🙏 అనంతాళ్వార్ 🙏
💫 1053 సం. లో జన్మించిన అనంతాళ్వార్ సుమారు 84 సంవత్సరాలు జీవించారు. సుదీర్ఘకాలం పాటు శ్రీవారి పుష్పకైంకర్యంలో పాలుపంచుకున్న ఆ ధన్యజీవి, శ్రీవారి భక్తులందరికీ ప్రాతఃస్మరణీయుడు.
💫 పూర్వం, భోగమండపమైన శ్రీరంగ క్షేత్రంలో, భగవద్రామానుజులు శ్రీవైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని శిష్యులకు వివరిస్తూ, తిరుమల క్షేత్రంలో స్వామివారికి పుష్పమాలా కైంకర్యం చేయడం భగవతీతికరమని శెలవిచ్చారు. అలాగే, శాశ్వతంగా తిరుమలలో ఉంటూ, వేంకటేశునికి పుష్పసమర్పణ చేయగల వారెవరైనా ఉన్నారా? అని శిష్యులను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా, అనందాళ్వాన్ (అనంతాళ్వార్) అనే శిష్యుడు తన సంసిద్ధతను వ్యక్తం చేసి, తిరుమల వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వ వలసిందిగా ప్రార్థించాడు. సంతృప్తి చెందిన రామానుజాచార్యులు, అనంతాళ్వార్ ను, ఆణ్ పిళ్ళె (నీవే నిజమైన మగవాడివి) అని ప్రశంసిస్తూ, తిరుమల వెళ్ళటానికి అనుమతించారు.
💐 పుష్పకైంకర్యం 💐
💫 గురువాజ్ఞ ప్రకారం భార్యాసమేతంగా తిరుమల చేరుకున్న అనంతాళ్వార్, అత్యంత నిష్ఠతో శ్రీవారికి పుష్పకైంకర్యం చేయసాగాడు. అప్పటికే తిరుమల చేరుకుని తీర్థ కైంకర్యం చేస్తూవున్న తిరుమలనంబి ద్వారా శ్రీవారి పుష్ప ప్రియత్వాన్ని గురించి, తిరుమలలో లభించే వివిధ పుష్పజాతుల గురించి చాలా వివరాలు తెలుసుకున్నాడు.
💫 తన గురువైన రామానుజాచార్యుల వారి గురువైన యామునాచార్యుల వారి పేరుతో శ్రీవారి ఆలయ ప్రాంగణంలో యామునోత్తరై అనే పుష్పమండపాన్ని అనంతాళ్వార్ నిర్మించారు. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఆ పరమభక్తుడు శ్రీకారం చుట్టిన యమునోత్తర (పుష్ప అర) అనే పుష్పమంటపాన్ని నేటికీ మనం శ్రీవారి ఆలయం నందున్న సంపంగిప్రాకారంలో చూడవచ్చు.
🌈 చెరువు త్రవ్వకం 🌈
💫 శ్రీవారి నిత్యకైంకర్యానికి కావలసిన వివిధ రకాలైన, రంగురంగుల, పరిమళాలు వెదజల్లే పుష్పాల నిమిత్తం ఆయన ఒక ప్రత్యేక పుష్పవాటికను పెంచ దలిచాడు. దానికి నాందిగా, ఆలయానికి దక్షిణ దిక్కున ఉన్న విశాలమైన ప్రదేశంలో ఒక పెద్ద చెరువును నిర్మించ తలపెట్టాడు. ఈ చెరువును ఇప్పటికీ మనం క్యూ కాంప్లెక్స్ ప్రక్కగా చూడవచ్చు. దీని ఒడ్డునే అనంతాళ్వార్ వారి సమాధి కూడా ఉంది.
💐 దైవకార్యంలో ఇతరుల సహాయం కోరకుండా, గర్భవతి అయిన తన భార్యతో కలిసి ఈ మహత్కార్యానికి పూనుకున్నాడు అనంతాళ్వార్. ప్రతి రోజూ ఉదయం, పుష్పమాలా కైంకర్యాలు ముగిసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించాక, చెరువు నిమిత్తం, భార్యతో కలిసి గుంట త్రవ్వడం ప్రారంభించేవాడు.
