🌹 శ్రీవారి సేవలు - 🙏 సుప్రభాతసేవ 💐
💫 తిరుమల క్షేత్రంపై ఆజమాయిషీ తరచూ చేతులు మారినప్పటికీ, చారిత్రకాధారాలు లభ్యమైనంత వరకు, సకలలోక సార్వభౌముడైన శ్రీనివాసునికి సేవలు, ఉత్సవాలు పదిహేను వందల సంవత్సరాలకు పైబడి కొనసాగుతూనే ఉన్నాయి. వెయ్యేళ్ళ క్రితం శ్రీరామానుజులవారు, అంతకు పూర్వం జరిగే సేవలన్నింటినీ క్రమబద్ధీకరించి, ఒక నిర్దిష్టమైన సేవలపట్టీని, అర్చనావిధానాన్ని రూపొందించారు. ఈనాడు కూడా, స్వల్ప మార్పులు, చేర్పులతో అవే సేవలు, అదే క్రమంలో జరుపబడుతున్నాయి. కాలానుగుణంగా, మరికొన్ని ఇతర సేవలు కూడా చేర్చబడ్డాయి.
💐 ప్రస్తుతం సంవత్సరానికి 450 కు పైగా ఉత్సవాలు జరుగుతాయి.
💐 నిత్య, వార, పక్ష, త్రైమాసిక, వార్షిక ఉత్సవాలు ఎన్నో, ఎన్నెన్నో...
💫 ఆలయ ఆగమశాస్త్రానుసారం, స్వామి రోజూ ఆరుసార్లు పూజలందుకుంటున్నారు. వీటినే "షట్కాల పూజలు" గా వ్యవహరిస్తారు.
💫 "సుప్రభాతసేవ" నుండి దాదాపు నడిరేయి సమయంలో జరిగే "ఏకాంతసేవ" వరకూ....
💫 బ్రహ్మముహుర్తంలో సుప్రభాతగానాన్ని ఆలకించి, నవనీతహారతి నందుకొని విశ్వరూపదర్శనాన్ని అనుగ్రహించే స్వామివారు అనేక సేవలు, లెక్కకు మిక్కిలి నైవేద్యాలు అందుకుంటూ, రాత్రి ఏకాంతసేవలో ముత్యాలహారతితో హయిగా విశ్రమిస్తారు. ఆ సేవలన్నింటినీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
♾️┉┅━❀🕉️❀┉┅━♾️
🙏 సుప్రభాతసేవ 💐
💫 చారిత్రక ఆధారాలను బట్టి ప్రస్తుతం అమలులో ఉన్న సుప్రభాతసేవా విధానం 15వ శతాబ్దిలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఈ సేవ ఎలా జరిగేదో తెలిపే ఆధారాలు లభ్యం కాలేదు. ఐతే, స్వామివారికి మేలుకొలుపులు పాడే సాంప్రదాయం మాత్రం ఎప్పటినుండో ఉంది.
💫 తరతరాలుగా, హైందవజాతిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగ్రృతం చేస్తున్న మహత్తర స్తవం - "శ్రీవేంకటేశ్వర సుప్రభాతం." నేటికీ లక్షలాది, దేశవిదేశాలలో ఉన్న తెలుగువారి ఇండ్లలో దినచర్య, నిత్యపూజ సుప్రభాత పఠనంతోనే ఆరంభమవుతాయి. ప్రాతఃసంధ్య వేళ ఈ సుప్రభాతగానం వినగానే, భగవధ్యానంలో తాదాత్మ్యం చెంది, మనం పొందే అలౌకిక, ఆధ్యాత్మిక అనుభూతి వర్ణనాతీతం!
💫 కలియుగంలో కూడా, త్రేతాయుగపు శ్రీరామునివలెనే "కౌసల్యాసుప్రజారామా" అంటూ మేలుకొలుపు పాడించుకోవడం ద్వారా, తాను సాక్షాత్తూ శ్రీరామచంద్రుని మరో అవతారమని స్వామి లోకాలకు చాటుతున్నారు. అలాగే, శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలో ద్వాపరయుగపు శ్రీకృష్ణుని ప్రస్తావన మరియు ప్రత్యేక పూర్వపుయుగాల్లో శ్రీమహావిష్ణువు యొక్క అనేక అవతారల వర్ణన కూడా కానవస్తుంది.
💐 29 శ్లోకాలున్న "సుప్రభాతము"
💐 11 శ్లోకాలున్న "స్తోత్రము" (కమలాకుచ చూచుక కుంకుమతో...),
💐 16 శ్లోకాలున్న "ప్రపత్తి" నీ (ఈశానాం జగతో...),
💐 14 శ్లోకాలున్న "మంగళాశాసనాన్ని" (శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే...),
💫 15వ శతాబ్దంలో.. మనవాళ మహముని శిష్యుడైన "ప్రతివాద భయంకర అణ్ణన్ స్వామి" రచించారు. వారి అసలు పేరు హస్తగిరినాథన్. ఇంతటి మహత్తరమైన స్తోత్రరత్నావళి నందించిన వీరు శ్రీవారి భక్తులందరికీ ప్రాతఃస్మరణీయులు.
