🙏 శ్రీవారి ఆలయవైశిష్ట్యం 🙏
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"
💫 అనగా... "విశ్వంలో తిరుమలకు సమానమైన పుణ్యక్షేత్రం లేదనీ, గతంలోగానీ, వర్తమానంలోగానీ, భవిష్యత్తులోగానీ శ్రీవేంకటేశ్వరునితో సరితూగ గల దేవుడు లేడని" అర్థం. అటువంటి దైవం నివసించే "బంగారుమేడ" నిర్మాణ వైశిష్ట్యం గురించి మనం తెలుసుకోబోతున్నాం. శ్రీవారి ఆలయానికి మరోపేరే బంగారు మేడ.
🌈 శ్రీవారి ఆలయ నిర్మాణ వైశిష్ట్యం 🌈
"సప్తగిరులు" అనగా...
అంజనాచలం, శేషాచలం, గరుడాచలం, వేంకటాచలం, నారాయణాచలం, వృషభాచలం, నీలాచలం - అనే ఏడుకొండల శిఖరశ్రేణుల మధ్య కొలువైన శ్రీవారి ఆలయం - మూడు ప్రాకారాలు - మూడు ప్రదక్షిణ మార్గాలతో విరాజిల్లుతోంది. అయుతే, కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రం తెరిచివుంచే వైకుంఠ ద్వారంతో కలుపుకుంటే, నాలుగు ప్రాకారాలు, నాలుగు ప్రదక్షిణ మార్గాలుగా చెప్పుకోవచ్చు.
🌈 ఆ ప్రాకారాలు వరుసగా:
1. మొదటి ప్రాకారము లేదా మహా ప్రాకారము
2. రెండవ ప్రాకారము లేదా సంపంగి ప్రాకారము
3. మూడవ ప్రాకారము లేదా విమాన ప్రాకారము
4. నాలుగవ ప్రాకారము లేదా వైకుంఠ ప్రాకారము
💫 ప్రతి ప్రాకారం చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గాలను కూడా అవే పేర్లతో పిలుస్తారు.
💫 ఒకటవ ప్రాకారానికి చుట్టూ, దేవాలయానికి బాహ్యంగా ఉన్న ప్రదక్షిణ మార్గాన్ని మహా ప్రదక్షిణమార్గం, మొదటి మరియు మరియు రెండవ ప్రాకరాల మధ్యభాగాన్ని సంపంగి ప్రదక్షిణ మార్గం, రెండవ మరియు మూడవ ప్రాకారాల మధ్యభాగాన్ని విమాన ప్రదక్షిణమార్గం, మూడవ మరియు నాల్గవ ప్రాకారాల మధ్యభాగాన్ని వైకుంఠ ప్రదక్షిణమార్గం అంటారు.
💫 మొదటి మూడు ప్రదక్షిణ మార్గాలూ మనకు సుపరిచితమే గానీ, మహద్భాగ్యంగా చెప్పుకోబడే, వైకుంఠ ప్రదక్షిణ మార్గం చూడగలగటం మాత్రం అత్యంత అరుదుగానే జరుగుతుంది. వీటన్నిటి గురించీ వీలైనంత వివరంగా తెలుసుకుందాం.
🙏 మహా ప్రదక్షిణమార్గం 🙏
💫 సుమారు ముప్ఫై అడుగుల ఎత్తు, 1354 అడుగుల చుట్టుకొలతతో, దీర్ఘచతురస్ర ప్రాకారం చుట్టూ ఉండే ప్రదక్షిణమార్గాన్ని మహాప్రదక్షిణమార్గం గా పిలుస్తారు. తూర్పు-పడమరల పొడవు ఎక్కువగానూ, ఉత్తర-దక్షిణాల వెడల్పు తక్కువగానూ ఉంటుంది. అంటే, లోతు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ప్రదక్షిణ పూర్తిచేస్తే, మనం ఆలయాన్నీ, ఆలయ వెనుకభాగంలో ఉండే ప్రేక్షక గ్యాలరీలను, లడ్డూ కౌంటర్లనూ, ఆదివరాహస్వామి ఆలయాన్నీ, స్వామిపుష్కరిణినీ ఓ మారు చుట్టినట్లే. అంటే, ఈ మహాప్రాకారాన్ని చుట్టి ఉండే, విశాలమైన తూర్పు-దక్షిణ, పడమర-ఉత్తర మాడవీధుల్లో, సవ్యదిశగా సంచరిస్తామన్నమాట. స్వామివారి ఊరేగింపులన్నీ ఈ మాడవీధుల్లోనే జరుగుతాయి.
💫 ఈ మాడవీధులన్నీ ఒక్కప్పుడు చాలా ఇరుకుగా ఉండేవి. అయితే, కాలం గడుస్తున్న కొద్దీ, వీటిని వెడల్పుగా, అధునాతనంగా, శ్రీవారి ఉత్సవరథాలు నిరాటంకంగా తిరగటానికి వీలుగా తీర్చిదిద్దారు. కానీ, ఆ వీధుల్లో ఉండేటువంటి శిల్పకళ ఉట్టిపడే అనేక మంటపాలు, కట్టడాలు కనుమరుగయ్యాయి. సుమారు 15 సంవత్సరాల క్రితం వరకూ కూడా, ఆలయానికి ఎదురుగా, చాలా సందడిగా ఉండే "వెయ్యికాళ్ళ మంటపం" మనకు సుపరిచితమే. ఇప్పుడది కాలగర్భంలో కలిసిపోయింది.
💫 ఈ నాల్గు మాడవీధుల కలయికతో ఏర్పడే చతుర్భుజికి ఆగ్నేయమూలలో స్వామివారి మందిరం కొలువై ఉంటుంది. ఈ మహాప్రదక్షిణమార్గంలో ఉండే విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
💫 ఆలయ మొదటి ప్రాకారం లేదా మహాప్రాకారాన్ని అనుసంధానిస్తూ, ఆలయానికి తూర్పుగా మహాద్వారం, దానికి ఎదురుగా, ఆలయానికి వెలుపల గొల్లమంటపం ఉంటాయి. వీటి గురించి తరువాత తెలుసుకుందాం.
💫 తూర్పు మాడవీధిలో, మహాద్వారానికి మరియు గొల్లమంటపానికి మధ్య నిలబడి, దక్షిణదిశగా వెళితే, మాడవీధి చివరగా, ప్రాచీనమైన పాతసహస్రదీపాలంకరణ సేవ మంటపం వస్తుంది. సాధారణ సమయాల్లో ఈ మంటపం మూసివేసి ఉంటుంది. సహస్రదీపాలంకరణ సేవను ప్రస్తుతం ప్రక్కనే ఉన్న విశాలమైన మంటపంలో చేస్తున్నారు. ఆ పాతమండపం వెనుక హాథీరాంబాబా మఠం ఉంటుంది.
💫 తూర్పుమాడవీధి చివరినుంచి కుడిప్రక్కకు తిరిగి, దక్షిణ మాడవీధి లో ప్రవేశించి తిన్నగా వెళితే, మొదటగా ఎడం ప్రక్కన "సుపథం" మార్గం కనపడుతుంది. అది దాటగానే, సంపంగి వృక్షాలనీడలో తిరుమలనంబి ఆలయం, దాని తరువాత క్యూ కాంప్లెక్స్ నుండి ఆలయానికి వెళ్ళే ఓవర్ బ్రిడ్జి కనపడతాయి. శ్రీవారి ఆలయప్రాకార అందాల్నీ, సమున్నతంగా నిలిచే ఆ కుడ్యం యొక్క రాచఠీవిని దగ్గరనుంచి చూసి తరించాలంటే, అది దక్షిణ మాడవీధిలోని ప్రథమార్థభాగం నుండి మాత్రమే సాధ్యం. దర్శనానికి క్యూలో వెళుతున్నప్పుడు, ఓవర్ బ్రిడ్జి నుంచి కనువిందు చేసే ఆలయ కుడ్యభాగం ఇదే.
💫 దక్షిణ మాడవీధిలో తిన్నగా వెళ్ళి కుడిప్రక్కకు తిరిగితే పడమర మాడవీధి లోకి ప్రవేశిస్తాము. వెంటనే మనకు "చిన్నజియ్యంగారిమఠం", "గోవిందనిలయం" అనబడే అర్చకుల క్వార్టర్సు కనబడతాయి.
💫 తిన్నగా వెళ్ళి మరలా కుడి ప్రక్కకు తిరిగి ఉత్తరమాడవీధి లోకి ప్రవేశించగానే, వరుసగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం (ఈయన భోగనరశింహుడు. యోగనరశింహుడు విమాన ప్రదక్షిణంలో ఉంటారు), వైఖానస అర్చకనిలయం, స్వామిపుష్కరిణి, ఆదివరాహస్వామి ఆలయం, వ్యాసరాజ ఆహ్నికమండపం, వాటికి ఎదురుగా వైఖానస ఆగమ శాస్త్రానికి మూలపురుషుడైన విఖనసమహర్షి ఆలయం, ప్రక్కనే రాధాగోపాల ఆలయం, దాన్ని ఆనుకుని చదువులతల్లి సరస్వతికే గురువైన హయగ్రీవుని ఆలయం కనపడతాయి.
💫 అవి దాటి మళ్ళా కుడిప్రక్కకు తిరిగి తూర్పు మాడవీధి లోకి ప్రవేశించి తిన్నగా వెళితే ఆలయమహాద్వారం వస్తుంది. అంటే, మనం మహాప్రదక్షిణ పూర్తి చేసుకుని, బయలుదేరిన చోటికే తిరిగి చేరుకున్నామన్నమాట.
💫 ఈ ప్రదక్షిణ మార్గంలో, ఆదివవరాహుని ఆలయం, స్వామి పుష్కరిణి, వ్యాసరాజమంటపం తప్ప మిగతావన్నీ మనకు ఎడం ప్రక్కనే ఉంటాయి.
💫 తూర్పుమాడవీధిలో స్వామిపుష్కరిణి ఉన్న ప్రాంతం, తూర్పు-దక్షిణ మాడవీధుల కలయికలో ఆలయం ఉన్న ప్రాంతాన్ని మినహాయిస్తే, మాడవీధుల మిగిలిన ప్రాంతమంతా, ఇరువైపులా, విశాలమైన ప్రేక్షక గ్యాలరీలు ఉంటాయి. బ్రహ్మోత్సవసమయంలో ఈ గ్యాలరీలన్నీ, స్వామివారి వాహన సేవలను చూడటానికి వేచిఉండే లక్షలాది భక్తులతో క్రిక్కిరిసి ఉంటాయి. బ్రహ్మోత్సవాల గురించి మరోసారి వివరంగా తెలుసుకుందాం.