💫 ఈయన గడ్డపారతో (గునపం) మట్టి త్రవ్వి గంపలో పోస్తే అతని భార్య ఆ మట్టిని దూరంగా తరలిస్తుండేది.
💫 ఇలా ఈ కార్యక్రమం దీక్షగా కొన్ని రోజులు కొనసాగింది. గర్భవతి కావడంతో, ఆమె అలిసిపోయి మధ్యమధ్యలో నిలబడి పోయేది. ఆయన పిలవడంతో, చెమట బిందువుల్ని పమిట చెంగుతో తుడుచుకొని తిరిగి పని కొనసాగించేది.
🙏 బాలుని రూపంలో శ్రీవేంకటేశ్వరుడు 🙏
💫 ఇలా పట్టుదలతో, ఇతరుల సాయం కోరకుండా, అంకితభావంతో సేవ చేస్తున్న ఆ దంపతుల శ్రమను చూడలేని శ్రీనివాసుడు పదమూడేండ్ల పసివాని రూపంలో వచ్చి "అయ్యా! మీరు త్రవ్వి పోసిన మట్టిని నేను మోసుకుని వెళ్తాను. నన్ను అనుమంతించండి" అని వేడుకొన్నాడు. ఆ కుర్రవాడి సాయాన్ని తిరస్కరించిన అనంతాళ్వార్, తమ గురువాజ్ఞ ప్రకారం తామిరువురూ ఆ కైంకర్యం నిర్వహిస్తున్నామనీ, భగవత్సేవలో తామెవరి సాయం తీసుకోబోమని, తమను విసిగించకుండా తక్షణం అక్కడినుంచి వెళ్ళిపొమ్మని, ఆ బాలుణ్ణి కసురుకుంటాడు. అయితే, కరుణా మయుడైన శ్రీనివాసుడు ఎలాగైనా ఆ దంపతులకు సాయం చేయలని గట్టిగా నిశ్చయించు కుంటాడు. ఇటు, అనంతాళ్వార్ ధ్యాసంతా - త్వరగా చెరువు త్రవ్వి, పూదోటను పెంచి, ఎప్పుడెప్పుడు శ్రీవారికి పుష్పాలను అలంకరిద్దామా! - అని ఉండేది. భర్తే దైవంగా భావించిన భార్య కూడా, తన బాధనంతా ఓర్చుకుని, తనకూ, భర్తకూ కలిగిన శ్రీవారి సేవాభాగ్యానికి మురిసిపోతూ, దైవకార్యంలో నిమగ్నమై ఉండేది.
💫 ఒక రోజు స్వామివారికి మనసాగక, బాలుని రూపంలో అనంతాళ్వార్ వెనుక ఉండి, ఆయన మట్టిని తట్టలో వేయగానే, పరుగుతో వెళ్ళి తట్టను ఖాళీ చేసి, ఖాళీ తట్టను అక్కడ పెట్టసాగాడు.
🙏 శ్రీవారికి గాయం 🙏
💫 అనుమానంతో వెనుకకు తిరిగి చూసిన అనంతాళ్వార్ కు ఆ పిల్లవాడు కనుపించాడు. వద్దన్నా పదే పదే తమ జోలికి వస్తున్న ఆ పిల్లవాణ్ణి తన చేతిలో ఉన్న గునపంతో కొట్టబోయాడు. ఆ పిల్లవాడు భయంతో, చేతిలో ఉన్న మట్టితట్టను అక్కడే వదిలేసి పరుగు లంకించుకున్నాడు. అయినా అనంతాళ్వార్ ఆ పిల్లవాడి వెంట బడ్డాడు. ఆ పరుగులో, పిల్లవాడు చేతికి అందినట్టే అంది జారి పొతున్నాడు. శ్రీహరి అంత సులభంగా చిక్కుతాడా?
💫 దాంతో కోపం ఆపుకోలేని అనంతాళ్వార్ విసిరిన గునపం ఆ పిల్లవాడి గడ్డానికి తగిలింది. బొట బొటా కారుతున్న రక్తంతోటే ఆ బాలుడు పరిగెత్తుకుంటూ ఆనందనిలయం లోకి జొరబడి కనపడకుండా దాక్కుంటాడు. వెదకి వేసారిన అనంతాళ్వార్ వెను దిరుగుతాడు.
