*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన*
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*
💫 శ్రీవారి ఆలయ మహాద్వారం మరియు వెండివాకిలి దాటి లోనికి ప్రవేశించగానే, మొట్టమొదటగా కనిపించే మార్గమే *"విమానప్రదక్షిణమార్గం"* లేదా *"పథం".*
💫 స్వామివారి ప్రధాన ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ ప్రదక్షిణ మార్గం, సంపంగిప్రాకారానికి మరియు విమానప్రాకారానికి మధ్యలో ఉంటుంది. మునుపటి ప్రకరణాలలో శ్రీవారి ఆలయ కుడ్యాలకు చుట్టూ, బాహ్యంగా ఉన్న మహాప్రదక్షిణాన్ని; ఆలయం లోనికి ప్రవేశించగానే ఉన్న సంపంగి ప్రదక్షిణాన్ని; ముగించుకొని పరమపవిత్రమైన ధ్వజస్తంభ ప్రదక్షిణగా; వెండివాకిలి దాటి, విమానప్రదక్షిణ మార్గంలోనికి చేరుకున్నాం.
💫 శ్రీవారి దర్శనానంతరం ఈ మార్గంలో ఉన్న విశేషాలన్నింటిని ఏ విధమైన అవరోధాలు లేకుండా దర్శించుకోవచ్చు. శతాబ్దాల చరిత్ర గల ఈ మార్గంలో నడయాడుతూ ఉన్నప్పుడు ఎడమప్రక్కగా, ఎత్తయిన అరుగులతో ఉన్న అనేక మండపాలు మనను ఆకట్టుకుంటాయి. మన కుడిప్రక్కన శోభాయమానంగా వెలుగుతున్న ఆనందనిలయ గోపురాన్ని లేదా విమానాన్ని కూడా కన్నులారా వీక్షించవచ్చు.
💫 ఒక్కో మంటపానికి ఒక్కో చరిత్ర! ఆయా రాజుల దాతృత్వానికి, శ్రీవారి పట్ల వారికున్న అచంచల భక్తికి నిలువెత్తు నిదర్శనం! ఆనందనిలయ విమాన వైశిష్ట్యాన్నైతే ఎంత చెప్పుకున్నా తక్కువే!
💫 ఆ చరిత్రపుటలను, ఆధ్యాత్మిక సొబగులను ఒక్కొక్కటిగా ఇప్పుడు అవలోకిద్దాం.
🙏 *శ్రీరంగనాథస్వామి* 🙏
💫 విమానప్రదక్షిణ మార్గంలో ప్రవేశించగానే, మొట్టమొదటగా, మనకు ఎదురుగా శేషతల్పంపై శయనించివున్న శ్రీరంగనాథుడు దర్శనమిస్తాడు. ఈ కుడ్యశిల్పం గరుడాళ్వార్ సన్నిధికి వెనుకభాగాన ఉంటుంది. బంగారుపూతతో ధగధగ లాడుతున్న శ్రీరంగనాధునికి పైభాగంలో వరదరాజస్వామి, క్రిందిభాగంలో శ్రీవెంకటేశ్వరుని ప్రతిమలు, ఒకే ఫలకంపై చెక్కబడి ఉంటాయి. అంటే శ్రీరంగపు రంగనాథస్వామిని, కాంచీపుర వరదరాజస్వామిని, తిరుమల వేంకటేశ్వరుణ్ణి, మూడు వైష్ణవ దివ్యక్షేత్రాలను ఏకకాలంలో దర్శించి తరించుకున్నామన్నమాట. వైష్ణవులందరి చిరకాల స్వప్నం, ఈ మూడు వైష్ణవ దివ్యక్షేత్రాల సందర్శనం!
💫 1991వ సంవత్సరంలో 55 లక్షల రూపాయలు వెచ్చించి ఈ బంగారు తాపడం చేయించబడింది.
💫 పూర్వం భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనం, టెంకాయలు ఇక్కడే సమర్పించుకునే వారు. భక్తుల రద్దీ కారణంగా ఇప్పుడు కర్పూరహారతులను ఆలయ మహాద్వారానికి ఎదురుగా, బేడి ఆంజనేయస్వామి సన్నిధి ముందున్న *"అఖిలాండం"* అనబడే ప్రదేశానికి తరలించారు.
💫 ప్రతిరోజూ తెల్లవారు ఝామున జరిగే *"అంగప్రదక్షిణలు"* లేదా *"పొర్లుదండాలు"* రంగనాథస్వామి విగ్రహం ఎదురుగా మొదలై, విమానప్రాకారాన్ని సవ్యదిశగా ఆసాంతం చుట్టి, మళ్లీ ఇక్కడే పూర్తవుతాయి. అంగప్రదక్షిణ చేయాలనుకున్న భక్తులు సంబంధిత తి.తి.దే. కార్యాలయంలో గానీ లేదా ఆన్లైన్ లో గాని ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. ప్రతిరోజు 750 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. శుక్రవారం మరియు ముఖ్యమైన పర్వదినాల్లో అంగప్రదక్షిణకు అనుమతి లేదు. భక్తులు ముందుగా స్వామిపుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించి, నిర్ణీత సమయానికి క్యూ కాంప్లెక్స్ ను చేరుకొని, ఆలయ నిబంధలననుసరించి, అంగప్రదక్షిణ గావించుకోవచ్చు.
🙏 *వరదరాజ స్వామి ఆలయం* 🙏
💫 శ్రీరంగనాథునికి ఎదురుగా నిలుచున్నప్పుడు, మనకు ఎడంప్రక్కగా కొద్ది అడుగుల దూరంలో, కాంచీపుర వరదరాజస్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయం విమానప్రదక్షిణానికి ఆగ్నేయదిక్కున, పశ్చిమాభిముఖంగా కొలువై ఉంటుంది. మూడు అడుగుల ఎత్తైన పీఠంపై, చిరునవ్వు చిందిస్తున్న వరదరాజస్వామి విగ్రహం అభయముద్రలో దర్శనమిస్తుంది. ఆలయ పైభాగంలో, ఏకకలశ నిర్మితమైన గర్భాలయ గోపురాన్ని కూడా చూడవచ్చు. ఈ స్వామిని ఇక్కడ ఎప్పుడు, ఎవరు ప్రతిష్ఠించారో చెప్పడానికి చారిత్రక ఆధారాలు లేవు. అయితే, 1354వ సం. ముందు నుండే ఈ ఉపాలయం ఉన్నట్లు తెలుస్తోంది. కాంచీపురంలో కొలువై ఉన్న వరదరాజస్వామి విగ్రహాన్ని మ్లేచ్ఛుల దండయాత్ర నుండి తప్పించే నిమిత్తం ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారని కొందరంటారు. కానీ ఈ విషయాన్ని ధ్రువీకరించే చారిత్రక ఆధారాలు లేవు. క్యూ ప్రతిబంధకాల కారణంగా ఈ స్వామిని దగ్గరనుంచి దర్శించుకోలేము.
👉 *పురాణేతిహాసాల ననుసరించి:*
🙏 *శ్రీరంగనాథుడు*
🙏 *తిరుమల వేంకటేశుడు*
🙏 *కంచి వరదరాజస్వామి*
💫 ఈ ముగ్గురి మూర్తులు మూడుకోణాలుగా ఏర్పడే త్రిభుజాకారంలో అపారమైన ఆధ్యాత్మిక శక్తి నిక్షిప్తమై ఉంటుంది. మనం వెండివాకిలి దాటినది మొదలు, శ్రీవారి దర్శనం పూర్తయ్యేంత వరకూ ఈ త్రిభుజాకారం లోనే గడుపుతాం. ఎంతో దూరాలోచనతో, మన పూర్వీకులు ఆలయ సందర్శనార్ధం వచ్చే భక్తులకు అపారమైన దైవికశక్తిని ప్రసాదించడం కోసం ఈ మూర్తులను ఆయా ప్రదేశాల్లో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఏర్పాటు చేసిన ఆ ద్రష్టలను మనసులోనే స్మరించుకొని శ్రీవారి దర్శనార్థం ముందుకు సాగుదాం.
🙏 *గరుడాళ్వార్ సన్నిధి* 🙏
💫 శ్రీరంగనాథస్వామి కుడ్యప్రతిమకు ఎడంప్రక్కన ఉన్న కటాంజన ద్వారంలో ప్రవేశించి, క్యూ మార్గంలో కుడిప్రక్కకు తిరగగానే, కొన్ని అడుగుల దూరంలో మనకు తూర్పుదిశగా, పంచభూతాల సమ్మేళనం గా భావించబడే *"గరుడు"* ని ఆలయం కనబడుతుంది. అదే *"గరుడాళ్వార్ సన్నిధి".*
💫 1512వ సం. లో ఎవరో అజ్ఞాతభక్తుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింప జేశాడు. శ్రీమహావిష్ణువు పరివారదేవత, వారి సేవకులలో ముఖ్యుడైన గరుత్మంతుని గురించి ఇంతకుముందే *"శ్రీవారి బ్రహ్మోత్సవాలు – గరుడవాహనం"* ప్రకరణంలో విస్తారంగా తెలుసుకున్నాం.
💫 సరిగ్గా శ్రీవారి బంగారువాకిలికి ఎదురుగా, శ్రీవారిని సతతం దర్శించుకుంటూ, నమస్కారభంగిమలో, రెక్కలు విప్పార్చుకున్నట్టి ఆరు అడుగుల గరుత్మంతుని విగ్రహం నేత్రపర్వంగా దర్శనమిస్తుంది. ఈ సన్నిధి గోపురంపైన ఉన్న మూడు బంగారు కలశాలను మనం విమానప్రదక్షిణ మార్గంలో ప్రవేశించగానే, శ్రీరంగనాథుని మూర్తి ఉపరితలభాగంపై చూడవచ్చు. శ్రీవారి ముల్లోకవిహారానికి ఎల్లవేళలా సన్నద్ధుడై, అబద్ధునిగా ఉండే గరుత్మంతుణ్ణి మనఃపూర్వకంగా నమస్కరించుకుని, ఆ తరువాతే తన దర్శనం చేసుకోవడం శ్రీనివాసునికి సంతోషదాయక మని చెప్పబడుతుంది.
🙏 *మహామణి మండపం లేదా, తిరుమామణిమండపం* 🙏
💫 క్యూ మార్గంలో నడుస్తూనే గరుత్మంతుని దర్శనం చేసుకుని, ఆనందనిలయానికి ప్రధాన ద్వారమైన బంగారువాకిలి ఎదురుగా ఉన్న *"ఘంటామండపం"* లేదా *"మహామణిమండపం"* లోనికి ప్రవేశించాము.
💫 ఈ మంటపం ఈ క్రింది విధంగా అనుసంధానిస్తూ, దాదాపుగా చతురస్రాకారంలో ఉంటుంది.
💐తూర్పుదిక్కున గరుడాళ్వార్ సన్నిధిని,
💐పడమరదిక్కున బంగారువాకిలిని,
💐ఉత్తరదిక్కున హుండీని,
💐తూర్పుదిక్కున విమానప్రదక్షిణాపథాన్ని.
💫 ఈ మండపం పైకప్పుకు ఆధారంగా ఉన్న 16 శిలా స్తంభాలపై శ్రీమహావిష్ణువు, శ్రీవేంకటేశ్వరుడు, వరదరాజస్వామి, ఆదివరాహస్వామి యొక్క ఆకృతులు కడు రమణీయంగా చెక్కబడి ఉంటాయి. పైకప్పు అంతా అత్యద్భుతమైన పౌరాణిక ఘట్టాలు మలచబడి, బంగారు తాపడంతో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తుంది. 15వ శతాబ్దం ప్రారంభంలో, చంద్రగిరికి చెందిన ఓ విజయనగర పాలకుని ద్వారా నిర్మింపబడ్డ ఈ మండపంలోనే, ప్రతిరోజు సుప్రభాత సమయంలో స్వామివారికి మేలుకొలుపులు పాడుతారు. ప్రతి బుధవారం, ఈ మంటపంలోనే, ఆర్జిత సేవయైన *"సహస్రకలశాభిషేకం"* కూడా జరుగుతుంది. ఈ మండపంలో, బంగారువాకిలికి ఎడమప్రక్కగా రెండు పెద్ద ఘంటలు వ్రేలాడదీయబడి ఉంటాయి. తమిళంలో *"మహామణి"* అంటే *"పెద్దఘంట"* అని అర్థం. అందువల్లనే ఈ మంటపానికి ఆ పేర్లు వచ్చాయి. ఈ ఘంటలను మ్రోగించే ఆలయ పరిచారకులను *"ఘంటాపాణి"* గా పిలుస్తారు. ఈ ఘంటానాదం విన్న తరువాతనే, చంద్రగిరిలో నివసించే స్వామివారి వీరభక్తులైన విజయనగర రాజులు ఆహారాన్ని స్వీకరించేవారట. ఆ సాంప్రదాయం చాలామంది తిరుమల వాసులు నేటికీ కొనసాగిస్తున్నారు.