🌈 మహాద్వార గోపురం 🌈
💫 మహాప్రాకారాన్ని అనుసంధానిస్తూ ఉన్న ద్వారమే మహాద్వారం. ఇదే ఆలయం యొక్క ప్రవేశ ద్వారం. ఇది తప్ప ఆలయంలోనికి ప్రవేశించటానికి వేరే మార్గం లేదు. దీనికే "పడికావలి", "సింహద్వారం", "ముఖద్వారం", తమిళంలో "పెరియ తిరువాశల్ (పెద్దవాకిలి)", అంటూ అనేక పేర్లు ఉన్నాయి.
💫 ఈ పెద్దవాకిలికి 1996వ సం. లో ఇత్తడి రేకు తాపడం చేయబడిన కారణంగా, దీన్ని "ఇత్తడివాకిలి" అనికూడా పిలుస్తారు. స్వామివారిని దర్శించే భక్తులు ఒకటవ వైకుంఠం క్యూ, లేదా రెండవ వైకుంఠం ద్వారా మాత్రమే వచ్చి, ఈ మహాద్వారం గుండా, ముందుగా దేవస్థానం వారు ఏర్పాటు చేసిన నిరంతరం ప్రవహించే నీటితో పాద ప్రక్షాళన చేసుకొని, ఆలయంలోకి ప్రవేశించాలి. ఈ మార్గానికి, అత్యద్భుత శిల్పకళ ఉట్టిపడుతూ, సమాంతరంగా ఉండే రెండు రాతి ద్వారాలు ఉన్నాయి. బయటవైపు ద్వారానికి, రెండు పెద్ద చెక్కవాకిళ్ళు (తలుపులు) అమర్చబడి ఉన్నాయి. ఉత్తరంవైపు ఉన్న పెద్దవాకిలినందుండే చిన్న తలుపులో నుంచి, మహాద్వారం మూసిఉండే సమయంలో సిబ్బంది రాకపోకలు సాగిస్తారు.
💫 ఈ మహాద్వారం పైన శిల్పకళా చాతుర్యం ఉట్టి పడుతూ, యాభై అడుగుల ఎత్తుతో, ఐదు అంతస్తులతో, శ్వేతవర్ణంతో, సప్త కలశాలతో శోభితమైన రాజగోపురం లేదా మహాద్వారగోపురం విరాజిల్లుతూ ఉంటుంది. ఉత్సవసమయాల్లో పుష్పాలంకృతమై, విద్యుద్దీపాల కాంతిలో మరింత శోభాయమానంగా ఉంటుంది. 13వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ రాజగోపుర నిర్మాణం, తరువాతి కాలంలో అంచెలంచెలుగా పూర్తైనట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.
🌈 శంఖనిధి - పద్మనిధి 🌈
💫 పాదప్రక్షాళన చేసుకోగానే, ఆలయ మహాద్వారానికి ఇరువైపులా దిగువభాగంలో, సుమారు రెండు అడుగుల పంచలోహ విగ్రహాలు కనిపిస్తాయి. వీరు శ్రీవారి సంపదను సంరక్షించే దేవతలు. ఆనందనిలయుని అంతులేని ఆస్తుల్ని అమరులే రక్షించాలి గానీ, అల్పమానవుల్ల అవుతుందా?
💫 ఇతిహాసాల ప్రకారం, ఒకానొకప్పుడు కుబేరుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానాలను వరాలుగా పొందాడు. శ్రీవారికి, పద్మావతీ పరిణయ సందర్భంలో తాను అప్పుగా ఇచ్చిన 14 లక్షల బంగారు నాణాల్ని వడ్డీతో సహా తిరిగి తీసుకునే నిమిత్తం, కుబేరుడే ఆ బ్రహ్మదత్త దేవతలను శ్రీవారి సంపదలకు కాపుంచాడని కొందరి విశ్వాసం.
💫 ఇందులో, ఎడమవైపు, అంటే దక్షిణ దిక్కులో ఉండే రక్షకదేవతయైన శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ఉంటాయి. మందిరంలోకి ప్రవేశించేటప్పుడు, ఈ దేవతను స్పుశించి నమస్కరించుకోవచ్చు. కుడి వైపున ఉండే దేవత పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి. క్యూ నిబంధన కారణంగా, దేవాలయం లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ దేవతను స్పశించగలం.
💫 ఈ నిధిదేవతల పాదాలవద్ద, ఆరంగుళాల ఎత్తుగల, నమస్కార భంగిమలో ఉన్న విజయనగర రాజైన అచ్యుతరాయలు విగ్రహాన్ని చూడవచ్చు. దీన్ని బట్టి ఈ విగ్రహాల్ని ఆ రాజే ప్రతిష్టించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆగమశాస్త్రనుసారం, ఈ నిధిదేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేయడం సాంప్రదాయం.
🌈 అనంతాళ్వార్ గడ్డపార (గునపం) 🌈
💫 పడికావలి దాటగానే, దేవాలయంలోకి వెళ్తుంటే, అంటే ద్వారానికి ఉత్తరంవైపు పై భాగంలో, ఈ గునపం, గోడకు వ్రేలాడదీయబడి ఉంటుంది. ఇది సుమారు వెయ్యి సంవత్సరాలు ప్రాచీనమైనది. దీనికి సంబంధించి, అత్యంత ఆసక్తికరమైన కథను శ్రీవారి మహాభక్తుడు అనంతాళ్వార్ చరిత్రలో వివరంగా తెలుసుకున్నాం. సాక్షాత్తూ శ్రీవారిని గాయపరచిన ఈ గునపాన్ని ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు, బయటకు నిష్క్రమించేటప్పుడు తప్పక దర్శించండి.
💫 మనకి తెలియకుండానే మనమిప్పుడు ఆలయంలోనికి, అంటే రెండవ ప్రదక్షిణ మార్గమైన సంపంగి ప్రదక్షిణ మార్గం లోనికి ప్రవేశించి, దేవదేవుని దర్శనం కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నాం!
💫 సంపంగి ప్రదక్షిణమార్గంలో ఎందరో రాజులు, చక్రవర్తులు శ్రీవారి మీద ఎనలేని భక్తితో కట్టించిన అనేక మండపాలు, వారివారి కాంశ్యప్రతిమలు మరెన్నో దర్శించదగ్గ ప్రదేశాలున్నాయి. ప్రతిమండపం, ప్రతి ప్రతిమ మనను చరిత్రలోతుల్లోకి తీసుకొని పోతుంది. ఆ విశేషాలన్నింటినీ రేపు తెలుసుకుందాం!
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"
💫 నిన్నటి భాగంలో మనం, మనకి తెలియకుండానే, ఆలయంలోనికి, అంటే రెండవ ప్రదక్షిణ మార్గమైన సంపంగి ప్రదక్షిణ మార్గం లోనికి ప్రవేశించి, దేవదేవుని దర్శనం కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నాం!
💫 సంపంగి ప్రదక్షిణమార్గంలో ఎందరో రాజులు, చక్రవర్తులు శ్రీవారి మీద ఎనలేని భక్తితో కట్టించిన అనేక మండపాలు, వారివారి కాంశ్యప్రతిమలు మరెన్నో దర్శించదగ్గ ప్రదేశాలున్నాయి. ప్రతిమండపం, ప్రతి ప్రతిమ మనను చరిత్రలోతుల్లోకి తీసుకొని పోతుంది. ఆ విశేషాలన్నింటినీ ఈరోజు తెలుసుకుందాం!
🙏 సంపంగి ప్రదక్షిణం 🙏
💫 మహాద్వారం ముందు పాదప్రక్షాళణ చేసుకొని, శంఖనిధి-పద్మనిధిల మూర్తులకు నమస్కరించుకొని, అనంతాళ్వార్ గడ్డపారను దర్శించుకొని, మహాద్వారం గుమ్మాన్ని దాటగానే, మనం సంపంగి ప్రాకారంలోకి, అంటే మందిరంలోనికి ప్రవేశిస్తాము.
💫 దేవాలయం యొక్క మహాప్రాకారం మరియు సంపంగి ప్రాకరం మధ్యన (అంటే మొదటి రెండవ ప్రాకారాల మధ్యన) గల సుమారు 30 అడుగుల వెడల్పైన ప్రదక్షిణ మార్గాన్ని సంపంగి ప్రదక్షిణం అంటారు. ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే ఉండే మొట్టమొదటి ప్రదక్షిణమార్గం ఇదే. లెక్క ప్రకారం ఇది రెండవ ప్రదక్షిణమార్గం అయినప్పటికీ, ఆలయం వెలుపలి మహా ప్రదక్షిణమార్గాన్ని ఆగమశాస్త్రం పరిగణించదు కాబట్టి, శాస్త్రరీత్యా, ఆలయానికి ఇదే మొదటి ప్రదక్షిణమార్గం. పూర్వం ఈ ప్రదక్షిణమార్గంలో స్వామివారి పుష్పకైంకర్యానికి ఉపయోగపడే సంపంగి లేదా చంపక వృక్షాలు విరివిగా ఉండటం చేత, ఈ మార్గానికి సంపంగి ప్రదక్షిణ మార్గం లేదా చంపక ప్రదక్షిణమార్గం అనే పేర్లు ఏర్పడ్డాయి. పేరుకు ప్రదక్షిణమార్గమే అయినా, ప్రస్తుతం ఉన్న క్యూ ప్రతిబంధకాల కారణంగా ఈ మార్గం ద్వారా పూర్తి ప్రదక్షిణం చేయలేము. కేవలం తూర్పుమార్గం, దక్షిణ-ఉత్తర మార్గాల్లోని కొంతభాగం మాత్రమే మనం దర్శించుకోగలం.
🌈 కృష్ణరాయమండపం లేదా ప్రతిమామండపం 🌈
💫 మహాద్వారాన్ని దాటగానే, మనం సంపంగి ప్రదక్షిణమార్గం లోని ప్రతిమామండపం లోనికి ప్రవేశిస్తాము. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఉండటం వల్ల దీన్ని కృష్ణరాయమంటపమనీ, ఇంకా ఇతరుల ప్రతిమలు కూడా ఉండటం వల్ల ప్రతిమామండపం అనీ వ్యవహరిస్తారు. పదహారు స్తంభాలతో ఉన్న ఈ ఎత్తైన మంటపం విజయనగర వాస్తుశైలిలో నిర్మించబడింది. ఆలయంలోకి వెళుతూంటే, మహాద్వారానికి కుడిపక్క, ఉభయ దేవేరులైన తిరుమలదేవి- చిన్నాదేవి సమేతంగా శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ఎదురుగా ప్రాంజలి ఘటిస్తూ , పడమరదిశలో నిలబడి దర్శనమిస్తాడు. రాయలవారే తమ విగ్రహాలను జనవరి 2, 1517వ తేదీన స్వయంగా ప్రతిష్ఠించుకున్నారు.
💫 యావద్దక్షిణ భారతదేశాన్ని కంటిసైగతో శాసించిన ఆ చక్రవర్తిని అలా, అత్యంత నిరాడంబరంగా, నమస్కరిస్తూ చూస్తుంటే ఏమనిపిస్తుంది?
