర్మించక ముందు), ఈ గర్భాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ మార్గం కూడా ఉండేది.
💫 గర్భాలయం పైకప్పు క్రిందుగా, మూలమూర్తి పై భాగంలో "కురాళం" అనబడే మఖమల్ వస్త్రం ఎప్పుడూ కట్టబడి ఉంటుంది. దీనిని సంవత్సారానికి నాలుగు సార్లు మార్చుతారు. అలాగే, మూలమూర్తి వెనుక ఉండే పరదాను, ప్రతి శుక్రవారాభిషేకానికి ముందురోజున మార్చుతారు.
💫 గర్భాలయంలో మూలవిరాట్టుతో పాటుగా భోగశ్రీనివాసుడు, శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి, కొలువుశ్రీనివాసుడు, ఉగ్రశ్రీనివాసుడు కూడా కొలువై ఉంటారు. ఈ పంచబేరాలకు తోడుగా సీతారామలక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణుల పంచలోహ విగ్రహాలు కూడా వేంచేసి ఉంటాయి. ఒక్క మూలవిరాట్టు తప్ప, మిగిలిన మూర్తులన్ని తరువాతి కాలంలో గర్భాలయంలో చేర్చబడినవే!
💫 స్వామివారికి ఎదురుగా, గర్భాలయం లోపల, ఆగ్నేయ ఈశాన్య మూలల్లో, ఎల్లవేళలా నేతిదీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. మొట్టమొదటిసారిగా ఈ దీపాలను బ్రహ్మదేవుడు వెలిగించటం వల్ల వీటిని "బ్రహ్మ అఖండం" గా పిలుస్తారు.
💫 గర్భాలయంలో స్వయంవ్యక్తమై, చరిత్రకందని కాలం నుండి పూజల నందుకుంటున్న మూలమూర్తి గురించి, తర్వాతికాలంలో చేర్చబడిన సీతారామలక్ష్మణులు, రుక్మిణి శ్రీకృష్ణ ప్రతిమల గురించి, విమానప్రదక్షిణ మార్గంలో ఉన్న మరికొన్ని విశేషాలగురించి తెలుసుకుందాం.
మనం బంగారువాకిలిలో నుంచి స్నపనమంటపం, రాములవారిమేడ దాటుకుని, శయనమంటపం లోకి ప్రవేశించి, కులశేఖరపడి ఆవల నిలబడి, మూలమూర్తి దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం.
No comments :