🙏 శ్రీవారి ప్రసాదవిశేషాలు -1 🙏
🙏 శ్రీవారి భోజనప్రియత్వం 🌈
💫 శ్రీవారు అలంకార, పుష్ప, సంకీర్తన ప్రియుడే కాదు; నైవేద్యప్రియుడు కూడా !
💫 ఆనందనిలయుడైన శ్రీనివాసుడు ఆరగించే లెక్కకు మిక్కిలిగా ఉన్న పిండివంటలనూ, దివ్యాన్నాలను లెక్క పెట్టలేక తికమక పడ్డ తెనాలి రామలింగ మహాకవి, "తిండిమెండయ్యగారు" అని తిరుమలేశునికి ఒక బిరుదు తగిలించి ఆ స్వామివారి భోజనప్రియత్వాన్ని చాటి చెప్పాడు.
💫 "ఇందిర వడ్డించ ఇంపుగను" అంటూ అన్నమయ్యా...., "పాలు, వెన్న, బకాళాబాతు" అంటూ మరొక కవి, ఇలా ఎందరెందరో కవులు తిరుమలేశుని భోజనప్రియత్వాన్ని ఎలుగెత్తి చాటారు.
🙏 శ్రీవారికి మడులు - మాన్యాలు 🙏
💫 శ్రీవారి నివేదనకు నాటి రోజుల్లో ఎందరో చక్రవర్తులు, సామాన్యులు మడులూ - మాన్యాలు సమర్పించారు. ఆ విధమైన మాన్యాలు తిరుపతి పరిసరాల్లోనూ, చిత్తూరు జిల్లా అంతటా, అంధ్రా, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సుదూర ప్రాంతాలలోను ఈనాటికీ లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే, శ్రీవారి భక్తుల హృదయాలను కలచివేసే విధంగా ప్రసాదాల రూపంలో తరతరాలుగా కోట్లాది భక్తుల ఆకలి తీర్చిన మరెన్నో మాన్యాలు వివిధ పాలకుల హయాంలో అన్యాక్రాంతం అయ్యాయి కూడా! మిగిలివున్న వాటిని పదిలపరచు కోవాల్సిన బాధ్యత తి.తి.దే. సంస్థదే కాదు, ఆ అంతులేని ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదకు వారసులమైన మన అందరిదీ కూడా!
🙏 భక్తుల ఆకలి తీర్చిన ప్రసాదాలు 🙏
💫 శ్రీవారి ఆలయంలో గోడల నిండా ఉన్న శాసనాలలో ఎక్కువ భాగం ఏ ఏ రాజులు, ఏ ఏ ప్రసాదాలకు ఎంతెంత రొఖ్ఖం చెల్లించారో, ఎన్నెన్ని మాన్యాలు ఇచ్చారో లాంటి వివరాల గురించే ప్రస్తావించాయి. తిరుమల కొండపై ఏ విధమైన హోటళ్ళు, ఇతరత్రా భోజన ఏర్పాట్లు లేని ఆ రోజుల్లో ఈ ప్రసాదాలే సుదూరప్రాంతాల నుండి వచ్చి తిరుమలను సందర్శించుకునే యాత్రికుల క్షుద్బాధను తీర్చేవి. యాత్రికుల సంఖ్య పెరిగే కొద్దీ ప్రసాదాల పరిమాణం కూడా పెరుగుతూ వచ్చింది. ఈనాడు తిరుమలలో, ప్రసాదాలు, భోజనాల నిమిత్తం జరిగే వంట ఏర్పాట్లు ప్రపంచస్థాయిలో ఉంటాయంటే అతిశయోక్తి కాదు. దేవాలయానికి వచ్చిన ఏ భక్తుడు ఆకలితో లేదా అర్థాకలితో తిరిగి వెళ్ళరాదనే హిందూ సాంప్రదాయం తిరుమలలో అనూచానంగా పాటించ బడుతోంది.