💫 ఈ రెండు ఘంటలలో ఒక దానిని *"నారాయణఘంట"* గానూ, రెండవ దానిని *"గోవిందునిఘంట"* గానూ వ్యవహరిస్తారు. ఒకప్పుడు బంగారువాకిలికి ఇరు ప్రక్కలా ఉండే ఈ రెండు ఘంటలను ప్రస్తుతం ఒక పార్శ్వానికి చేర్చి, రెండింటిని ప్రక్క- ప్రక్కనే అమర్చారు.
🙏 *జయ విజయులు* 🙏
💫 శ్రీవారు కొలువుండే వైకుంఠానికి ఏ విధంగా జయవిజయులు కాపుంటారో, అదేవిధంగా బంగారువాకిలికి దక్షిణాన జయుడు, ఉత్తరాన విజయుడు; శంఖు, చక్ర, గదాధారులై, సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపాల్లా దర్శనమిస్తుంటారు. వీరిని *"చండ-ప్రచండులు"* అని కూడా వ్యవహరిస్తారు. పది అడుగుల ఎత్తుతో గంభీరంగా ఉండే ఈ పంచలోహ విగ్రహాలు తర్జనితో భక్తులను ఎల్లవేళలా హెచ్చరిస్తుంటాయి. స్వామి పుష్కరిణిలో పవిత్రస్నానమాచరించి, శుచిగా ఆలయంలోకి ప్రవేశించి, ఆలయ నిబంధనలు పాటిస్తూ, క్రమశిక్షణతో మెలుగుతూ, తోటి భక్తులకు ఇబ్బంది కలుగకుండా స్వామి దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నారేమో!
💫 ఈ మూర్తులను జాగ్రత్తగా గమనిస్తే, వారి నోళ్లకు చిన్నచిన్న కోరలుంటాయి. దానికి కారణం పూర్వజన్మలో వారు రాక్షసులుగా జన్మించడమే.
💫 పురాణాల్లోకి వెళితే ఒకప్పుడు వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉండే జయ-విజయులు, కారణాంతాన బ్రహ్మమానస పుత్రులైన సనకసనందనాది మునులచే శపించబడి, కృతయుగంలో *హిరణ్యాక్ష-హిరణ్యకశిపులు* గానూ, త్రేతాయుగంలో *రావణ కుంభకర్ణులు* గానూ, ద్వాపరయుగంలో *శిశుపాల దంతావక్రులు* గానూ జన్మించి, వారి వారి దుష్క్రుత్యాల వల్ల శ్రీవారి చేతిలో సంహరింప బడ్డారు. శాపకాలం పూర్తయిన తర్వాత, శ్రీమహావిష్ణువు కటాక్షంతో తిరిగి కలియుగంలో శ్రీనివాసునికి ద్వారపాలకులుగా నియమింపబడ్డారు. ఆదిశేషుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు తరువాత, విష్ణుమూర్తి పరివార దేవతలలో అత్యంత ప్రముఖులు వీరే!
💫 శ్రీవారిసన్నిధి యందున్న బంగారు కటాంజనాలలో నిరంతరం నిలుచుని ఉండే మహద్భాగ్యానికి నోచుకున్న జయవిజయులకు భక్తిపూర్వకంగా నమస్కరించి, వారి అనుమతితో, శ్రీవారి దర్శనార్థం, *"బంగారువాకిలి"* ముంగిట చేరుకున్నాం.
💫 ఇప్పుడు *బంగారువాకిలి,* దాని లోపల ఉన్న *ఇతర మండపాలు* మరియు *"గర్భాలయం"* గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన*
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*
🙏 *బంగారువాకిలి* 🙏
💫 శ్రీవారి ఆలయానికి మూడవది (మొదటిది "మహాద్వారం" లేదా "పడికావలి", రెండవది "వెండివాకిలి" లేదా "నడిమి పడికావలి"), అత్యంత ముఖ్యమైనది అయిన ఈ *"బంగారువాకిలి"* పేరుకు తగ్గట్లే, పసిడి కాంతులతో తళతళలాడుతూ, లక్ష్మీవల్లభుడైన శ్రీనివాసుని అనంతమైన ఐశ్వర్యాన్ని, వైకుంఠ వైభవాన్ని చాటుతూ ఉంటుంది.
[ *Note: చిన్న మనవి: కొన్ని ఆర్జిత సేవలలో పాల్గొనేవారు, విఐపి బ్రేక్ దర్శనం అనుమతి ఉన్న భక్తులు మాత్రమే బంగారువాకిలి దాటి లోనికి ప్రవేశించగలరు. మిగతా భక్తులందరూ,ఇక్కడినుండే, "లఘుదర్శనం" ద్వారా శ్రీవారి దివ్యమంగళరూపాన్ని దర్శించుకుని, మహామణి మంటపానికి దక్షిణంగా ఉన్న కటకటాల ద్వారం నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.*]
💫 బంగారువాకిలి గుమ్మం పైభాగాన, గుమ్మానికి ఇరుప్రక్కలా, జయ-విజయుల మధ్యనున్న ప్రదేశమంతా కడు రమణీయమైన పుష్పాలు, లతలు చెక్కబడి బంగారు తాపడంతో మెరుస్తూ ఉంటాయి. ఈ రెండు తలుపులు గళ్ళు - గళ్ళుగా విభజించబడి, ప్రతి గడిలోనూ ఒక్కో అద్భుతమైన ప్రతిమ అచ్చెరువు గొల్పుతూ ఉంటుంది. సుదర్శనచక్రం, శ్రీవేంకటేశ్వరుడు, మహావిష్ణువు, పాంచజన్యం, వాసుదేవుని విభిన్నరూపాలు, కేశవుని ద్వాదశమూర్తులు (కేశవుడు, నారాయణుడు, మాధవుడు, గోవిందుడు, విష్ణువు, మధుసూదనడు, త్రివిక్రముడు, వామనుడు, శ్రీధరుడు, హృషీకేశుడు, పద్మనాభుడు, దామోదరుడు), దశావతారరాలు కన్నులకింపుగా చెక్కబడి, సాక్షాత్తూ వైకుంఠమే ఇక్కడికి చేరుకున్నట్లుగా గోచరిస్తుంది. పై గడపకు ఇరుపార్శ్వాలలో గజరాజులచే పూజింపబడుతున్న గజమహాలక్ష్మి పద్మాసీనురాలై ఉంటుంది.
💫 బంగారువాకిళ్ళను సుప్రభాత సమయంలో *"కుంచెకోల"* అనే పరికరంతో, జియ్యంగార్లు, అర్చకులు, ఆలయ అధికారుల వద్దనున్న తాళంచెవులతో అందరి సమక్షంలో తెరిచే విస్తారమైన ప్రక్రియను మనం *"సుప్రభాతసేవ"* లో తెలుసుకున్నాం.
💫. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమలకు చేరుకున్న భక్తులు, పూటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉండి, మ్రొక్కుబడులు చెల్లించుకుని, బంగారువాకిలి వెలుపలి నుండే క్షణకాల దర్శనంతో సంతృప్తిపడి, శ్రీనివాసుని దివ్యమంగళమూర్తి నుండి దృష్టి మరల్చుకోలేక, రెప్పవేస్తే కన్నుల ముందున్న పెన్నిధి కనుమరుగవుతుందేమోనన్న బెంగతో, అతికష్టం మీద ముందుకు సాగిపోతారు.
💫 స్వామివారిని ఎన్నెన్నో కోర్కెలు కోరుదామని వచ్చిన భక్తులు ఆనందాతిశయంతో, భక్తిపారవశ్యంతో, తన్మయంతో తమను తాము మైమరచిపోతారు.
*మనం కోరుకోగలిగింది అత్యల్పం, స్వామివారు ప్రసాదించ గలిగింది అనంతం! భక్తుని మానసం భగవంతు డెరుగడా?*
💫 కొండంత దేవుడిని కోటి కోర్కెలతో కష్టపెట్టకుండా, క్షణకాల దర్శనంలో ఆ చిన్మయానంద రూపాన్ని గుండె గుడిలో పదిలంగా కొలువుంచు కోవడం శ్రేయస్కరం!
🌈 *స్నపనమండపం* 🌈
💫 బంగారువాకిలి దాటగానే మనం మొట్టమొదటగా ప్రవేశించే ఓ ఇరుకైన, చిరుచీకటిగా వుండే నాలుగుస్తంభాల మంటపమే *"స్నపనమండపం."* ఈ మంటపం యొక్క శిలాస్తంభాలపై వివిధ ఆకృతుల్లో ఉన్న శ్రీకృష్ణుని, యోగానరసింహుని శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. 614వ సంవత్సరం నందు, ఆలయానికి మరమ్మత్తులు జరుగుతున్న సమయంలో, పల్లవరాణి "సామవై" మూలమూర్తికి నకలుగా భోగశ్రీనివాసమూర్తి వెండి ప్రతిమను చేయించి, ఈ మంటపంలో ప్రతిష్ఠ చేయించి నందున, దీన్ని *"బాలాలయం"* అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం కొలువు శ్రీనివాసమూర్తికి ప్రతినిత్యం తెల్లవారు ఝామున జరిగే *"దర్బారు"* ఈ మంటపంలోనే నిర్వహింప బడుతుంది. స్వామివారికి అలంకరించే అమూల్యమైన ఆభరణాలన్నీ ఈ మండపంలోని బీరువాలలో, అర్చకులు, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో భద్రపరుస్తారు. శ్రీవారి ఆభరణాల గురించి ముందు ముందు వివరంగా తెలుసుకుందాం.
🌈 *రాములవారి మేడ* 🌈
💫 స్నపనమంటపం దాటగానే మనం మరో ఇరుకైన మంటపంలోకి ప్రవేశిస్తాం. ఈ మండపంలో దక్షిణం వైపున ఉన్న అరుగుపై – ఉత్తరాభిముఖంగా సీతారామలక్ష్మణులు; రాములవారి పరివార దేవతలైన హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు - కొలువై ఉండేవారు. అలాగే, ఉత్తరం వైపున ఉన్న అరుగుమీద, దక్షిణాభిముఖంగా శ్రీవేంకటేశ్వర పరివార దేవతలైన — గరుత్మంతుడు, విష్వక్సేనుడు, అనంతుడు – కొలువై ఉండేవారు. ఎప్పటినుంచో రామపరివారం వేంచేసి ఉండటం వల్ల ఈ మంటపాన్ని *"రాములవారి మేడ"* గా వ్యవహరిస్తారు.
💫 కాలాంతరంలో, సీతారామలక్ష్మణుల విగ్రహాలను గర్భాలయంలోకి, మిగిలిన మూర్తులన్నింటిని విమానప్రదక్షిణ మార్గంలోనున్న "అంకురార్పణ మంటపం" లోనికి తరలించారు. ఈ మండపం గురించి తరువాత తెలుసుకుందాం.
💫 రాత్రి ఏకాంతసేవ సమయంలో తాళ్లపాక వంశీయులు రాములవారిమేడ నుండే తుంబురనాదం వినిపిస్తూ జోలపాట పాడుతారు. 13వ శతాబ్దానికి పూర్వం, ఈ మంటపం ముక్కోటి ప్రదక్షిణమార్గంలో కలిసిపోయి, నాలుగో ప్రదక్షిణ మార్గంగా ఉండేది. తరువాత ఇరుపార్శ్వాలలో గోడలు నిర్మించడం వల్ల, ఇదో మంటపమై పోయింది.
🌈 *శయనమండపం* 🌈
💫 రాములవారి మేడ దాటగానే శయనమండపం లోనికి ప్రవేశిస్తాం. గర్భాలయానికి అనుసంధానించి, దానికి ఎదురుగా ఉండే ఈ మండపాన్ని ఆగమశాస్త్ర పరిభాషలో *"అంతరాళం"* గా పిలుస్తారు. ఈ మంటపం శ్రీవారికి శయనమంటపంగా మరియు భోజనశాలగా కూడా ఉపయోగపడుతుంది. వెన్న, పాలు, పెసరపప్పు (వడపప్పు), స్వామివారికి తొలినైవేద్యంగా సమర్పించబడే మాత్రాన్నం మరియు అతికొద్ది ముఖ్యమైన ప్రసాదాలు తప్ప, మిగిలిన సమస్త ప్రసాదవిశేషాలను శయనమంటపం నుంచే స్వామివారికి నివేదిస్తారు. ఈ మంటపంలోనే భోగశ్రీనివాసమూర్తిని, వెండి గొలుసులతో వ్రేలాడ దీయబడిన బంగారు పట్టెమంచం పైనున్న పట్టుపరుపుపై శయనింపజేసి, ఏకాంతసేవ జరుపుతారు. తోమాలసేవ సమయంలో ఆళ్వారుల దివ్యప్రబంధగానం, శ్రీసూక్తపురుషసూక్త పఠనం, ఈ మండపం నుండే జరుగుతాయి. తోమాలసేవ, సహస్రనామార్చన, అష్టదళ పాదపద్మారాధన, శుక్రవారాభిషేకం వంటి ప్రముఖమైన ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు మాత్రమే శయనమంటపంలో కూర్చుని తనివితీరా స్వామివారిని దర్శించుకునే భాగ్యం దక్కుతుంది. ఇంత సమీపం నుండి స్వామివారిని వీక్షించుచుకునే మహదవకాశం, అత్యంత అరుదుగా మాత్రమే లభిస్తుంది.