💫 ప్రతిరోజు బ్రాహ్మీముహుర్త కాలంలో (తెల్లవారుఝామున 2:30-3:00 గం. ల మధ్య) సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయంలో 'సన్నిధి గొల్ల' తిరునామం ధరించి, దివిటీ చేబూని ఉత్తరమాడవీధి లోని అర్చకుల ఇంటికి వెళ్ళి, వారికి నమస్కరించి, సాదరంగా వారిని ఆలయానికి ఆహ్వానిస్తాడు. అప్పటికే పవిత్ర స్నానం, ఊర్ధ్వపుండ్రధారణ (తిరునామాలు), అనుష్టానాదులు ముగించి సిద్ధంగా ఉన్న అర్చకస్వాములు శ్రీవారి బంగారువాకిలిని తెరిచే "కుంచెకోల" అనబడే పరికరాన్ని భుజంపై పెట్టుకొని, తాళంచెవుల గుత్తితో, సన్నిధిగొల్లను అనుసరిస్తూ ఆలయానికి విచ్చేస్తారు.
💫 ఇలా అర్చకస్వాములు మహాద్వారం వద్దకు చేరగానే మహాద్వారానికి లోపల, ఉత్తరదిక్కున ఉన్న నగారామండపంలో పెద్ద పలకగంటను మ్రోగిస్తారు. 1960 ల్లో, ఈ గంట దేవాలయానికి ఎదురుగా ఉన్న వేయికాళ్ళమంటపం పైకప్పుకు వ్రేలాడుతుండేది. మాడవీధుల విస్తరణలో భాగంగా, ఈ మధ్యకాలంలో ఆ మంటపం కూల్చివేయబడింది.
💫 సన్నిధిగొల్లను అనుసరిస్తూ వస్తున్న అర్చకులు ప్రధాన ద్వారదేవతలకు (శంఖనిధి-పద్మనిధి) మంత్రపూర్వక ప్రణామాలర్పిస్తూ ఆలయప్రవేశం చేస్తారు. వారి వద్ద ఉన్న కుంచెకోలనూ, తాళంచెవులగుత్తినీ ధ్వజస్తంభ మండపంలో ఈశాన్యదిక్కున ఉన్న క్షేత్రపాలకశిలకు తాకించి, భక్తితో నమస్కరించి, ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా వెండి వాకిలిని దాటి, బంగారువాకిలి ముందు మౌనంగా స్వామివారిని ధ్యానం చేస్తుంటారు.
💫 అర్చకస్వాములను అక్కడ వదిలి, సన్నిధి గొల్ల మరల సన్నిధివీధిలోని బేడి ఆంజనేయస్వామి గుడి వద్దనున్న శ్రీమాన్ పెద్దజియ్యంగార్ మఠానికి వెళ్ళి, జియ్యంగారినీ లేదా వారి పరిచారకుడైన ఏకాంగినీ ఆలయంలోని బంగారువాకిలి ముంగిటకు తోడ్కొని వెళ్తాడు.
💫 ఆ సమయానికి అర్చకులతో పాటుగా; ఆలయ అధికారులు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేదపండితులు బంగారువాకిలి ముందు వేచి ఉంటారు. అలాగే అన్నమయ్య వంశీయులొకరు తుంబుర ధరించి మేలుకొలుపు సంకీర్తన పాడటానికి సిద్ధంగా ఉంటారు. వీరందరితో బాటుగా ఇంద్ర, వరుణ, బ్రహ్మాది దేవతలు; శివపరివారము, సనకసనందనాదులు, సప్తఋషులు, అష్టదిక్పాలకులు, నారదాది మహర్షులు, గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు, గరుత్మంతుడు, ఆదిశేషువు మున్నగువారందరు పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించి, అదృశ్యరూపంలో స్వామివారి సుప్రభాతానంతర దర్శనార్థం వేచియుంటారని ప్రసిద్ధి.
💫 అర్చకులు, జియ్యంగార్ లేదా వారి పరిచారకుడైన ఏకాంగి, ఆలయ అధికారులు, వేదపండితులు, తాళ్ళపాక వంశీయులు, సన్నిధి గొల్ల, సుప్రభాతసేవ ఆర్జిత సేవకు విచ్చేసిన భక్తులు వీరందరి సమక్షంలో, అర్చకులు కుంచెకోలతో బంగారువాకిలికి ఉన్న చిన్న రంధ్రం ద్వారా, లోపల వేసివున్న గడియను తీస్తారు. తరువాత అందరి సమక్షంలో తాళం చెవులకు, తాళాలకు రాత్రి వేసిన సీళ్ళను పరిశీలించి, తాళాలు తెరుస్తారు. తాళంచెవులను ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరించే - అర్చకులు, జియ్యంగార్లు, ఆలయ అధికారులు , ఈ ముగ్గురి వద్ద సీళ్ళు వేసియున్న పెట్టెలలో భద్రపరిచే సంక్లిష్టమైన మరియు సురక్షితమైన వ్యవస్థ ఏనాటినుంచో అమలులో ఉంది. ఆ విధివిధానాలను ఈనాటికీ పొల్లుపోకుండా పాటిస్తారు. ఆనందనిలయుని అంతులేని సంపదకు ఆమాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాల్సిందే మరి!
