🌹శ్రీవారి కైంకర్యపరులు♾️
💫 "కైంకర్యం" అంటే భగవంతునికి ప్రీతిపాత్రమైన కార్యాన్ని ఆచరించటం. కింకరుడు చేసే పని "కైంకర్యం" గా పిలువబడుతుంది. కింకరుడు అంటే భగవంతుడు చెప్పిన లేదా ఆయనకు ప్రీతికరమైన పనులను తూచా తప్పకుండా, ఏ విధమైన సందేహం, తడబాటు, తాత్సారం లేకుండా, ఒక క్రమశిక్షణ గల సైనికుని వలె చేసుకుంటూ పోయే వాడు.
💫 శ్రీవారి ఆలయంలో నిత్యం నిర్వహించే కైంకర్యాలలో అనేకమంది కైంకర్యపరులు వివిధరకాల సేవలను శతాబ్దాలుగా అందించటం జరుగుతూ ఉంది. వీరిలో ప్రధానంగా మూడు రకాల వారున్నారు.
🙏 శ్రీ వైఖానస అర్చకులు
🙏 జియ్యరు స్వాములు
🙏 ఆచార్యపురుషులు
వీరితో పాటుగా - సన్నిధి గొల్ల కూడా ముఖ్యభూమిక పోషిస్తున్నారు.
💫 శ్రీవారి కైంకర్యాలలో ఎవరెవరు పాల్గొంటారు. వారు ఎప్పటినుండి ఆలయంతో అనుబంధం కలిగి ఉన్నారు, వారెటువంటి విధులు నిర్వహిస్తారు మొదలైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 శ్రీవైఖానస అర్చకులు 🙏
💫 "వైఖానస" అనే పదం విష్ణ్వాలయాల్లో అత్యంత అంకితభావంతో సేవలందించే నిమిత్తం శ్రీమహావిష్ణువు అంశతో జన్మించిన "విఖనమహర్షి" నుండి వచ్చింది. విఖనమహర్షి ఆలయాన్ని తిరుమలలోని ఉత్తరమాడవీధిలో, రాధాగోపాల ఆలయానికి ఎడం ప్రక్కగా దర్శించుకోవచ్చు. విష్ణువు అంశతో జన్మించడం వల్ల, ఈ మహర్షి సాక్షాత్తూ బ్రహ్మదేవునికి సోదరుడన్నమాట.
💫 వైఖానస శాఖకు చెందినవారు ఇతర వైష్ణవశాఖల్లో వలె తర్కం, మీమాంస జోలికి వెళ్ళకుండా, కేవలం విష్ణువు పూజాపునస్కారముల మీదనే శ్రద్ధ వహిస్తారు. శ్రీవారి కైంకర్యాలకు వీరి ప్రధాన గ్రంథమైన "శ్రీవైఖానస ఆగమం" మూలాధారం. దీనిలో పొందుపరచబడిన ప్రతి అంశాన్నీ వీరు పొల్లుపోకుండా ఆచరిస్తారు.
💫 ప్రస్తుతం ఈ శాఖకు చెందిన నాలుగువేల కుటుంబాల వారు ఆంధ్ర, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటకల్లోనూ; వృత్తిరీత్యా అమెరికా వంటి ఇతర దేశాల్లోనూ నివసిస్తున్నారు.
💫 శ్రీవైష్ణవుల నుండి సులభంగా గుర్తించబడడానికి వీలుగా, వీరు తిరుచూర్ణం స్థానంలో (నిలువు నామాల మధ్యలో ఉన్న గీత) కేసరి రంగు మిశ్రమాన్ని వాడుతారు.
👉 ఈ సారి మీరు తిరుమల లేదా శ్రీరంగం, కంచి వంటి మరేదైనా ప్రముఖ వైష్ణవ క్షేత్రాన్ని దర్శించుకున్నపుడు, వైఖానస అర్చకులకు ఉన్న నామాలను గమనించండి.