"కోటికీ పడగెత్తినా ధనవంతుడూ, నీకృపకెన్నడూ సమపాత్రులూ... "
అన్న ఘంటసాల గీతం గుర్తుకు రావట్లేదూ?
💫 ఆలయ అధికారులు తెలియక చేసిన తప్పులవల్ల భక్తులకేదన్నా అసౌకర్యం కలిగితే, వారి తరఫున రాయలవారు క్షమాభిక్ష అడుగుతున్నట్లుగా కూడా మనకు గోచరిస్తుంది. దర్శనానంతరం ఆలయం నుండి బయటకు వెళ్ళేటప్పుడు, మనకు ఎడం ప్రక్కగా, ఈ విగ్రహాల్ని దగ్గరగా చూడగలుగుతాం!
💫 అలాగే, మహాద్వారానికి ఎడమ ప్రక్క నమస్కార భంగిమలో ఉన్న, చంద్రగిరి రాజైన వేంకటపతిరాయలవారి నిలువెత్తు కాంశ్యవిగ్రహం కూడా చూడచ్చు. ఈ విగ్రహానికి దక్షిణం వైపున అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణీ ల నిలువెత్తు నల్లరాతి విగ్రహాలు నమస్కార భంగిమలో ప్రతిష్ఠించబడ్డాయి. ఈ రాజులందరూ శ్రీవారికి పరమభక్తులే కాక, దేవాలయపోషణకు అనేక మడులూ, మాన్యాలూ సమర్పించి చిరస్మరణీయులయ్యారు. రాయలవారి ప్రతిమలు తప్ప, మిగతా విగ్రహాలన్నింటనీ మనం క్యూలో శ్రీవారి దర్శనార్థం వెళుతున్నప్పుడు, మనకు ఎడమ ప్రక్కగా చూడవచ్చు.
💫 ఈ మండపం చూస్తూంటే, 'రాజులకైనా, రారాజులకైనా, సమస్త భోగభాగ్యాలూ ఆ శ్రీవారి చలవే. వారికి అందరూ వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపాల్సిందే"
అన్న అలౌకికభావం కలుగుతుంది.
🌈 తులాభారం 🌈
💫 ప్రతిమామంటపానికి సమీపంలో, ఎడంప్రక్కగా ఓ త్రాసు కనబడుతుంది. సంస్కృతంలో త్రాసును తుల అంటారు. భక్తుల శరీరబరువును త్రాసులో కొలుస్తారు కాబట్టి దీనిని తులాభారం గా పేర్కొంటారు. కోరిన కోర్కెలు సిద్ధించినవారు, తమ బరువుకు లేదా తమ కుటుంబసభ్యుల బరువుకు సరితూగేట్లుగా, తాము మ్రొక్కుకున్న ధనాన్ని లేదా ద్రవ్యాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఈ ద్రవ్యాల్లో ముఖ్యంగా కలకండ, బెల్లం, కర్పూరం మొదలైనవి ఉంటాయి. అదే, మ్రొక్కుకుంది ధనమైతే, తగినంత రొఖం చెల్లిస్తే కావలసిన నాణాలను దేవస్థానం వారే సమకూరుస్తారు. నేటికీ, దక్షిణ భారతదేశం లోని అనేక కుటుంబాల్లో, పసిపిల్లలకు శ్రీవారి ఆలయంలో తులాభారం జరిపించి సరిపడా ద్రవ్యాన్ని లేదా ధనాన్ని స్వామివారికి సమర్పించటం పరిపాటి.
💫 ఇది కేవలం నాణాల సమర్పణ కాదు, శ్రీవారికి కృతజ్ఞతా పూర్వకంగా చేసుకునే "ఆత్మసమర్పణ" కూడా !
🌈 అద్దాల మంటపం 🌈
💫 ఆలయంలోకి ప్రవేశిస్తుంటే కుడివైపున, రాయలవారి కాంశ్యప్రతిమకు ఎదురుగా ఉన్న విశాలమైన మండపమే అద్దాలమంటపం. దాన్నే ఉత్తరభారతీయులు "ఆయినామహల్" అనీ, తమిళులు "కన్నాడి అరై" అని పిలుస్తారు. అన్ని వైష్ణవాలయాల్లో విధిగా ఉండే ఈ అద్దాల మంటపం, శ్రీవారి ఆలయంలో ఓ ఎత్తైన రాతి అధిష్ఠానం మీద నిర్మింప బడివుంది. ఈ మంటపంలో "ముఖమంటపం", "అంతరాళం" అని రెండు భాగాలున్నాయి.
💫 ముఖమండపంలో ఇదివరకు "ప్రసాద అరలు" ఉండేవి. ఈ అరల్లో అర్చకులు తమవంతుకు వచ్చే ప్రసాదాన్ని ఉంచి భక్తులకు విక్రయించేవారు. ఈ అరలు ఉండే ప్రాంతాన్ని "ప్రసాదం పట్టెడ" గా పిలుస్తారు. ప్రస్తుతం అర్చకుల వంతుకు వచ్చే ప్రసాదాలను కూడా దేవస్థానం వారే స్వీకరించి భక్తులకు ఉచితంగా, విక్రయాల ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో అందజేస్తున్నారు కాబట్టి "ప్రసాద అరలు" తీసివేయబడ్డాయి.
💫 అతరాళం మధ్యలో, నాలుగు స్థంభాల నడుమ ఉన్న చతురస్రాకార వేదిక గోడలకూ, పై కప్పుకూ, అన్నివైపులా పెద పెద్ద అద్దాలు అమర్చబడ్డాయి. అలాగే, డోలోత్సవానికి అనువుగా గొలుసులు వ్రేలాడదీయబడి ఉన్నాయి. ఈ మంటపంలో ఉభయనాంచారుల సమేత మలయప్పస్వామికి డోలోత్సవం (ఊయలసేవ లేదా ఊంజల్ సేవ) జరుగుతున్నప్పుడు, స్వామివారి ప్రతిరూపం అద్దాల్లో అన్ని ప్రక్కలా కనువిందు చేస్తూ, స్వామివారి సర్వవ్యాపకత్వానికి ప్రతినిథిత్వంగా గోచరిస్తుంది. ఈ అద్దాల మంటపంలో ప్రతి మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఈ డోలోత్సవం అర్జిత సేవ. ఈ సేవలో పాల్గొనే భక్తులు మాత్రమే అంతరాళం దర్శించగలరు. సాధారణంగా, ముఖమండపం లోనికి భక్తులను అనుమతించరు. అయితే, శ్రీవారి దర్శనానంతరం, ప్రసాదాలు స్వీకరించిన తరువాత చేతులు శుభ్రపరుచు కోవటానికి వెళ్ళేటప్పుడు, మనకు కడిప్రక్క నుంచి ఈ "ముఖమంటపాన్ని" దగ్గరగా చూడవచ్చు. ఉత్తరభారతదేశం నుండి వచ్చిన ఈ డోలోత్సవసేవా విధానం, మహంతుల ద్వారా శ్రీవారి ఆలయంలో ప్రవేశపెట్టబడి ఉండవచ్చు. 1831వ సం. నుండి ఈ ఉత్సవం జరుగుతున్నట్లు ఆధారాలున్నాయి.
💫 అన్నమాచార్యుని బాణిలో ఈ డోలోత్సవ శోభను వర్ణించుకుందాం:
"డోలాయాంచల డోలయాంహరే డోలాయాం
మీనకూర్మ వరాహ మృగపతి అవతారా
దానవారే గురశౌరే ధరణిధర మరుజనక...
శీరపాణే గోసమాణే శ్రీవేంకటగిరి కూటనిలయ"
🌈 రంగనాయకమండపం 🌈
💫 అద్దాల మంటపానికి ఎదురుగా, ప్రతిమామండపం లోని వేంకటపతిరాయల విగ్రహానికి దగ్గర్లో, దర్శనానికి వెళ్ళేటప్పుడు మన ఎడమ ప్రక్కగా, ఎత్తైన శిలావేదికపై నుండే విశాలమైన మండపమే రంగనాయక మండపం లేదా, రంగమండపం. 108 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు గల ఈ మంటపంలో శ్రీరంగనాథుడు కొన్నాళ్ళు కొలువై ఉన్నాడు కావున, ఆయన పేరు మీద ఇది "రంగమంటప" మైంది. 1320-1360 సం. ల మధ్య మహమ్మదీయ దండయాత్రల కారణంగా, శ్రీరంగ క్షేత్రంలోని రంగనాయకుల ఉత్సవమూర్తులను, సురక్షితమైనదిగా భావింపబడే తిరుమల క్షేత్రానికి తెచ్చి, ఈ మండపంలో ఉంచి నిత్యపూజా నివేదనలు చేశారు. తరువాత విగ్రహాలను యథావిధిగా శ్రీరంగం తరలించారు. కేవలం శ్రీరంగనాథుని ఉత్సవ విగ్రహాలను ఉంచి పూజాదికాలు నిర్వహించటానికే ఈ మంటపాన్ని "రంగనాథయాదవరాయలు" అనే ఓ స్థానిక పాలకుడు నిర్మించాడు.
"రంగ రంగ రంగపతి రంగనాథా - నీ
సింగారాలె తరచాయ శ్రీ రంగనాథా...
వేంకటాద్రి మీద చేరి నన్ను కూడితివి
ఏవల చూచిన నీవే ఇటు రంగనాథా "
💫 ఈ మండపంలో, "పెద్దశేషవాహనం" గా పిలువబడే ఏడు పడగల బంగారు శేషవాహనాన్ని కొద్ది దూరంగా, క్యూలోనుంచే దర్శించుకోవచ్చు. బ్రహ్మాత్సవాల మొదటి రోజున ఈ వాహనం మీదే స్వామివారు ఊరేగుతారు.
💫 మలయప్పస్వామి వారు ఉభయదేవేరుల సమేతంగా, సంవత్సరానికి రెండు మార్లు దసరా బ్రహ్మోత్సవాల్లో ఒకసారి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకసారి ఈ మండపంలో కొలువై ఉంటారు.
💫 ఒకప్పుడు ఈ మంటపంలోనే స్వామివారికి నిత్య కళ్యాణోత్సవాలు, వసంతోత్సవం, బ్రహ్మోత్సవం జరిగేవి. రాను రానూ భక్తులసంఖ్య పెరగడంతో, ప్రస్తుతం సంపంగి ప్రదక్షిణ మార్గంలో దక్షిణంవైపున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణమంటపంలో కళ్యాణోత్సవం జరుగుతూ ఉంది.
💫 ప్రస్తుతం ఈ మంటపంలో శ్రీవారి తిరుమంజన కార్యక్రమాలు, దేశాధిపతులు, రాష్ట్రాధిపతులకు వేదపండితుల ఆశీస్సులూ వారికి ప్రసాదవితరణలు, జరుగుతున్నాయి.