🌈 *కులశేఖరపడి* 🌈
💫 పన్నెండుమంది ఆళ్వార్లలో ఒకరైన *"కులశేఖరాళ్వార్",* 767వ సం., కుంభమాసాన, పునర్వసు నక్షత్రంలో, కేరళదేశము నందలి "కళి" అనే పట్టణంలో, "దృఢవ్రతుడ" నే రాజుకు, శ్రీమహావిష్ణువు యొక్క కౌస్తుభరత్నాంశతో జన్మించారు.
💫 104 పాటలతో ఆయన రచించిన "పెరుమాళ్ తిరుమొళి" అనే గీతమాలికలోని 11 పాటలలో తిరుమలేశుణ్ణి వర్ణించబడింది. లోకప్రసిద్ధమైన ఈ పాటలను విని, ఆనందపరవశులై తిరుమలేశుని దర్శనార్థం వేంకటాచలానికి వచ్చిన భక్తులు ఎందరో ఉన్నారు. ఒక పాశురంలో ఆయన స్వామివారిని ఈ విధంగా వేడుకొన్నారు:
*పడియాయ్ కెడందు ఉన్*
*పవళవాయ్ కాన్ బేనే"*
💫 అంటే, "ఓ వెంకటేశా! నీముందు రాతిగడపగా పడి ఉన్నట్లైతే నీ ముఖారవిందాన్ని నిత్యం దర్శించుకోవచ్చు కదా!" భగవద్భక్తి పూరితమైన 'ముకుందమాల' అనే గ్రంథాన్ని కూడా ఈయన రచించారు.
💫 ఈ చిన్ని పదబంధంతో కులశేఖరుని ఆర్తిని, ఆకాంక్షను, భావోద్వేగాన్ని, శ్రీవారి పట్ల వారికుండే అనన్య భక్తిని అవగతం చేసుకోవచ్చు. ఆయన కోరికను తీర్చటానికా అన్నట్లు, స్వామివారికి అత్యంత సమీపంలో ఉండే గడప *"కులశేఖరపడి"* గా పిలువ బడుతుంది. "పడి" అనగా "గడప" లేదా "మెట్టు" అని అర్థం.
💫 ఈ గడపకు పైన, క్రింద, ఇరుపార్శ్వాల యందు బంగారు తాపడం చేయబడి ఉంటుంది. స్వామివారి వైఖానస ఆగమ అర్చకులు మరియు జియ్యంగార్లకు తప్ప, వేరెవ్వరికీ ఈ గడప దాటి గర్భాలయం లోనికి ప్రవేశించే అధికారం లేదు. కోటీశ్వరులైనా, దేశాధినేతలైనా, ఈ గడప వెలుపలనుండి వెనుదిరిగాల్సిందే!
🌈 *గర్భాలయం* 🌈
💫 కులశేఖరపడికి లోపల, స్వామివారి మూలమూర్తి కొలువై ఉండే ఇరుకైన ప్రదేశమే *"గర్భాలయం".* దీన్నే *"ఆనందనిలయం"* గా కూడా వ్యవహరిస్తారు. బంగారు తాపడం కలిగిన ఆనందనిలయ "విమానం" లేదా "గోపురం" ఈ గర్భాలయం ఉపరితలం పైనే ప్రతిష్ఠించబడి ఉంటుంది.
💫 చారిత్రక ఆధారాల ననుసరించి, ఈ గర్భాలయం 900వ సంవత్సరానికి పూర్వమే నిర్మించబడగా, మిగిలిన కట్టడాలన్నీ 11వ శతాబ్దా నంతరమే, అంచెలంచెలుగా రూపు దిద్దుకున్నాయి.
💫 సంవత్సరానికి నాలుగు మార్లు జరిగే "కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం" ఆర్జిత సేవలో భాగంగా, గర్భాలయ అంతర్భాగాని కంతటికీ సుగంధద్రవ్యాల మిశ్రమమైన *"పరిమళం"* అనబడే పదార్థాన్ని పూయడం ద్వారా, గాలివెలుతురు లేకపోయినప్పటికీ, గర్భాలయం అంతటా, ఏ విధమైన క్రిమి-కీటకాలు లేకుండా, సువాసనలతో గుబాళిస్తుంది.
💫 ఈ గర్భాలయం, పన్నెండు అడుగుల తొమ్మిది అంగుళాల పొడవు, వెడల్పులతో చతురస్రంగా ఉంటుంది. గర్భాలయానికి ఆగమశాస్త్రం అనుమతించిన అత్యధిక వైశాల్యం ఇదే! స్వామివారు స్ఫురద్రూపు లవ్వడంచేత, వారికి తగ్గట్లుగా ఇంత విశాలమైన గర్భాలయం నిర్మించబడింది.
💫 పల్లవరాజుల కాలంలో నిర్మింపబడిన ఆలయాలన్నింటిలో గర్భాలయగోడలు దాదాపు మూడు-నాలుగు అడుగుల మందం కలిగి ఉంటాయి. దానికి భిన్నంగా, శ్రీవారి గర్భాలయ కుడ్యాలు ఏడు అడుగులకు పైగా మందం కలిగి ఉన్నాయి. వివిధ రాజుల కాలంలో స్వామివారి గర్భాలయానికి చుట్టూ ఉన్న అసలు గోడను అనుసంధానించి వేర్వేరు లక్ష్యాలతో కొత్త గోడలు నిర్మించుకుంటూ పోవడమే దీనికి కారణం. అంతకు ముందు (వెలుపలి గోడ నిర్మించక ముందు), ఈ గర్భాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ మార్గం కూడా ఉండేది.
💫 గర్భాలయం పైకప్పు క్రిందుగా, మూలమూర్తి పై భాగంలో "కురాళం" అనబడే మఖమల్ వస్త్రం ఎప్పుడూ కట్టబడి ఉంటుంది. దీనిని సంవత్సారానికి నాలుగు సార్లు మార్చుతారు. అలాగే, మూలమూర్తి వెనుక ఉండే పరదాను, ప్రతి శుక్రవారాభిషేకానికి ముందురోజున మార్చుతారు.
💫 గర్భాలయంలో మూలవిరాట్టుతో పాటుగా భోగశ్రీనివాసుడు, శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి, కొలువుశ్రీనివాసుడు, ఉగ్రశ్రీనివాసుడు కూడా కొలువై ఉంటారు. ఈ పంచబేరాలకు తోడుగా సీతారామలక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణుల పంచలోహ విగ్రహాలు కూడా వేంచేసి ఉంటాయి. ఒక్క మూలవిరాట్టు తప్ప, మిగిలిన మూర్తులన్ని తరువాతి కాలంలో గర్భాలయంలో చేర్చబడినవే!
💫 స్వామివారికి ఎదురుగా, గర్భాలయం లోపల, ఆగ్నేయ ఈశాన్య మూలల్లో, ఎల్లవేళలా నేతిదీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. మొట్టమొదటిసారిగా ఈ దీపాలను బ్రహ్మదేవుడు వెలిగించటం వల్ల వీటిని *"బ్రహ్మ అఖండం"* గా పిలుస్తారు.
💫 గర్భాలయంలో స్వయంవ్యక్తమై, చరిత్రకందని కాలం నుండి పూజల నందుకుంటున్న మూలమూర్తి గురించి, తర్వాతికాలంలో చేర్చబడిన సీతారామలక్ష్మణులు, రుక్మిణి శ్రీకృష్ణ ప్రతిమల గురించి, విమానప్రదక్షిణ మార్గంలో ఉన్న మరికొన్ని విశేషాలగురించి తెలుసుకుందాం.
మనం బంగారువాకిలిలో నుంచి స్నపనమంటపం, రాములవారిమేడ దాటుకుని, శయనమంటపం లోకి ప్రవేశించి, కులశేఖరపడి ఆవల నిలబడి, మూలమూర్తి దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం.
ఇప్పుడు మూలమూర్తిని, గర్భాలయంలో ఉన్న ఇతరదేవతా మూర్తులను తనివితీరా దర్శించుకుందాం!
*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన*
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*
🙏 *శ్రీవారి మూలవిరాట్టు* 🙏
💫 స్వామివారు సుమారుగా తొమ్మిదిన్నర అడుగుల ఎత్తులో, పాదపద్మాలను పద్మపీఠంపై నుంచి, నిగనిగలాడే నల్లని మేనిఛాయతో దర్శనమిస్తారు. ముంగాళ్లకు అందెలు లేదా నూపురాలు అలంకరింపబడి ఉంటాయి. స్వామివారి మూర్తి నిటారుగా నిలబడి ఉన్నట్లు కనిపించినప్పటికీ, నడుముభాగంలో కొద్దిగా ఎడమప్రక్కకు ఒరిగి, మోకాలు కొద్దిగా పైకి లేచి ఉంటుంది. అంటే స్వామివారు వయ్యారంగా నిలబడి ఉన్నారన్నమాట. నడుముకు రెండంగుళాల వెడల్పైన కటి బంధం చుట్టబడి ఉంటుంది. నడుము పై భాగంలో ఏ విధమైన ఆచ్ఛాదన లేని స్వామివారు, క్రింది భాగంలో ఒక ధోవతి ధరించి ఉంటారు. బొడ్డు నుండి పాదాల వరకు వ్రేలాడుతున్న ఖడ్గాన్ని *"సూర్యకఠారి"* లేదా *"నందకఖడ్గం"* అని పిలుస్తారు.
💫 చతుర్భుజుడైన స్వామివారు, పైనున్న కుడిచేతిలో సుదర్శనచక్రాన్ని, ఎడమచేతిలో *పాంచజన్య శంఖాన్ని* ధరించి ఉంటారు. ఈ ఆయుధాలు స్వామివారి మూర్తికి సహజసిద్ధమైనవి కావు. అమర్చబడ్డవని మనం ముందుగానే తెలుసుకున్నాం.
💫 మరో కుడిచెయ్యి వరదభంగిమలో నుండి, అరచేతి వేళ్లతో కుడిపాదాన్ని సూచిస్తూ ఉంటుంది. నడుముపై, నేలకు సమాంతరంగా పెట్టుకుని ఉన్న ఎడమచేతిని కటిహస్తంగా పిలుస్తారు. ఈ హస్త భంగిమను ఆగమపరిభాషలో *"కట్యావలంబితముద్ర"* గా పేర్కొంటారు. వరదహస్తంతో కోరిన వరాలను కురిపిస్తూ, నా పాదాలే భక్తులకు శరణ్యమని సూచిస్తుంటారు. కటిహస్తంతో, నన్ను నమ్ముకున్న భక్తులు సంసారసాగరంలో నడుములోతు వరకే మునుగుతారనే సంకేతం ఇస్తారు. ముంజేతులకు కంకణాలు, కంఠభాగంలో యజ్ఞోపవీతం, మరో నాలుగు హారాలు మనోహరంగా దర్శనమిస్తాయి. నిరంతరం విల్లంబులను, అమ్ములపొదిని ధరించి ఉండడం వల్ల భుజంపై రాపిడి గుర్తులు కూడా కనిపిస్తాయి. వక్షస్థలంపై దక్షిణభాగాన కొలువైవున్న మహాలక్ష్మిని *"వక్షస్థల లక్ష్మి"* గా పిలుస్తారు. శిరస్సు పైనుండి సొగసుగా జాలువారుతున్న శిరోజాలను, భుజాలపై దోబూచులాడుతున్న ముంగురులను కూడా దర్శించుకోవచ్చు. ముఖారవిందంలో నాసిక, పెదిమలు, గడ్డము, చెవులు, నేత్రాలు సమపాళ్ళలో తీర్చిదిద్ది నట్లుంటాయి.
💫 శంఖుచక్రాలు తప్ప పైన పేర్కొన్నవన్నీ మూలమూర్తిలో అంతర్భాగంగా ఉన్నవే!! వీటిలో చాలా భాగం శుక్రవార అభిషేక సమయంలో, ఆభరణాలు, వస్త్రాలంకరణ లేనప్పుడు మాత్రమే దర్శించగలం. అయితే, స్వామివారు నిత్యం పట్టుపీతాంబరాలతో, వజ్ర వైడూర్య రత్నఖచిత స్వర్ణాభరణాలతో, అనేక పూలమాలలతో, శ్రీదేవి భూదేవి అమ్మవార్ల పతకాలతో, విశేషసందర్భాల్లో వజ్రకిరీటధారణతో, యజ్ఞోపవీతం, ఉదరాన *కౌస్తుభమణి,* నడుముకు బంగారు మొలత్రాడు, పాదాలకు బంగారు తొడుగులుతో అలంకరింపబడి ఉంటారు.
💫స్వామివారి విప్పారిన నేత్రాలను, నాసిక ఉపరితల భాగాన్ని చాలా వరకు కప్పివేస్తూ వెడల్పాటి ఊర్ధ్వపుండ్రం, దాని మధ్యభాగాన కస్తూరితిలకం కనిపిస్తాయి. కాబట్టి మిగిలిన సమయాల్లో మూలమూర్తి సహజరూపాన్ని దర్శించటం వీలుకాదు.
