🙏 సహస్రదీపాలంకరణసేవ 🙏
💫 ఉభయదేవేరులతో కూడిన మలయప్పస్వామి వారు వైభవోత్సవమండపం నుండి సహస్రదీపాలంకరణ మండపానికి విచ్చేస్తారు. ఈ మండపం నాదనీరాజనం వేదికకు కుడిప్రక్కగా, తూర్పు-దక్షిణ మాడవీధుల కూడలిలో ఉంటుంది.
💫 అప్పటికే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్రదీపాల మధ్య ఉన్న ఊయలో స్వామివారు ఉభయదేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారికి మొదటగా, పంచకజ్జాయం నివేదన చేసిన తరువాత వేదపారాయణ పఠనం, అన్నమాచార్య - పురందరదాసు కీర్తనల ఆలాపన, నాదస్వరవాదన వినిపిస్తారు. ఈ విధంగా వేద, నాద, గానాలతో మలయప్పస్వామి మెలమెల్లగా ఊయల ఊగుతూ భక్తులకు దర్శనమిస్తారు. తరువాత శ్రీవారికి నక్షత్ర హారతి, కర్పూర నీరాజన సమర్పణతో ముగిసే ఈ సేవ ప్రతిరోజూ సాయంకాలం 5.30 గం. లకు మొదలవుతుంది. ఏ విధమైన ముందస్తు బుకింగు లేకుండా, టిక్కెట్టు లేకుండా కూడా ఎవరైనా ఈ సేవ చూసి తరించవచ్చు. ముందస్తు టిక్కెట్టు తీసుకున్న భక్తులకు మాత్రం, ముందు వరుసల్లో కూర్చుని, సేవను సమీపం నుంచి దర్శించుకునే అవకాశం కలుగుతుంది.
💫 అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో, నాలుగు మాడవీధులలో నిత్యోత్సవానికి వేంచేస్తారు. ఆలయానికి 8 దిక్కులలో కర్పూర నీరాజనం సమర్పిస్తారు. తూర్పు మాడవీధిలో పుష్కరిణి వద్ద 'పుష్కరిణి హారతి' సమర్పింప బడుతుంది. తదుపరి, కుంభహారతి మరియు కర్పూరహారతి సమర్పణతో శ్రీవారు ఆలయ పునఃప్రవేశం చేస్తారు.
💫 దీనితో, ఉత్సవమూర్తులకు ఆలయం వెలుపల జరిగే నిత్యసేవలు పూర్తవుతాయి.
No comments :