🌈 తిరుమలరాయమంటపం 🌈
💫 రంగనాయక మంటపాన్ని ఆనుకుని, దానికి పడమర దిక్కున, ధ్వజస్థంభ మంటపానికి దక్షిణదిశగా పది అడుగుల దూరంలో, రెండంచెలుగా ఈ మంటపం నిర్మింపబడింది. మొదటి అంచె ఎత్తైన వేదికగా, వేరొక అంచె నేలమట్టానికి సమంగా ఉండి, వేదికపై జరిగే ఉత్సవాలను భక్తులు ధక్షిణదిశగా కూర్చొని తిలకించటానికి వీలుగా నిర్మింపబడింది.
💫 "విజయనగర ప్రభువైన సాళువ నరశింహరాయలు శ్రీవారికి మ్రొక్కు చెల్లింపుగా "అన్నా ఊయల తిరునాళ్ళ" అనే ఉత్సవాన్ని నిర్వహించే నిమిత్తం, 1473వ సం. లో "ఎత్తైన వేదిక" నిర్మించాడు. "అన్నా" అనే తమిళపదానికి "హంస" అని అర్థం. తమిళ "ఆణిమాసం" (జూన్-జూలైల మధ్య) లో జరుపబడే ఈ ఉత్సవం కాలాంతరంలో నిలిచిపోయింది.
💫 అరవీటి వంశ చక్రవర్తి అయిన తిరుమలరాయలు 16వ శతాబ్దంలో ఈ మంటపాన్ని విస్తరింపజేసి, వార్షికవసంతోత్సవం నిర్వహించేవాడు. అందువల్ల ఈ మంటపానికా పేరు వచ్చింది. కానీ ఆయన ఏర్పాటు చేసిన ఉత్సవం కూడా అర్థంతరంగానే నిలిచిపోయింది.
💫 ప్రస్తుతం ఈ మంటపంలో, "కొలువుమేళం" గా పిలువబడే ఓ సేవలో భాగంగా మేళం, డోలు, నగారాలు మ్రోగింపబడతాయి. సూర్యోదయవేళ 6:00-6:30 గం. ల మధ్య జరిగే కొలువును "హరికొలువు" గా, సూర్యాస్తమయ సమయంలో 5:30-6:00 గం. ల మధ్య జరిగే కొలువును "సందెకొలువు" గా పిలుస్తారు.
💫 ప్రస్తుతం బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణవేళ మాత్రమే స్వామివారు ఈ మంటపంలోకి వేంచేసి పూజా నివేదనలు అందుకుంటారు.
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"
🌈 రాజా తోడరమల్లు 🌈
💫 తిరుమలరాయమంటపంలో, ధ్వజస్థంభానికి సుమారు పది అడుగుల దూరంలో స్వామి వారికి అభిముఖంగా ముగ్గురు భక్తుల నిలువెత్తు రాగి ప్రతిమలు దర్శనమిస్తాయి. ఈ విగ్రహాల భుజాలపై ఉన్న పేర్లననుసరించి, తలపాగా ధరించి ఉన్న పురుషుడు "లాలా ఖేమరాము". మిగిలినవి ఆయన భార్య "పితాబీబీ", తల్లి "మాతా మోహనదేవి" ల విగ్రహాలు.
💫 లాలా ఖేమరామునే "రాజా తోడరమల్లు" అని పిలుస్తారు. 17వ శతాబ్దంలో, శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తజనసందోహాన్ని చూసి, అప్పట్లో భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో అధికారంలో ఉన్న మహమ్మదీయుల మరియు బ్రిటీషు వారి కళ్ళు ఆలయంపై పడ్డాయి. హైందవమతానికి ఆలవాలమైన ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశ్యంతో మహమ్మదీయులూ, అత్యధిక ఆదాయం వచ్చే ఈ ఆలయం పై ఆధిపత్యం సాధించటానికి బ్రిటీషువారూ, ఒకే సారి ఆలయంపైకి దండెత్తారు. శ్రీవారికి పరమభక్తుడూ, వారికోసం ప్రాణాలైనా అర్పించే తోడరమల్లుకు ఈ విషయం తెలిసి, మిత్రుల సహాయంతో వారిద్దరి (మహమ్మదీయులు, బ్రిటీషువారు) మధ్య చిచ్చుపెట్టి, ఒకరితో ఒకరు కలహించుకొనేట్లు చేసి ఆలయాన్ని రక్షించాడు. అప్పుడు ఆయన ఆర్కాటు నవాబు సాదతుల్లాఖాన్ తరఫున కర్ణాటక ప్రాంతాన్ని పర్యవేక్షించేవాడు.
🙏 ఓ మహమ్మదీయుని కొలువులో ఉంటూ, హిందూ దేవాలయాన్ని రక్షించి భావితరాలవారికి పదిలంగా అప్పగించిన, ఆ భక్తశిఖామణికి జోహార్లు. స్వామివారంటే తనకున్న అపరిమిత భక్తికి చిహ్నంగా, నమస్కార భంగిమలో ఉన్న ఈ విగ్రహాలను ఆయనే ప్రతిష్ఠించుకున్నారు. 🙏
💫 సంపంగి మార్గంలో ఉన్న మంటపాలనూ, మూర్తులనూ దర్శించుకుని ఇప్పుడు మనం ధ్వజస్తంభమంటపం లోకి అడుగు పెట్టాం. ఈ మంటపం ద్వారానే వెండివాకిలి దాటి మనం విమానప్రదక్షిణ మార్గంలోకి ప్రవేశించాలి. ఇక్కడ తెలుసుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయి:
🌈 ధ్వజస్తంభ మంటపం 🌈
💫 ఇప్పుడు మనం – ప్రతిమామంటపం (తూర్పు) వెండివాకిలి (పడమర), అద్దాలమంటపం (ఉత్తరం) తిరుమలరాయ మంటపాల (దక్షిణం) - మధ్య ఉన్న చతురస్రాకార మంటపంలో ఉన్నాం. ఈ మంటపంలో ఆలయ ధ్వజస్తంభం ఉన్నది కావున దీన్ని ధ్వజస్తంభ మంటపం అంటారు. ఇక్కడనుంచి చూస్తే, మేలిమి బంగారు కాంతులతో మెరుస్తున్న ధ్వజస్తంభం వెండివాకిలికి తూర్పుదిక్కులో కనిపిస్తుంది. పైకి చూస్తే, ధ్వజస్తంభానికి ఎదురుగా ఏడు బంగారు కలశాలతో కూడిన మూడంతస్తుల వెండివాకిలి గోపురం కూడా చూడవచ్చు.
💫 15వ శతాబ్దంలో నిర్మింపబడిన ఈ మంటప శిలా స్థంభాలపై, యోగనరశింహస్వామి, ఆంజనేయుని మూర్తులు; బకాసురవధ, శ్రీనివాసకళ్యాణం వంటి పౌరాణిక ఘట్టాలు; ఎన్నెన్నో మనోహరంగా మలచబడ్డాయి. ఈ మంటపంలో బంగారు తొడుగుతో ఉన్న ధ్వజస్తంభం; దాన్ని ఆనుకుని తూర్పువైపున పెద్ద బలిపీఠం; దానికి ఈశాన్యదిక్కున చిన్న బలిపీఠంలా కనుపించే "క్షేత్రపాలకశిల" స్థితమై ఉన్నాయి. వీటన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
🌈 ధ్వజస్తంభం 🌈
💫 వెండివాకిలికి ఎదురుగా, నగిషీలు చెక్కిన శిలాపీఠం మీద ఉన్నటువంటి ఎత్తైన కొయ్యస్తంభమే ధ్వజస్తంభం. శిలాపీఠం మరియు స్తంభం మొత్తానికి బంగారుపూత పూయబడిన రాగిరేకు తాపడం చేయబడి ఉంటుంది. ఈ స్తంభంమీద కూడా గరుత్మంతుడు, హనుమంతుడు, శంఖుచక్రాలు, కాళీయమర్ధనఘట్టం – వంటి శిల్పాలు అత్యద్భుతంగా చెక్కబడి ఉన్నాయి.
💫 ధ్వజం అంటే "జండా". తమిళంలో ధ్వజస్తంభాన్ని "కొడిక్కంబం" అంటారు. "కొడి" అంటే "కేతనము" లేదా "జండా" అని అర్థం.
💫 ధ్వజారోహణం అంటే - స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని సూచిస్తూ, ధ్వజస్తభంపై స్వామివారి పరమభక్తుడు మరియు వాహనమైన గరుడుని చిత్రపటం ఉన్న జండా ఎగురవెయ్యటం. అందుకే ధ్వజస్తంభాన్ని 'గరుడగంభం' గా కూడా పిలుస్తారు.
💫 "ధ్వజారోహణం" ద్వారా, ఆకాశమార్గాన అత్యంత వేగంగా పయనించగల గరుడినితో సమస్తలోకాల వారికీ బ్రహ్మోత్సవ సంబరాల నిమిత్తం లాంఛనప్రాయంగా ఆహ్వానం పలకబడుతుంది. ఈ ధ్వజస్తంభానికి మరో ప్రాముఖ్యత కూడా ఉంది. ఏ వ్యక్తులైనా, వస్తువులైనా, పూజాద్రవ్యాలైనా ఆఖరుకు స్వామివారైనా, మదిరంలోంచి బయటకు వెళ్ళాలన్నా, బయటనుంచి లోనికి రావాలన్నా, ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేస్తూ వెళ్ళాల్సిందే. సహస్రాబ్దాలుగా శ్రీవారి ముందు స్థిరచిత్తంతో నిలుచుని ఉండే ధ్వజస్తంభానికి ఆమాత్రం గౌరవ మర్యాదలు దక్కాల్సిందే మరి. చిత్తచాంచల్యంతో చరించే మనబోటి మానవులకో చక్కటి సందేశమిస్తుందీ అచంచలమైన ధ్వజస్తంభం!
💫 పూర్వం విమానప్రదక్షిణ మార్గంలో నుండే ధ్వజస్తంభం, అక్కడ స్థలాభావం కారణం చేత ఐదారు శతాబ్దలక్రితం ప్రస్తుతమున్న ప్రాంతానికి మార్చబడింది.
