🙏 శ్రీవారి మూలవిరాట్టు 🙏
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"
💫 స్వామివారు సుమారుగా తొమ్మిదిన్నర అడుగుల ఎత్తులో, పాదపద్మాలను పద్మపీఠంపై నుంచి, నిగనిగలాడే నల్లని మేనిఛాయతో దర్శనమిస్తారు. ముంగాళ్లకు అందెలు లేదా నూపురాలు అలంకరింపబడి ఉంటాయి. స్వామివారి మూర్తి నిటారుగా నిలబడి ఉన్నట్లు కనిపించినప్పటికీ, నడుముభాగంలో కొద్దిగా ఎడమప్రక్కకు ఒరిగి, మోకాలు కొద్దిగా పైకి లేచి ఉంటుంది. అంటే స్వామివారు వయ్యారంగా నిలబడి ఉన్నారన్నమాట. నడుముకు రెండంగుళాల వెడల్పైన కటి బంధం చుట్టబడి ఉంటుంది. నడుము పై భాగంలో ఏ విధమైన ఆచ్ఛాదన లేని స్వామివారు, క్రింది భాగంలో ఒక ధోవతి ధరించి ఉంటారు. బొడ్డు నుండి పాదాల వరకు వ్రేలాడుతున్న ఖడ్గాన్ని "సూర్యకఠారి" లేదా "నందకఖడ్గం" అని పిలుస్తారు.
💫 చతుర్భుజుడైన స్వామివారు, పైనున్న కుడిచేతిలో సుదర్శనచక్రాన్ని, ఎడమచేతిలో పాంచజన్య శంఖాన్ని ధరించి ఉంటారు. ఈ ఆయుధాలు స్వామివారి మూర్తికి సహజసిద్ధమైనవి కావు. అమర్చబడ్డవని మనం ముందుగానే తెలుసుకున్నాం.
💫 మరో కుడిచెయ్యి వరదభంగిమలో నుండి, అరచేతి వేళ్లతో కుడిపాదాన్ని సూచిస్తూ ఉంటుంది. నడుముపై, నేలకు సమాంతరంగా పెట్టుకుని ఉన్న ఎడమచేతిని కటిహస్తంగా పిలుస్తారు. ఈ హస్త భంగిమను ఆగమపరిభాషలో "కట్యావలంబితముద్ర" గా పేర్కొంటారు. వరదహస్తంతో కోరిన వరాలను కురిపిస్తూ, నా పాదాలే భక్తులకు శరణ్యమని సూచిస్తుంటారు. కటిహస్తంతో, నన్ను నమ్ముకున్న భక్తులు సంసారసాగరంలో నడుములోతు వరకే మునుగుతారనే సంకేతం ఇస్తారు. ముంజేతులకు కంకణాలు, కంఠభాగంలో యజ్ఞోపవీతం, మరో నాలుగు హారాలు మనోహరంగా దర్శనమిస్తాయి. నిరంతరం విల్లంబులను, అమ్ములపొదిని ధరించి ఉండడం వల్ల భుజంపై రాపిడి గుర్తులు కూడా కనిపిస్తాయి. వక్షస్థలంపై దక్షిణభాగాన కొలువైవున్న మహాలక్ష్మిని "వక్షస్థల లక్ష్మి" గా పిలుస్తారు. శిరస్సు పైనుండి సొగసుగా జాలువారుతున్న శిరోజాలను, భుజాలపై దోబూచులాడుతున్న ముంగురులను కూడా దర్శించుకోవచ్చు. ముఖారవిందంలో నాసిక, పెదిమలు, గడ్డము, చెవులు, నేత్రాలు సమపాళ్ళలో తీర్చిదిద్ది నట్లుంటాయి.
💫 శంఖుచక్రాలు తప్ప పైన పేర్కొన్నవన్నీ మూలమూర్తిలో అంతర్భాగంగా ఉన్నవే!! వీటిలో చాలా భాగం శుక్రవార అభిషేక సమయంలో, ఆభరణాలు, వస్త్రాలంకరణ లేనప్పుడు మాత్రమే దర్శించగలం. అయితే, స్వామివారు నిత్యం పట్టుపీతాంబరాలతో, వజ్ర వైడూర్య రత్నఖచిత స్వర్ణాభరణాలతో, అనేక పూలమాలలతో, శ్రీదేవి భూదేవి అమ్మవార్ల పతకాలతో, విశేషసందర్భాల్లో వజ్రకిరీటధారణతో, యజ్ఞోపవీతం, ఉదరాన కౌస్తుభమణి, నడుముకు బంగారు మొలత్రాడు, పాదాలకు బంగారు తొడుగులుతో అలంకరింపబడి ఉంటారు.
