🙏 ఆది వరాహస్వామి ఆలయం 🙏
💫 ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమంలో క్షణం తీరిక లేకుండా, ఒక పగలంతా (బ్రహ్మ దేవునికి ఒక పగలంటే వేయి మహాయుగాలు. కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాల్ని కలిపి సమిష్టిగా ఒక మహాయుగం అంటారు) శ్రమించిన తరువాత అలసటతో ఓ కునుకు తీస్తాడు. దాంతో, ఆయన సృష్టించిన జగత్తంతా అల్లకల్లోలమై, సూర్యచంద్రులు గతులు తప్పి, కుంభవృష్టితో జలప్రళయం సంభవించింది.
💫 అదే అదనుగా తీసుకుని, హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమండలాన్ని పాతాళానికి తీసుకుని వెళ్ళి భయోత్పాతం సృష్టిస్తాడు. ఇంద్రాది దేవతల కోరిక మేరకు, శ్రీమహావిష్ణువు శ్వేతవరాహ రూపునిగా అవతరించి, భీకరంగా జరిగిన యుద్ధంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి, తన కోరలతో భూమిని తిరిగి పైకెత్తి సృష్టి నంతటినీ యథాస్థితికి తెస్తాడు.
💫అనంతరం, ఆదివరాహస్వామి, తన చెంతనే భక్తితో నిలబడి ఉన్న, తన వాహనమైన గరుత్మంతుణ్ణి, "పక్షిరాజా ! భూదేవిని ఉద్ధరించడం వల్ల, ఆమె నన్ను పతిగా వరించింది. యుగధర్మానుసారం నేనందుకు అంగీకరించాను. ఇక్కడే కొంతకాలం ఉండి, భూలోకాన్ని పరిరక్షించవలసిన బాధ్యత నాపైనున్నది. అందువలన నీవు వైకుంఠానికి వెళ్ళి నా క్రీడాచలాన్ని సత్వరమే తోడ్కొని రా" అని ఆజ్ఞాపించాడు.
💫 అంత, ఆ పక్షీంద్రుడు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీదేవికి వైకుంఠనాథుని ఆదేశాన్ని విపులంగా విన్నవించాడు. శ్రీమహాలక్ష్మి తాను కూడా స్వామి చెంతకు చేరాలని సంకల్పించుకొని, తన మూలస్వరూపాన్ని వైకుంఠం లోనే ఉంచి, మరొక అంశతో భూలోకానికి బయల్దేరింది. జగన్మాతతో కూడిన క్రీడాచల పర్వతాన్ని తీసుకొని భూలోకానికి చేరుకున్న పక్షీంద్రుడు, స్వామి వారి ఆనతి ననుసరించి, క్రీడాచలాన్ని సువర్ణముఖీ నది ఉత్తర భాగంలో ప్రతిష్ఠించాడు. ఈ నది వడ్డునే నేడు శ్రీకాళహస్తీశ్వరుడు కొలువై ఉన్నాడు.
💫 శ్వేతవరాహుడు భూదేవీ సమేతంగా క్రీడాపర్వతాన్ని అధిరోహించి, దైత్యసంహార నిమిత్తం తాను ధరించిన శత్రుభయంకర రూపంలోనే పుష్కరిణికి పడమటి గట్టున కొలువు తీరాడు. కాలాంతరాన ఆ క్రీడాచలమే తిరుమల క్షేత్రంగా భాసిల్లుతోంది.
💫 బ్రహ్మాది దేవతలు ఆదివరాహుణ్ణి స్తుతించి "స్వామీ! తమరీ భీకరమైన రూపాన్ని త్యజించి, సౌమ్యరూపం దాల్చి, ఈ పర్వతశ్రేణుల పైనే స్థిరనివాస మేర్పరుచుకుని, ప్రజలకు దర్శనభాగ్యం కల్పించడి. భక్తజనులకు ధ్యాన-కర్మ యోగాలను బోధిస్తూ, దివ్య మహిమలతో కూడిన మీ లీలలను చాటుతూ ఉండండి" అని వేడుకొన్నారు.
💫 దేవతల మొర నాలకించిన ఆదివరాహుడు, భూదేవీ సమేతంగా, దివ్యకాంతుల ప్రకాశంతో ఉన్న ఓ విమానగోపురం కలిగిన భవనం లోనికి ప్రవేశిస్తాడు. అంతలోనే ఆ విమానగోపురం అంతర్థానమై, ఆ భవనమే నేడు శ్రీవారి పుష్కరిణి ఒడ్డున, పడమర మాడవీధిలో, "ఆదివరాహస్వామి ఆలయం" గా ప్రసిద్ధి చెందింది. అలాగే, తిరుమల ఆదివరాహక్షేత్రమని, తిరుమలలో మొట్టమొదటి దైవం ఆదివరాహుడు లేదా శ్రీవరాహస్వామి అని, తిరుమల
క్షేత్రాధిపతి వరాహస్వామి వారని భావిస్తుంటారు.
