🙏 పక్ష, మాసోత్సవాలు
🌈 పక్షోత్సవాలు 🌈
💫 శ్రీవారికి ప్రతి ఏకాదశి నాడూ పక్షోత్సవం జరుగుతుంది. ఆనాడు విశేష ఉత్సవాలు, ఊరేగింపులు ఉండవు. అయితే, నివేదనలో మాత్రం ప్రత్యేకంగా దోశెలు, సుండలు (గుగ్గిళ్ళు) సమర్పించ బడతాయి.
🌈 మాసోత్సవాలు
💫 శ్రీవారి ఆలయంలో ప్రతి నెలా ఆయా నక్షత్ర దినాల్లో విశేషంగా కొన్ని ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని నక్షత్రోత్సవాలు గా కూడా పిలుస్తారు. నెలకు ఒక్కసారే వస్తాయి కనుక వీటిని మాసోత్సవాలు గా కూడా పిలుస్తారు. వీటిలో ముఖ్యమైనవి అయిదు.
🌈 1. రోహిణీ నక్షత్రోత్సవం
💫 ప్రతినెలా శ్రీకృష్ణుని జన్మ నక్షత్రమైన రోహిణి నక్షత్రం నాటి ఉదయం, సుప్రభాతానంతరం, భోగశ్రీనివాసునితో పాటు గర్భాలయం లోని రుక్మిణీ-శ్రీకృష్ణులకు కూడా అభిషేకం జరుగుతుంది. ఆరోజు సాయంత్రం, శ్రీకృష్ణుడు, రుక్మిణీ సమేతంగా ఆలయం వెలుపలకు వేంచేసి, సహస్రదీపాలంకరణ సేవలో పాల్గొంటారు. పిదప, మాడవీధుల్లో ఊరేగి ఆలయప్రవేశం చేస్తారు. ఈ సేవలో పాల్గొన్న ఇరువది ఏడు నక్షత్రాల వారందరికీ, విశేషంగా రోహిణీ నక్షత్రం వారికీ, నక్షత్ర శాంతి జరిగి, దోష విముక్తు లవుతారు.
🌈 2. ఆర్థా నక్షత్రోత్సవం
💫 శ్రీ భగవద్రామానుజుల వారి అవతార నక్షత్రమైన ఆర్ద్ర నక్షత్రం నాటి సాయంసంధ్యలో శ్రీమలయప్పస్వామి వారు సహస్రదీపాలంకరణ సేవలో పాల్గొంటారు. ఆరోజు భగవద్రామానుజుల వారు మరో పీఠాన్ని ఎక్కి శ్రీస్వామివారికి అభిముఖంగా, స్వామివారికి స్వాగతం పలుకుతున్నట్లుగా, తిరుమల మాడ వీధుల్లో ఊరేగింపబడతారు. మేషమాసంలో ప్రత్యేకంగా, ఆర్ద్ర నక్షత్రానికి పది రోజుల ముందు నుండీ, భాష్యకార్ల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆ పది రోజులూ స్వామివారికి అభిముఖంగానే రామానుజాచార్యుల వారు ఊరేగింపబడతారు. ఆలయంలో, భాష్యకార్ల సన్నిధి యందు స్వామివారికి ఆస్థానం జరుపబడుతుంది. నివేదనానంతరం, స్వామివారి పూలమాలలు రామానుజాచార్యుల వారికి సమర్పిస్తారు. అలాగే, స్వామివారి శేషహారతి రామానుజులకు ఇవ్వబడుతుంది. ఈ దర్శనంతో, ఇరవయ్యేడు నక్షత్రాలవారికీ, ముఖ్యంగా ఆర్ద్ర నక్షత్ర సంజాతులకు, నక్షత్ర శాంతి జరిగి శుభం చేకూరుతుంది.
🌈 3. పునర్వసు నక్షత్రోత్సవం
💫 శ్రీరాముని జన్మనక్షత్రం పునర్వసు. ప్రతినెలా పునర్వసు నక్షత్రదినాన, సుప్రభాతానంతరం, భోగశ్రీనివాసునితో పాటుగా, శ్రీసీతారామలక్ష్మణులకు కూడా అభిషేకం జరుగుతుంది. శ్రీరామనవమి రోజూ, ఆ మరునాడైన దశమి రోజూ, బంగారువాకిలి ముందు శ్రీసీతారామలక్ష్మణులకు ఆస్థానం జరుగుతుంది. ఆ సాయంత్రం జరిగే సహస్రదీపాలంకరణ సేవలో, శ్రీసీతారామలక్ష్మణులు, శ్రీదాసాంజనేయస్వామి మాత్రమే పాల్గొంటారు. అనంతరం, తిరుమల పుర వీధుల్లో ఊరేగింపు జరిగిన తరువాత, శ్రీసీతారామలక్ష్మణులు శ్రీ బేడీ ఆంజనేయస్వామివారి సన్నిధికి వేంచేస్తారు. రాములవారి పూలమాలలను ఆంజనేయుడికి సమర్పించిన తరువాత, వారికే శేషహారతి కూడా ఇవ్వబడుతుంది. పిదప, శ్రీసీతారామలక్ష్మణులు ఆలయ ప్రవేశం చేసి యథాస్థానంలో ఆసీనులవుతారు. ఈ సేవలో పాల్గొనడం ద్వారా, 27 నక్షత్రాలవారికీ, విశేషంగా పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికీ నక్షత్ర శాంతి జరుగుతుంది.
