🙏 పర్యంకాసనము (లేదా ఏకాంతసేవ) 🙏
💫 శ్రీవారి ఆలయంలో చిట్టచివరిగా జరిగే సేవ ఏకాంతసేవ. దీనినే ఆగమ పరిభాషలో "పర్యంకాసనము" లేదా "శయనాసనము" అని కూడా అంటారు.
💫 మొట్టమొదటగా, సన్నిధిలో శ్రీవారి మూలవర్లకు, ఇతర దేవతా మూర్తులకు రాత్రి తోమాలసేవలో అలంకరించిన పుష్పమాలలను సడలింపు చేస్తారు. బంగారు పట్టెమంచాన్ని తెచ్చి అనందనిలయానికి ముందున్న శయనమండపంలో వెండిగొలుసుతో వ్రేలాడదీసి దానిపై పట్టుపరుపునూ, దిండ్లను అమర్చుతారు. శయనమండపంలో ముగ్గు వేసి దీపాలను వెలిగించుతారు.
👉 పర్యంకాసనంలో అయిదు ఉపచారాలు ఉంటాయి.
1. మృగనాభిశ్చతాంబూలం (కస్తూరి సహిత సువాసన భరిత తాంబూలం),
2. గంధము,
3. పుష్పము,
4. ప్రదక్షిణ,
5. నమస్కారాదులు.
💫 ఈ ఉపచారాల తదుపరి, మహా భక్తురాలైన తరిగొండ వెంగమాంబ వంశీయులు పట్టెమంచం చుట్టూ రంగవల్లులు తీర్చి దిద్దుతారు. ఈ సేవను కౌతుకబేరం భోగశ్రీనివాసునికి జరుపుతారు. అయితే, ధనుర్మాసంలోని 30 రోజులూ భోగశ్రీనివాసునికి బదులుగా సన్నిధిలో ఉన్న వెండి కృష్ణమూర్తికి జరుపుతారు.
💫 అర్చకులు, ఆనంద నిలయాంతర్భాగంలో గల రాములవారి మేడ తలుపు దగ్గరగా వేసి, బంగారువాకిలికి తెర వేస్తారు. అప్పుడు గరుడమండపం వద్ద సన్నాయిమేళం శ్రవణానందంగా మ్రోగింపబడుతుంది. పోటువారు వేడిగా కాచిన ఆవుపాలు సన్నిధికి తెస్తారు. సభ అరవారు పంచకజ్జాయం (జీడిపప్పు, పంచదార, యాలకులు, గసగసాలు, ఎండుకొబ్బరి ముక్కల మిశ్రమం), మధురఫలాల ముక్కలు, తాంబూలం, చందనం సిద్ధం చేసి సన్నిధికి తెస్తారు. అర్చకస్వామి పంచపాత్రలలో, బంగారు బిందెలోని తీర్థం నింపి ఉంచుతారు. ఆలయ ఐతిహ్యం ప్రకారం రాత్రి తలుపులు వేసిన తరువాత బ్రహ్మాది దేవతలు శ్రీవారికి ఏకాంతంగా ఆరాధన చేస్తారని ప్రతీతి. వారి ఆరాధన కోసం పంచపాత్రలలో ఈ తీర్థం సిద్ధం చేస్తారు. శ్రీవారి దర్శనం తరువాత, వకుళమాత దర్శనానంతరం ముఖ్యాలయానికి ఎడంప్రక్కగా ఉన్న గట్టుమీద, అంకురార్పణ మంటపంలో సుప్రభాత సేవ భక్తులకు వితరణ చేసే తీర్థం అదే. బ్రహ్మచే అభిషేకించబడిన తీర్థం కనుక దాన్ని "బ్రహ్మతీర్థం" అంటారు.
💫 శ్రీవారి గెడ్డాన్ని పచ్చకర్పూరంతో అలంకరిస్తారు (దీనికి సంబంధించి ఆసక్తికరమైన కథను శ్రీవారి భక్తశిఖామణి అయిన అనంతాళ్వార్ చరిత్రలో తెలుసుకుందాం). శ్రీవారి బంగారు పాదకవచాలు తీసి, స్వామిపాదాల మీద రెండు చందనపుముద్దలు సమర్పిస్తారు. వక్షస్థల లక్ష్మీ అమ్మవారికి ఒక చందనపు ముద్ద ఉంచుతారు. మరొక ముద్ద బ్రహ్మాది దేవతల ఆరాధన నిమిత్తం, అరముద్ద భోగశ్రీనివాసమూర్తి హృదయంపైనా ఉంచుతారు. తరిగొండ వంశీయులు "ముత్యాలహారతి" తట్టలో ముత్యాలతో శ్రీవారి రూపం ఏర్పరిచి, హారతికర్పూరం, ముడుపు (తమలపాకులు, వక్కలు) సిద్ధం చేస్తారు.
💫 తదుపరి, సన్నిధిలో వైఖానస అర్చకులు మాత్రం ఉండగా, రాములవారి మేడ తలుపులు వేయబడతాయి. అర్చకులు మంచాన్ని మంత్రోదకంతో సంప్రోక్షించి, ఉదయం ఆరాధన సమయంలో మూలవర్ల నుండి ఇతరబేరములకు ఆవాహన చేసిన శక్తిని మూలవర్లలోనికి పునరావాహన చేసి, శ్రీవారి శయనబేరం అయిన భోగ శ్రీనివాసుణ్ణి శయనం పైకి ఆహ్వానించి, పట్టెమంచంపై నుండి భక్తులను చూస్తున్నట్లుగా, దక్షిణం తలంపుగా శయనింపజేస్తారు. తదుపరి, హారతి సమర్పించడంతో ఆ రోజు నిత్యకైంకర్యాలు సమాప్తి అవుతాయి.
💫 అర్చకులు, సాబూతు (స్వామివారికి అలంకరించిన నగల పరిశీలన) చూసుకుని, మంత్రోచ్ఛారణ జరుగుతుండగా, కుంచెకోలతో తలుపులు మూసివేస్తారు.
🙏 రాత్రి అర్చన 🙏
💫 అర్చకస్వామి ఘంటానాదం చేసి, కూర్మాసనం మీద ఆసీనుడై, సంకల్పం చేసి అర్చన ప్రారంభించగానే, వేదపారాయణదారు కేశవాది చతుర్వింశతి నామాలు పఠిస్తుండగా, తులసిదళాలను శ్రీవారి పాదాలకు అర్పించి, ధూప, దీప సమర్పణ చేస్తారు. తర్వాత శ్రీవారికి అష్టోత్తర నామావళి పఠనంతో పాటుగా తులసీదళార్చన జరుగుతంది. వెంటనే వక్షఃస్థల మహాలక్ష్మికి "చతుర్వింశతి" నామార్చన చేసి, నీరాజనం సమర్పణ చేసి, నైవేద్యాన్ని సమర్పించి బంగారువాకిలి ప్రక్కన ఉన్న ఘంటామండపం లోని గంటలన్నింటినీ ఒకే సారి గంభీరంగా మ్రోగిస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
No comments :