పంచ బేరాలు
💫 మొట్టమొదటగా పరమపావనమైన ఆనందనిలయం, అనగా తిరుమల క్షేత్రం నందలి ప్రధానాలయపు గర్భాలయం, లోని "పంచబేరాలు" గా పిలువబడే శ్రీవేంటేశ్వరుని ఐదు రూపాల గురించి తెలుసుకుందాం.
💫 సకల లోక కళ్యాణ కారకుడైన శ్రీవేంకటేశ్వరుని రూపాంతరాల స్మరణతో "తిరుమల సర్వస్వం" ప్రారంభమవ్వటం మంగళదాయకంగా భావించి, తొట్టతొలి ప్రకరణాన్ని శ్రీనివాసుని "పంచబేరాల" కు అంకితమివ్వడం జరిగింది. ఆనందనిలయంలో కొలువై, పంచబేరాలు గా పేర్గాంచిన శ్రీనివాసుని ఇదు దివ్యమంగళ స్వరూపాలు ఈ విధంగా పిలువ బడుతాయి.
🙏 ధ్రువబేరం
🥀 మూల విరాట్టు
🙏 అనిరుద్ధబేరం
🥀 కొలువు శ్రీనివాసుడు
🥀 దర్బారు శ్రీనివాసుడు
🥀 అళగిప్పిరాన్
🙏 కౌతుకబేరం
🥀 పురుష బేరం
🥀 భోగ శ్రీనివాసుడు
🥀 మనవాళ పెరుమాళ్
🙏 స్వపనబేరం
🥀 అచ్యుతబేరం
🥀 ఉత్సవ శ్రీనివాసుడు
🥀 స్వపనమూర్తి
🥀 ఉగ్ర శ్రీనివాసుడు
🙏 ఉత్సవబేరం
🥀 మలయప్పస్వామి
🙏 మూలవిరాట్టు 🌈
💫 సుమారు వెయ్యేళ్ళ క్రితం, చరిత్రకు అందనట్టి ప్రాచీనకాలం నుండి తిరుమల శిఖరంపై విరాజిల్లుతున్న ఈ ప్రతిమ శివుడిదా! లేదా అమ్మవారిదా! లేదా విష్ణువుదా! అనే వివాదం నెలకొన్నది. ఆ సమయంలో శ్రీమద్రామానుజుల వారు బంగారు శంఖు చక్రాలు తయారు చేయించి, వాటిని తన భక్తితత్పరతతో స్వామివారి ఉభయహస్తాలలో శ్రీవారి చేతనే స్వయంగా ధరియింప జేసి ఆ ప్రతిమ శ్రీమహావిష్ణువు కలియుగావతారమైన శ్రీవేంకటేశ్వరునిదేనని నిర్ద్వంద్వంగా, తర్కపూరితంగా నిరూపించారు.
💫 కుడి వక్షఃస్థలంలో అమ్మవారితో, చతుర్భుజాలతో, శంఖు చక్రాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వుండే స్వామి ఇక్కడ స్వయంగా వెలిశారు. మూలవిరాట్ నే ధ్రువబేరం ( స్థిరంగా వుండే విగ్రహం) అని కూడా వ్యవహరిస్తారు.
💫 తొమ్మిదిన్నర అడుగుల ఎత్తుతో సమున్నతంగా ఉండే స్వామివారి యజ్ఞోపవీతంలో ఒక ప్రోగు తెగి వుంటుంది. ప్రలంభాసురునితో ప్రచండయద్ధం జరిగినప్పుడు ఆ ప్రోగు తెగి పోయిందని ప్రసిద్ధి. శ్రీవారికి నాగాభరణంతో బాటుగా అనేక స్వర్ణాభరణాలు అలంకరించబడి వుంటాయి.
💫 మొదట్లో సన్నగా ఉండే తిరునామం రామానుజాచార్యుల వారి హయాం నుండి ప్రస్తుతం మనకు కనపడే వెడల్పాటి ఊర్థ్వపుండ్రంగా రూపాంతరం చెందింది. ఈ తిరునామానికి మామూలు రోజుల్లో 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులాల కస్తూరి వినియోగిస్తారు. అదే బ్రహ్మోత్సవాల్లో దీనికి రెండింతల పదార్థాన్ని ఉపయోగిస్తారు.