💫 తదనంతరం, బంగారువాకిలి తెరుచుకుని సన్నిధిగొల్ల దివిటీతో ముందుగా లోనికి ప్రవేశిస్తాడు. మరుక్షణం అర్చకులు కూడా సుమధురస్వరంతో, 'కౌసల్యా సుప్రజారామ' అంటూ వీనులవిందుగా ఆలపిస్తూ బంగారు వాకిలిలోనికి ప్రవేశిస్తారు. ఏకాంగి మహంతుమఠం వారు తెచ్చిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలం గల బంగారు పళ్ళెరాన్ని అందుకుని లోనికి వెళ్ళిన వెంటనే బంగారువాకిలి మూయబడుతుంది. బంగారువాకిలి ముందు వేచివున్న వేదపండితులు అర్చకులు ప్రారంభించిన సుప్రభాత గీతాన్ని అందుకుని వీనులవిందుగా వినిపిస్తారు. తరువాత అన్నమయ్య వంశీయులు బంగారువాకిలి ముందు నిలబడి మేలుకొలుపు కీర్తనను భూపాలరాగంలో ఆలపిస్తారు. సుప్రభాత సేవకు విచ్చేసిన భక్తులు శ్రవణపేయంగా, రాగయుక్తంగా ఆలపింపబడుతున్న సుప్రభాతాన్ని వింటూ భక్తిపారవశ్యంలో మైమరచిపోతారు. సుప్రభాత సేవలో పాల్గొనే భక్తులకు దాదాపు 20-25 నిముషాల పాటు బంగారువాకిలికి ఎదురుగా, అత్యంతసమీపంలో వేచియుండి, వీనులవిందైన సుప్రభాతగానాన్ని ప్రత్యక్షంగా ఆలకిస్తూ, అందులో స్వరం కలుపుతూ, బంగారువాకిళ్ళను శాస్తోక్తంగా తెరిచే విస్తారమైన ప్రక్రియను పరత్యక్షంగా తిలకించుకునే మహత్తరభాగ్యం దక్కుతుంది. ఈ సేవ కోసం ఏళ్ళ తరబడి వేచియుండే భక్తులు ఎందరో ఉంటారు.
💫 బంగారువాకిళ్ళను దగ్గరగా మూసిన సన్నిధి గొల్ల వద్దనున్న దివిటీ వెలుగులో, అర్చకులు రాములవారి మేడకు (బంగారువాకిలిని దాటిన వెంటనే వచ్చే మంటపం) వేసివున్న తలుపుల తాళాలను తీసి, శయనమండపంలో పానుపుపై శయనించి ఉన్న భోగశ్రీనివాసునికి ప్రదక్షిణగా శ్రీవారిసన్నిధికి చేరుకుంటారు. వైఖానస అర్చకులు, జియ్యంగార్లు వెంట రాగా దివిటీతో ముందుగా లోనికి వెళ్ళిన సన్నిధిగొల్ల, కులశేఖరపడి (ఏడు ద్వారాల్లో చిట్టచివరిది, అంటే స్వామివారికి అత్యంత సమీపంలో ఉండేది) వద్ద నిలచి, ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళ విగ్రహ తొలిదర్శనం చేసుకుంటాడు. ఓ గొల్లవానికి తొలిదర్శనభాగ్యమా? ఆశ్రితపక్షపాతియైన స్వామివారి అనుగ్రహానికి హద్దులుండవు మరి!
💫 సన్నిధిగొల్ల చేతిలోని దివిటీ నందుకుని 'ఏకాంగి' దేవుని సన్నిధిలోని దీపాలు వెలిగించగా, సన్నిధిగొల్ల రాములవారిమేడ లోని దీపాలను వెలిగిస్తాడు. అనంతరం అర్చకులు శ్రీవారికి నమస్కారం చేసి, శయనమండపం లో బంగారు పట్టుపరుపుపై శయనించివున్న భోగశ్రీనివాసమూర్తిని సమీపించి, నమస్కరించి, చప్పట్లు చరిచి, మేల్కొనవలసిందిగా ప్రార్ధిస్తారు. తరువాత, భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మూలమూర్తి సన్నిధిలో (జీవస్థానంలో) వేంచేపు చేస్తారు.
💫 ఆనందనిలయంలో కులశేఖరపడి వద్ద తెరవేసి, అర్చకులు శ్రీవారికి దంతధావన, ఆచమనాది ప్రక్రియలు గావించి, మహంతుమఠం వారు తెచ్చిన నవనీతం, పాలు, చక్కెరను నివేదన చేసి, సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు. బంగారువాకిలి ముంగిట్లో వేదపండితులు సుప్రభాతం, మంగళాశాసనాన్ని ముగిస్తూవుండగా, లోపల అర్చకులు శ్రీవారికి నవనీతహారతి నిస్తున్నప్పుడు, బంగారువాకిళ్ళు తెరువబడతాయి.
No comments :