💫 స్వయంవ్యక్తము, దివ్యసాలగ్రామశిల అయినటువంటి శ్రీవారు, అర్చారూపాన్ని పొందటం వెనుక ఆగమశాస్త్ర నేపథ్యం ఉంది. అర్చనాదికాలకు అనువైన రూపాన్ని ధరించి కలియుగవాసులలో భక్తి భావాన్ని, పాపభీతిని, ధర్మాధర్మవిచక్షణ పెంపొందించడమే అర్చారూపంలోని పరమార్థం! తన ముగ్ధమోహన రూపంతో భక్తులను పరవశింపజేసి, వారి మనస్సును. దృష్టిని తనపై మళ్ళింప జేసుకుని, వారికి ఇహపరాలను ప్రసాదిందిడం కోసమే స్వామివారు ఇక్కడ భౌతికంగా కొలువై ఉన్నారు.
💫 స్వామివారి దివ్యమంగళ రూపాన్ని వర్ణించటం మహామహులకే సాధ్యం కాలేదు. శ్రీవారి శోభను చూచాయగా, లేశామాత్రంగా తెలియజెప్పే చిన్ని ప్రయత్నమే ఇది!
💫 శ్రీవారి మూర్తి మానవనిర్మితమై ఉండవచ్చునని కొందరు సందేహం వెలిబుచ్చుతారు. అయితే, ఆలయశాస్త్రంలో నిష్ణాతులైన స్థపతులు ఈ వాదనను తర్కయుక్తంగా, శాస్త్రబద్ధంగా ఖండించారు. ఆగమశాస్త్రానుసారం మానవనిర్మిత మూర్తులలో - యోగమూర్తి, భోగమూర్తి, వీరమూర్తి, అభిచారకమూర్తి - అనే నాలుగు భంగిమలు కలిగిన మూర్తులుంటాయి. ప్రతి మూర్తికి ఉండవలసిన నిర్దిష్ట లక్షణాలను ఆగమశాస్త్రంలో పొందుపరిచారు. మూలమూర్తి ఆకారాన్ని, హస్తభంగిమలను, ధరించిన ఆయుధాలను, స్వతఃసిద్ధంగా ఉన్న అలంకారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఈ నాలుగు రకాల మూర్తులకు నిర్ధారించబడిన ఏ లక్షణాలను గర్భాలయంలోని మూలమూర్తి కలిగి ఉండదు. అందుచేత, ఈ మూలవిరాట్టు మానవనిర్మితం కాదని, ఆగమశాస్త్ర ఆవిర్భావానికి ఎంతో ముందుగానే ఈ మూర్తి ఉద్భవించిందని తేటతెల్లమవుతుంది.
💫 గర్భాలయంలో స్వామివారి మూలమూర్తితో పాటుగా పంచబేరాలు (ధ్రువబేరమైన అయిన మూలవిరాట్టు తోపాటుగా), సుదర్శన చక్రత్తాళ్వార్, పవిత్ర సాలగ్రామాలు, రుక్మిణి-శ్రీకృష్ణుడు, సీతారామలక్ష్మణ మూర్తులు కూడా దర్శనమిస్తాయి.
💫 *పంచబేరాల* గురించి మనం మొట్టమొదటి ప్రకరణంలోనే తెలుసుకున్నాం. తక్కిన ఉత్సవమూర్తుల గురించి తదుపరి భాగాలలో చెప్పుకుందాం.
🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏
*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన*
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*
💐 *కళ్యాణమండపం* 💐
💫 సంపంగిప్రాకార కుడ్యానికి లోపలివైపున అనుసంధానింపబడి, యాగశాలకు ఆనుకొని దానికి పడమరగా, విమానప్రదక్షిణ మార్గంలో ఉన్న విశాలమైన మంటపాన్ని *"కళ్యాణ మండపం"* అంటారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం వరకు శ్రీవారి నిత్యకళ్యాణోత్సవం ఈ మంటపం లోనే జరుగుతూ ఉండేది. శ్రీవారి మహాభక్తుడు తాళ్ళపాక అన్నమయ్య, తదనంతర కాలంలో వారి వంశీయులు ఈ మంటపంలోనే శ్రీవేంకటేశ్వరుని కళ్యాణోత్సవాలు జరిపేవారు.
💫 1586వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య ప్రతినిథియైన అయిన చెన్నప్ప అనే అధికారి ఈ మండపాన్ని నిర్మించారు. పూర్తిగా విజయనగరశైలిలో నిర్మింపబడ్డ ఈ మండపం రమణీయమైన శిల్పకళా చాతుర్యంతో కనువిందు చేస్తుంది. ఈ మంటప అంతర్భాగంలో వున్నటువంటి, నాలుగు స్తంభాలతోనున్న *"మధ్యమండపం"* విజయనగరశిల్పుల కళాకౌశల్యానికి మచ్చుతునక. ఈ నాలుగు స్తంభాలు, ఒక్కొక్కటి మరో నాలుగు స్తంభాల సముదాయం ఒక లావాటి స్తంభం మరియు దానికి బాహ్యంగా మరో మూడు సన్నటి స్తంభాలు - ఒకే రాతిలో చెక్కబడి ఉంటాయి. అత్యంత నునుపైన నల్లటి గ్రానైట్ వంటి రాతిపై అందమైన కళాకృతులు అత్యద్భుతంగా మలచ బడ్డాయి. ఈ మధ్యమంటపం లోనే, కళ్యాణోత్సవం జరిగేటప్పుడు ఉభయ నాంచారులతో కూడిన మలయప్పస్వామి వారిని వేంచేపు చేసేవారు.
💫 కళ్యాణమంటపం లోని శిలాస్తంభాల మీదా, కుడ్యాల యందు అనేక ఆకృతులు హృద్యంగా చెక్కబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి యోగముద్ర లోనున్న నరశింహస్వామి, హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తున్న ఉగ్రనరశింహుడు, సింహవాహనంపై ఆసీనుడై ఉన్న నరశింహుడు, త్రివిక్రమావతారంలో ఉన్న విష్ణుమూర్తి, గరుడవాహనంపై విహరిస్తున్న శ్రీమహావిష్ణువు, ఆదిశేషునిపై శయనించిన శేషసాయి, పదహారు చేతులతో కరందమకుటం ధరించి శిరస్సు చుట్టూ అగ్నిజ్వాలలతో ప్రకాశిస్తున్న అత్యంత అరుదైన సుదర్శనుని ప్రతిమ – మున్నగునవి.
💫 ఇవే కాకుండా, విజయనగర సామ్రాజ్య చిహ్నమైన *"యాలి"* అనబడే కాల్పనిక జంతువు, కామధేనువు, పుష్పాకృతులు, హనుమంతుడు, జాంబవంతుడు, రామాయణ ఘట్టాలు మొదలైనవెన్నో చెక్కబడి ఉన్నాయి.
💫 ఇదివరకు నాణేలపరకామణి (నాణాల లెక్కింపు కేంద్రం) ఈ మంటపంలోనే ఉండేది. శ్రీవారికి చెందిన ప్రాచీన, నూతన ఉత్సవ వాహనాలను కూడా ఈ మంటపం లోనే భద్రపరిచేవారు. తరువాతి కాలంలో, కల్యాణోత్సవ వేడుకలు సంపంగి ప్రాకారంలోని *"శ్రీవేంకటరమణస్వామి కళ్యాణమంటపం"* లోనికి మార్చబడ్డాయి. అలాగే, వాహనాలను బయట నుండే వాహనమండపం లోనికి; నాణేలపరకామణిని తిరుపతి లోని తి.తి.దే. పరిపాలనాకార్యాలయ భవనానికి తరలించారు.
💫 తెలుగు పదకవితా పితామహుడు అన్నమాచార్యులచే శ్రీనివాసునికి కళ్యాణోత్సవం చేయబడ్డ ఈ పవిత్ర కళ్యాణమంటపం ప్రస్తుతం చాలా వరకు ఖాళీగానే ఉంటుంది. కొన్ని ఉత్సవ సందర్భాల్లో మాత్రం అర్చకులు, ఆలయ అధికారులు పూజాద్రవ్యాలను శిరస్సులపై నుంచుకొని, స్వామివారిసన్నిధి లోనికి ఈ కళ్యాణ మండపం నుండి బయలుదేరుతారు. శ్రీవారి దర్శనానంతరం ఈ మంటపంలో కూర్చుని కొద్దిగా విశ్రాంతి తీసుకుంటూ, ఉత్తరం వైపున ఉన్న ఆనందనిలయ గోపురాన్ని తనివితీరా దర్శించుకోవచ్చు.
🌈 *నోట్లపరకామణి (నోట్ల లెక్కింపుకేంద్రం)* 🌈
💫 కళ్యాణమంటపానికి ఆనుకొని, ఆలయానికి పడమరదిక్కున ఉన్న విశాలమైన, పొడవాటి మంటపాన్ని ప్రస్తుతం *"నోట్లపరకామణి"* గా వ్యవహరిస్తారు. పూర్వం ఈ మంటపంలో కూడా కొన్ని వాహనాలను భద్రపరిచేవారు. మూలమూర్తికి పూతగా పూసే పునుగుతైలం కూడా ఇక్కడే తయారు చేయబడేది. ప్రసాదవితరణ సైతం ఇక్కడే జరిగేది. కాలాంతరంలో ఇవన్ని వేర్వేరు ప్రదేశాలకు తరలించబడ్డాయి. ప్రస్తుతం శ్రీవారికి హుండీలో రొక్ఖరూపంలో, వస్తురూపంలో సమర్పింపబడే కానుకలను వేరు చేసి, దేశవిదేశాలకు చెందిన కరెన్సీనోట్లను లెక్కించే *"నోట్లపరకామణి"* గా ఈ మంటపాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ మంటపం పగటిపూట నడుము పైభాగంలో ఏ ఆచ్చాదన లేకుండా నోట్లను వేరుచేస్తున్న శ్రీవారి సేవకులతోనూ, నోట్ల లెక్కింపు యంత్రాలతోనూ, నోట్ల కట్టలను బయటకు చేరవేస్తున్న బ్యాంకు సిబ్బంది తోనూ సందడిగా ఉంటుంది. నిబంధనల ప్రకారం నోట్ల లెక్కింపు విధుల్లో ఉన్న శ్రీవారిసేవకులు, బ్యాంకు సిబ్బంది, ఏ విధమైన ఆభరణాలను కానీ, చేతి గడియారాలను కానీ ధరించరాదు.
💫 ప్రతినిత్యం 3–4 కోట్ల రూపాయలు, బ్రహ్మోత్సవాల్లో దానికి రెండింతల నగదు ఇక్కడ లెక్కించబడుతుంది. ఈ లెక్కింపు కార్యక్రమాన్ని చూస్తుంటే శ్రీమహాలక్ష్మి "ధనలక్ష్మి రూపం" లో శ్రీవారి చెంతనే కొలువుతీరి ఉన్నట్లుగా, ముల్లోకాల యందలి సమస్త సంపదలు ఇక్కడే ప్రోగుపడ్డట్లుగా అనిపిస్తుంది. నోట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది 2-3 షిప్టుల్లో పని చేస్తారు. పరకామణిలో జరిగే కార్యక్రమాలన్నింటినీ సీసీటీవీల ద్వారా విజిలెన్స్ శాఖ వారు నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. స్వామివారి దర్శనానంతరం, విమాన ప్రదక్షిణ మార్గంలో వెళుతున్న భక్తులు ఒకరిద్దరిని పిలిచి, ఈ లెక్కింపు కార్యక్రమానికి సాక్షి సంతకాలు తీసుకునే సాంప్రదాయం ఉంది.
💫 శ్రీవారి కృప ఉంటే, ఈసారి మనమే సాక్షులుగా ఎన్నుకోబడి ఆ వైభవాన్ని కన్నులారా తిలకించి, పునర్దర్శన భాగ్యాన్ని, శ్రీవారి ప్రసాదాన్ని పొందే అవకాశం ప్రాప్తిస్తుంది.
🌈 *చందనపు అర* 🌈
💫 నోట్లపరకామణికి ఉత్తరం దిక్కున, సంపంగి ప్రదక్షిణమార్గంలో వాయువ్యమూలకు, ఇనుపకడ్డీల వాకిళ్ళతో కనిపిస్తున్న చిన్నగదిని *"చందనపు అర"* గా పిలుస్తారు. ప్రతినిత్యం స్వామివారికి అవసరమయ్యే చందనం ఈ గదిలోనే తయారు చేయబడుతుంది. గంధం తీయడానికి అనువుగా వుండే ఎత్తైన సానరాళ్ళు ఏర్పాటు చేయబడి ఉంటాయి. పెద్ద తిరుగలిరాళ్ల లాగా ఉండే వీటిపై గంధం చెక్కలను వడివడిగా అరగదీస్తూ, చందన ద్రవ్యాన్ని తయారుచేసే దేవాలయ పరిచారకులను *"చందనపాణి"* గా వ్యవహరిస్తారు. చందనంతో పాటుగా, నీళ్ళతో తడిచిన మెత్తని పసుపు ముద్దలు కూడా ఇక్కడే తయారు చేయబడతాయి. ఈ గదిలో తయారైన చందనాన్ని, పసుపును శ్రీవారికి జరిగే అన్ని ఉత్సవాల్లో వినియోగిస్తారు.