💫 ఈ ధ్వజస్తంభం కర్రదైనందువల్ల దాన్ని మార్చుతూ ఉండాలి. ప్రస్తుతం ఉన్న ధ్వజస్తంభం 1982వ సం. లో, కర్ణాటకలోని "దండేలి" అడవుల్లో లభించే టేకుచెట్టు మానుతో తయారైంది. ధ్వజస్తంభానికి ఉపయోగించే మాను ఎలాంటి తొర్రలు, పగుళ్ళు, కొమ్మలు, వంకరలు లేకుండా, 75 అడుగుల పొడవుతో, దృఢంగా, దీర్ఘకాలం మన్నేట్లు ఉండాలి. ఇన్ని సులక్షణాలు కలిగిన టేకుమానును వెదకటం, కొండమీదకు రవాణా చేయటం, కనీసం వందేళ్ళవరకూ చెక్కుచెదరకుండా వుంచే రసాయనిక ప్రక్రియ చేపట్టటం, అన్నింటినీ మించి అంత పొడవైన ఏక స్తంభాన్ని దానికంటే ఎంతో తక్కువ ఎత్తుతో నుండే పైకప్పు గల ఈ నిర్ణీత ప్రదేశంలో ప్రతిష్ఠించడం కోసం అప్పటి తి.తి.దే. యాజమాన్యం అత్యంత వ్యయప్రయాసల కోర్చింది. గత రెండువందల సంవత్సరాల తి.తి.దే. రికార్డుల్లో ధ్వజస్తంభం మార్చిన సాంకేతికాంశాల ప్రస్తావనేమీ లేకపోవడం వల్ల, ఈ కార్యక్రమం మరింత జటిలం అయ్యింది. అయితే, ఆ శ్రీనివాసుని కృప, భక్తులసహకారం, తి.తి.దే. యాజమాన్యం సిబ్బంది యొక్క అంకితభావంతో, అత్యంత క్లిష్టతరమైన ఈ ప్రక్రియ అవిఘ్నంగా జరిగి ఎట్టకేలకు విజయవంత మయ్యింది.
💫 తమిళశాసనాలు ఎక్కువగా ఉండే తిరుమల ఆలయంలో ధ్వజస్తంభాన్ని మార్చేటప్పుడు, పాత ధ్వజస్తంభం యొక్క పద్మపీఠంపై ఓ తెలుగుశాసనం బయట పడింది. దాని ప్రకారం, సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం; పాతధ్వజస్తంభాన్ని "సిద్లూరి రామాజీమాదర్సు పంతులు" అనే ఒక తెలుగు భక్తుడు సమర్పించాడు. ఆలయంలో తమిళుల ఆధిపత్యం ఎక్కువ ఉండే ఆ రోజుల్లో, దేవాలయానికి ఆయువుపట్టైన ధ్వజస్తంభాన్ని ఓ తెలుగు భక్తుడు సమర్పించినట్టు తెలుసుకోవడం మన తెలుగు వారందరికీ కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది.
💫 మయూరధ్వజుడనే మహారాజు త్యాగనిరతికీ, దానశీలతకు మెచ్చి శ్రీకృష్ణభగవానుడిచ్చిన వరాన్ననుసరించి, అతనికి ధ్వజస్తంభరూపంలో వైష్ణవాలయాల యందుండే భాగ్యం కలిగింది. శ్రీకృష్ణుని ఆనతి ప్రకారం ధ్వజస్తంభదర్శనం, ప్రదక్షిణం పూర్తయిన తరువాతనే దైవదర్శనం చేసుకోవాలి. ఈనాటికీ అదే సాంప్రదాయం కొనసాగుతోంది.
🌈 క్షేత్రపాలకశిల (లేదా గుండు) 🌈
💫 ధ్వజస్తంభమంటపంలో ఈశాన్యదిక్కున ఉన్న ఒకటిన్నర అడుగుల ఎత్తైన, చిన్నపాటి శిలాపీఠాన్ని "క్షేత్రపాలకశిల" లేదా "క్షేత్రపాలకగుండు" అంటారు. తిరుమల ఆలయానికి క్షేత్రపాలకుడు "శివుడు" అని "సన్నిధిగొల్ల" , ప్రకరణంలో తెలుసుకున్నాం.
💫 ఆ క్షేత్రపాలకునికి గుర్తుగా, మాడవీధుల్లోని ఈశాన్యదిక్కున జీవం ఉన్న ఓ పెద్ద శిల ఉండేదట. అర్చకులు ఆలయద్వారాలు మూసేసి ఇళ్ళకెళుతూ తాళాలగుత్తిని ఆ శిలకు మూడుసార్లు తాకించేవారు. దాంతో, ఆలయద్వారాలు మూసుకున్నట్టు సంకేతం అందుకున్న ఆ శిల గుడి చుట్టూ మాడవీధుల్లో తిరుగుతూ, అలయానికి కాపు కాస్తూ, అన్యులెవ్వరినీ మాడవీధుల్లోకి ప్రవేశించనిచ్చేది కాదు. సుప్రభాత సమయంలో వాకిళ్ళు తెరిచేముందు మరలా ఆ తాళాలగుత్తిని శిలకు తాకిస్తే, ఆ శిల తన గమనాన్ని ఆపి, తిరిగి ఈశాన్యమూలలో స్థిరంగా ఉండేది.
💫 ఒకనాటి రాత్రి వేగంగా సంచరిస్తున్న ఆ శిల క్రింద పడి ఓ బాలుడు మరణించడంతో, అటువంటి దుర్ఘటన పునరావృతం కాకుండా ఆ శిలను ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న గోగర్భంతీర్థం వద్దకు తరలించారు. అయితే, ఆ శిలలోని చిన్నభాగాన్ని మాత్రం, తరలించ బడిన క్షేత్రపాలకశిలకు గుర్తుగా, ధ్వజస్తంభమంటపం లోని ఈశాన్యదిక్కున ఉంచారు.
💫 ఆలయం బీగాలగుత్తిని రెండు పూటలా ఈ శిలకు తాకించి, నమస్కరించే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.
💫 ప్రతి మహాశివరాత్రి పర్వదినాన అర్చకులూ, ఆలయాధికారులూ, భక్తులూ ఛత్రచామర మంగళవాద్యాలతో గోగర్భతీర్థానికి వెళ్ళి; నమకం చమకంతో రుద్రాభిషేకంచేసి; ఆ గుండుకు వెండినామాలూ (ఊర్ధ్వపుండ్రాలు), కళ్ళూ అతికించి; పుష్పాలంకరణానంతరం ధూప-దీప-అర్చన-నివేదనాదులు కావించి; భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు. విష్ణుమూర్తికి సాక్షాత్తు శివుడు క్షేత్రపాలకుడిగా నుండటం; ప్రపంచ ప్రసిద్ధ వైష్ణవాలయంలో శివరాత్రి ఉత్సవం ఘనంగా నిర్వహించటం; శివుణ్ణి ఊర్ధ్వపుండ్రంతో అలంకరించటం చూస్తుంటే, "శివాయ విష్ణురూపాయ - విష్ణురూపాయ శివే" అన్న తత్వం సంపూర్ణంగా అవగత మవుతుంది.
🌈 బలిపీఠం 🌈
💫 ధ్వజస్తంభాన్నాఇ ఆనుకుని, తూర్పుదిక్కున ఉన్న ఓ ఎత్తైన పీఠమే "బలిపీఠం". ఇది కూడా బంగారుపూత పూసిన రాగిరేకు తాపడంతో తళతళా మెరుస్తూ ఉంటుంది. శ్రీవారికీ, ఇతర ప్రధాన పరివార దేవతలకూ, ద్వారపాలకులకూ ప్రసాదాలను నివేదించిన తరువాత, విమానప్రదక్షిణ మార్గంలోని అష్టదిక్కుల్లో ఉన్న బలిపీఠాలపై ఆయా దిగ్దేవతలకు మంత్రపూర్వకంగా బలిని వేస్తారు. ఇలా సమర్పిస్తూ చివరగా వెండివాకిలి వద్దకు వచ్చి, మిగిలిన అన్నాన్ని, అంటే బలిని ధ్వజస్తంభం ముందున్న ఈ ఎత్తైన బలిపీఠంపై ఉంచుతారు. ఈ బల్యన్నాన్ని రాత్రింబవళ్ళూ సంచరించే భూత -ప్రేత-యక్ష-పిశాచాది గణాలూ, క్రిమికీటకాదులూ ఆహారంగా భుజిస్తాయని ప్రతీతి.
💫 శ్రీకృష్ణుని ఆనతి ప్రకారం మనం ధ్వజస్తంభానికి భక్తి పూర్వక నమస్కారాలు సమర్పించుకున్నాం కాబట్టి ఇక శీఘ్రంగా వెండివాకిలి దాటి, బంగారువాకిళ్ళలో ఉన్న శ్రీవారిని దర్శించుకో వచ్చు. దీనితో వెండివాకిలి లోనికి ప్రవేశించే ముందు, సంపంగి ప్రదక్షిణంలో చూడవలసిన ముఖ్య విశేషాలన్నీ పూర్తయ్యాయి.
శ్రీవారి దర్శనానంతరం ప్రసాదం స్వీకరించిన తరువాత, ఓ ఊచల పంజరంలో ఉన్న నల్లటి బావిని మనందరం చూసే ఉంటాం. దాని విశేషాలూ, శ్రీవారి దర్శనానంతరం, సంపంగి ప్రదక్షిణమార్గం లో చూడవలసిన మరికొన్ని విశేషాలను ఈపై చెప్పుకుందాం.
సంపంగి ప్రదక్షిణ మార్గంలో శ్రీవారి దర్శనానికి ముందు చూడగలిగే విశేషాలన్నింటినీ దాదాపుగా చెప్పుకున్నాం.
ఇదే ప్రదక్షిణ మార్గంలో, దర్శనానంతరం చూడగలిగేవి, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే చూడగలిగేవీ, అసలు దర్శించలేనివీ ఎన్నో విశేషాలున్నాయి. వాటన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"
🌈 నాలుగుకాళ్ళ మంటపాలు 🌈
💫 1470వ సం. లో విజయనగర చక్రవర్తి సాళువ నరశింహరాయలు తన భార్య, ఇద్దరు కుమారులు, తన పేరున నాలుగుకాళ్ళ మంటపాలుగా పిలువబడే నాలుగు మంటపాలను సంపంగిప్రదక్షిణ మార్గానికి నాలుగు మూలల్లో అంటే - ఆగ్నేయ, నైఋతి, వాయువ్య, ఈశాన్యాల్లో - కళాత్మకంగా నిర్మించాడు. జనసమ్మర్థం అంతగా లేని కాలంలో స్వామివారి ఉత్సవ ఊరేగింపులన్నీ సంపంగి ప్రదక్షిణ మార్గం నందే జరిగేవి. ఆ సమయంలో, ఈ మార్గంలోని నాలుగు మూలల్లో ఉన్న మండపాల్లో స్వామివారు వేంచేసి పూజాదికాలు అందుకునే వారు. కళ్యాణోత్సవాలు సైతం వీటిలోనే నిర్వహించేవారు. ఎత్తైన ఈ మంటపాల్లో జరిగే పూజలను భక్తులు అన్నివైపుల నుండీ వీక్షించవచ్చు. కళ్యాణోత్సవ సమయాల్లో ఈ మండపాల ఉపరితలం నుంచి మంగళవాద్యాలను నగారాల వలె మ్రోగించేవారు.