💫 శ్రీవారి ఆలయద్వారాలను తెల్లవారక ముందే తెరువటం మొదలు, తిరిగి అర్థరాత్రి సమయంలో మూసివేసే వరకు సమస్త కైంకర్యాలు వీరి చేతుల మీదుగా జరగాల్సిందే. ఇతర కైంకర్యపరులందరూ వీరికి కేవలం సహాయ పడతారు.
💫 ఒక ఆలయం లోని అర్చామూర్తిలో దైవత్వం నెలకొని, ఆ ఆలయం అత్యంత ప్రసిద్ధిలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం సుశిక్షితులు, సద్వర్తనులైన అర్చకులు క్రమపద్ధతిలో నిరంతరాయంగా, లోప రహితంగా శతాబ్దాల తరబడి స్వామి వారికి అర్చనాదులు చేయడమే. తిరుమల ఆలయం ఈనాడు ఇంత ప్రాశస్త్యం చెందిందంటే, అందులో వీరి అకుంఠిత కృషి, అంకితభావాల పాత్ర ఎంతుందో చెప్పకనే చెబుతుంది.
💫 ఆగమశాస్త్రానుసారం, విష్ణువును పూజించే అర్హత, సామర్థ్యం కేవలం "విష్ణువు" కే ఉంటాయి. కాబట్టి, శ్రీవైఖానస అర్చకులు విస్తారమైన వైదిక ప్రక్రియల ద్వారా, అర్చన ప్రారంభించటానికి ముందు శ్రీమహావిష్ణువును తమలో ఆవహించుకుని, తమను తాము విష్ణువుగా పరివర్తించుకొని శ్రీవారి అర్చనాది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇంతటి మహత్కార్యం అనునిత్యం చేయాలంటే వారెంతటి నియమనిష్ఠలు, క్రమశిక్షణ, ఇంద్రియనిగ్రహం కలిగి ఉండాలో ఆలోచించండి!
💫 శ్రీవారి ఆలయానికి సంబంధించి అత్యంత ప్రామాణికంగా చెప్పుకునే "సవాల్-జవాబ్" పట్టీ అనే 1817వ సం. నాటి, బ్రిటీష్ పాలకులు వ్రాసిన పుస్తకంలో పొందుపరచిన వివరాల ప్రకారం ఆలయ ప్రధాన అర్చకులైన శ్రీమాన్ గోపీనాథ దీక్షితుల వారి కుటుంబం, శతాబ్దాల తరబడి అవిఛ్ఛిన్నంగా ఉండి, 9వ శతకంలో రెండుగా విభజించబడింది.
👉 మొదటి కుటుంబం భారద్వాజ గోత్రానికి చెందిన గోపీనాథ దీక్షితులది. విడివడిన, రెండవ కుటుంబం, కౌశిక గోత్రానికి చెందిన, తపస్సంపన్నుడైన శ్రీ శ్రీనివాస దీక్షితుల వారిది.
💫 ప్రస్తుతానికి ఈ రెండు గోత్రాలవారు గోత్రానికి రెండు కుటుంబాలు చొప్పున, మొత్తం నాలుగు కుటుంబాల వారు గుడిలో అర్చకత్వం వహిస్తున్నారు.
💫 భారద్వాజ గోత్రానికి చెందిన గొల్లపల్లి మరియు పైడిపల్లి కుటుంబాల వారు.
💫 కౌశికగోత్రానికి చెందిన తిరుపతమ్మ గారి మరియు పెద్దింటి వారి కుటుంబాల వారు.
💫 ప్రస్తుత ప్రధానార్చకులైన శ్రీ వేణుగోపాల దీక్షితుల వారు మరియు వారి ముందున్న శ్రీరమణదీక్షితుల వారు, భారద్వాజ గోత్రజులైన గొల్లపల్లి కుటుంబానికి చెందినవారు.
💫 ఆయా కాలాల్లో దాతలైనటువంటి రాజులూ, జమీందార్లూ ఆయా కుటుంబాలకు దానంగా ఇచ్చిన గ్రామాల పేర్లే కాలక్రమేణా వారి కుటుంబ నామధేయాలుగా మార్పు చెందాయి.