🌈 *ఆనందనిలయ విమానం* 🌈
💫 అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బంగారుమేడపై ప్రతిష్ఠితమైన *"ఆనందనిలయ విమానం"* లేదా *"గోపురం"* ప్రదక్షిణమార్గంలో ఏ మూలనుంచైనా, చాలా దగ్గరగా, చక్కగా దర్శనమిస్తుంది. సరిగ్గా దీని క్రిందనే ఉన్న గర్భాలయంలో మూలమూర్తి కొలువై వుంటారు. ఆనందనిలయం ఉపరితలభాగంలో ఉండటంవల్ల దీనిని *"ఆనందనిలయ విమానం"* అని కూడా పిలుస్తారు.
💫 పురాణకాలంలో దీన్ని వాహనంగా చేసుకుని శ్రీహరి వైకుంఠం నుండి భూలోకానికి వచ్చినట్లు, మొట్టమొదటగా, శ్రీమహావిష్ణువు ఆదేశం మేరకు గరుత్మంతుడు విష్ణుమూర్తితో సహా ఈ విమానాన్ని వైకుంఠం నుంచి తెచ్చి వేంకటాచలక్షేత్రంలో ప్రతిష్ఠించినట్లు పురాణాల్లో చెప్పబడింది. అయితే, అత్యుత్తమ భక్తులకు మాత్రమే దివ్యవిమాన దర్శనభాగ్యం కలుగుతుంది. మనలాంటి సామాన్యు లందరికీ, ఆ దివ్యవిమానం స్థానంలో, ఈ బంగారుగోపురం యొక్క భౌతిక స్వరూపమే గోచరిస్తుంది. ఈ గోపురాన్ని శ్రీనివాసుని ఆనతిపై తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని చెబుతారు. దర్శనమాత్రం తోనే కోరిన కోర్కెలు సిద్ధించే ఈ గోపురాన్ని ఉద్దేశ్యించే అన్నమయ్య, తిరుమలను *"బంగారు శిఖరాలు బహు బ్రహ్మమయము"* అని వర్ణించాడు.
💫 మూడంతస్తుల గోపురంలో, కింది రెండంతస్తులు దీర్ఘ చతురస్రాకారంలోను, మూడవ అంతస్తు వర్తులాకారం లోనూ నిర్మింపబడ్డాయి. పది అడుగుల ఎత్తైన మొదటి అంతస్తులో లతలు, తీగలు, చిన్నచిన్న శిఖరాలు, మకర తోరణాలు చెక్కబడి ఉన్నాయి. పదకొండు అడుగుల ఎత్తున్న రెండవ అంతస్తులో మకరతోరణాలతో పాటుగా - విష్ణుమూర్తి, వరాహస్వామి, నరశింహస్వామి, జయవిజయులు, గరుడుడు, అనంతుడు, విష్వక్సేనుడు, సప్తఋషులు, ఆంజనేయుడు, విమాన వేంకటేశ్వరుడు - లాంటి 40 శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. పదహారు అడుగుల మూడవ అంతస్తులో - మహాపద్మం, నాలుగు మూలలలో సింహాలు, చిలుకలు, లతలు, హంసలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ అద్భుతమైన ప్రతిమలన్నీ బంగారు తాపడంతో పూర్తిగా కప్పబడి ఉండటం వల్ల, ఎంతో శ్రద్ధగా, నిశితంగా పరిశీలిస్తే గానీ వీటి అందచందాలను ఆస్వాదించలేము. దర్శనానంతరం ఏ విధమైన ఆంక్షలూ లేకుండా ఈ గోపురాన్ని తనివితీరా కాంచవచ్చు. ఈసారి తిరుమల యాత్రలో ఆనందనిలయ వీక్షణానికి తగినంత సమయం కేటాయించండి.
💫 బయట నుండి లోనికి వచ్చే ఉత్సవాలు, లేదా బయటకు వెళ్ళే ఉత్సవాలు, ఆనందనిలయ విమాన ప్రదక్షిణ చేసిన తర్వాతనే లోనికి రావడం గాని, బయటకు వెళ్ళడం గానీ జరుగుతుంది. తిరుమలకొండ మీద ఈ ఒక్క విమానమే ఉండాలనే కట్టడి ఉంది. సప్తగిరులపై మరే మానవనిర్మిత విమానం కానీ, హెలికాప్టర్ గాని అనుమతించ బడదు. దేశాధినేతలైనా సరే, తిరుపతి నుంచి తిరుమలకు మెట్ల ద్వారా లేదా రోడ్డు మార్గంలో రావాల్సిందే!
💫 ఆధారాలు లభించినంత వరకు, మొట్టమొదటగా 839వ సంవత్సరంలో పల్లవరాజైన విజయ దంతి విక్రమవవర్మ, తరువాత 1262 లో జాతవర్మ సుందరపాండ్యుడు, 1518 లో శ్రీకృష్ణదేవరాయలు, 1630 లో కంచి వాస్తవ్యుడైన 'కోటికన్యాదానం తాతాచార్యులు' అనబడే వైష్ణవభక్తుడు, 1908లో బావాజీమఠం వారు, 1958 లో తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఈ గోపుర బంగారుకవచాన్ని తిరిగి నిర్మించారు. 1359వ సంవత్సరంలో సాళువ మంగిదేవ మహారాజు పాత బంగారు కలశం స్థానంలో కొత్త దానిని ప్రతిష్ఠించారు.
💫 1958వ సంవత్సరంలో జరిగిన ఆనందనిలయవిమాన మహాసంప్రోక్షణ కార్యక్రమంలో, విమానం మీదున్నటువంటి పాతరేకులపై ఉన్న బంగారాన్ని, హుండీ ద్వారా భక్తులు సమర్పించుకున్న బంగారాన్ని, రసాయన ప్రక్రియ ద్వారా శుద్ధి చేసే కార్యక్రమాన్ని మహారాష్ట్రకు చెందిన శ్రీరామ్ నాథ్ షిండే గారు చేపట్టి, మేలిమి బంగారాన్ని వెలికి తీశారు. తమిళనాడుకు చెందిన చొక్కలింగాచారి అనే స్థపతి, విమానానికి కావలసిన రాగిరేకులను తయారు చేశారు. ఈ రేకులకు తమిళనాడులోని మరో భక్తుడు రాజగోపాలస్వామి రాజు గారు బంగారు తాపడం చేశారు. దీని తయారీకి పన్నెండు టన్నుల రాగి, పన్నెండువేల తులాల బంగారం వినియోగించబడింది. మొత్తం పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు కాగా, అందులో పాతబంగారం విలువ ఎనిమిది లక్షలు. మిగిలిన బంగారం అంతా హుండీ ద్వారా సేకరించబడింది. మొత్తం ఐదు సంవత్సరాలు పట్టిన ఈ కార్యక్రమంలో, మూడు సంవత్సరాలు రాగిరేకుల తయారీకి, మరో రెండు సంవత్సరాలు బంగారు తాపడానికి పట్టింది.
🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏
*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన*
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*
🙏 *చక్రత్తాళ్వార్ (సుదర్శనచక్రం)* 🙏
💫 చక్రత్తాళ్వార్ గా పిలువబడే *"సుదర్శనచక్రం"*, రెండడుగుల ఎత్తు కలిగి, చక్రాకారంలో 16 కోణాలు కలిగి, పంచలోహ నిర్మితమై, ఆరంగుళాల ఎత్తైన, వెండి చతురస్రపీఠంపై విరాజిల్లుతుంటుంది. ప్రతి సంవత్సరం నాలుగు సందర్భాలలో చక్రత్తాళ్వార్ కు స్వామిపుష్కరిణిలో చక్రస్నానం గావిస్తారు.
💫 స్వామివారి పరమాయుధమైన సుదర్శనచక్రం పూర్వయుగాలలో ఎందరో దైత్యులను సంహరించింది. చక్రాయుధానికి స్వామివారు ప్రత్యేకంగా అనుజ్ఞ ఇవ్వనవసరం లేదు. స్వామివారి చిత్రాన్ని, సంకల్పాన్ని, భక్తుల వాంఛితాలను గుర్తెరిగి, శిష్టరక్షణ దుష్టశిక్షణ గావించి, తిరిగి పదిలంగా స్వామివారి చెంతకు చేరుకుంటుంది. మనకు సుపరిచితమైన *"గజేంద్రమోక్షం"* ఘట్టమునందు మొసలి కోరలనుండి గజరాజును రక్షించినది సుదర్శనచక్రమే!
💫 భక్తులు తిరుమల యాత్రకు సంకల్పించినది మొదలు, వారిని ప్రయాణ మార్గంలోనూ, తిరుమల క్షేత్రం లోనూ అనుకోని విపత్తుల నుండి కాపాడి, తిరిగి వారి వారి గమ్యాలకు సురక్షితంగా చేర్చే బాధ్యతను సుదర్శనచక్రం చేపడుతుందని భక్తులు నమ్ముతారు.
🌈 *సాలగ్రామాలు* 🌈
💫 గర్భాలయం నందు వివిధ ఆకృతుల్లో, పరిమాణాల్లో ఉన్న అనేక సాలగ్రామాలు స్వామివారి పాదాల చెంతనున్న వెండిపళ్లెరంలో కొలువై ఉండి అనూచానంగా పూజాదికాల నందుకుంటున్నాయి. భగవద్రామానుజచార్యులు, వ్యాసతీర్థులవారు, ఇంకా అనేక భక్తశిఖామణులు మూలవిరాట్టును దివ్య సాలగ్రామశిలగానూ, తిరుమల క్షేత్రాన్ని దివ్యసాలగ్రామ మయంగానూ భావించి పూజించారు. పూజలందుకునే సాలగ్రామాలే కాకుండా, మాలలరూపంలో కూడా అనేక సాలగ్రామాలు మాలల రూపంలో అమర్చబడి స్వామివారి కంఠసీమను అలంకరిస్తున్నాయి. శ్రీ కృష్ణదేవరాయలు గురువుగారైన వ్యాసతీర్థుల వారు బంగారు కవచాలను తొడిగిన సాలగ్రామాలను స్వామివారికి బహుకరించారు. వేరెందరో భక్తులు కూడా తరచుగా స్వామివారికి సాలగ్రామమాలలను సమర్పిస్తున్నారు.
🙏 *రుక్మిణి శ్రీకృష్ణులు* 🙏
💫 గర్భాలయం నందు, కుడిచేతిలో వెన్నముద్దను పెట్టుకొని ఒంటికాలి మీద వయ్యారంగా నిల్చుని ఉన్న బాలకృష్ణుడు, రెండడుగుల ఎత్తైన రుక్మిణి-శ్రీకృష్ణుని వెండి విగ్రహాలు ఎప్పటి నుంచో పూజింపబడుతున్నాయి. రాజేంద్రచోళుని భార్య 1100వ సంవత్సరంలో ఈ విగ్రహాలకు పాలు పెరుగు నైవేద్యం సమర్పించేది.
💫 ప్రతి సంవత్సరం కనుమనాడు మలయప్పస్వామితో పాటుగా, శ్రీకృష్ణుడు కూడా *"పార్వేట ఉత్సవం"* లో పాల్గొంటారు. బ్రహ్మోత్సవాల్లో *"మోహినీ అవతారం"* రోజున, మలయప్పస్వామితో పాటు మరొక పల్లకిపై శ్రీకృష్ణుడు ఊరేగుతారు. ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పాశురాలను పాడుతూ, చిన్నికృష్ణుని మేల్కొలుపుతారు. అలాగే, ఆ మాసంలో రాత్రివేళయందు భోగశ్రీనివాసమూర్తికి బదులుగా చిన్నికృష్ణునికి పవళింపు సేవ జరుగుతుంది. ద్వాపరపు శ్రీకృష్ణుని కొనసాగింపే కలియుగ వేంకటేశ్వరుని అవతారమని అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం!
🙏 *సీతారామలక్ష్మణులు* 🙏
💫 గర్భాలయంలో మూలమూర్తికి ఎడమప్రక్కగా, ఒకప్పుడు రాములవారి మేడలో కొలువై ఉండే సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ విగ్రహాలు ఇక్కడికి ఎలా చేరుకున్నాయి అనే విషయంపై రెండు కథనాలు ఉన్నాయి.
💐 త్రేతాయుగంలో సీతమ్మవారిని వెతుక్కుంటూ వెంకటాద్రికి విచ్చేసిన రామలక్ష్మణులకు గుర్తుగా ఈ మూర్తులు ఇచ్చట కొలువై ఉన్నాయి. అందువలననే రామలక్ష్మణులు రాజోచితమైన కిరీటాలు ధరించకుండా, అరణ్యవాసంలో ఉన్నట్లు జడధారులై దర్శనమిస్తారు.
💐 మరో కథనం ప్రకారం - భగవద్రామానుజుల వారు తిరుమలనంబి నుండి శ్రీమద్రామాయణ రహస్యాలను, నడకదారిలోని ఓ ప్రదేశంలో తెలుసుకుంటూ ఉన్నప్పుడు, ఒక సద్ర్బహ్మణుడు వారికి ఈ విగ్రహాలను సమర్పించాడు. తదనంతర కాలంలో తిరుమలనంబి ద్వారా ఇవి ఆనందనిలయం లోనికి చేర్చబడ్డాయి.