💫 స్వామివారు కుడి, వరదహస్తంతో (అంటే వరాలనిచ్చే హస్తం), ఎడమ, కటిహస్తంతో (అంటే నడుము భాగంలో చేర్చబడిన చేయి) దర్శనమిస్తారు. స్వామివారి పాదపద్మాలు పద్మపీఠంపై విరాజిల్లు తుంటాయి. "సూర్యకఠారి", లేదా "నందకం", అనే ఖడ్గాన్ని నడుము క్రింది భాగం నుంచి ధరించి వుంటారు.
💫 దాదాపు 120 సంవత్సారాలు జీవించి స్వామివారి సేవలో పునీతుడైన రామానుజాచార్యుల వారి గురించి మున్ముందు సవివరంగా తెలుసుకుందాం. అలాగే, స్వామివారి మూలవిరాట్టు ఆవిర్భావం, స్వరూప స్వభావాల గురించి కూడా ఆనందనిలయాన్ని వివరిస్తున్నప్పుడు సవిస్తారంగా వర్ణించుకుందాం.
🙏 కొలువు శ్రీనివాసుడు 🌈
💫 ఈ శ్రీనివాసుడినే, "దర్బారు శ్రీనివాసుడు", అనిరుద్ధబేరం, అళగిప్పిరాన్ అని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఈ స్వామి బంగారువాకిలి దాటి బయటకు రారు. వీరు ఆదాయం, పద్దులు, లేఖిక, దర్బారు, బలిబేరం (నైవేద్యం ) స్వీకరిస్తారు.
💫 826వ సం. నాటిదిగా భావింపబడే ఈ విగ్రహం ఆనందనిలయం లోనికి ఎలా వచ్చిందో చెప్పటానికి చారిత్రక ఆధారాలు లేవు. ప్రతి రోజూ తోమాలసేవ (తోమాలు అనగా పూలు) అనంతరం దర్బారుసేవ నిర్వహిస్తారు. అంటే - ఆ రోజు తిథి, వార, నక్షత్రాలు, ముందురోజు ఆదాయం ఎంత వచ్చింది – ఆ లెక్కలన్నీ స్వామి వారికి చెబుతారన్న మాట. ఇంగ్లీషు తేదీల ప్రకారం కూడా పంచాంగాన్ని వినిపిస్తారు. తరువాత నైవేద్యం సమర్పించి మరునాటి తిథి, వార, నక్షత్రాలు వినిపిస్తారు. నిత్యాన్నపథకానికి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు కూడా స్వామివారికి మనవి చేస్తారు. బొక్కసం (లెక్కల) గుమస్తా, అర్జిత సేవలవల్ల, ప్రసాద విక్రయాల ద్వారా, హుండీ కానుకలుగా వచ్చిన వెండి, రాగి, బంగారం ఇతర లోహ పాత్రలు, నగలు వగైరాలను; రొఖ్ఖ రూపంలో వచ్చిన కానుకలను పైసలతో సహా లెక్కగట్టి స్వామి వారికి వినిపించి; సాష్టాంగ నమస్కారం చేసి శెలవు తీసుకుంటారు. ప్రతి రోజూ ఉదయం 4.30 గం. లకు ప్రారంభమయ్యే ఈ సేవను ఆలయ ప్రాంగణంలో కూర్చొని వీనులవిందుగా విని తరించవచ్చు. ఈ కార్యక్రమం అంతా బంగారువాకిలికి ఆనుకుని వున్న 'స్నపనమండపం' లో జరుగుతుంది. ఇది పూర్తిగా ఏకాంతసేవ.
🙏 భోగశ్రీనివాసుడు 🌈
💫 మూలవిరాట్ కు ఎడమవైపు వున్న బేరం (మూర్తి లేదా ప్రతిమ) "భోగశ్రీనివాసుడు". సామాన్య శకం 624 సం. లో పల్లవరాణి 'సామవై' అనే మహాభక్తురాలు ఈ వెండి ప్రతిమను చేయించింది. మరికొందరు శాస్త్రకారుల అంచనా ప్రకారం ఈ విగ్రహం సామాన్యశకం 966వ సం. లో చేయించబడింది.