💫 ఆ తరువాత కొంత కాలానికి వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి, తిరుమల లోని ఓ పుట్టలో నివాసముంటూ, గొల్లవాని గొడ్డలి దెబ్బతో బయటకు వచ్చిన శ్రీనివాసుడు, అప్పటికే శేషాచలానికి అధిపతియైన వరాహస్వామిని, తన శాశ్వతనివాసం నిమిత్తం కొంత స్థలాన్ని దానంగా అడుగుతాడు.
💫 ఆదివరాహుడు విధించిన - ప్రథమ దర్శనం, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం - అనే షరతులకు అంగీకరించి, ఆ నియమాలతో కూడిన ఓ దానపత్రాన్ని రాసిచ్చి శ్రీనివాసుడు వందగజాల స్థలాన్ని దానంగా పొందుతాడు. బ్రాహ్మీలిపిని బోలిన లిపిలో లిఖించబడిన ఈ దానపత్రాన్ని (ఆంగ్ల భాషలో గిఫ్ట్ డీడ్), వరాహస్వామి ఆలయంలో నిక్షిప్తమై యున్న ఒక చతురస్రాకార "రాగి పలక యంత్ర" రూపంలో నేటికీ చూడవచ్చని చెబుతూంటారు.
💫 తరువాతి కాలంలో, "ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి" అన్న చందంగా, శ్రీనివాసుడు తన ప్రాబల్యాన్ని అపరిమితంగా పెంచుకొన్నాడు. అయితే, ఆనాడు శ్రీనివాసుడు అంగీకరించిన షరతులకు లోబడి, ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం వరాహస్వామికే చేయబడతాయి. క్షేత్ర సాంప్రదాయాన్ననుసరించి, వరాహస్వామి దర్శనానంతరం మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలి. అప్పుడే తిరుమల యాత్ర సంపూర్ణంగా ఫలప్రదమవుతుంది. ముందుగా వరాహస్వామిని దర్శించక పోతే, సాక్షాత్తూ శ్రీనివాసుడు అంగీకరించిన షరతును ఉల్లంఘించటమే అవుతుందని భక్తుల విశ్వాసం.
"వరాహ దర్శనాత్పూర్వం శ్రీనివాసం సమేన్నచ
దర్శనాత్ప్రా గ్వరా హస్య శ్రీనివాసో న తృష్యతి "
💫 వరాహస్వామి ఆలయం - ముఖమండపం, అర్థమండపం, అంతరాళం, గర్భాలయం – అని నాలుగు భాగాలుగా, మూడు ప్రాకారాలతో నిర్మింపబడింది. గర్భాలయం మధ్యలో ఒక అడుగు ఎత్తైన శిలావేదికపై, రెండడుగుల భూవరాహస్వామి విగ్రహం ప్రతిష్ఠింపబడింది. ఈ స్వామి, పై రెండు చేతుల్లో శంఖుచక్రాలతో, ఎడమ తొడపై భూదేవిని కూర్చుండ బెట్టుకుని చెవిలో తత్వబోధ చేస్తూ, ఊర్ధ్వపుండ్రంతో విరాజిల్లు తుంటారు. ఆలయంలో ధ్వజస్థంభం లేనందున, వరాహస్వామికి ప్రత్యేకంగా ఉత్సవాలు జరిపించే సాంప్రదాయం లేదు. శ్రీవారు మరియు వరాహస్వామి అభిన్నులవ్వటం చేతనూ, ఇద్దరిదీ శ్రవణా నక్షత్రం అవ్వటం వల్లనూ, ఆనందనిలయవాసునికి జరిగే సమస్త ఉత్సవ కైంకర్యాలూ వరాహునికి జరిగినట్లే అని అనూచానంగా వస్తున్న నమ్మిక.
💫 ఈ ఆది వరాహస్వామి ఆలయ చరిత్ర, శ్రీ వేంకటేశ్వర కళ్యాణంతో ముడివడి ఉంది. మానవరూపం దాల్చి ఉన్న శ్రీనివాసుడు, పద్మావతితో పరిణయం జరిగే నాటికి, కళ్యాణ ఖర్చులకు సైతం పైకం లేని నిరుపేద. ఆకాశరాజు కూతురితో వివాహం అంటే ఆడంబరంగా జరగాలి మరి! చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో తోచక మధన పడుతూంటే, స్నేహితుడైన శివుని సిఫారసు మేరకు, కావలసిన పైకాన్ని ఋణంగా ఇవ్వడానికి కుబేరుడు సంసిద్ధుడవుతాడు.