💫 గర్భాలయంలోని మూలమూర్తులను తనివితీరా దర్శించుకుని, వెనుదిరిగి, వరుసగా శయనమండపం, రాములవారిమేడ, స్నపనమండపం – మీదుగా బంగారువాకిలి దాటి, జయ-విజయుల అనుమతితో తిరుమామణి మంటపానికి ఉన్న దక్షిణ ద్వారం నుంచి నిష్క్రమించి, తిరిగి విమాన ప్రదక్షిణమార్గాన్ని చేరుకున్నాం.
🌈 *ప్రధాన వంటశాల (పోటు)* 🌈
💫 విమానప్రదక్షిణమార్గంలో ఆగ్నేయదిశగా, ఎత్తైన అరుగులతో ఉండే వంటశాలను "పోటు" అంటారు. ఇదే వాస్తును ఇప్పటికీ మనం అనుసరిస్తూ, ఇంటికి ఆగ్నేయమూలన వంటగదిని ఏర్పాటు చేసుకుంటున్నాం. శ్రీవారిని దర్శించుకుని బయటకు రాగానే మనకు ఎదురుగా ఉండే బంగారుబావికి ఎడమప్రక్కగా ఈ ప్రధాన వంటశాల కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీవారికి సమర్పించే అన్నప్రసాదాలను మాత్రం ఇందులో తయారు చేస్తున్నారు. పూర్వం లడ్డు, వడ వంటి పణ్యారాలను కూడా ఇందులోనే తయారు చేసేవారు. ప్రస్తుతం ఇటువంటి పణ్యారాలను సంపంగి ప్రదక్షిణ మార్గంలో ఉన్న *"పడిపోటు"* లో తయారుచేస్తున్నారని ఇంతకు ముందే తెలుసుకున్నాం.
💫 ఈ "పోటు" యందు అన్నప్రసాదాలను వంటబ్రాహ్మణులు అత్యంత శుచిగా, నియమనిష్ఠలతో, వేళప్రకారం తయారుచేసి, స్వామివారి నివేదన నిమిత్తం గంగాళాలలో నింపుతారు. *"గమేకార్లు"* అనబడే పరిచారకులు ఈ ప్రసాదాల గంగాళాలను స్వామివారి సన్నిధికి చేరుస్తారు. పంచభక్ష్య పరమాన్నాలు ఎన్నో తయారైనా, పెరుగన్నాన్ని, మాత్రమే కులశేఖరపడి దాటి, కుమ్మరి భీమన్నకు గుర్తుగా గర్భాలయంలో ఉంచి నివేదన చేస్తారు. దాదాపుగా మిగిలిన ప్రసాదాలన్నీ గర్భాలయం వెలుపలనున్న శయనమందిరం నుండే స్వామివారికి నివేదించ బడతాయి.
🙏 *వకుళమాత* 🙏
💫 పోటుకు ప్రక్కగా, ఎత్తైన వేదికపైనున్న అద్దాలమందిరంలో, శ్రీవారి తల్లి వకుళమాత సుఖాసీనురాలై, నిత్యపూజ లందుకుంటూ, మనకు దర్శనమిస్తుంది. ముఖారవిందానికి ఎదురుగా ఉన్న ఓ చిన్నరంధ్రం ద్వారా ఆమె, తనయుడైన శ్రీనివాసుని కోసం తయారవుతున్న నైవేద్యాలను పర్యవేక్షిస్తారు. దేశానికి రాజైనా తల్లికి తనయుడే కదా!
💫 అలాగే, బ్రహ్మాండనాయకుడు కూడా తల్లిగారైన వకుళమాత చేతిముద్దలు తిన్నవాడే. వేల ఏళ్లనాటి, ఆ శ్రీనివాసుని బాల్యాన్ని స్ఫురణకు తెచ్చుకుంటూ, తన కుమారునికి సమర్పింపబడే నైవేద్యాలు "శుచిగా, రుచిగా, సమయబద్ధంగా తయారవుతున్నాయా లేదా" అన్న విషయాన్ని వకుళాదేవి అనుక్షణం గమనిస్తూ ఉంటుంది. అందుచేతనే ఈ మాతను *"పాకలక్ష్మి"* లేదా *"పచనలక్ష్మి"* అని కూడా అంటారు.
💫 కలియుగ ఆరంభంలో శ్రీనివాసుడు వరాహస్వామి అండదండలతో వెంకటాచలంపై స్థిరనివాసం ఏర్పరుచుకున్నప్పుడు, వకుళాదేవి శేషాచల అడవుల్లో పండే *శ్యామకధాన్యాన్ని* అన్నంగా వండి, తేనెతో కలిపి ప్రేమగా శ్రీనివాసుని తినిపించేదట. ఆ శ్యామకధాన్యాన్ని నేడు తెలంగాణ-రాయలసీమల్లో *"కొర్రలు"* అని, కర్ణాటకలో *"శ్యామలు"* అని పిలుస్తారు. ఈ ధాన్యానికి *"ప్రియంగు"* అనే మరో పేరు కూడా ఉండడం చేత, శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో శ్రీస్వామివారిని *"ఓం ప్రియంగు ప్రియాయై నమః"* అని కూడా స్తుతిస్తారు.
💫 ఈ విధంగా, ఆ తల్లి-తనయుల సంబంధం యుగయుగాలుగా, తరతరాలుగా కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో కొందరు అది "వకుళమాత విగ్రహం కాదు. శ్రీమహాలక్ష్మి మూర్తి" అంటున్నారు. కానీ, తి.తి.దే. వారు "వకుళమాత" అంటూ స్పష్టంగా సూచిస్తున్నారు.
🌈 *బంగారుబావి* 🌈
💫 వంటశాల మెట్లను ఆనుకొని, భూమి ఉపరితలం నుండి బంగారు తాపడం చేయబడి ఉన్న బావిని *"బంగారుబావి"* గా పిలుస్తారు. మహామణిమండపం నుండి బయటకు రాగానే, మన ఎదురుగా ఉన్న కటాంజనాలలో (లోహపు ఊచల పంజరం) దీనిని చూడవచ్చు. శ్రీవారి బోజనావసరాల నిమిత్తం సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి ఈ తీర్థాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెబుతారు. అందువలన దీనికి *"శ్రీతీర్థం"* లేదా *"లక్ష్మీతీర్థం"* అనే నామాంతరాలు ఉన్నాయి. తరువాతి కాలంలో ఆ బావి శిథిలం చెందగా, తొండమాన్ చక్రవర్తిగా పునర్జన్మించిన రంగదాసు అనే శ్రీవారి భక్తుడు,, స్వామివారి ఆనతి మేరకు దీనిని పునరుద్ధరించాడు. శ్రీవారి అభిషేకానికి కావలసిన శుధోదకాన్ని వెయ్యేళ్ళ క్రితం వరకు పాపనాశన తీర్థం నుండి, ఆ తరువాత ఆకాశగంగాతీర్థం నుండి "తిరుమలనంబి" అనే భక్తుడు తీసుకు వచ్చేవారు. తరువాతి కాలంలో తిరుమలనంబి గురువుగారైన యామునాచార్యులవారు, సాక్షాత్తు శ్రీమహాలక్ష్మిచే నిర్మించబడిన తీర్థం స్వామివారి చెంతనే ఉండగా, వేరే తీర్థాలనుండి అభిషేకజలం తీసుకు రావాలసిన అవసరం లేదని భావించినప్పటినుండి, ఈ బంగారుబావి లోని పవిత్రజలాలను శ్రీవారి వంటకాలు, అభిషేక, అర్చనాదుల నిమిత్తం ఉపయోగిస్తున్నారు. ఈ బావిలోని నీరు "సుందరుడైన " స్వామివారికి ఉపయోగపడుతుంది కనుక దీనిని *"సుందరస్వామి కూపం"* లేదా *"సుందరబావి"* అని కూడా పిలుస్తారు. ఆ రోజుల్లో స్వామివారిని *"సుందరస్వామి"* గా కూడా కీర్తించేవారు.
💫 అయితే, శుక్రవార అభిషేకానికి మాత్రం ఆకాశగంగాతీర్థం నుండి మూడు బిందెల అభిషేకజలాన్ని "తోళప్పాచార్యులు" గా పిలువబడే తిరుమలనంబి వంశీయులు తెచ్చే సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. పూర్వకాలంలో ఈ బావి నుండి అమర్చిన రాతి కాలువ ద్వారా నీరు వంటశాల లోనికి నేరుగా చేరుకునేది. తరువాతికాలంలో నీటికుండలతో చేదటం ద్వారా, ప్రస్తుతం విద్యుత్ ద్వారా ఈ బావిలోని నీటిని తోడుతూ వంటలకు ఉపయోగిస్తున్నారు. వేలాది సంవత్సరాల క్రిత నిర్మించబడ్డ ఈ బావి ఇప్పటికీ పానయోగ్యమైన జలాన్ని ప్రసాదించటం సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి మహాత్మ్యమే!
💫 ఈ మధ్యకాలంలో, కొండపై గుడి చుట్టూ అనేక నివాసగృహాలు రావడంతో నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉండటంవల్ల, సిమెంటు తాపడంతో ఆ అవకాశం లేకుండా చేసి పాపనాశన తీర్థంలోని నీటితో ఈ బావిని నింపుతున్నారు.
🌈 *అంకురార్పణ మంటపం* 🌈
💫 "పోటు" ను దర్శించుకుని ఎత్తైన అరుగు మీద ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు ముందుగా వచ్చేది *"అంకురార్పణ మంటపం".* బ్రహ్మోత్సవాలకు ముందు రోజున ఈ మంటపంలో, సేకరించుకొచ్చిన పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తింపజేయడం వల్ల ఈ మంటపానికి *"అంకురార్పణ మంటపం"* అనే పేరు వచ్చింది. అంకురార్పణపర్వం గురించి "శ్రీవారి బ్రహ్మోత్సవాలు" లో వివరంగా తెలుసుకున్నాం.
💫 ఒకప్పుడు దేవాలయ అంతర్భాగం నందున్న రాములవారిమేడలో కొలువుండే రామపరివార దేవతలైన ఆంజనేయుడు, అంగదుడు, సుగ్రీవుని విగ్రహాలు; అలాగే, *"నిత్యశూరులు"* అనబడే శ్రీమహావిష్ణువు పరివారదేవతలైన విష్వక్సేనుడు, ఆదిశేషువు, గరుత్మంతుడు విగ్రహాలను – ప్రస్తుతం ఈ మండపంలో దర్శించుకోవచ్చు. శ్రీవారి దర్శనానంతరం తీర్థం, శెఠారిని ఈ మంటపం ఎదురుగానే భక్తులకు ప్రసాదిస్తారు. రాత్రివేళల్లో స్వామివారి ఏకాంతసేవ పూర్తయి, ఆలయ ద్వారాలు మూసిన తరువాత, బ్రహ్మాది దేవతలు విచ్చేసి స్వామిని కొలుస్తారని ఓ గట్టి నమ్మకం. వారు అర్చించుకోవడం కోసం, ప్రతిరోజు ఆలయద్వారాలు మూసేటప్పుడు ఐదు బంగారు గిన్నెలలో ఆకాశగంగ తీర్థం నింపి ఉంచుతారు. ఉదయం సుప్రభాతం తర్వాత విశ్వరూపసందర్శనం కోసం విచ్చేసే భక్తులకు అంకురార్పణమండపంలో ఇచ్చేది ఈ తీర్థమే!! దీన్నే *"బ్రహ్మతీర్థం"* గా పిలుస్తారు.
💫 బ్రహ్మ కడిగిన విష్ణు పాదోదకం గనుక, ఈ తీర్థాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
🌈 *యాగశాల* 🌈
💫 అంకురార్పణ మండపానికి ఆనుకుని ఉన్న "యాగశాల" లో పూర్వం హోమాలు, యజ్ఞయాగాదులు వంటి వైదికక్రతువు లన్ని జరుగుతుండేవి. కానీ ప్రస్తుతం స్థలాభావం, భక్తులరద్దీ చేత ఈ క్రతువుల్లో చాలావరకూ సంపంగిప్రాకారం లోని "కళ్యాణమండపం" లో జరుప బడుతున్నాయి. బుధవారం నాడు జరిగే సహస్రకలశాభిషేకం సమయంలో మాత్రం, బంగారువాకిలి వద్ద ఏర్పాటు చేయబడిన తాత్కాలిక యజ్ఞగుండంలో యాగం నిర్వహింపబడుతుంది.
*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన*
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*
🙏 *విమాన వేంకటేశ్వరుడు* 🙏
💫 ఆనందనిలయ గోపురం రెండవ అంతస్తులో అత్యంత ముఖ్య మైనటువంటి, మనకు చిరపరిచితమైన, వెండి మకరతోరణంతో ఉన్న శ్రీవెంకటేశ్వరుని ప్రతిమను ఆనందనిలయ విమానం నందున్న కారణంగా *"విమాన వేంకటేశ్వరస్వామి"* అని పిలుస్తారు. తొండమాన్ చక్రవర్తి దీనిని ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ముమ్మూర్తులా మూలవిరాట్ ని పోలియున్న ఈ విగ్రహం, ఆనందంనిలయ గోపురానికి వాయువ్యదిక్కున దర్శనమిస్తుంది.