💫 శ్రీవైఖానస అర్చకులు మాత్రమే శీవారి మూలవిరాట్టును సృశించి, వారికి మరియు ఆనందనిలయంలో గల ఇతర దేవతామూర్తులకు కైంకర్యం చేయగలిగే అధికారం కలిగియున్నారు.
💫 క్షణకాల దర్శనానికే మనలాంటి సామాన్యులు పరితపించిపోతుంటే, నిత్యం స్వామివారిని సేవిస్తూ, స్పృశిస్తూ, వారి సన్నిధిలో గడిపే భాగ్యం కలగటం ఎన్ని జన్మల సుకృతమో కదా !
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 జియ్యంగార్లు 🙏
💫 ఆలయ ఆర్థిక వ్యవహారాలు చూడడానికీ, కైంకర్య ఏర్పాట్లు చేయడానికి ఆలయంలో ఆది నుండీ ఒక "ఆధికారవ్యవస్థ " ఉండేది. అయితే, వారు జీతభత్యాలకు పని చేసేవారు కావటంతో, వారికి శ్రీవారి పట్ల అచంచల భక్తి విశ్వాసాలు లేకుండా, వారు కేవలం ఉద్యోగధర్మంగా నిధులు నిర్వర్తించే అవకాశం ఉంది. ఆ కారణంగా, వారు కైంకర్యానికి కావలసిన వస్తు సామాగ్రిని సరియైన పరిమాణంలో, తగు నాణ్యతతో, సకాలానికి అందిస్తున్నారా లేదా అన్న విషయాన్ని నిర్ధారించు కోవడానికి, అర్చకులకు అధికారగణానికీ మధ్య ఒక అనుసంధాన వ్యవస్థ ఉండాలని భగవద్రామానుజులు తలంచారు (నేటి పరిభాషలో దీన్ని "ఆడిటింగ్" వ్యవస్థ అనుకోవచ్చు).
💫 ఆ వ్యవస్థను ఆజమాయిషీ చేసే వ్యక్తి ఆలయ ఆచార వ్యవహారాలను క్షుణ్ణంగా తెలిసినవాడై, స్వతహాగా నియమనిష్ఠలు కలవాడై, పాండిత్యవైరాగ్యాల్లో అధికుడైతేనే అతని మాటపై గౌరవం ఉంటుందని కూడా తలచారు. అంతేగాక, హుండీద్వారా, ఆర్జిత సేవల ద్వారా, దానధర్మాల ద్వారా, ఇంకా అనేక మార్గాల ద్వారా దేవాలయానికి చేకూరే ఆదాయాన్ని; నిత్యం జరిగే కైంకర్యఖర్చులు, జీతభత్యాలను సరిచూసుకునే ఒక సమాంతరవ్యవస్థ కూడా ఉండాలి. ఇంకా, ఆలయ కైంకర్య పద్ధతులు అధికారులకు పూర్తిగా తెలియక పోవచ్చు. వారికి ఈ విషయాల్లో మార్గదర్శకత్వం వహించాలి. ఈ కోణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని, "ఏకాంగి" అనే ఒక వ్యవస్థను రామానుజులవారు నెలకొల్పారు. తదనంతరం అదే జియ్యంగార్ల వ్యవస్థ గా ప్రసిద్ధి కెక్కింది. వివిధ కైంకర్యాలలో, ఆలయంలో జరిగే ప్రతి ఉత్సవం మరియు సేవలో ఈ వ్యవస్థ యొక్క ప్రాతినిధ్యం ఉండేలా కట్టుబాటు చేయబడింది. ఆలయం అభివృద్ధి చెందిన తరువాత, క్రమంగా అధికారయంత్రాంగ పరిమాణం భారీగా పెరగడంతో బాటు, అత్యున్నత స్థాయి (ప్రస్తుతం IAS) అధికార్లను కూడా నియమిస్తూ వచ్చారు. అంతే కాకుండా, ఆలయ నిత్యకృత్యాలన్నీ లిఖితపూర్వక ప్రమాణాలతో, లోటుపాట్లకు తావులేని రీతిలో చట్టబద్ధతను సంతరించుకున్నాయి. దాంతో, జియ్యంగార్ల బాధ్యతల్లో కూడా కొంత మార్పులు చోటు చేసుకున్నాయి.