💫 కాలక్రమేణా భక్తులరద్దీ ఎక్కువ కావడంతో, శ్రీవారి ఉత్సవాలను విశాలమైన ఇతర మంటపాల్లోనూ, ఊరేగింపులను వెడల్పాటి మాడవీధుల్లోనూ నిర్వహించసాగారు.
💫 ప్రస్తుతం, ఆగ్నేయ, వాయువ్య, ఈశాన్య మూలల్లోని నాలుగుకాళ్ళ మంటపాలు మూడు మాత్రం మిగిలి ఉండగా, నాల్గవది తరువాతి కాలంలో చేపట్టిన విస్తరింపు కట్టడాల్లో విలీనమైపోయింది. మిగిలిన మూడింటిలో కూడా, కేవలం ఆగ్నేయమూలలో ఉన్న మంటపాన్ని మాత్రమే ఇప్పుడు మనం చూడగలం. ఇతర దిక్కుల్లోనున్న మంటపాలను చూడటానికి భక్తులకు ప్రవేశం లేదు.
🌈 శ్రీవేంకటరమణుని కళ్యాణమంటపం 🌈
💫 నీరజాక్షుని నిత్యకళ్యాణోత్సవం కోసం సంపంగి ప్రదక్షిణం లోని దక్షిణమార్గంలో నూతనంగా, సృజనాత్మకత ఉట్టిపడేటటువంటి కళాఖండాలతో, తూర్పుముఖంగా ఈ కళ్యాణమంటపం నిర్మింపబడింది. ఇందులో ప్రతిరోజూ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మలయప్పస్వామి వారికీ ఉభయనాంచారులకు కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది. విశాలమైన ప్రాంగణంలో వందలాది భక్తులు కూర్చొని కళ్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించవచ్చు.
💫 ప్రతి సోమవారం జరిగే విశేషపూజ; పవిత్రోత్సవం, పుష్పయాగం, జ్యేష్టాభిషేకం వంటి సంవత్సరోత్సవాలు కూడా ఈ మంటపంలోనే జరుప బడతాయి.
💫 మొదట్లో విమానప్రదక్షిణ మార్గపు నైఋతి దిక్కులోని కళ్యాణమంటపంలో, తరువాత సంపంగిప్రాకారంలోని రంగనాయకమంటపంలో జరుపబడే కళ్యాణోత్సవాలు ప్రస్తుతం విశాలమైన ఈ కళ్యాణమంటపం లో జరుగుతున్నాయి. కళ్యాణోత్సవ ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులు మాత్రమే ఈ కళ్యాణమంటపాన్ని కాంచగలరు.
🌈 ఉగ్రాణం 🌈
💫 "ఉగ్రాణం" గా పిలువబడే సరుకుల గిడ్డంగులను మనం తి.తి.దే. ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాల్లోనూ చూస్తాం. వీటిలో ప్రసాదాల తయారీకి ఉపయోగించే వంట సామగ్రీ మరియు పూజాద్రవ్యాలు నిలువ ఉంచుతారు. సంపంగి ప్రదక్షిణమార్గం లోని వాయువ్యమూలలో ఉన్న ఈ "ఉగ్రాణం" లో, స్వామివారి అభిషేకాలకు, అర్చనలకు ఉపయోగించే పసుపు, చందనం, కర్పూరం, నెయ్యి, సుగంధద్రవ్యాలు వంటి వాటిని నిలువ చేస్తారు.
💫 ఇదే కాకుండా, సంపంగి ప్రదక్షిణ మార్గానికి పడమటి దిక్కున ఉన్న కొన్ని మంటపాలను కూడా – శనగపిండి, బెల్లం, మినప్పప్పు, పంచదార, బియ్యం వంటి సరుకులు; పిండి కలుపుకోవడం కోసం ఉపయోగించే పెద్ద పెద్ద మిక్సీలు ఉంచటానికి ఉపయోగిస్తారు. ప్రసాదాల తయారీ నిమిత్తం వాడే వంటదినుసులు బాహ్యకుడ్యం వెనుక నుండి కన్వేయరు బెల్టుల ద్వారా సంపంగి ప్రదక్షిణం పడమరదిశగానున్న గిడ్డంగుల్లోనికి చేర్చబడతాయి. వీటివద్దకు కూడా భక్తులకు ప్రవేశం లేదు.
🌈 విరజానది లేదా విరజాతీర్థం 🌈
💫 వైకుంఠంలోని పవిత్రతీర్థమైన విరజానది స్వామివారి పాదాల క్రింద నుండి ప్రవహిస్తూ స్వామిపుష్కరిణిలో కలుస్తుందని భక్తుల విశ్వాసం. అందువల్లనే, గోవింద నామాల్లో శ్రీనివాసుణ్ణి "విరజాతీర్థుడని" కూడా అభివర్ణిస్తారు.
💫 ఈ నదీగమనమార్గంలో ఉపరితలంపై నిర్మింపబడిన బావిని విరజానది గా పిలుస్తారు. ఈ బావి అంచులపై అద్భుతమైన శిల్పాలు, పౌరాణిక ఘట్టాలు చెక్కబడి ఉండటంతో స్థానికులు దీన్ని "బొమ్మలబావి" గా కూడా పిలుస్తారు. ఈ బావి ప్రస్తుతం నేలమట్టానికి ఉన్న కటకటాల తలుపుతో మూయబడి, దానివద్ద "విరజానది" అనే బోర్డు వ్రేలాడ దీయబడి ఉంటుంది. ఈ బావి వద్దకు కూడా భక్తులకు ప్రవేశం లేదు.
🌈 పడిపోటు 🌈
💫 ఇది సంపంగి ప్రదక్షిణానికి ఉత్తర మార్గంలో ఉంటుంది. పడమటి భాగంలో ఉగ్రాణం వద్ద మొదలై, పొడవుగా, దాదాపు మనం ప్రసాదాలు స్వీకరించే ప్రదేశం వరకూ విస్తరించి ఉంటుంది. స్వామివారి ప్రసాద నివేదనలన్నీ అన్నప్రసాదాలు తప్ప - అంటే లడ్డూ, వడ, జిలేబీ, మురుకు, అప్పం, దోశ మొదలైనవి పరిశుభ్రమైన వాతావరణంలో, అత్యంత నైపుణ్యంతో, భారీ ఎత్తున ఈ పడిపోటులో తయారు చేయబడతాయి. ఈ ప్రదేశంలోకి సాధారణంగా భక్తులకు ప్రవేశం లేదు. అయితే, మనం ప్రార్థనా పూర్వకంగా అడిగితే, అక్కడ ఉన్న సిబ్బంది ఒక్కో సారి అనుమతిస్తారు. ఈ సారి ప్రయత్నించండి. ప్రపంచంలో మరెక్కడా లేనంత భారీ ఎత్తున జరిగే వంటల ప్రక్రియను చూసి తీరాల్సిందే! ఈ మధ్య కాలంలో, స్థలాభావం చేత, లడ్డూ తయారీకి కావలసిన బూందీని మాత్రం ఆలయం వెలుపల తయారు చేయిస్తున్నారు.
💫 పడిపోటుకు ఆగ్నేయమూలలో, తూర్పుదిశగా ఉన్న "పోటుతాయారు" అనే అమ్మవారికి భక్తిపూర్వకంగా నమస్కరించి వంట బ్రాహ్మణులు శుచిగా తమ దినచర్యను ప్రారంభిస్తారు. పడిపోటుకు ఎదురుగా ఇదివరకు ఉండే చిన్న బావిలోని నీటిని వంటలకు ఉపయోగించే వారు.
🌈 పూల అర లేదా పుష్పమండపం లేదా యమునోత్తరై 🌈
💫 సంపంగి ప్రదక్షిణం లోని ఉత్తరమార్గంలో, పడిపోటు నానుకొని ఉన్న గదిని ఈ మూడు పేర్లతో పిలుస్తారు. శ్రీవారి కైంకర్యాలకు, వివిధ ఉత్సవాలకు అవసరమయ్యే పుష్పమాలలను ఈ గదిలో తయారు చేసేవారు. అయితే స్థలాభావం, పెరిగిన అవసరాల దృష్ట్యా, ఇప్పుడు పుష్పమాలలను వేరొక చోట తయారు చేయించి, ఉపయోగార్థం విమానప్రాకారంలోని ఓ శీతలీకరించిన గదిలో భద్రపరుస్తున్నారు. దాని వివరాలు తరువాత తెలుసుకుందాం.
💫 "యమునోత్తరై" అంటే "యమునానది ఒడ్డు" అని అర్థం. స్వామిని శ్రీకృష్ణునికి ప్రతిరూపంగానూ, స్వామి పుష్కరిణిని యమునానది గానూ భావించడం వల్ల దీనికా పేరు వచ్చి ఉండవచ్చు. మరో కథనమేమంటే - ఈ పుష్పకైంకర్యాన్ని ప్రారంభించిన అనంతాళ్వార్ అనే భక్తుడు తన గురువు రామానుజుల వారి గురువుగారైన "యామునాచార్యుల" వారి పేరు మీద ఈ గదికి ఆ పేరు పెట్టాడు. ఈ మహాభక్తుని గురించి ముందుగానే తెలుసుకున్నాం.ఈ గదిని బయటనుంచి దర్శించుకోవచ్చు. ఈ
🌈 వగపడి 🌈
💫 రెండస్తుల కలిగిన ఈ ప్రసాదాల గిడ్డంగి, పూల అరను ఆనుకుని ఉంటుంది. ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు, తి.తి.దే. సిబ్బందికి ఇక్కడే ప్రసాదవితరణ చేస్తారు. సిబ్బంది అనుమతితో లోనికి ప్రవేశించవచ్చు. ఈ గది ముంగిట్లో నుంచే లడ్డూ, వడ, జిలేబీల సుగంధాలు చవులూరిస్తాయి. సాధారణంగా, మనం దీని ముంగిట్లో నుంచునే ఉచిత ప్రసాదాలను సేవిస్తాం. గంటల తరబడి క్యూలో వేచి ఉండటం వల్ల వచ్చిన అలసట, ఆకలి; ఘుమఘమలాడే స్చచ్ఛమైన నేతి సువాసనలు; అంతకుమించి శ్రీవారి ప్రసాదాల మీదుండే అపరిమిత భక్తిశ్రద్ధలు; వెరసి, మన ఆలోచనలన్నీ తాత్కాలికంగా, ఆధ్యాత్మిక భావనల్లోంచి ఆత్మారాముణ్ణి సంతృప్తి పరచే దిశలో అనాలోచితంగానే పయనిస్తారు
🌈 పూలబావి 🌈
💫 స్వామివారికి సడలింపు చేసిన పూలమాలలను భక్తులకిచ్చే సాంప్రదాయం తిరుమలలో లేదు. "పూజానైర్మల్యాలు" గా పేర్కొనబడే వీటన్నింటినీ, సంపంగి ప్రదక్షిణానికి ఈశాన్యంలో ఉన్న "పూలబావి" గా పిలువబడే ఓ బావిలో విసర్జించేవారు. అందుకే దానికా పేరు వచ్చింది. అయితే సంవత్సరంలో ఒక్కసారి తిరుచానూరులో కార్తీకమాస బ్రహ్మోత్సవ చక్రస్నానం జరిగే రోజున మాత్రం, శ్రీవారికి అలంకృతమైన పూమాలలు, పరిమళద్రవ్యాలు, ప్రసాదాలు, చీర-రవికెలు సమస్త గౌరవలాంఛనాలతో, తిరుమలనుంచి కాలినడకన తీసుకొని వచ్చి పద్మావతి అమ్మవారికి సమర్పిస్తారు.