💫 పూర్వం ముందుగా విమాన వేంకటేశ్వరుని దర్శించుకున్న తరువాతనే మూలవిరాట్ దర్శనం కావించుకునే వారట. కానీ ఇప్పుడా సాంప్రదాయం మారిపోయింది. క్యూ నిబంధనల కారణంగా, మొదట మూలమూర్తిని దర్శించుకున్న తరువాతే విమానవేంకటేశ్వరుని దర్శించు కోగలం. ఏ కారణం చేతనైనా గర్భాలయంలో గల మూలమూర్తిని దర్శించుకోలేని భక్తులు, విమానవేంకటేశ్వరుణ్ణి దర్శించుకుంటే చాలుననే సాంప్రదాయానికి పదహారవ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు గురువైన వ్యాసతీర్థులవారు ఆద్యులు.
💫 విమాన వేంకటేశ్వరునికి ఇరువైపులా గరుత్మంతుడు, హనుమంతుడు, బాలకృష్ణుడు దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాల్లో, అర్చకులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నిచ్చెన నెక్కి స్వామివారికి పవిత్రమాలలు సమర్పిస్తారు. గర్భాలయంలో మూలవిరాట్టుకు జరుపబడే నివేదన సమయంలో, లోపలనుండే విమాన వేంకటేశ్వరునికి కూడా నివేదన సమర్పింప బడుతుంది
🌈 *వేదపారాయణం* 🌈
💫 స్థలాభావం కారణంగా గర్భాలయం నందున్న స్వామిసన్నిధిలో వేదపారాయణం చేయడం సాధ్యం కాదు కనుక, ఆలయానికి ఉత్తర దిక్కున ఉన్న ఎత్తైన అరుగులపై, విమానవేంకటేశ్వరునికి అభిముఖంగా కూర్చొని పండితులు వేదపారాయణం జరుపుతారు. తిరుమల ఆలయంలో వేదపఠనానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలు విజయనగర సామ్రాజ్యానికి చెందిన రెండవ దేవరాయలు కాలంలో ప్రామాణీకరింపబడ్డాయి. వేదపారాయణ సక్రమంగా, నిరాటంకంగా జరిగేందుకు గాను 24 మంది వేదపండితులు నియమింపబడ్డారు. శ్రీనివాసపురం అనే గ్రామ వార్షిక ఆదాయంలో సగభాగం ఈ వేదపండితుల ఉదరపోషణ నిమిత్తం కేటాయించే ఏర్పాట్లు చేశారు. వీరిలో, ప్రతిరోజు ఇద్దరు చొప్పున, వంతులవారీగా వేదం చదివే ఏర్పాటు జరిగింది. ఋగ్వేదము, సామవేదము, అథర్వణవేదము, కృష్ణయజుర్వేదము, శుక్లయజుర్వేదము పఠింపబడుతాయి. ఆ కాలం నుండి నేటి వరకు ఈ వేదపారాయణ నిరాటంకంగా జరుగుతోంది.
🌈 *సబేరా (సభఅర)* 🌈
💫 "సభ" అనగా కొలువు లేదా ఉత్సవం. "అర" అనగా గది. కాలాంతరంలో "సబేరా" గా మారిన ఈ "సభ అర", వేదపారాయణం జరిగే ప్రదేశానికి ఆనుకుని విమాన ప్రదక్షిణ మార్గం ఉత్తరభాగంలో ఉన్నది. ఆయా ఉత్సవాల్లో ఉపయోగింపబడే వివిధ సాంప్రదాయిక పూజాసామాగ్రి అయిన ఛత్రచామరాలు, వెండి దివిటీలు, బంగారు గొడుగులు, ఏకాంతసేవలో ఉపయోగించే పట్టుపరుపు, బంగారు నవారుమంచం, పరిమళ ద్రవ్యాలు – మొదలైనవన్నీ ఈ గదిలో భద్రపరుస్తారు. *శ్రీవారి శేషవస్త్రం లేదా మేల్ ఛాట్ వస్త్రాన్ని* ఈ గదిలో ఉంచి, ప్రముఖులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు వారి కళ్ళకు అద్దుతారు.
🌈 *సంకీర్తనా భండారం* 🌈
💫 విమానప్రదక్షిణ మార్గంలో, సబేరా గదికి ఎదురుగా, దక్షిణాభిముఖంగా శిల్పశోభితమై, పెద్ద పెద్ద చెక్కడపు రాళ్లతో ఉన్న బీరువా లాంటి అరను *"సంకీర్తనాభండారం"* అని పిలుస్తారు. దీన్నే *"తాళ్ళపాక అర"* అని కూడా అంటారు. దీని పై భాగంలో *"అన్నమాచార్యుల భాండాగారం"* అనే బోర్డు ఉంటుంది. ఈ భండారానికి చెక్కతలుపులు బిగించబడి ఉన్న చిన్న ద్వారం ఉంటుంది. ద్వారానికి ఇరువైపులా తమ ఎడమ, కుడి చేతులతో అర ముఖద్వారాన్ని సూచిస్తూ, భుజాల మీదనున్న తుంబురలను మీటుతూ రెండు శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. వాటిలో తూర్పుదిక్కున ఉన్నది అన్నమయ్య విగ్రహం అయితే, పడమటి దిక్కున ఉన్నది వారి కుమారుడైన పెద్ద తిరుమలాచార్యుని ప్రతిమ. తాళ్ళపాక వంశీయులు తాము గానం చేసిన కీర్తనలన్నీ, వారే స్వయంగా రాగిరేకులపై చెక్కించి, ఈ అరలో భద్రపరచి, భావితరాలకు అందజేశారు. తాళ్ళపాక అన్నమాచార్యులు తన ఆరాధ్యదైవమైన స్వామివారికి తన కృతులను అర్పిస్తూ ఈ విధంగా గానం చేశాడు:
*"దాచుకో నీ పాదాలకుఁదగ నే చేసిన పూజలివి*
*పూచి నీ కీరితి రూప పుష్పము లివి యయ్యా*
*ఒక్క సంకీర్తన చాలు వొద్దికై మమ్ము రక్షించగ*
*తక్కినవి నీ భండారాన దాచివుండనీ"*
🌈 *సన్నిధి భాష్యకారులు* 🌈
💫 సంకీర్తనాభండారానికి ప్రక్కనే ఉన్న *"భాష్యకారుల సన్నిధి"* లో, భగవద్రామానుజుల వారు వ్యాఖ్యాన ముద్రయందు, పద్మాసనంలో కొలువై ఉంటారు. ఆయన వ్రాసిన *"శ్రీభాష్యం"* అనే ఉద్గ్రంథాన్ని స్వయంగా వ్యాఖ్యానిస్తూ, శ్రీవారిసన్నిధి యందు ఉండటం వల్ల *"సన్నిధి భాష్యకారులు"* గా ప్రసిద్ధి కెక్కారు. ఈ విగ్రహాన్ని మూలవిరాట్టుగా చెప్పుకోవచ్చు. దీంతోపాటుగా, రామానుజులవారు తన శిష్యుడైన అనంతాళ్వార్ కు బహూకరించిన ఒకటిన్నర అడుగుల ఎత్తయిన తన (రామానుజుల వారి) శిలావిగ్రహాన్ని కూడా ఈ సన్నిధిలో దర్శించుకోవచ్చు. ఈ సన్నిధిలో గల, రామానుజుల వారి పాదుకలు ముద్రాంకితమై ఉన్న శఠారిపై అనంతాళ్వార్ పేరు చెక్కబడి ఉంటుంది. రామానుజులవారు పరమపదించిన తర్వాత, 1200 సంవత్సరం ప్రాంతంలో, ఈ విగ్రహప్రతిష్ఠ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సన్నిధిలో నిత్యనివేదన, వైశాఖమాసంలో శ్రీరామానుజుల జయంతి సందర్భంగా పదిరోజుల పాటు ఆరాధనలు జరుగుతాయి.
🌈 *యోగా నరసింహస్వామి సన్నిధి* 🌈
💫 విమానప్రదక్షిణ మార్గంలో, పశ్చిమాభిముఖంగా, భాష్యకారులు సన్నిధికి సమీపాన ముఖమండపం, అంతరాళం, గర్భాలయం అనే మూడు భాగాలు కలిగిన *"యోగా నరశింహ స్వామి"* ఆలయంలో, యోగముద్రలో ఉన్న, మూడు అడుగుల ఎత్తైన నరశింహస్వామి విగ్రహం కొలువై ఉంటుంది. తిరుమల క్షేత్రంలో ఎక్కడో పడిఉన్న యోగానరశింహుని ప్రతిమను భగవద్రామానుజుల వారు తెచ్చి ఇక్కడ ప్రతిష్టించినట్లు, తరువాత, 14వ శతాబ్దం ప్రథమార్ధం నందు, ఆ ప్రదేశంలోనే ఈ ఆలయం నిర్మించబడినట్లు చెబుతారు. మరో కథనం ప్రకారం, అదే సమయంలో షోలంగిపురం మరియు అహోబిలం లోని దేవతామూర్తులను మహమ్మదీయుల దండయాత్రల నుంచి రక్షించేనిమిత్తం వాటిని అక్కడి నుంచి తరలించి, తిరుమల క్షేత్రంలో ప్రతిష్ఠించడానికి ఈ ఆలయాన్ని నిర్మించారు. యోగముద్రలో ఉన్న స్వామివారి మోకాళ్ళు రెండింటినీ కలుపుతూ ఒకవస్త్రం కట్టిన రీతిలో నారశింహుని శిల్పం మలచబడి ఉంటుంది. రెండు మోకాళ్ళపై రెండు అరచేతులు ఆన్చి ఉంటాయి. వైశాఖమాసంలో వచ్చే నృసింహజయంతి నాడు ఈ ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతాయి. ప్రతి శనివారం అభిషేకం జరుగుతుంది.
🌈 *శంకుస్థాపన స్తంభం* 🌈
💫 యోగా నరసింహస్వామి సన్నిధికి ఒక ప్రక్కగా, దిగువ భాగాన నాలుగు దిక్కుల్లో ఆంజనేయస్వామి శిల్పాలతో అలరారుతున్న స్తంభాన్ని *"శంకుస్థాపన స్తంభం"* గా వ్యవహరిస్తారు. స్వామివారి ఆలయ నిర్మాణానికి తొండమాన్ చక్రవర్తి మొట్టమొదటగా వేసిన పునాది స్తంభం ఇదేనని చెబుతారు. స్వామివారిని స్మరించుకుంటూ, దీనికి ప్రదక్షిణం చేస్తే శీఘ్రంగా స్వగృహం సమకూరుతుందని భక్తుల నమ్మకం.
🌈 *పూల అర* 🌈
💫 శంకుస్థాపన స్తంభం ప్రక్కనే, గాజు తలుపులు కలిగి, శీతలీకరించబడి ఉన్న గదిని *"పూల అర"* గా పిలుస్తారు. ఇందులో స్వామివారికి సమర్పించేటటువంటి పూలమాలలు, పండ్లు, తులసిదళాలు భద్రపరుస్తారు. సంపంగి ప్రదక్షిణంలో నుండే మరో పూల అరను *"యామునోత్తరై"* అంటారు.
🌈 *పరిమళపు అర* 🌈
💫 యోగా నరశింహుని ఆలయ ప్రదక్షిణ మార్గంలో, దక్షిణాభిముఖంగా ఉన్న రాతిశిల ఉండే ప్రదేశాన్ని *"పరిమళపు అర"* గా పిలుస్తారు. ప్రతి గురువారం నాడు, మరుసటి రోజు శ్రీవారికి జరుపబడే శుక్రవార అభిషేక సందర్భంగా, శ్రీవారి నుదుటన అలంకరించే ఊర్ధ్వపుండ్రానికి అవసరమైనటువంటి పచ్చకర్పూరాన్ని ఈ సానరాతిపై నూరుకునే వారు. అంతేకాకుండా, అభిషేకానికి కావాలసిన పునుగు, జవ్వాది, కస్తూరి, కుంకుమపువ్వు వంటి సుగంధద్రవ్యాలను కూడా ఈ అరలోనే సిద్ధం చేసుకునేవారు. అయితే, ప్రస్తుతం భక్తుల తాకిడి దృష్ట్యా ఈ ద్రవ్యాలను వేరే ప్రదేశంలో తయారు చేసుకొని, వాటిని సిద్ధం చేసిన గిన్నెలను ఈ రాతి పైనుంచి, ఇక్కడి నుంచి ఆలయ అంతర్భాగం లోనికి లాంఛన పూర్వకంగా తీసుకువెళతున్నారు. తమ మనసులో ఉన్న కోరికలను చూపుడువేలు ద్వారా ఈ రాతిశిలపై లిఖిస్తే వాటిని స్వామివారు సత్వరమే తీరుస్తారని భక్తుల నమ్మకం.