💫 ప్రస్తుతం, వీరు సేవలూ ఉత్సవాల్లో అర్చకులకు పూజా సంభారాలు అందించడం, ఆలయ ద్వారాలు శాస్తోక్తంగా తెరిచే లాంఛనాల్లో సహాయపడడం, ఉత్సవసమయాల్లో దివ్యప్రబంధగానానికి ఆధ్వర్యం వహించడం, ఆలయ సాంప్రదాయాల నిర్వహణలో సాధారణంగా వచ్చే సందేహాల నివృత్తి చేయడం లాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు.
💫 సాక్షాత్తూ భగవద్రామానుజుల వారు ప్రవేశ పెట్టిన వ్యవస్థ కావటం మరియు మందిర ఆచారవ్యవహారాల్లో ఆరితేరి ఉండడం వల్ల, వీరింకా విశేష గౌరవాదరాలను చూరగొంటున్నారు. శ్రీవారి గర్భాలయంలో ప్రవేశించడానికి, శ్రీవైఖానస అర్చకులతో పాటుగా కేవలం జియ్యంగార్లకు మాత్రమే అనుమతి ఉంది.
💫 ఈ జియ్యంగార్లు వానప్రస్థాశ్రమం స్వీకరించినవారు. వీరు ఎల్లప్పుడూ చేతిలో త్రిదండం ధరించి ఉంటారు.
💫 "త్రిదండం" అంటే ఒకే పొద నుండి తీయబడిన మూడు వెదురు బద్దలను కలిపి కట్టి ఉంచిన పొడవాటి దండం. ఒక బద్ద ఆత్మకు, మరియొకటి ప్రకృతికి, మూడవది పరమాత్మకు సంకేతాలు. ఈ దండాన్ని ధరించిన వారిని "త్రిదండి" గా పిలుస్తారు (ఉదాహరణకు త్రిదండి చినజియ్యర్ స్వామి. వీరి ఫోటోను గుర్తు చేసుకుంటే, ఎల్లప్పడూ కుడిచేతితో, భుజం మీదుగా త్రిదండాన్ని ధరించి ఉంటారు).
💫 కైంకర్యాలలో అంతరాయం ఉండకూడదని ఇద్దరు జియ్యంగార్లు ఉండే సంప్రదాయం మొదలైంది. పెద్దజియ్యంగార్ పరమపదించితే చిన్న జియ్యరు పెద్దజియ్యర్ అవుతారు. వెంటనే మరొక యోగ్యుడైన వ్యక్తిని చిన జియ్యంగారుగా నియుక్తి చేస్తారు. వీరు వంశ పారంపర్యంగా వచ్చే మిరాశీలు కాదు. అరబిక్ భాషలో "మిరాశీ" అంటే వంశ పారంపర్యమని అర్ధం. మహమ్మదీయుల పరిపాలనా కాలంలో ఈ పదం వాడుకలోకి వచ్చింది. గౌ||. ఎన్. టి. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మిరాశివ్యవస్థలో పెను మార్పులు సంభవించాయి. ఆ విషయాలు మరొకచోట వివరంగా చర్చించడమైనది.
💫 పెద్దజియ్యరుగారి మఠం ప్రస్తుతం తిరుమలయందు బేడి ఆంజనేయస్వామి ఆలయం ప్రక్కగా, రాంబగీచా విశ్రాంతిగృహం నుండి, దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనకు కుడి ప్రక్కగా, ప్రముఖంగా కనిపిస్తుంది. జియ్యరుస్వామి వారు వేరే కార్యక్రమాల్లో లేనప్పుడు ఈ ఆశ్రమాన్ని దర్శించుకొని, వారి ఆశీర్వాదం తీసుకోవచ్చు.
💫 ప్రస్తుతం "ఏకాంగి" అంటే, జియ్యంగార్ల పరిచారకుడుగా, వారి తరఫున కైంకర్యాలలో సేవలందించే వ్యక్తిగా ప్రసిద్ధి కెక్కారు. ఈయన ఏకవస్త్రుడైన బ్రహ్మచారి.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 ఆచార్యపురుషులు 🙏
💫 ఆలయంలో జరిగే వివిధ కైంకర్యాలలో పాలు పంచుకునే మూడవ వ్యవస్థే, "ఆచార్యపురుషుల వ్యవస్థ".