🙏 శాస్తోక్తంగా వంటలు 🙏
💫 వంటవారు "వైఖానస ఆగమ సాంప్రదాయానికి" గానీ, "పాంచరాత్ర ఆగమ సంప్రదాయానికి" గానీ చెంది ఉండాలి.
💫 వైఖానసాన్ని గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాం. "పాంచరాత్ర సాంప్రదాయం" అనగా...
💫 హయవదనుడు అనే రాక్షసుడు బ్రహ్మనుండి వేదాలను తస్కరించి సముద్రగర్భానికి వెళ్ళి దాక్కున్నపుడు, వేదాలు మరియు అందులో పొందు పరుచబడిన మంత్రాలూ అందుబాటులో లేనందున, అయిదు రాత్రుల పాటు దేవతలంతా మంత్రం బదులుగా, తంత్రంతో విష్ణువుకు పూజ చేశారు. ఆ అయిదు రోజులు ఒక ప్రత్యేక పద్దతిలో భగవదారాధన జరిగింది కావున ఆ పూజా విధానానికి "పాంచరాత్రము" మనే పేరొచ్చింది. వేదాలను అసురుల నుండి రక్షించిన, "వేదనారాయణ స్వామి" వారి అత్యద్భుతమైన ఆలయాన్ని తిరుపతి సమీపంలో ఉన్న "నాగులాపురం" అనే గ్రామంలో నేడు మనం చూడవచ్చు.
💫 శ్రీవారి అర్చాప్రక్రియలో ఒక ముఖ్య ఘట్టమైన - "భోజ్యాసనం" అంటే, నైవేద్యం సమర్పించే ప్రక్రియ.
💫 విస్తారంగా జరిగే ఈ ప్రక్రియలో ప్రసాదాల వంటలకు సంబంధించి ఖచ్చితమైన విధివిధానాలు, నివేదించే పద్ధతులు, నివేదనా సమయాలు, జరగవలసిన ఉపచారాలు, వంటలో ఉపయోగించే దినుసులు, వాటి నిష్పత్తులు మొదలైనవన్నీ తూ.చా తప్పకుండా పాటిస్తారు.
💫 శ్రీవారికి నివేదించే హవిస్సును (ప్రసాదాలను) గర్భాలయ ప్రాకారానికి ఆగ్నేయమూలలో ఉన్న "పోటు" అనబడే ప్రధాన వంటశాలలో సిద్ధం చేస్తారు. వకుళమాత ఈ వంటశాల గోడకు ఉన్న రంధ్రంలోంచి చూస్తూ, తన కుమారుడైన శ్రీనివాసుని కోసం తయారయ్యే వంటలన్నింటినీ నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. తల్లి ప్రేమ మరి!
💫 ఈ సారి తిరుమల వెళ్ళినపుడు ఈ వకుళమాతను కూడా దర్శించుకుందాం.
💫 శ్రీవారి ప్రసాదాల గురించి మొట్టమొదటి, 614 వ సం. నకు చెందిన శాసనం విమానప్రాకారం లోని ఉత్తరపు గోడమీద చెక్కబడి ఉంది. ఆలయచరిత్రకు సంబంధించి మనకు లభ్యమైన తొలిశాసనం కుడా ఇదే!
💫 ఈ శాసనంలో తెలిపిన వివరాల ప్రకారం నాలుగు నాలీలు (ఒక నాలీ అంటే 16 పిడికిళ్ళు, సుమారు కిలో పైన) బియ్యంతో వండిన అన్నాన్ని కులశేఖరపడి లోపల శీవారికి నివేదన చేయాలి. దీని కోసం ఒక దాత తిరుచానూరు సమీపంలోని పైడిపల్లి అనే గ్రామాన్ని అర్చకులకు దత్తత ఇచ్చారు.