💫 ఒకటిన్నర అడుగుల ఎత్తుతో ముగ్ధమనోహరంగా ఉండే ఈ మూర్తిని, కౌతుకబేరం, పురుషబేరం అని కూడా వ్యవహరిస్తారు. ఈ మూర్తికే 'మనవాళప్పెరుమాళ్' అనే మరో నామధేయం కూడా ఉంది. 'మనవాళన్' అనే తమిళపదానికి 'పెండ్లికొడుకు' అని అర్థం. నిత్య పెండ్లికొడుకులా నిత్యమూ పట్టుపానుపుపై శయనించే భోగభాగ్యాలను పొందుతూ ఈ స్వామి సార్థక నామధేయు డయ్యాడు.
💫 జ్యేష్ఠమాసంలో ఈ మూర్తికి ప్రత్యేక సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. పూర్వం - ఇప్పటి, మలయప్పస్వామి వారి ఉత్సవ విగ్రహాలు లేనప్పుడు – మాడవీధుల్లో భోగశ్రీనివాసుడినే వూరేగించేవారు. అన్ని మర్యాదలూ, సేవా కైంకర్యాలు, అభిషేకం, ఏకాంతసేవ, బంగారు పట్టుపరుపుపై పవళింపుసేవ, బుధవారం జరిగే ప్రధానసేవ యైన సహస్రకలశాభిషేకం భోగశ్రీనివాసునికే చెందుతాయి. ప్రతి ఉదయం తోమాలసేవకు ముందుగా భోగశ్రీనివాసునుకి అభిషేకం జరుపబడుతుంది.
💫 సామవై మహారాణికి మరో పేరు 'పేరుందేవి'. ఆమె కాలంలో ఆనందనిలయం జీర్ణోద్ధారణ కావించబడినప్పుడు, నిత్యపూజకు ఆటంకం కలుగకుండా ఉండే నిమిత్తం మూలమూర్తికి నకలుగా భోగశ్రీనివాసుడి విగ్రహం చేయించి; నేడు స్నపనమంటపంగా పిలువబడే ప్రదేశంలో 'బాలాలయం' నిర్మించి; భోగశ్రీనివాసుణ్ణి అందులో ప్రతిష్ఠింపజేసి; వారికి సకల లాంఛనాలతో పూజాదికాలను నిర్వహించింది. స్వామివారికి అనేక ఆభరణాలు చేయించి, ఆడంబరంగా అనేక ఉత్సవాలు నిర్వహిస్తూ పరమ భక్త శిరోమణిగా పేరు గాంచింది. స్వామివారి సేవలో తరించిన మొట్టమొదటి చారిత్రక వ్యక్తిగా గూడా ఈమె చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచి, తరువాతి కాలంలో శ్రీవారి మహాభక్తులైన ఎందరో రాజులు, మహారాజులకు ఆదర్శప్రాయమైంది.
🙏 ఉగ్రశ్రీనివాసుడు 🌈
💫 ఈ శ్రీనివాసునికే, "ఉత్సవ శ్రీనివాసుడు" అని మరియొక పేరు వుండేది. ఈ మూర్తిని, స్నపనబేరం, అచ్యుతబేరం మరియు స్నపనమూర్తి అని కూడా పిలుస్తారు. స్నపనం అంటే పరిశుధ్ధం చేయుట లేదా శుద్ధిచేయుట అని అర్ధం.
💫 శ్రీదేవిభూదేవి సమేతుడై ఉండే ఈ స్వామిని సామాన్యశకం 1200 సం. లో యాదవరాజొకరు ఆలయానికి బహూకరించారు. అప్పటినుండి ఈ మూర్తులు అనందనిలయం నందుండి, ఉత్సవమూర్తులుగా పూజాపునస్కారాలు అందుకుంటూ ఉండేవి.
