🙏 నిత్యకళ్యాణోత్సవం 🙏
💫 శ్రీదేవీ-భూదేవి సమేతుడైన శ్రీమలయప్పస్వామికి ప్రతినిత్యం మధ్యాహ్నం 12 గం. లకు అభిజిల్లగ్నంలో నిత్యకళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. రెండవ అర్చన, గంట ('గంట' గురించి తరువాత తెలుసుకుందాం), నివేదన పూర్తయిన తరువాత సంపంగి ప్రాకారం లోని కళ్యాణమంటపంలో శ్రీమలయప్పస్వామి వారు తూర్పు ముఖంగా ఒక బంగారు సింహాసనం మీద వేంచేపు చేయబడుతారు. దక్షిణంగా శ్రీదేవీ-భూదేవి అమ్మవార్లు మరొక బంగారు సింహాసనం మీద వేంచేపు చేస్తారు. 15-17 శతాబ్దాలలో తాళ్ళపాక వంశీయులు ఈ కళ్యాణోత్సవం ప్రారంభించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. తాళ్ళపాక వంశస్థులే నేటికీ కన్యాదాతలుగా వ్యవహరిస్తారు. శ్రీవారికి కళ్యాణం చేయించటానికి విచ్చేసిన గృహస్థులను కళ్యాణమంటపానికి అనుమతించి, వారి గోత్రనామాదులతో సంకల్పం చెప్పించి, వారిని స్వామి వారికి అభిముఖంగా కూర్చోబెడతారు.
💫 కళ్యాణోత్సవ కైంకర్యం జరిపించే వైఖానస అర్చకులు పసుపు ధోవతి ధరించి, బృహస్పతిగా వ్యవహరించే మరో అర్చకునితో సహా 'వోచి' సహాయంతో మంటపప్రవేశం చేసి శ్రీవారి పాదసేవ చేసుకుంటారు.
💫 తదుపరి క్రమంగా విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షాబంధన (కంకణధారణ), అగ్నిప్రతిష్ఠ, హోమములు, తెరపట్టడం, కన్యావీక్షణము, మహాసంకల్పము, కన్యాదానము, గోత్రపఠనం, మాంగల్యపూజ, మాంగల్యధారణ, కర్పూరనీరాజనం, ప్రధానహోమం, లాజహోమం, పూర్ణాహుతి, రక్షాతిలకధారణ వంటి కైంకార్యాలను పూర్తి చేస్తారు.
💫 ఆ వెంటనే 'వారణమాయిరం' (వధూవరులు నారికేళాలు చేతులు మార్చుకునే వివాహ లాంఛనం) కైంకర్యం జరిపి, పుష్పమాలా పరివర్తనం (శ్రీవారు-అమ్మవార్లు వేడుకగా పుష్పమాలలు మార్చుకునే ఘట్టం) గావించి, అమ్మవార్లను స్వామివారి వద్దకు వేంచేపు చేసి, 'అక్షతారోపణ' తంతు (తలంబ్రాలు పోసుకోవడం) కావించి, చివరిగా ఆనందకర్పూరహారతితో కళ్యాణం ముగిస్తారు.
💫 సర్వజనులు క్షేమ, స్టైర్య, ధైర్యాదులతో ఉండాలనీ, స్త్రీలు ఈ జన్మలోనూ, మరుజన్మలోనూ, సువాసినులుగా ఉండాలనే మహాసంకల్పంతో శ్రీవారికి నిత్యకళ్యాణోత్సవం జరిపించటం పరిపాటి. ఈ నిత్యకళ్యాణోత్సవం వల్లనే శ్రీవారికి 'కళ్యాణచక్రవర్తి' అని, తిరుమల క్షేత్రం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నదని ప్రశస్తులు ఏర్పడ్డాయి.
💫 ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గం. నుండి 1 గం. వరకూ ఈ నిత్యకళ్యాణోత్సవం జరుగుతుంది.
No comments :