🙏 సాయంకాలం అర్చన 🙏
💫 శ్రీవారి ఉత్సవమూర్తులను బంగారువాకిలిలో వేంచేపు చేసి, సిరాతళిగ ను (రవ్వతో చేసిన ప్రసాదము - రవ్వకేసరి లాగా ఉంటుంది) నివేదించి నీరాజనం సమర్పిస్తారు. ఉత్సవర్లను తిరిగి సన్నిధిలో యథాస్థానానికి వేంచేపుచేసి హారతి సమర్పిస్తారు. అప్పుడు రెండవ తోమాలసేవ ప్రారంభమవుతుంది.
💫 సన్నిధిగొల్ల ముందు రాగా అర్చకులు ఆలయప్రవేశం చేసి స్వామికి పాదసేవ చేసి, హారతి ఇచ్చిన తరువాత మూలవర్లకూ, ఇతర దేవతా మూర్తులకు ఉదయం తోమాలసేవలో అలంకరింపబడిన పుష్పమాలలు సడలింపు చేయబడతాయి. తరువాత స్థలశుద్ధి, పాత్రశుద్ధి జరుపబడతాయి. అనంతరం జియ్యరు స్వాములు యమునోత్తరైలోని పుష్పమాలలు వెదురుబుట్టలో ఉంచి, శిరస్సు మీదుంచుకొని, ధ్వజస్తంభ ప్రదక్షిణగా సన్నిధికి చేరుతారు. పిమ్మట అర్చకులు ఘంటానాదం చేసి, జియ్యంగార్ స్వామికి ఆలవట్టం (వెడల్పైన, నగిషీలతో కూడిన వెండి వింజామర) ఇచ్చి, వారిచేతి నుండి తులసి స్వీకరించి, ప్రాణాయామం, సంకల్ప క్రియలు చేస్తారు. బంగారుబావి తీర్థంతో పాత్రలు నింపి శ్రీవారి ఆరాధనకు సిద్ధం చేస్తారు. మూలవర్లకు ఆసనం, పాదం, ఆర్ఘ్యం, ఆచమనం, శంఖోదకం వంటి ఉపచారాలు చేస్తారు. తర్వాత మూలవర్లతో సహా దేవతా మూర్తులందరినీ పుష్పమాలలతో నేత్రపర్వంగా అలంకరిస్తారు. మంత్రపుష్పం చదివిన తరువాత, ఉదయం వలె జియ్యర్ స్వాములు, "సాయిత్తిరుళా..." అని పాత్రం చెప్పగానే, కులశేఖరపడి వెలుపల ఉన్న అధ్యాపకులు, "నిత్యానుసంధానం" అనే నాలాయిర దివ్యప్రబంధలోని పాశురాలను గానం చేస్తారు.
💫 అనంతరం శ్రీవారికి నక్షత్ర హారతి, కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. అర్చకస్వామి శ్రీవారికి ఆలవట్టం సమర్పించి క్షమాప్రార్థన, పాదసేవ చేసిన తరువాత జియ్యరు స్వాములకు, గోష్ఠికి (అర్చక బృందం) శఠారి ఇస్తారు.
No comments :