👉 [బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించిన విశేషాల్ని ఈరోజే, రాబోయే ఉపప్రకరణంలో తెలుసుకుందాం.]
"రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలము లియ్యగలిగె నిందరికి!!...
తలప శబరి పాలి తత్త్వపు రహస్యము
అలరి గుహుని పాలి ఆదిమూలము
కలడన్న వారి పాలి కన్ను లెదుటి మూరితి
వెలయ శ్రీ వేంకటాద్రి విభుడీతడు!!"
🌈 4. శ్రవణా నక్షత్రోత్సవం
💫 శ్రీవేంకటేశ్వరస్వామి శ్రవణానక్షత్ర పుణ్యదినాన అవతరించారు. వేంకటేశునికి అభిన్నుడైన ఆదివరాహుడు కూడా శ్రవణానక్షత్ర సంజాతుడే! శ్రవణా నక్షత్రం ఉదయాన, భోగశ్రీనివాసునితో పాటుగా, ఉభయ నాంచారులతో కూడిన మలయప్పస్వామికి అభిషేకం జరుగుతుంది. ఆరోజు పగటి సేవలన్నీ సమాప్తం అయిన తరువాత, మలయప్పస్వామివారు దేవేరులతో సహా, సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవలో పాల్గొన్న పిదప పురవీధుల్లో ఊరేగి, ఆలయంలో పునఃప్రవేశం చేస్తారు. కొన్ని మాసాల్లో, శ్రీవారి అవతార నక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో విశేషపూజలు జరుగుతాయి. ప్రతి కన్యారాశిలో, శ్రవణా నక్షత్రం నాటికి ముగిసేటట్లుగా, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ తరువాత వచ్చే కార్తీకమాసంలోని శ్రవణానక్షత్రం రోజున, స్వామివారికి కన్నుల పండువగా, పుష్పయాగోత్సవం నిర్వహిస్తారు.
🌈 5. పున్నమి గరుడసేవ
💫 వివిధ నక్షత్రోత్సవాలే కాకుండా, ప్రతి నెలా, ప్రతి పున్నమిరాత్రీ తిరుమలేశునికి పున్నమి గరుడసేవ జరుప బడుతుంది.
💫 ఆ రోజు సాయంకాలం ఏడు గంటలకు, వజ్రకవచ, వజ్రకిరీటధారీ, సర్వాలంకరణ భూషితుడైన శ్రీమలయప్పస్వామి వారు గరుడునిపై వేంచేసి, ఛత్రచామరాలతో, గజ, తురగ, వషభరాజాలతో, తిరువీధుల్లో విహరిస్తారు.
🌈 బేడీ ఆంజనేయుని సన్నిధి
💫 త్రేతాయుగంలో శ్రీరామునికీ-శ్రీ ఆంజనేయునికీ ఉన్న ఆత్మీయతానుబంధం కలియుగంలోనూ కొనసాగుతోంది. దాస్యభక్తికి ప్రతిరూపమైన ఆంజనేయుడు, ముకిళిత హస్తాలతో, శృంఖలాబద్ధుడై, స్వామివారి మహాద్వారానికి ఎదురుగా, సమున్నతంగా, అఖండానికి చేరువగా ఉన్న ఓ మందిరంలో దర్శనమిస్తారు. దీనినే బేడీ ఆంజనేయస్వామి ఆలయం గా వ్యవహరిస్తారు.
💫 ఆంజనేయుడికి ఈ పేరు రావడం వెనుక అనేక కథనాలు వెలుగులో ఉన్నాయి.