💫 అనంతాళ్వార్, ఆ రోజు సాయం సమయంలో పుష్పమాలలతో ఆనందనిలయంలోకి వెళ్ళేటప్పటికి, వేంకటేశ్వర స్వామికి గడ్డం వాచి, రక్తం పెచ్చుకట్టి ఉంది. అది చూసిన అర్చకులు హడలి పోతారు. స్వామి వారి గాయాన్ని చూసిన అనంతాళ్వార్ కు తాను చేసిన ఘోరతప్పిదం తృటిలో అర్థమై, స్వామిని క్షమించమని ప్రాధేయపడ్డాడు.
🙏 పచ్చకర్పూరం బొట్టు 🙏
💫 అప్పట్లో తన భక్తులతో నేరుగా మాట్లాడే శ్రీనివాసుడు, వ్యాకులతతో ఉన్న అనంతాళ్వార్ ను సమాధాన పరుస్తున్నట్లుగా అర్చకులతో , "నా భక్తుడు గునపంతో కొట్టగా ఏర్పడిన గాయం మీద పచ్చకర్పూరపు బొట్టు పెట్టండి. రాబోయే తరాలలో నా భక్తులు నా గడ్డం మీద పచ్చకర్పూరపు బొట్టును చూసి, అది అనంతాళ్వార్ అనే భక్తుడు కొట్టిన దెబ్బ అని చెప్పుకుంటుంటే, అది విని నేను మురిసిపోతాను" అని చెప్పి తన భక్తప్రియత్వాన్ని చాటుకున్నారు. అంతే కాకుండా, స్వామివారు అనంతాళ్వార్ యొక్క నిరుపమాన భక్తిని ఆ విధంగా లోకానికి చాటిచెప్పారు. స్వామివారి ఆజ్ఞానుసారం ఆ సంఘటనకు గుర్తుగా, నేటికీ ప్రతిరోజూ, శ్రీవారి గడ్డం మీద పచ్చకర్పూరంతో అలంకరిస్తారు.
🙏 *శ్రీవారి దివ్యమంగళ విగ్రహాన్ని మదిలోనే ఊహించుకొని, వారి గడ్డంపై నిత్యం ఉండే తెల్లటి మచ్చను తలచుకోండి. దాని వెనుక ఉన్న మర్మం
🌈 అనంతాళ్వార్ గడ్డపార 🌈
💫 శంఖనిధి - పద్మనిధి దాటుకుని ఆలయంలోకి వెళుతూంటే, మహాద్వారపు ఉత్తరం గుమ్మం మీద నేటికీ అనంతాళ్వార్ విసిరిన గునపాన్ని మనం చూడవచ్చు.
💫స్వామివారి గడ్డానికి తగిలిన దెబ్బకు గుర్తుగా, ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో, ధ్వజారోహణ జరిగిన మరునాడు, స్వామివారికి "బాగ్ సవారి" అనే ఉత్సవం జరుగుతుంది. నాడు అనంతాళ్వార్ తరుముకు వస్తూంటే స్వామి ఎలా పరుగు పెట్టారో, ఆ ఉత్సవం రోజు స్వామి పల్లకి అలా పరుగు పెడుతుంది.
💫ఆ ఉత్సవం పూర్తి విశేషాలను "సంవత్సరోత్సవాల్లో" విశదీకరించడమైనది.
అన్నమాచార్యుడు, కొండల్లో నెలకొన్న..., అనే కీర్తనలో
“అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి ముచ్చిలి పెట్టికి మన్ను మోచినవాడు”
అంటూ అనంతాళ్వార్ గాథను ప్రస్తుతించారు.
💫 అనంతాళ్వార్ గునపం దెబ్బకు శ్రీవారు గాయపడ్డ ఉదంతం తరువాత, వేంకటేశుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడైన అనంతాళ్వార్, చెరువును త్రవ్వడం అత్యంత శీఘ్రంగా పూర్తి చేయగలిగాడు. తన గురువు గారైన భగవద్రామానుజుల వారిని స్మరింపజేసే విధంగా, అ ఉద్యానవనానికి శ్రీరామానుజోద్యానవనం అని పేరు పెట్టాడు. కాలక్రమంలో ఆ తోట శ్రీవారికి కావలసిన సమస్త పుష్ప రాశులనూ సమకూర్చ గలగడమే కాకుండా, అత్యంత అరుదైన పుష్పజాతులతో తిరుమల క్షేత్రానికే ప్రధానాకర్షణగా నిలచింది.