💫 ఒకానొకప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంలో ఈ మూర్తులను ఉత్సవమూర్తులుగా వూరేగిస్తున్నపుడు ఒక అగ్నిప్రమాదం జరిగి తిరుమలలోని గృహాలన్నీ భస్మీపటల మయ్యాయి.
💫 శ్రీవారు అర్చకస్వాములకు దర్శనమిచ్చి ఇక మీదట ఆ మూర్తుల్ని వుత్సవ విగ్రహాలుగా ఉపయోగించ వద్దని చెప్పారు. అంతే గాకుండా, మలయకొండల్లో స్వామివారి విగ్రహాలు లభిస్తాయని, ఇకనుండి అవి మాత్రమే ఉత్సవ విగ్రహాలుగా పూజలందు కోవాలని శెలవిచ్చి అంతర్జాన మయ్యారు. స్వామివారికి ఆగ్రహం వచ్చి అగ్నిప్రమాదం జరిగిందని భావించి, అప్పటినుండి ఆయనను "ఉగ్రశ్రీనివాసునిగా" పిలుస్తూ ఆనందనిలయానికే పరిమితం చేశారు.
💫 ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి సందర్భంగా జరిగే ఆరాధన నాడు మరియు కార్తిక ద్వాదశి రోజు మాత్రమే ఈ ఉగ్రశ్రీనివాసునికి ఆస్థానం జరుగుతుంది.
💫 కార్తీక ద్వాదశి నాడు సుప్రభాతం, తోమాలసేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసునికి అభిషేకాదులు నిర్వహించి; పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలు అలంకరిస్తారు. పిదప స్వామివారు మాడవీధుల్లో ఊరేగింపబడతారు. ఈ ఊరేగింపు సూర్యోదయానికి చాలా ముందుగా జరుగుతుంది. సూర్యోదయానంతర వెలుగులు ఈ మూర్తిని సోకితే ఉగ్రత్వం వస్తుందని భావించి, ఈ ఉత్సవాన్ని తెల్లవారు ఝామున సూర్యోదయానికి చాలా ముందుగానే ముగిస్తారు. ఉదయం 3 గం. లోపే ఈ మూర్తులు మందిరం అంతర్భాగం చేరేట్లు అర్చకులు అత్యంత జాగ్రత్త వహిస్తారు. ఊరేగింపు పూర్తయిన తరువాత ఉగ్రశ్రీనివాసుణ్ణి ఆలయం నందలి రంగమండపంలో గల సర్వభూపాల వాహనంలో వేంచేపు చేసి నైవేద్య నీరాజనాలు సమర్పించి ఆనందనిలయంలో పునఃప్రవేశింప జేస్తారు. శ్రీవారి మూలమూర్తికి ముమ్మూర్తులా నకలు ప్రతిమ అయిన ఉగ్రశ్రీనివాసుని విగ్రహం పంచలోహ నిర్మితమైనది. ఈ మూర్తి ఇరవై అంగుళాల ఎత్తు కలిగి వుండి ఆరంగుళాల ఎత్తైన పద్మపీఠంపై అమర్చబడి వుంటుంది. అలాగే, స్వామి వారికి ఇరువైపులా అయిదంగుళాల ఎత్తైన పీఠంపై పద్దెనిమిది అంగుళాల ఎత్తైన శ్రీదేవి భూదేవిల పంచలోహ ప్రతిమలు దర్శనమిస్తాయి.
🙏 మలయప్ప స్వామి 🌈
💫 3 అడుగుల 9 అంగుళాల ఎత్తుతో, ఈ స్వామి దేవేరులైన శ్రీదేవి భూదేవి సమేతంగా వుంటారు.
💫 సామాన్యశకం 1330 సం. లో మలయకోనలో ఈ స్వామి లభించారు. ఒకానొక బ్రహ్మోత్సవాల సందర్భంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు, ఉగ్రశ్రీనివాసుని అనతిపై తిరుమల సానువుల్లోని మలయపర్వతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఈ మూర్తులు లభ్యమయ్యాయి. మలయపర్వతం అంటే 'తల వంచిన కొండ' అని అర్థం. ఉభయదేవేరులతో ఉన్న మలయప్పస్వామి వారి మూర్తులను ఉత్సవ విగ్రహాలుగా ఊరేగిస్తూ అర్ధాంతరంగా ఆపివేయబడ్డ బ్రహ్మోత్సవాలను తిరిగి కొనసాగించారు. అప్పటినుండి ఈనాటి వరకూ ఈ మూర్తులే ఉత్సవ విగ్రహాలుగా పూజలందు కొంటున్నాయి.