💫 పూర్వం సప్తగిరులలో ఒకటైన అంజనాద్రిపై, అంజనాదేవి, తనయుడైన ఆంజనేయుడు పసి బాలునిగా ఉన్నప్పుడు, అతనితో కలిసి నివసించేది. చిన్నారి ఆంజనేయుడు చిలిపితనంతో ఒక ఒంటె వెనుక అల్లరిగా పరుగెడుతుండే వాడు (ఒంటెను ఆంజనేయస్వామి వాహనంగా పేర్కొంటారు). విసుగెత్తిన అంజనాదేవి తన కుమారుణ్ణి ఇప్పుడీ ఆలయం ఉన్న ప్రదేశంలో శృంఖలాబద్ధుణ్ణి గావించి, తాను తిరిగి వచ్చేంత వరకూ అక్కడే ఉండమని ఆజ్ఞాపించి, తపస్సు నిమిత్తం ఆకాశగంగ తీర్థానికి ఏతెంచింది. కారణాంతరాల వల్ల, ఆమె తిరిగి రాలేకపోయింది. ఆజ్ఞాబద్ధుడైన ఆంజనేయుడు, తల్లి రాక కోసం ఎదురు చూస్తూ, ఇంకా ఆ ప్రదేశంలోనే, స్వామివారికి నమస్కరిస్తూ నిలబడి ఉన్నాడు. ఆ విధంగా, అచంచల రామభక్తికే కాదు, మాతృవాక్య పరిపాలనకు కూడా ఆంజనేయుడు ప్రఖ్యాతి గాంచాడు.
💫 మరో కథనం ప్రకారం, భేరీ అనే ఉత్తరభారత పదానికి "సమ్ముఖం" అని అర్థం. స్వామి వారి సమ్ముఖంలో ఉన్నాడు గనుక 19వ శతాబ్దంలో తిరుమల క్షేత్రం ఉత్తర భారతదేశానికి చెందిన మహంతుల ఆధ్వర్యంలో ఉన్నపుడు, ఈ ఆంజనేయుడిని భేరీ ఆంజనేయుడిగా పిలిచేవారు. అదే కాలక్రమంలో, బేడీ ఆంజనేయుడిగా రూపాంతరం చెందింది.
💫 ఇంకా, అనేక ఆసక్తి కరమైన కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
💫 తిరుమలలో, స్వామివారి ఆలయం, ఆదివరాహస్వామి ఆలయం తరువాత అత్యంత ప్రసిద్ధి చెందినది ఈ ఆలయమే! ఈ ఆలయం గర్భాలయం, ముఖమండపం అని రెండు భాగాలుగా నిర్మించబడింది. గర్భాలయంలో, గోడవారకు మధ్యలో ఆరడుగుల నిలువెత్తు ఆంజనేయుడు ప్రతిష్ఠింపబడ్డాడు. గర్భాలయంపై ఏక కలశ గోపురం నిర్మింపబడింది. దీనికి నాలుగు మూలలా, సింహాల ప్రతిమలు అమర్చబడి ఉన్నాయి. ఆలయం చుట్టూ ప్రదక్షిణ మార్గంకూడా ఉంది. ప్రతిరోజూ మూడు పూటలా, స్వామివారి నివేదనానంతరం, స్వామివారి ఆలయం నుండి వచ్చిన అన్న ప్రసాదాలతో ఆంజనేయునికి నైవేద్యం జరుగుతుంది.
💫 బ్రహ్మోత్సవాలలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు, బేడీ ఆంజనేయుడి ఆలయం నుండి ఊరేగింపుగా వెళ్ళి శ్రీవేంకటేశునికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
💫 అంజనాదేవి తపస్సు ముగించుకొని ఎప్పుడు వస్తుందో? పాపం! ఆంజనేయుడికి ఈ బేడీల నుండి ఎప్పుడు విముక్తి కలుగుతుందో?
💫 అంతా, శ్రీనివాసుని చిద్విలాసం!
💫 ఉభయులూ, ఒకరిని విడిచి వేరొకరు ఉండలేక, జన్మజన్మలకూ ఈ సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారేమో?
"కలశాపురముకాడ గంధపుమాకులనీడ -
లరేవు మేలు మేలు హనుమంతురాయ....
దిక్కులు గెలిచితివి ధీరత బూజ గొంటివమిక్కిలి ప్రతాపాన మెరసితివి
ఇక్కువతో శ్రీవేంకటేశ్వరుబంటు వైతివి హనుమంతరాయ"
💫 శ్రీవారి దర్శనం ముగించుకోగానే, మనం సాధారణంగా, మాడవీధుల ప్రక్కనే ఉన్న తరిగొండ వెంగమాంబ సత్రం లో ఉచిత భోజనం చేసి, అదే శ్రీవారి మహాప్రసాదంగా భావిస్తాము. ప్రతిరోజూ సుమారు లక్ష మందికి, అదే బ్రహ్మోత్సవాల్లో రెండు లక్షల మందికి, వండి వడ్డించే, "నభూతో నభవిష్యతి" అన్న చందంగా ఉండే ఈ భోజనశాలకు ఆ భక్తురాలి పేరెందుకు పెట్టారు?
No comments :