💫 అనంతాచార్యుని ఆలోచనలన్నీ ఆనందనిలయం మీదే ఉండేవి. శ్రీనివాసుణ్ణి, శ్రీమహాలక్ష్మినీ రంగురంగుల పుష్పాలతో పలువిధాలుగా అలంకరించినట్లు, పాదపద్మాలకు పూలు సమర్పించినట్లు, పరంధాముణ్ణి, పద్మావతీ అమ్మవార్నీ పూలపల్లకిలో ఊరేగించినట్లు పరిపరి విధాల ఆలోచనల్లో మునిగి ఉండేవాడు. చిగురించే చెట్టును చూసినా, పూచే పుష్పాన్ని చూసినా శ్రీవారిని పుష్పగుచ్ఛాల్లో ముంచెత్తినట్లు అనుభూతి చెందేవాడు.
💫 ఇలా, అనంతాళ్వార్ - మనసా, వాచా, కర్మణః, శ్రీవారి పుష్పకైంకర్యసేవలో తలమునకలై ఉన్న తరుణంలో, సపరిచర్యలతో సంతృప్తి చెందిన శ్రీవారి ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి.
💫 'ఈ దండలే ఇంత మనోహరంగా ఉంటే, పూవులు పూచే తోట ఇంకెంత ఆహ్లాదకరంగా ఉంటుందో? ఏమైనా సరే! తన భక్తుడు అత్యంత అంకితభావంతో పెంచుతున్న పూదోటను ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే! అని సంకల్పించారు.
💫 ఒకనాటి రాత్రి ఏకాంతసేవా కార్యక్రమం ముగిసిన తరువాత, స్వామివారు అలివేలుమంగా సమేతంగా, విహారనిమిత్తం అనంతాళ్వార్ తోటకు ఏతెంచారు. కన్నులపండువగా ఉన్న పుష్పవనాన్ని చూసి పరవశించిపోయిన శ్రీవారు, కనిపించిన పువ్వునల్లా కోసి అమ్మవారి తలలో తురిమాడు. కొన్నింటిని తాను స్వయంగా ధరించి మరి కొన్నింటిని ఆఘ్రాణించాడు. అమ్మవారు కూడా, అయ్యవారికి ఏ మాత్రం తీసి పోకుండా, ప్రతి మొక్క వద్దకు వెళ్ళి, పువ్వుల పరిమళాల్ని ఆస్వాదించి, వాటిని కోసి స్వామివారి కిచ్చింది. ఇలా, పూదోట సోయగంలో మైమరచి, చెట్టపట్టాలేసుకు తిరిగి, ఆ జంట సుప్రభాత సమయానికి ఆనందనిలయం తిరిగి చేరారు.
💫 తెల్లవారిన తరువాత, తోటలో ప్రవేశించిన అనంతాళ్వార్ కి మతిపోయినట్టైంది. ఎక్కడ చూసినా, నలిపి పడేసిన పూలు, విరిగిన కొమ్మలు, రాలిన మొగ్గలు, తెగిపడిన ఆకులతో తోటంతా భీభత్సంగా ఉంది. ఉగ్రుడైన అనంతాళ్వార్, తోట ఆ పరిస్థితిలో ఉండటానికి కారణమైన వారిని శాపనార్థాలు పెడుతూ, దోషులను ఎలాగైనా పట్టుకోవాలనే కృతనిశ్చయంతో, తన శిష్యులను తోటకు కాపలా ఉంచాడు. కానీ, ఎంతకూ దొంగలు దొరకలేదు. పుష్పచౌర్యం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ఇక లాభం లేదనుకొని, కంటి మీద కునుకు లేకుండా తనే కాపలా కాసేవాడు. ఎన్నాళ్ళకూ దొంగ దొరకక పోవడంతో తల్లడిల్లి పోయిన అనంతాళ్వార్, తన పుష్పకైంకర్యానికి ఎలాంటి విఘాతం రానివ్వవద్దని, కన్నీళ్ళతో స్వామిని వేడుకొన్నాడు. భక్తుని కన్నీటికి కరిగిపోయిన శ్రీనివాసుడు, అనంతాళ్వార్ భక్తిని లోకానికి తెలియ జెప్పాలను కొన్నాడు.