🙏 ప్రసాదాల విక్రయం? 🙏
💫 తిరుమల ఆలయంలో ప్రసాదాలకు సంబంధించి జనబాహుళ్యానికి అంతగా పరిచయం లేని ఆసక్తికరమైన చరిత్ర ఎంతో ఉంది. ఆలయంలో లభించిన శాసనాల ప్రకారం (శాసనం సంఖ్య 286 T. T.) ఆరేడు వందల సంవత్సరాల క్రితం అప్పటివరకూ ఏ దక్షిణభారత ఆలయంలోనూ లేనివిధంగా శ్రీవారి అర్చకులు, దేవాలయంలో పనిచేసే సిబ్బంది, ఇతర రాజోద్యోగులు, శ్రీవారి నైవేద్య కైంకర్య నిమిత్తం భూములను దానంగా ఇచ్చేవారు. అందుకు ప్రతిగా, వారు ఏ ఏ ప్రసాదాల నిమిత్తం భూములను దానమిచ్చారో, ఆయా ప్రసాదాల్లో నాలుగో వంతు వాటా వారికి దక్కేది. ఆ విధంగా వారి హక్కుభుక్తమైన వాటాను "ప్రసాదక్కరార్" లు అనబడే ప్రసాదం విక్రయదారులకు అమ్ముకునేవారు. అలా వారికి దత్తమైన విక్రయహక్కులకు సంబంధించి దస్తావేజులను వ్రాయించి, ఆలయ రికార్డుల్లో నమోదుచేసి ఆ లావాదేవీలకు చట్టబద్ధత కల్పించబడేది. ఆ విక్రేతలు తమకు హక్కుగా సంక్రమించిన నాలుగవ వంతు ప్రసాదాన్ని, ఆలయంలో "ప్రసాదంపట్టెడ" అనే ప్రదేశంలో ఉంచి భక్తులకు విక్రయించుకునే వారు. ఇలా దేవస్థానంవారి గుర్తింపుతో చట్టబద్ధంగా జరిగే లావాదేవీలు ఉభయతారకంగా ఉండేవి. ఈ ఏర్పాటుతో, అప్పట్లోనే విపరీతంగా గిరాకీ ఉన్న ప్రసాదాలను భారీమొత్తంలో తయారుచేయడం కోసం ఆలయానికి కావలసిన ఆదాయవనరులు, సాధన సంపత్తులు సమకూరేవి. అలాగే, జీతభత్యాలు లేకుండా లేదా అరకొర ఆదాయంతో స్వామివారిని నమ్ముకొని తరతరాలుగా అర్చనలు చేస్తున్న అర్చకులకు, ఆలయంలో ఇతర విధులు నిర్వర్తిస్తున్న చిరుద్యోగులకు స్వల్ప ఆదాయం ఒనగూడేది.
💫 నాలుగవ వంతు ప్రసాదం దాతలకు కేటాయించగా, మిగిలిన మూడు వంతుల ప్రసాదంలో దేవస్థాన యాజమాన్యం కొంత భాగం విక్రయించి, మరి కొంత భాగాన్ని ఆర్జిత సేవా భక్తులకు వితరణ చేసి, మిగిలిన ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా పంచిపెట్టేవారు. నాలుగో వంతు ప్రసాదం దాతలకు ఇచ్చే ఆనవాయితీ ఈనాడు లేకపోయినా, మొత్తం ప్రసాదంలో కొంత భాగాన్ని భక్తులకు ఉచితంగా పంచిపెట్టి, మిగిలిన దానిని దేవస్థానం వారు నిర్ణయించిన ధరలకు విక్రయించే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
💫 తిరుమలలో ప్రారంభమైన ఈ "ప్రసాదం హక్కుల విక్రయ" సాంప్రదాయం, తర్వాతి కాలంలో దక్షిణ భారతదేశం లోని అనేక దేవాలయాలకు విస్తరించినట్లు తెలుస్తోంది.
No comments :