💫 ప్రాచీన కాలంలో తిరుమల ఆలయం అనేక కూరమృగాలు మరియు విషపురుగులతో నిండివున్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండేది. ఆ కాలంలో దర్శనానికి వెళ్ళటమే గొప్ప విషయం. మరి ఇతర సేవల ప్రస్తావనే అత్యంత దుర్లభం. అట్టి క్లిష్ట పరిస్థితుల్లో, స్వామివారికి జరిగే కైంకర్యాలలో ఆగమశాస్త్రానుసారం కావలసిన సమస్త సదుపాయాలు సమకూరుస్తూ; ఆలయ ఆచారాలను కాపాడుతూ శ్రీవారికి వంశపారంపర్యంగా సేవ చేసి తరించిన శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన గొప్ప భక్తులే ఈ ఆచార్యపురుషులు!
💫 వారు చాలామంది ఉన్నా, ముఖ్యులైనవారు ఏడుగురు అని బ్రిటీషు కాలం నాటి "కైంకర్యపట్టీ" ద్వారా తెలుస్తోంది. వారెవరంటే -
1. తోళప్పాచారి - వీరు ఆకాశగంగ ఉద్భవించటానికి కారణ భూతులైన, శ్రీవారి మహాభక్తుడు "తిరుమలనంబి" వంశీయులు. తీర్థకైంకర్యం, మంత్రపుష్పకైంకర్యం, వేదపారాయణ కైంకర్యం వీరి విధులు. -
2. పురిశై – వీరు శ్రీవారితో ప్రగాఢ అనుబంధం కలిగివున్న మరో భక్తాగ్రేసరుడు. "అనంతాళ్వార్" వంశస్థులు. పుష్పకైంకర్యం మరియు ఉత్సవ సమయాలలో దివ్యప్రబంధగానం వీరి విధులు. -
3. భావనాచారి
4. ప్రతివాది భయంకరం ("సుప్రభాత" రచయిత అణ్ణన్ స్వామి వంశీయులు)
5. వీరవల్లి
6. కిడాంబి ధర్మపురి
7. పరవస్తు
💫 వీరందరూ, శ్రీవారికి పరంపరానుగతంగా, వివిధకాలాల్లో, వందల ఏళ్ళుగా పూజలు, నివేదనలు, పుష్పకైంకర్యాలు నిర్వహిస్తూ, శ్రీవారి ఆలయ కైంకర్య సాంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా కాపాడు తున్నటువంటి మహనీయులే!
💫 ప్రస్తుతం వీరందరూ వివిధ ఉత్సవ సమయాల్లో దివ్యప్రబంధ గానం చేస్తూంటారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 సన్నిధి గొల్ల 🙏
💫 శ్రీవారి సన్నిధిలో కైంకర్యాలను నిర్వహించే శ్రీవైఖానస అర్చకులను వారి నివాసగృహం నుండి జాగ్రత్తగా, సన్నిధికి దారి చూపుతూ, చేతిలో దివిటీ నుంచుకొని శ్రీవారి ఆలయానికి తోడ్కొని, రావటం స్వతహాగా "గొల్ల" లైన వీరి ప్రధాన బాధ్యత. ఉదయం సుప్రభాతసేవ, సమయంలో మరియు రాత్రి ఏకాంతసేవ సమయంలో వీరి పాత్రను మనం ముందు చెప్పుకున్న "సుప్రభాత సేవ" మరియు "ఏకాంతసేవ " ప్రకరణాలలో వివరించడం జరిగింది.
💫 తిరుమలనంబి, అనంతాళ్వారు, సన్నిధి గొల్లల గురించి మరిన్ని వివరాలు మున్ముందు "శ్రీవారి భక్తాగ్రేసరులు" అనే ప్రకరణంలో సవివరంగా తెలుసుకుందాం.
No comments :