💫 అదలా ఉండగా, తోటలో పహరా కాస్తున్న అనంతాళ్వార్‌కు, ఓ నడిరాత్రి సమయంలో, తోటలో సంచరిస్తున్న రెండు మానవాకారాలు కనిపించాయి. సుందర, సుకుమార శరీరాలతో, రాచఠీవి ఉట్టిపడే ముఖవర్ఛస్సుతో ఉన్న ఈ జంట రాజ దంపతులేమో? అయినా, ఎవరైతే నాకేంటి? స్వామివారికి అర్పించాల్సిన పుష్పాలను చిందరవందర చేస్తున్న వీళ్ళను ఏమాత్రం ఉపేక్షించకూడదు' ఆ విధంగా మనసులో తలపోస్తూ, స్వామిని చేజిక్కించుకో బోయాడు. ఇంద్రాది దేవతలకు, సనకాది మహర్షులకు చిక్కని చిద్విలాసుడు, ఈ బడుగు బాపడికి బందీ అవుతాడా? సంధించిన బాణంలా సాగిపోయాడు. పారిపోతున్న పెనివిటిని చూసి అచ్చెరువొందిన జగజ్జనని అనంతాళ్వార్ చేతికి చిక్కింది. ఉక్రోషం ముంచుకొచ్చిన అనంతాళ్వార్, చేజిక్కిన సిరుల తల్లిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. "మీరు యక్ష, కిన్నెర, గంధర్వులా? యతీంద్రులా? ఒక వేళ మానవులయితే, గొప్పింటి బిడ్డల్లా ఉన్నారు. మీకిదేం బుద్ధి? శ్రీవారి కైంకర్యానికి ఉపయోగించే ఈ సుకుమార కుసుమాల్ని ఛిద్రం చేయటానికి మీకు చేతులెలా వచ్చాయి? మీ సరస, సల్లాపాలకు నా తోటే కావలసి వచ్చిందా? ఎక్కడుంటారు మీరు? నీ మగని పేరేమిటి? భార్య కోసం రాని భర్త ఉంటాడా? అందులోనూ నీలాంటి ముగ్ధమనోహరి కోసం రాకుండా ఎక్కడికి పోతాడు?" ఇలా తన ఆక్రోశాన్నంతా వెళ్ళగక్కుతూ, తన ఉత్తరీయంతో అమ్మవారిని తోటలోనే ఉన్న ఓ సంపంగి మానుకు కట్టేశాడు.
💫 కలవరపాటుకు గురైన అమ్మవారు, వాత్సల్యం ఉట్టిపడే మృదువైన స్వరంతో... "నాయనా! నీ బిడ్డలాంటి నన్ను విడిచి పెట్టు. నేను వారిస్తున్నా వినకుండా నా మగడే నన్నీ తోటకు తోడ్కొని వచ్చాడు. నా మగని పేరు నేనెట్లా ఉచ్ఛరించ గలను? ఏ స్త్రీ అయినా తన పతిదేవుని పేరును పెదాలతో పలుక గలదా? ఓ పట్టాన ఆయన ఎవరికీ దొరకడు. అందు గలడిందు లేడనలేని వాడు ఎక్కడుంటాడని చెప్పగలను? ఎంత మంది ఎన్ని రకాలుగా పిలిచినా పలికే సర్వాంతర్యామి ఆయనే" అంటుంది.
