🙏 అభిషేకనిమిత్తం ఆకాశగంగ తీర్థం 🙏
💫 మూలవిరాట్టుకు నవనీతహారతిని సమర్పించగానే భోగశ్రీనివాసునుకి జరిగే అభిషేకంతో "తోమాలసేవ" ప్రారంభమవుతుంది. ఈ అభిషేకానికి - పూర్వం శ్రీవారి నిత్యాభిషేక కైంకర్యంలో తరించిన మహాభక్తుడు తిరుమలనంబి వంశీయులు (వీరిని "తోళప్పాచార్యులు" గా పిలుస్తారు), దేవాలయానికి దాదాపు మైలున్నర దూరాన ఉన్న ఆకాశగంగ తీర్థాన్ని వెండి బిందెలతో, ఛత్రచామర మంగళవాద్య మర్యాదలతో, తెల్లవారకముందే తీసుకుని వచ్చేవారు. నడిరేయి చిమ్మచీకట్లలో, రక్షకభటులు వెంటరాగా, అరణ్యమార్గంలో, కాలినడకన, తరతరాలుగా ఈ అభిషేకజలాన్ని భుజాలపై మోసుకుంటూ తెస్తున్న తిరుమలనంబి వంశీయులు ధన్యజీవులు. అయితే ఈ మధ్యకాలంలో, ఆకాశగంగ నుండి అభిషేకజలాన్ని తెచ్చే లాంఛనం కేవలం శుక్రవారం నాడు మూలమూర్తికి జరిపించే శుక్రవారాభిషేకానికి మాత్రమే పరిమితం చేశారు.
💫 ఈ తీర్థాన్ని తెచ్చి, ఆలయానికి ప్రదక్షిణ చేసి, ఆ బిందెలను సన్నిధిలో ఉంచేవారు.
No comments :