💫 ఈ పూలబావిని అద్దాలమండపానికి వెనుకభాగంలో, సరిగ్గా మనం ఉచిత ప్రసాదాలు స్వీకరించే ప్రదేశానికి ఎదురుగా చూడవచ్చు.
💫 ఐతిహ్యం ప్రకారం భూదేవిచే ఏర్పరచబడిన ఈ "భూతీర్థం" (పూలబావికి పూర్వనామం) కాలాంతరంలో నిక్షిప్తమై పోయింది. శ్రీనివాసుని ఆనతిపై రంగదాసుడనే భక్తుడు నేలను త్రవ్వి ఈ బావిని వెలుగులోకి తెచ్చి దాని నీటిని శ్రీవారి పుష్పకైంకర్యానికి ఉపయోగించేవాడు. శ్రీవారికి ప్రీతిపాత్రమైన ఈ బావి శిథిలమైపోగా రంగదాసే తొండమానునిగా పునర్జన్మించి, ఆ బావిని తిరిగి పునరుద్ధరించాడు. అంతే కాకుండా, ఆ బావినందలి రహస్య మార్గం ద్వారా నిత్యం వచ్చి స్వామిని దర్శించుకునే వాడు.
💫 ఒకప్పుడు శత్రురాజులు తరుముకు రాగా, తొండమానుడు ఈ మార్గం ద్వారా పరుగు పరుగున వచ్చి శరణాగతవత్సలుణ్ణి శరణువేడాడు. అభ్యంతరమందిరంలోకి అకస్మాత్తుగా వచ్చిన ఆగంతుకుణ్ణి చూసి సిగ్గుతో - శ్రీదేవి శ్రీవారి వక్షస్థలంలోను, భూదేవి ఈ బావిలోనూ - దాక్కున్నారు.
💫 వరాహపురాణం ద్వారా ఈ ఇతిహాసాన్ని తెలుసుకున్న భగవద్రామానుజులవారు భూదేవిని ఆ బావిలో తిరిగి ప్రతిష్ఠింపజేసి, అర్చనాదులు క్రమం తప్పకుండా జరిగే ఏర్పాటు చేశాడు. అంతే కాకుండా, భూదేవి నిమిత్తం పెనిమిటి పూజా నైర్మల్యాలను ఈ బావిలో విడిచే కట్టడి కూడా చేయడంతో, కొన్ని వందల సంవత్సరాలు ఆ సాంప్రదాయం కొనసాగింది.
💫 కానీ, ఈ మధ్యకాలంలో పూలవాడకం విపరీతంగా పెరిగిపోవడం వల్ల, వాడిన పూమాలలను తిరుమల సానువుల్లో ఎవరూ తొక్కని ప్రదేశంలో విడవడం ప్రారంభించారు. అదీ "పూలబావి" పుట్టు పూర్వోత్తరాలు!
💫 ఈ మధ్యకాలం వరకూ దిగుడుబావిగా ఉన్న ఈ బావిని చేదుడు బావిగా మార్చి, దాని వరలకు బయటివైపు నల్లటి గ్రానైట్ పలకలు తాపడం చేసి, దాని చుట్టూ ఇనుప ఊచల తడికెను ఏర్పాటు చేశారు. ఇంతటి పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పూలబావికి ఈసారి తప్పక నమస్కరించి తరించండి.
💫 శ్రీవారి ఆలయంలో అత్యంత ముఖ్యమైన సంపంగి ప్రదక్షిణ మార్గం లోని అన్ని విశేషాలను దాదాపుగా తెలుసుకున్నాం.
💫 సంపంగి ప్రదక్షిణ మార్గం లోనే ఉండినట్లుగా చెప్పబడే ప్రొద్దుతిరగని చింతచెట్టు గురించీ, వెండివాకిలి గురించీ, దేవాలయ మహద్వారానికి తూర్పు దిక్కున గంభీరంగా నిలబడి ఉండే గొల్లమంటపం గురించి చెప్పుకొని రేపటితో "సంపంగి ప్రదక్షిణం" సమాప్తం చేద్దాం.
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"
ముందు భాగాల్లో మనం "సంపంగి ప్రదక్షిణమార్గం" లో ఉండే విశేషాలను దాదాపుగా తెలుసుకున్నాం. ఇంకా మిగిలిన కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
🌈 నీడ తిరగని చింతచెట్టు 🌈
💫 11వ శతాబ్దంలో భగవద్రామానుజులు; 15వ శతాబ్దంలో అన్నమయ్య; దర్శించి తరించిన ఓ పరమాద్భుతమైన చింతచెట్టు శ్రీవారి ఆలయంలో ఉండేది. శ్రీనివాసుని ఆవిర్భావంతో ముడివడిన ఈ వృక్షరాజం యొక్క ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగించే పూర్వాపరాలను శ్రీనివాసుని భక్తులందరూ తెలుసుకుని తీరాలి:
💫 లోక కళ్యాణార్థమై, నారదమహర్షి ఒకానొకప్పుడు తండ్రియైన బ్రహ్మదేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు –
💫 "తండ్రీ! మీ విన్నపాన్ని ఆలకించి ఆ శ్రీమహావిష్ణువు, శ్రీవేంకటాచలక్షేత్రంలో అవతరించి భక్తులను అనుగ్రహించే టట్లుగా వరమిచ్చి చాలా కాలమైంది. కావున, ఆ వైకుంఠనాథుని మరలా ప్రార్థించి, సత్వరమే తిరుమల క్షేత్రంలో ప్రత్యక్షమై మానవులందరికీ వారి దర్శనభాగ్యం కలిగింప జేయండి."
💫 ఆ నారదుని ప్రార్థనకు తన సమ్మతిని తెలియజేస్తూ, ఆ మహత్కార్యం నెరవేరటంలో నారదుని పాత్ర ఏమిటో విశదపరచి, బ్రహ్మదేవుడు అతనితో ఈ విధంగా శెలవిచ్చాడు
💫 "నేను శేషాద్రిశిఖరాన, స్వామిపుష్కరిణి సమీపంలో, త్రేతాయుగపు దశరథ మహారాజు అంశతో మరియు ద్వాపరయుగపు వసుదేవుని అంశతో ఓ చింతచెట్టును సృష్టిస్తాను. ఆ వృక్షఛాయలో శ్రీరాముని తల్లి కౌసల్య అంశతో మరియు శ్రీకృష్ణుని తల్లి దేవకి అంశతో ఓ విశాలమైన పుట్టను ఏర్పాటు చేస్తాను. వీళ్ళనే ఎందుకు ఎన్నుకున్నానంటే; ఆయా పుణ్యదంపతులకు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే శ్రీరామ-శ్రీకృష్ణుల రూపాలలో త్రేతాయుగం-ద్వాపరయుగాల్లో తనయుడుగా జన్మించినప్పటికీ, కారణాంతరాల వల్ల వారికి అనతికాలం లోనే పుత్ర వియోగం సంభవించింది. శ్రీరాముని వనవాసంతో కౌసల్యాదశరథులు పరితపించగా, కారాగారంలో జన్మించగానే శ్రీకృష్ణుడు దేవకీవసుదేవులకు దూరమయ్యాడు. వారికి పుత్రునిపై మమకారం తీరనేలేదు. అలాగే, చిన్నికృష్ణుణ్ణి అత్యంత ప్రేమాభిమానాలతో పెంచుకున్న యశోదమ్మ, శ్రీకృష్ణుని వివాహాన్ని చూడలేక పోయింది. కావున కలియుగంలో ఆమెను వకుళమాతగా జన్మింపజేసి శ్రీనివాసుని కళ్యాణాన్ని దగ్గరుండి జరిపించే ఏర్పాటు కూడా చేయాలని ఎప్పుడో నిశ్చయించు కున్నాను".
💫 అలా బ్రహ్మదేవుడు వచించినదే తడవుగా వేంకటాచలంలో ఓ చింతచెట్టూ, దానిక్రింద పుట్ట (వల్మీకం), వకుళమాత చెకచెకా సృష్టించబడ్డాయి.
💫 తండ్రియానతి మేరకు కార్యరంగంలోకి దిగిన నారదమహర్షి, వైకుంఠవాసుణ్ణి వల్మీకవాసునిగా తయారుచేసే ప్రయత్నంలో పడ్డాడు.
💫 అదే సమయంలో, యోగిపుంగవులందరూ కలిసి ఓ మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ యజ్ఞానికి విచ్చేసిన కలహభోజనుడు, త్రిమూర్తుల్లో అత్యంత మహిమాన్వితునికి మాత్రమే యజ్ఞఫలాన్ని ధారపోయవలసిందిగా సలహా ఇచ్చాడు. త్రిమూర్తుల్లో ఎవరు గొప్పో నిగ్గు తేల్చటం కోసం, మహర్షుల కోర్కె మేరకు బ్రహ్మనూ, మహేశ్వరుణ్ణి దర్శించిన భృగుమహర్షి చివరగా వైకుంఠానికేతెంచాడు. ఆ తరువాత క్షణికావేశానికి గురైన భృగుడు - లక్ష్మీనివాసమైన శ్రీనివాసుని హృదయంపై కాలితో తన్నడం; క్రోధితురాలైన శ్రీమహాలక్ష్మి వైకుంఠాన్ని వదలి కరివీరపురానికి (నేటి కొల్హాపూరుకు) చేరడం; విష్ణువు, లక్ష్మీదేవి జాడ వెతుకుతూ భూలోకానికేతెంచి వేంకటాచలంలో చింతచెట్టు క్రిందున్న పుట్టలో సేదతీరడం; ఓ గొల్లవాని గొడ్డలిదెబ్బకు గాయపడిన శ్రీనివాసుడు పుట్టలో నుండి బయటకు వచ్చి వకుళమాత చెంత చేరి పద్మావతిని పరిణయమాడటం మనకు సుపరిచితమే! ఇందులో కొంత భాగాన్ని మనం "సన్నిధి గొల్ల" ప్రకరణంలో తెలుసుకున్నాం కూడా.