"ఇందుకలడందు లేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూసిన అందందే గలడు"
💫 అమ్మవారి మాటలకు ఆగ్రహం హద్దులు దాటిన అనంతాళ్వార్ "చాలా గడుసుగా మాట్లాడు తున్నావమ్మా! ఎలా రాకుండా ఉంటాడో నేనూ చూస్తాను" అంటూ, తోట వెలుపలికి వెళ్ళి పరికించాడు. తోట బయట తచ్చాడుతున్న ఆ ఆకతాయి వెంట బడతాడు. ఆ పురుషుడు తోట నుంచి ఆనందనిలయానికి దక్షిణపు వీధిలో ప్రవేశించి ఆలయానికి అప్రదక్షిణంగా పారిపోతుండగా, అనంతాళ్వార్ అతన్ని తరుముతూ వెంటబడ్డాడు. శ్రీవారి ఆలయం ముందు, పుష్కరిణి దగ్గర, ఉత్తర-పశ్చిమ మాడ వీధుల్లో, అడ్డదిడ్డంగా పరిగెత్తిన ఆ దొంగ మళ్ళా అనంతాళ్వార్ తోటను సమీపించి అదృశ్యమయ్యాడు. విసిగి వేసారిన అనంతాళ్వార్ "తెల్లవారిన తరువాత దొంగ సంగతి చూద్దాం" అనుకుంటూ, అమ్మవారి పాదాల చెంత కునుకు తీశాడు. ఏ తల్లి కరుణా కటాక్షం కోసం సమస్త జగత్తూ అనుక్షణం పరితపిస్తూ ఉంటుందో, అటువంటి తల్లిని బందీ చేసి ఆమె పాదాల చెంత రాత్రల్లా పడుకున్నాడు అనంతాళ్వార్ !
💫 ఇంతలో, భళ్ళున తెల్లవారడంతో బంగారువాకిళ్ళను తెరిచిన అర్చకస్వాములు, వక్షస్థల లక్ష్మి కనపడక పోవడంతో వణికి పోయారు. స్వామివారు సౌమ్యంగా, "అర్చక శిఖామణులారా! ఆందోళన చెందకండి. అనంతాళ్వార్ రాత్రంతా అమ్మవారిని కట్టేశాడు. ఆయన్ను వేడుకొని, అమ్మవారిని తోడ్కొని రండి" అని శెలవిచ్చారు. అర్చకులు వేద మంత్రాలతోటీ, మంగళ వాద్యాలతోటీ అమ్మవారి కోసం తరలి వెళ్ళారు. చెట్టుకు కట్టివేయబడి, బేలగా, మగని రాక కోసం వీక్షిస్తున్న లక్ష్మీదేవిని చూసి అచ్చెరువొందిన అర్చకులు అనంతాళ్వార్ తో, "ఎవరిని కట్టేశావో తెలుసా? సమస్త జగత్తునూ శాసించగలవాడి భార్య ఆవిడ. సాక్షాత్తూ, శ్రీమహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాన్ని నువ్వు కట్టేశావు. శ్రీవారు ఆమెను తోడ్కొని రమ్మన్నారు" అని స్వామి ఆదేశం వినిపించారు. తన తప్పు తెలుసుకొన్న అనంతాళ్వార్ "అయ్యో! ఎంత అపరాధం చేశాను? అనుక్షణం కొలిచే ఈ చేతులతోనే నిన్ను కట్టిపడేశాను." అని సాష్టాంగ నమస్కారం చేశాడు. జరిగిన తొందరపాటుకు పశ్చాత్తాపం ఒక వంక, అమ్మవారి సాక్షాత్కారానికి నోచుకొన్న భాగ్యానికి అంతు లేని ఆనందం వేరొక వంక! ఇలా పలు భావనలు ముప్పిరి గొనగా, అశ్రునయనాలతో అమ్మవారికి మనసారా నమస్కరించి, జరిగిన తప్పిదానికి క్షమార్పణ కోరి, ఆడపిల్లను అల్లుని చెంతకు చేర్చే విధంగా, ఓ బుట్టలో తోటలోని పువ్వులు అమర్చి, అమ్మవారిని వాటిపై ఆసీనురాల్ని చేసి, బట్టను శిరస్సునుంచుకుని, వగర్చుతూ, వగర్చుతూ అమ్మవారిని శ్రీవారి పాదాల చెంతకు చేర్చి, తెలియక చేసిన తప్పును మన్నించమని వేడుకొంటూ శ్రీవారి పాదాక్రాంతుడయ్యాడు.