💫స్వామివారి విప్పారిన నేత్రాలను, నాసిక ఉపరితల భాగాన్ని చాలా వరకు కప్పివేస్తూ వెడల్పాటి ఊర్ధ్వపుండ్రం, దాని మధ్యభాగాన కస్తూరితిలకం కనిపిస్తాయి. కాబట్టి మిగిలిన సమయాల్లో మూలమూర్తి సహజరూపాన్ని దర్శించటం వీలుకాదు.
💫 స్వయంవ్యక్తము, దివ్యసాలగ్రామశిల అయినటువంటి శ్రీవారు, అర్చారూపాన్ని పొందటం వెనుక ఆగమశాస్త్ర నేపథ్యం ఉంది. అర్చనాదికాలకు అనువైన రూపాన్ని ధరించి కలియుగవాసులలో భక్తి భావాన్ని, పాపభీతిని, ధర్మాధర్మవిచక్షణ పెంపొందించడమే అర్చారూపంలోని పరమార్థం! తన ముగ్ధమోహన రూపంతో భక్తులను పరవశింపజేసి, వారి మనస్సును. దృష్టిని తనపై మళ్ళింప జేసుకుని, వారికి ఇహపరాలను ప్రసాదిందిడం కోసమే స్వామివారు ఇక్కడ భౌతికంగా కొలువై ఉన్నారు.
💫 స్వామివారి దివ్యమంగళ రూపాన్ని వర్ణించటం మహామహులకే సాధ్యం కాలేదు. శ్రీవారి శోభను చూచాయగా, లేశామాత్రంగా తెలియజెప్పే చిన్ని ప్రయత్నమే ఇది!
💫 శ్రీవారి మూర్తి మానవనిర్మితమై ఉండవచ్చునని కొందరు సందేహం వెలిబుచ్చుతారు. అయితే, ఆలయశాస్త్రంలో నిష్ణాతులైన స్థపతులు ఈ వాదనను తర్కయుక్తంగా, శాస్త్రబద్ధంగా ఖండించారు. ఆగమశాస్త్రానుసారం మానవనిర్మిత మూర్తులలో - యోగమూర్తి, భోగమూర్తి, వీరమూర్తి, అభిచారకమూర్తి - అనే నాలుగు భంగిమలు కలిగిన మూర్తులుంటాయి. ప్రతి మూర్తికి ఉండవలసిన నిర్దిష్ట లక్షణాలను ఆగమశాస్త్రంలో పొందుపరిచారు. మూలమూర్తి ఆకారాన్ని, హస్తభంగిమలను, ధరించిన ఆయుధాలను, స్వతఃసిద్ధంగా ఉన్న అలంకారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఈ నాలుగు రకాల మూర్తులకు నిర్ధారించబడిన ఏ లక్షణాలను గర్భాలయంలోని మూలమూర్తి కలిగి ఉండదు. అందుచేత, ఈ మూలవిరాట్టు మానవనిర్మితం కాదని, ఆగమశాస్త్ర ఆవిర్భావానికి ఎంతో ముందుగానే ఈ మూర్తి ఉద్భవించిందని తేటతెల్లమవుతుంది.
💫 గర్భాలయంలో స్వామివారి మూలమూర్తితో పాటుగా పంచబేరాలు (ధ్రువబేరమైన అయిన మూలవిరాట్టు తోపాటుగా), సుదర్శన చక్రత్తాళ్వార్, పవిత్ర సాలగ్రామాలు, రుక్మిణి-శ్రీకృష్ణుడు, సీతారామలక్ష్మణ మూర్తులు కూడా దర్శనమిస్తాయి.
💫 పంచబేరాల గురించి మనం మొట్టమొదటి ప్రకరణంలోనే తెలుసుకున్నాం. తక్కిన ఉత్సవమూర్తుల గురించి తదుపరి భాగాలలో చెప్పుకుందాం.
No comments :