💫 కాలాంతరాన ఆ పుట్ట సమీపంలో తొండమానునిచే శ్రీవారికి ఆలయం నిర్మించబడడంతో ఓ ప్రాకారం ఏర్పడి, ఆ చెట్టు సంపంగి ప్రదక్షిణమార్గంలో మహాద్వారానికి చేరువగా నిల్చింది.
💫 ఆ చింతచెట్టు కాండం దృఢంగా ఉండి శాఖోపశాఖలుగా విస్తరించింది. ఆ చెట్టు నీడ ఎటూ తిరగక వృక్షమూలంలోనే స్థిరంగా ఉండటంతో అది "నీడ తిరుగని చింతచెట్టు" గా ప్రసిద్ధి చెందింది. అంతే గాకుండా, ఆ చెట్టు విశ్రాంతి యన్నదే లేకుండా చిగురిస్తూ, పుష్పిస్తూ, ఫలిస్తూ ఉండేది. అందువల్ల అది "ఉన్నిద్ర తింత్రిణీ వృక్షం" (నిద్రపోని చింత చెట్టు) గా కూడా పేరొందింది. కాలక్రమాన, భూలోకంలో తనకు మొట్టమొదటి సారిగా నీడ కల్పించిన ఆ వృక్షం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్ర మయ్యింది.
💫 ఒకానొకప్పుడు ఆ లక్ష్మీవల్లభుడు తన భక్తుడైన తొండమానునితో, "ఆ చింతచెట్టునూ, మహాలక్ష్మికి ఆవాస స్థానమైన చంపకవృక్షాన్ని మాత్రం రక్షించి, మిగిలిన చెట్లనన్నింటినీ తొలగించి ఆలయప్రాకారాలు నిర్మించవలసిందిగా" ఆదేశించినట్లు వెంగమాంబ విరచిత "వేంకటాచలమహాత్మ్యం" ద్వారా తెలుస్తోంది.
💫 ప్రస్తుతం ఆలయంలో కానరాని ఆ వృక్షం ఎప్పుడు, ఎలా కనుమరుగైందో ఎవరికీ తెలియదు. తన కార్యం పరిసమాప్తి చెందడంతో బ్రహ్మదేవుడే ఆ వృక్షాన్ని తనలో తిరిగి ఐక్యం చేసుకున్నాడేమో!
💫 11వ శతాబ్దంలో భగవద్రామానుజులు ఆ చింతచెట్టును దర్శించి తరించినట్లు "పరమయోగివిలాసం" అనే ప్రామాణిక గ్రంథంలో వ్రాయబడింది. అలాగే, 15వ శతాబ్దంలో అన్నమయ్య తొలిసారిగా తిరుమల యాత్ర చేసినపుడు -
కుందనపు బొలుపుల పెద గోపురము సేవించి
తరగని ఫలపుష్ప తతి తోడ నీడ తిరుగని
చింత వర్తిల నమ్రుడగుచు."
అనే కీర్తనలో, ఈ చింతచెట్టును దర్శించు కున్నట్లుగా పేర్కొన్నాడు.
💫 సాక్షాత్తు శ్రీనివాసునికే నీడనిచ్చిన ఆ వృక్షరాజం, "మానవుడు ఐహిక ప్రలోభాలకు లోనై తన దిశను మార్చుకోకుండా; అజ్ఞానాంధకారపు ఛాయలను దరిజేర నీయకుండా; ఆ పరమాత్ముని సాక్షాత్కారం కోసం అలుపెరుగని సాధన చేయాలని; జన్మ సార్థక్యం కాగానే నిశ్శబ్దంగా నిష్క్రమించాలని" సూచిస్తుంది.
🌈 వెండివాకిలి 🌈
💫 ప్రప్రథమ ప్రాకారం లోని మహాద్వారం గుండా ప్రవేశించి, సంపంగి ప్రదక్షిణమార్గం లోని వివిధ మండపాలను దర్శించుకొని, ధ్వజస్తంభ దర్శనం తరువాత మనం వెండివాకిలి ముందుకు చేరుకుంటాం. ఈ ప్రవేశద్వారం యొక్క, గడపలకూ, ప్రక్కనున్న గోడలకూ వెండితాపడం చేసి యుండడం వల్ల దీన్ని "వెండివాకిలి" గా పిలుస్తారు. అలాగే, రెండవ ప్రవేశద్వారం కావటం వల్ల దీనిని "నడిమి పడికావలి" గా కూడా వ్యవహరిస్తారు.
💫 1929వ సం. లో, నైజాం ఎస్టేటుకు చెందిన "శ్రీరాం ద్వారకా దాస్ పర్భణి" అనే భక్తుడు ఈ వాకిళ్ళకు వెండితాపడం చేయించినట్లుగా ఆ తలుపులపై హిందీ, ఆంగ్లభాషల్లో వ్రాయబడి ఉంది. సంపంగి ప్రాకారానికి అనుసంధానమై ఉండే ఈ ద్వారంపై ఏడు కలశాలతో, శిల్పకళా శోభితమైన మూడంతస్తుల గోపురం నిర్మించబడింది.
💫 వెండివాకిలికి ఇరుప్రక్కలా ఉన్న కుడ్యాలపై, హాథీరాంబాబా-వేంకటేశ్వరుల పాచికలాట శ్రీరామపట్టాభిషేకం ఘట్టాలు హృద్యంగా చెక్కబడి వెండి రేకుతో తాపడం కావించబడ్డాయి.
💫 12వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ కుడ్య-ద్వార-గోపుర నిర్మాణం అంచెలంచెలుగా చేకూరి; 13వ శతాబ్దంలో పూర్తయినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ వెండివాకిలి దాటగానే మనం మూడవ లేదా విమాన ప్రదక్షిణమార్గం లోనికి ప్రవేశిస్తాం.
💫 అయితే, అంతకు ముందుగా శ్రీవారి ఆలయ మహాద్వారం ముందున్న ఓ ముఖ్యమైన మంటపాన్ని గూర్చి తెలుసుకుందాం:
🌈 గొల్లమంటపం 🌈
💫 పూర్వకాలంలో శ్రీవారి ఉత్సవాలు - తిరుచానూరులో జరిగేవి. అవన్నీ శ్రీవారి నివాస స్థానమైన "తిరుమలక్షేత్రం" లోనే జరగాలని 11వ శతాబ్దంలో రామానుజులవారు తీర్మానించారు. అందునిమిత్తం తిరుమల కొండను అభివృద్ధి చేసే పనుల్లో నిమగ్నమైన కూలీలకు, పర్యవేక్షకులకు చంద్రగిరికి చెందిన "గోపమ్మ" అనబడే ఓ గొల్లవనిత చల్లని మజ్జిగ నిచ్చి దాహం తీర్చేది. ఆమె సేవకు మెచ్చిన రామానుజాచార్యులు ఏ వరం కావాలో కోరుకొమ్మనగా, ఆ వనిత అమాయకంగా, "తమరు చీటీ రాసిస్తే మోక్షమొస్తుందట. ఓ చీటీ రాసి మోక్షమిప్పియ్యండి" అని బదులిచ్చింది. ఆమె నిష్కల్మషత్వానికి మెచ్చిన రామానుజులు, ఓ తాళపత్రంపై "శ్రీనివాస పరబ్రహ్మ ముక్తిని ప్రసాదించుగాక" అని వ్రాసి ఆమె చేతిలో నుంచారు. ఆ గొల్లవనిత సేవానిరతికి, మోక్షపిపాసకు, నిష్కళంకభక్తికి గుర్తుగా, రామానుజుని ప్రేరణతో ఆ ప్రదేశంలో "గొల్లమంటపం" నిర్మించబడింది.
💫 మరో కథనం ప్రకారం, మజ్జిగ విక్రయాలతో సంపాదించిన డబ్బుతో స్వయంగా ఓ గోపవనితే, ఆమెకు స్వామివారిపై ఉన్న అచంచల భక్తి విశ్వాసాలకు గుర్తుగా ఈ మంటపాన్ని నిర్మించింది.
💫 కథనమేదైనప్పటికీ, ద్వాపరంలో గోవిందునికి- గోపాలురకు ఉన్న బాంధవ్యం కొనసాగుతూ; కలియుగంలో శ్రీవేంకటేశ్వరునికీ-గొల్లలకూ మధ్య ఏర్పడ్డ అనుబంధం ఈ "గొల్లమంటపం" రూపంలో ద్యోతక మవుతోంది.
💫 1470వ సం. లో నిర్మించబడిన ఈ కట్టడంలో నిలబడి ఒకప్పుడు ప్రధానార్చకులు ప్రతినిత్యం ఘంటానాదం చేసిన కారణంగా దీనికి "ఘంటామండపమ" నే మరో పేరు కూడా వచ్చింది.
💫 ఈ మంటపం శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఎదురుగా, సమున్నతంగా నిలబడి ఉంటుంది. శ్రీవారి ఉత్సవ వాహనాలు మహాద్వారానికీ, గొల్లమంటపానికి మధ్య నుండి సొగిపోతాయి.
💫 ఇప్పటివరకు, సంపంగి ప్రదక్షిణమార్గంలోని ప్రతిమా, మంటప, ఇతర కట్టడాల విశేషాలన్నింటినీ తెలుసుకున్నాం.
💫 ఇవే కాకుండా అన్ని మంటపాల్లోని కుడ్యాలపై, స్తంభాలపై, పైకప్పు లోపలిభాగంలో లతాపుష్ప ఆకృతులు, జంతువులు, పక్షుల చిత్రాలు, ఏనుగు తలపైనున్న గుర్రం, ఆ గుర్రంపై స్వారీ చేస్తున్న యోధుడు, వివిధ దేవతా శిల్పాలు; పూతనవధ, గోపికావస్త్రాపహరణం వంటి పౌరాణిక ఘట్టాలు; ఆదిశేషుడు, హనుమ, గరుడిని శిల్పాలు; ఇంకా అనేక కళాకృతులు ముగ్ధమనోహరంగా చెక్కబడి ఉన్నాయి. వీటినన్నింటినీ వీలున్నంతలో వీక్షించాల్సిందే గానీ, వాటి శోభను వర్ణింపనలవి కాదు.
💫 వెండివాకిలిని దాటి మనం ఇక మూడవ ప్రదక్షిణం, అంటే "విమానప్రక్షిణమార్గం" లోనికి చేరుకోవడమే తరువాయి.
💫 అయితే, ఆ ప్రదక్షిణం చేసే ముందుగా కొన్ని శ్రీవారి ఉత్సవాల గురించి తెలుసుకుందాం.
💫 నిత్య, వార, మాస ఉత్సవ విశేషాలను ముందుగానే చెప్పుకున్నాం కాబట్టి, కొన్ని "సంవత్సరోత్సవాల" గురించి కూడా రేపటి భాగంలో తెలుసుకుందాం.
No comments :