💫 అక్షరాలా పదునాలుగు లక్షల రామచంద్ర ముద్రలు కలిగిన బంగారు కాసులు అప్పుగా ఇచ్చేట్లు ఒప్పందం ఖరారైంది. ప్రతి నూరు కాసులకు ఒక కాసు వడ్డీ చెల్లించడానికీ, ఋణమొత్తాన్ని యుగాంతంలో తీర్చి వేయడానికి స్వామివారు అంగీకరించారు. ఈ చర్చోపచర్చలూ, రాతకోతలన్నీ, ఆదివరాహక్షేత్రం లోని అశ్వత్థ వృక్షనీడలో, హేవళంబి నామ సంవత్సర, చైత్ర శుద్ధ దశమి నాడు జరిగాయి.
💫పై షరతులన్నీ అంగీకరిస్తూ, స్వామివారు కుబేరునికి వ్రాసి ఇచ్చినట్లుగా చెప్పబడుతూన్న ఆ కాలపు ప్రామిసరీ నోటు, ఈ మధ్యకాలం వరకూ వరాహస్వామి ఆలయకుడ్యం పై వ్రేలాడతూ ఉండేది. ఇటీవలనే దాన్ని తిరుమలలో ఉన్న వస్తుప్రదర్శనశాల కు తరలించారు.
💫 కుబేరుని షరతులు అంతటితో అయిపోలేదు, సాక్షి సంతకం కావాలన్నాడు. మొదట బ్రహ్మదేవుడితో సంతకం పెట్టించగా, "కుమారుడి సంతకమేం చెల్లుతుంది?" అంటూ పెదవి విరిచాడు. శివుడి సంతకం ప్రతిపాదిస్తే, "ముచ్చటగా మూడో సంతకం కూడా కావా" లన్నాడు. తదుపరి, "సత్యనిష్ఠకు మారు పేరైన అశ్వత్థవృక్షాన్ని సాక్ష్యంగా అంగీకరిస్తా" నన్నాడు. చివరికి, ముగ్గురిచేతా సాక్షి సంతకాలు పెట్టించిన తరువాతే, ఋణమొత్తం శ్రీనివాసుని చేతికిచ్చాడు. అప్పు కోసం సాక్షాత్తూ ఆ లక్ష్మీ వల్లభుడికే ముప్పతిప్పలు తప్పలేదు.
🌈 కలి మహిమ కాకుంటే మరేంటి? 🌈
💫 నాటికీ, నేటికీ అప్పిచ్చేవాడికి, అప్పు తీసుకునే వాడంటే లోకువే మరి. సవాలక్ష షరతులకు తల వంచాల్సిందే! అయితే, సత్యసంధుడైన శ్రీనివాసుడు ఆ షరతులన్నింటినీ తరతరాలుగా నేరవేరుస్తూనే ఉన్నాడు. నేటితరం మానవుల వలె ఎగ వెయ్యడానికి ఎత్తులు వేయట్లేదు.
💫 శ్రీవరాహస్వామికి ఆగమశాస్త్రానుసారం, ప్రతిరోజూ మూడు పూటలా అర్చనలు, నివేదనలూ జరుపబడతాయి. అన్నప్రసాదాలన్నీ శీవారి కంటే ముందుగా, వరాహస్వామికి నివేదింపబడతాయి. అలాగే, ప్రతి శుక్రవారం తెల్లవారు ఝామున అభిషేకం జరుపబడుతుంది.
💫 ప్రతి బ్రహ్మోత్సవం చివరి రోజున "చక్రస్నానం" సందర్భంగా, ఉభయ నాంచారులతో కూడిన మలయప్పస్వామి, చక్రత్తాళ్వార్ (స్వామివారి బంటుగా భావింపబడే సుదర్శనచక్రం) తో సహా వరాహస్వామి ఆలయం లోకి వేంచేస్తారు. పంచామృత స్నపన తిరుమంజనం తరువాత పుష్కరిణిలో చక్రస్నానం జరుప బడుతుంది. అయితే రథసప్తమి, ముక్కోటి ద్వాదశి నాడు శ్రీ చక్రత్తాళ్వార్ మాత్రమే మందిరం లోకి వేంచేసి పుష్కరిణీలో స్నానం చేస్తారు.
💫 వేర్వేరు శాసనాల్లో, వరాహస్వామి "వరాహనాయనార్" గానూ, "నప్పిరాన్" గానూ పేర్కొన బడ్డారు. 1982 సం లో, ఆలయానికి జరిగిన మహా సంప్రోక్షణ కార్యక్రమ సందర్భంగా, శ్రీవరాహస్వామి వారి ఆలయం చుట్టూ మకరతోరణ నిర్మాణం, ఆలయంపై పెద్ద విమాననిర్మాణం మరియు బంగారు కలశస్థాపన జరిగింది.
✅👉 ఈ సారి తిరుమల వెళ్ళినపుడు, ముందుగా శ్రీవరాహస్వామి దర్శనం తరువాతనే శ్రీవారిని దర్శించుకుందాం. 👈✅
💫 ఆ దేవదేవుడు ఒప్పుకున్న షరతుల్ని పాటించాల్సిన బాధ్యత, వారి భక్తులుగా మనందరి మీదా ఉంది.
No comments :