💫 తిరుమలలో జరిగే డోలోత్సవం, నిత్యకళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, పవిత్రోత్సవాలు అన్నీ మలయప్పస్వామికే చెందుతాయి. అన్ని ఉత్సవాలు, వేడుకల నందుకొనే ఈ స్వామి తిరుమలను సందర్శించుకునే భక్తులందరికీ సుపరిచితులు. ఆనందనిలయం లోని మూలమూర్తి దర్శనార్థం భక్తులు వారి చెంతకు చేరుకోవాలి. కానీ భక్తసులభుడైన మలయప్పస్వామి వారు మాత్రం తానే ఆనందనిలయం లోనుండి బయటకు వచ్చి భక్తుల వద్దకు వేంచేస్తారు. ఆనందనిలయం లోనికి ప్రవేశించటంలో అశక్తులైన తన భక్తుల సందర్శనార్థం, మూలమూర్తె తన ప్రతిరూపాన్ని బయటకు పంపుతున్నారేమో!
💫 కొల్లిగళ వీరణ్ణశెట్టి అనే భక్తునికి విష్ణుమూర్తి కలలో కనిపించినందుకు గుర్తుగా ఆయన స్వామివారికి వజ్రకిరీటం చేయించారు. ఆ వజ్రకవచాన్ని తొలుతగా తమ ఇలవేలుపు అయినట్టి "చెరువు నారాయణస్వామి" కి తొడగడానికి ప్రయత్నిస్తే అది సరిపోదు. ఆ తరువాత శ్రీరంగనాథునికి ప్రయత్నిస్తే వారికి కూడా సరిపోదు. అప్పుడు కంచిలో ఉన్న అర్చకస్వాములు తిరుమల లోని మలయప్పస్వామి పేరు సూచించారు. అప్పుడా భక్తుడు తిరుమల క్షేత్రానికి విచ్చేసి మలయప్పస్వామికి ఆ కవచం తొడిగితే సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికీ ఆ కవచం క్రింద భాగంలో ఆ భక్తుని పేరును మనం చూడవచ్చు.
💫 ఈ పంచలోహ విగ్రహాలు తామరపువ్వు ఆకారంలోని పీఠం మీద కొలువై వుంటాయి. అనేక స్వర్ణాభరణాలతో బాటుగా, వజ్రకవచం మరియు ముత్యాలకవచం కూడా మలయప్పస్వామి వారి స్వంతం.
💫 ఆనందనిలయం లోని ఈ పంచబేరాలు విష్ణువు యొక్క మహారూపాలను సూచిస్తాయి:
🙏. మూలవిరాట్టు - విష్ణువు
🙏 భోగ శ్రీనివాసుడు - పురుషుడు
🙏 మలయప్ప స్వామి - మహా విష్ణువు
🙏 ఉగ్ర శ్రీనివాసుడు - సదా విష్ణువు
🙏 కొలువు శ్రీనివాసుడు - వ్యాపి నారాయణుడు
💫 ఈ పంచబేరాలే కాకుండా, ఆనందనిలయంలో ఇతర పరివారదేవతలు కూడా ఉంటారు.
🙏 ఆంజనేయ లక్ష్మణ సీతా సమేత శ్రీరాముడు,
🙏 రుక్మిణీ సమేత శ్రీకృష్ణుడు,
🙏 సుదర్శనచక్రం,
🙏 సేనాని విష్వక్సేనుడూ, గరుత్మంతుడూ - మొదలైనవారు.
💫 ఈ మూర్తుల గురించి వచ్చే ప్రకరణాల్లో వివరంగా తెలుసుకుందాం.
🙏 శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం 🙏
No comments :