🙏 భోగశ్రీనివాసునికి అభిషేకం 🙏
💫 అనంతరం అర్చకస్వాములు శ్రీవారికి నమస్కరించి, సుప్రభాతసేవలో మేల్కొలపబడిన భోగశ్రీనివాసుణ్ణి వెండి స్నానపీఠంపై వేంచేపు చేయిస్తారు. ఆర్ఘ్య, పాద్య, ఆచమన, అనుష్ఠాన, ఉపచారాలు చేసిన తరువాత, బంగారుబావిలో నిలువ ఉంచబడిన ఆకాశగంగ తీర్థంతో భోగశ్రీనివాసునుకి అభిషేకం చేస్తారు.
💫 తరువాత శ్రీవేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) వారి నిజపాదాలపై ఉన్న బంగారు తొడుగులకు కూడా అభిషేకం చేస్తారు. వేదపండితులు పురుషసూక్తం పఠిస్తూండగా, అర్చకులు శ్రీవారి సన్నిధిలోని నృసింహ, శ్రీరామ సాలగ్రామాలకు కూడా అభిషేకం చేస్తారు. అనంతరం మూలమూర్తికీ, వక్షస్థలలక్ష్మికీ, శ్రీదేవీ-భూదేవి సహిత మలయప్పస్వామికీ, ఉగ్రశ్రీనివాసునికీ, ఇలా సన్నిధిలో వున్న పంచబేరాలకు, అభిషేకం చేయించినట్లుగా ఆకాశగంగ తీర్థంతో సంప్రోక్షిస్తారు.
💫 అయితే రోహిణీనక్షత్రం నాడు మాత్రం సన్నిధిలోనే వున్న రుక్మిణీ శ్రీకృష్ణులకు కూడా తిరుమంజనం (అభిషేకం) నిర్వహిస్తారు. అలాగే, పునర్వసు నక్షత్రం నాడు సీతారామలక్ష్మణులకూ, శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణానక్షత్రం నాడు శ్రీదేవీ-భూదేవి సహిత మలయప్పస్వామికీ కూడా అభిషేకం జరుగుతుంది.
💫 అభిషేకానంతరం భోగశ్రీనివాసునికి వస్త్రాలంకరణ, తిలకధారణ చేసి; మిగిలిన ఉత్సవమూర్తులకు షోడశోపచారాలు సమర్పిస్తూండగా జీయ్యరు గార్లు, వైష్ణవస్వాములు దివ్యప్రబంధంలోని ఆళ్వార్లు గానం చేసిన 'తిరుప్పళ్ళి ఎళుచ్చి' అనే అరువది పాశురాలను పారాయణం చేస్తారు.
No comments :