💫 అప్పటివరకూ వినోదం చూస్తున్న శ్రీనివాసుడు "మామగారూ రండి" అని అనంతాళ్వార్ ను ఆప్యాయంగా ఆహ్వానించి, "నా భార్యను నీ ఇంట్లో ప్రేమతో కట్టేసుకున్నావు. పూలబుట్టలో కూర్చోబెట్టి స్వంత కూతురిలా నా చెంతకు చేర్చావు. చందన తాంబూలాలు స్వీకరించు. పిల్లనిచ్చిన మామ గారివి కదా!" అంటూ అనంతాళ్వార్ కు గంధం రాసి, పుష్పమాలలు వేసి, పట్టుబట్టలు పెట్టారు. అనుకోని కొత్త చుట్టరికంతో అనంతాళ్వార్ ఆనందానికి ఎల్లలు లేవు. భక్తి పారవశ్యంతో, శ్రీవారిని వేనోళ్ళ కీర్తిస్తూనే ఉన్నాడు.
💫 అలా, స్వామివారి చేత మామా అని పిలిపించు కొన్న ధన్యజీవి ఆ అనంతాళ్వార్ !
💫 ఆ పూలగంప లోని అమ్మవారు యథాప్రకారంగా బంగారు ప్రతిమయై శ్రీవారి వక్షస్థలాన్ని తిరిగి అలంకరించారు. అలా, అనంతాళ్వార్ పుణ్యమా అని, ఒక్క రాత్రిలోనే మునుపెన్నడూ లేని విధంగా అమ్మవారికి శ్రీవారితో వియోగము, పునఃస్సంగమమూ కలిగాయి.
💫 అనంతాళ్వార్ తవ్విన చెరువు ప్రక్కన ఉన్న వసతి గృహాల్ని "అనంతాళ్వార్ టాంక్ కాటేజెస్ (ఎ.టి.సి.)" గా వ్యవహరిస్తారు. ఆనాడు ఆ పుణ్యమూర్తి ఒంటరిగా తవ్విన ఆ చెరువు ఈనాడూ లక్షలాది యాత్రికుల దాహార్తిని తీర్చుతూ ఉంది.
💫 84 సం. ల సుదీర్ఘకాలం జీవించి శ్రీవారి సేవకే అంకితమైన ఆ అనంతాచార్యులు స్వామివారి సన్నిథిలోనే పరమపదం చేరుకొన్నారు. ఆయన నడయాడిన స్వగృహాన్ని మహాప్రదక్షిణ మార్గంలో నైఋతి మూలలో చూడవచ్చు. ఆయన ఇంటి ప్రాకారం మీదా, తోటలో ఉన్న మండపంలోనూ, అనంతాళ్వార్, ఆయన భార్యాబిడ్డలూ, సేవకుల చిత్తరువులు దర్శించుకోవచ్చు. ఆయన ఇంటికి వెనుకగా, నేటికీ ఉన్న ఓ దిగుడు బావి నీటినే అనంతాళ్వార్ తన అనుష్ఠానానికీ, ఆరాధనకు ఉపయోగించే వారు.
💫అనంతాళ్వార్ ఇంటి వెనుకగా ఉన్న తోటలో ఆయన సమాధిని (బృందావనం) మనం దర్శించవచ్చు. ఈ బృందావనం నుంచి ఉద్భవించిన పొగడమాను ఎండిపోయి, దాని పాదులో ఓ వటవృక్షం వృద్ధి చెందుతూ ఉంది.
💫బ్రహ్మోత్సవాల వంటి ప్రత్యేక సమయాల్లో, ఆలయ మహాప్రదక్షిణ మార్గంలో ఊరేగుతున్నప్పుడు, అనంతాళ్వార్ ఇంటి వద్ద కర్పూరహారతి నందుకున్న తరువాతనే ఆనందనిలయుడు ముందుకు సాగుతారు.
💫 భక్తునికీ-భగవంతునికీ ఉన్న ఈ విడదీయరాని బంధం – ఎన్నెన్నో జన్మల అనుబంధం!
💫 అనంతాళ్వార్ జ్ఞాపకాలన్నింటినీ పదిలపరుస్తూ, భావి తరాలకోసం భద్రపరుస్తున్న తి.తి.దే. వారి కృషి శ్లాఘనీయం!
No comments :