🙏 కొలువు (లేదా ఆస్థానం లేదా దర్బార్) 🙏
💫 బంగారు వాకిలిని ఆనుకుని లోపల ఉన్న గదిని 'స్నపన మండపం' అంటారు. అక్కడే శ్రీవారికి ప్రతిరోజూ ఉదయం 4.30 గం.ల నుండి ఆస్థానం జరుగుతుంది.
💫 సన్నిధిలో ఉన్న పంచబేరాలలో ఒకరైన కొలువు శ్రీనివాసమూర్తిని ఛత్రచామరాది మర్యాదలతో, మంగళవాద్యాలతో, స్నపన మండపంలో ఉంచిన బంగారు సింహాసనంపై వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి కొలువు నిర్వహింప బడుతుంది. ఈ సేవ పూర్తిగా ఏకాంతం. అర్చకులూ, ఆలయ అధికారులచే నిర్వహించ బడుతుంది. భక్తులకు అనుమతి లేదు.
💫 కొలువు శ్రీనివాసునికి షోడశోపచారాలు నిర్వహించి, ధూపదీప హారతులు సమర్పిస్తారు. అనంతరం అర్చకులు, శ్రీవారి నుండి తాంబూలం, దక్షిణతో కూడిన 20 శేర్ల (ఇంచుమించగా 16 కిలోలు) బియ్యాన్ని దానంగా స్వీకరించి, "నిత్యేశ్వర్యాభవ" అని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తారు. ఆస్థానసిద్ధాంతి శ్రీనివాసునికి పంచాంగశ్రవణం చేస్తూ, ఆనాటి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను వినిపిస్తూ, నాటి ఉత్సవ విశేషాలను శ్రీవారికి తెలుపుతారు. ఆలయం యొక్క బొక్కసం (ట్రెజరీ) అధికారులు క్రితంరోజు ఆలయానికి హుండీ ద్వారా వచ్చిన రొఖ్ఖం, ఇతర కానుకల వివరాలను, ఆర్జిత సేవల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను మొదలగు వాటిని చదివి వినిపిస్తారు.
💫 కొలువు లేదా దర్బార్ యొక్క మిగతా విశేషాలన్నింటినీ మనం పంచబేరాలు కొలువు శ్రీనివాసుడు అనే ప్రకరణంలో తెలుసుకున్నాం. ఉదయం 4.30 గం. ల ప్రాంతంలో, ఆలయ పరిసరాల్లో మనం ఎక్కడ ఉన్నా "కొలువు" సందర్భంగా శ్రీవారికి చెప్పబడే వివరాలన్నింటినీ మనం కూడా వీనులవిందుగా విని తరించవచ్చు.
No comments :