🌈 *శ్రీవారి హుండీ* 🌈
💫 1831వ సంవత్సరంలో, ఆనాటి చిత్తూరు జిల్లా కలెక్టర్, "ఏషియాటిక్ జర్నల్" అనే పత్రికలో - బంగారువాకిలి ముందున్న "స్నపనమండపం" లో, నాలుగు స్తంభాల మధ్యన, యాత్రికులు ముడుపులు, కానుకలు సమర్పించు కోవడానికి వీలుగా ఓ పెద్దగంగాళం ఉండేదని వ్రాశాడు. శ్రీవారి దర్శనం నిమిత్తం, ఈ గంగాళానికి ఒక ప్రక్కగా వెళ్లి, దర్శనానంతరం ఈ గంగాళానికి మరో ప్రక్కనుంచి తిరిగి వచ్చేవారు. ప్రస్తుతం ఈ హుండీ మహామణిమంటపానికి ఉత్తరపార్శ్వంలో, నాలుగుస్తంభాల నడుమ ఏర్పాటు చేయబడి ఉంది. స్వామివారి దర్శనానంతరం విమానప్రదక్షిణ చేసుకున్న భక్తులు తమ మొక్కుబడులను, కానుకలను, నిలువుదోపిళ్ళను ఈ హుండీలో సమర్పించుకుంటారు.
💫 బంగారునగలు, కరెన్సీనోట్లు, వెండి వస్తువులు, సెల్ ఫోన్లు, అలంకరణ సామగ్రి, పుస్తకాలు, మనీపర్సులు, కళాఖండాలు, లాటరీ టిక్కట్లు, బొమ్మలు, ఆటవస్తువులు, పూజలో వినియోగించే వస్తువులు - ఒకటేమిటి, ఎవరి అభిరుచి, వృత్తి, ప్రవృత్తికి తగ్గట్లుగా వారు శ్రీవారికి కానుకలు సమర్పిస్తుంటారు.
💫 నిటారుగా, పెద్దసంచి ఆకృతిలో, శ్రీవారి శంఖు, చక్ర తిరు నామాలు చిత్రించి ఉన్న కాన్వాస్ గుడ్డలో పెద్ద కంచుగంగాళాన్ని దించి, ఆ వస్త్రాన్ని తాళ్లతో కట్టి వ్రేలాడ దీస్తారు. భక్తులు వేసే కానుకలు భద్రంగా, నేరుగా చేరుకోవడానికి ఏర్పాటు చేయబడిన ఈ గంగాళాన్ని *"కొప్పెర"* అని కూడా వ్యవహరిస్తారు. ఈ హుండీ చుట్టూ ఉన్న వస్త్రంపై దేవస్థానం వారి సీలు వేసి ఉంటుంది. హుండీని తెరిచేటప్పుడు, ఇద్దరు భక్తుల సమక్షంలో సీళ్లు తనిఖీ చేస్తారు. జగద్గురు శ్రీఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రం ప్రతిష్ఠించినందు వల్లనే అపరిమితమైన సంపద ఈ హుండీలో సమకూరుతోందని పెద్దలు చెబుతారు. శ్రీస్వామివారి వక్షస్థలంలో లక్ష్మీదేవి కొలువై వుండటం కూడా అంతులేని సంపద పోగు పడడానికి మరో కారణం! ఆధారాలు లభ్యం అయినంత వరకూ, 42 ఏళ్ల పాటు ఈ హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఈస్టిండియా కంపెనీవారు కైవసం చేసుకున్నారు. తదనంతరం ఇది మహంతులకు అప్పగించబడింది. 1933వ సంవత్సరంలో, ఆలయం తి.తి.దే. ఆధ్వర్యం లోకి వచ్చేటంత వరకు మహంతులదే పెత్తనం. అప్పుడు హుండీ ద్వారా వచ్చే సంవత్సర ఆదాయం సుమారు రెండు లక్షలు. ఇప్పుడది ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ, సుమారుగా 1200 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ఈనాడు వచ్చే దినసరి ఆదాయం ఆనాటి వార్షికాదాయానికి సుమారుగా 200 రెట్లు అన్నమాట!
💫 శ్రీవారిపై భక్తుల విశ్వాసం ఏ స్థాయిలో పెరుగుతోందో తెలుసుకోవడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? ఇప్పటివరకు రికార్డ్ అయిన అత్యధిక దినసరి ఆదాయం 2018 సం. జూలై 26వ తేదీ నాటి, ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు!
💫 ఈ హుండీ ద్వారా వచ్చిన ఆదాయంలో చాలా భాగాన్ని దేవాలయాభివృద్ధికే కాకుండా, వివిధ సేవాకార్యక్రమాలకు, ధార్మిక, శిక్షణ, వైద్య సంస్థల నిర్వహణకు కూడా వినియోగించ బడుతుంది.
🙏 *బంగారు వరలక్ష్మి* 🙏
💫 శ్రీవారిహుండీలో కానుకలు సమర్పించి బయటకు వచ్చిన వెంటనే, ఎడమవైపున్న ప్రాకారానికి పైభాగంలో ఒక నిలువెత్తు బంగారువరలక్ష్మి ప్రతిమ అమర్చబడి ఉంటుంది. సరిగ్గా ఈ ప్రతిమకు ఎదురుగా, ఈ మధ్య కాలంలో మరో హుండీ ఏర్పాటు చేయబడింది.
ఈ అమ్మవారు స్వామివారికి ఈశాన్యమూలలో కొలువై, కనకవర్షాన్ని కురిపిస్తూ, భక్తులను అనుగ్రహిస్తుంటారు. స్వామివారికి భక్తిపూర్వకంగా తృణమో, పణమో సమర్పించిన భక్తులకు, ఈ వరలక్ష్మి విశేషంగా సంపదలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. భక్తుడు ఎంత విలువైన కానుక ఇచ్చాడో ముఖ్యం కాదని, *"గంగిగోవు పాలు గరిటెడైనను చాలు"* అన్నట్లు అచంచల భక్తి విశ్వాసాలతో, నీతి-నిజాయితీలతో ఆర్జించిన సంపదలో ఎంతో కొంత భాగాన్ని తన శక్తికి తగ్గట్లుగా కానుకల రూపేణా సమర్పించుకుంటే స్వామివారు కృపావృష్టి కురిపిస్తారని ఈ అమ్మవారు చెబుతుంది.
🌈 *కటాహతీర్థం (తొట్టి తీర్థం)* 🌈
💫 విమానప్రదక్షిణ మార్గంలో, అన్నమయ్య భండారానికి ఎదురుగా, ఎడమ ప్రక్కన నీటితొట్టెవలె ఉన్న రాతిపాత్రను *"కటాహతీర్థం" లేదా "తొట్టి తీర్థం"* గా అభివర్ణించేవారు. అంతకు ముందు ఈ తీర్థం ముక్కోటి ప్రదక్షిణమార్గంలో ఉత్తరదిక్కున ఉండేది. శ్రీస్వామివారి పాదాలనుండి జాలువారే పవిత్ర అభిషేకజలం ఇది! గర్భాలయపు ఉత్తరం వైపున ఉన్న ప్రాకారానికి రంధ్రం చేసి, *"గోముఖం"* ద్వారా స్వామివారి అభిషేకజలం వచ్చే ఏర్పాటు చేయబడింది. అయితే, దాదాపు ఏడడుగులకు పైగా మందం ఉన్న గర్భాలయపు గోడ యందలి రంధ్రాన్ని శుభ్రపరిచే ఏర్పాటు ఆకాలంలో లేకపోవడంతో ఆ రంధ్రం మూసివేయబడి ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం.
💫 *స్వామిపుష్కరిణి స్నానం, శ్రీనివాసుని దర్శనం, కటాహతీర్థ పానం* ఈ మూడు త్రైలోక్య దుర్లభాలని పురాణాలలో ప్రవచించబడింది. అంటే ఈ మూడింటి సంయోగం వేంకటాచలక్షేత్రంలో తప్ప, ముల్లోకాలలో వేరెక్కడా కానరాదన్నమాట. ఈ తీర్థాన్ని స్వీకరించేటప్పుడు కేశవనామాలను లేదా అష్టాక్షరీ మంత్రాన్ని ఉచ్ఛరించేవారు. స్పర్శాదోషం లేశమాత్రం లేని ఈ కటాహతీర్ధాన్ని ఎవరైనా, ఎప్పుడైనా సేవించవచ్చు. ఈ తీర్థసేవనం బ్రహ్మహత్యాది పాపాలను సైతం తొలగించి, భయంకర వ్యాధులను కూడా రూపుమాపుతుందని స్కాందపురాణం తెలుపుతుంది. పురాణేతిహాసాల ననుసరించి,
💫 పూర్వం తుంగభద్రానదీ తీరంలో కేశవుడనే బ్రాహ్మణ యువకుడు విధివశాన, వేశ్యాలోలుడై, ధనాశతో ఒక విప్రుణ్ణి హత్య గావించడంతో అతనికి బ్రహ్మహత్యాపాపం చుట్టుకుంది. కేశవుడు భయంతో తండ్రి కాళ్ళపై పడి క్షమించమని వేడుకొనగా, ఆ సమయానికి విచ్చేసిన భరద్వాజమహర్షి, వేంకటాచలానికి ఏతెంచి, కటాహతీర్థం సేవించమని సూచించాడు. ముని ఆనతి ప్రకారం తిరుమల క్షేత్రాన్ని సందర్శించిన కేశవుడు స్వామిపుష్కరిణిలో స్నానమాచరించి, కటాహతీర్థాన్ని సేవించి బ్రహ్మహత్యాదోష విముక్తుడయ్యాడు.
🙏 *విష్వక్సేనుడు* 🙏
💫 శ్రీవారి హుండీకి ప్రదక్షిణ చేసి, వెలుపలికి రాగానే ఎడమప్రక్కగా, అంటే గర్భగుడికి ఈశాన్యదిశలో, దక్షిణాభిముఖంగా విష్వక్సేనమందిరం కొలువై ఉంది. నారాయణాద్రిపై ఎన్నో సంవత్సరాలు కఠోరతపస్సు చేసి, శ్రీమహావిష్ణువును మెప్పించి, వైకుంఠంలోని సేనలన్నింటికీ ఆధిపత్యం పొందిన విష్వక్సేనుడు, ప్రతి ఉత్సవానికి విఘ్ననాయకునిగా పూజింపబడుతాడు. కైలాసంలో గణేశుడు ఏ విధులు నిర్వహిస్తాడో, అవే విధులను వైకుంఠంలో విష్వక్సేనుడు నిర్వర్తిస్తాడు. బ్రహ్మోత్సవాల ముందురోజున మాడవీధుల్లో తిరిగి ఉత్సవ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించే విష్వక్సేనుడు – ఆణివార ఆస్థానం, ఉగాది ఆస్థానం, దీపావళి ఆస్థానం – వంటి ఉత్సవాల్లో కూడా ప్రముఖమైన పాత్ర పోషిస్తాడు. ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో కొలువై ఉండటంచేత, వైకుంఠఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే "విష్వక్సేనుణ్ణి" దర్శించుకోగలం. సాధారణ దినాల్లో, హుండీ ప్రక్కగా "విష్వక్సేనుడు" అని ఉండే బోర్డును మాత్రమే చూడగలం.
*యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్*
*విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం! తమాశ్రయే!!!*
🙏 *ముక్కోటి ప్రదక్షిణం* 🙏
💫 శ్రీవారి దర్శనానంతరం, మహామణి మంటపానికి దక్షిణదిక్కున ఉన్న నిష్క్రమణమార్గం నుంచి వెలుపలికి వచ్చి, వెనువెంటనే, విమానప్రదక్షిణ మార్గంలో కుడిప్రక్కకు తిరిగి చూస్తే, ఎల్లప్పుడూ మూసి ఉండే ముక్కోటి ప్రదక్షిణ మార్గం లేదా వైకుంఠ ప్రదక్షిణ మార్గం కనిపిస్తుంది. దర్శనానంతరం, మూసిఉన్న ఈ ప్రవేశమార్గం ఎదురుగుండా సాక్షాంగనమస్కారం చేస్తున్న భక్తగణాన్ని కాంచవచ్చు.
💫 విమానప్రదక్షిణ మార్గంలో దక్షిణదిక్కున, గర్భాలయానికి ఆనుకొని ఉన్న ప్రాకారానికి గల ఈ చిన్న ద్వారం గుండా ఈ ప్రదక్షిణమార్గం లోనికి ప్రవేశించి, గర్భాలయాన్ని చుట్టుకుని, హుండీకి ప్రక్కన గల నిష్క్రమణ మార్గం ద్వారా బయటకు రావాలి. స్వామివారి గర్భాలయ ప్రాకారానికి మరియు విమానప్రదక్షిణం లోని లోపలి ప్రాకారానికి మధ్యన ఉన్న మార్గమే ఈ ప్రదక్షిణమార్గం. పేరుకు ప్రదక్షిణాపథం అయినప్పటికీ, గర్భాలయానికి దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కుల లోనే మనం సంచరించగలం. మూడు దిక్కులలోనూ సమానమైన వెడల్పు లేకుండా, ఉత్తరదిక్కున ఉన్న ప్రదక్షిణ మార్గం మిగతా రెండు దిక్కలతో పోల్చితే దాదాపు రెండింత లుంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న "రాములవారిమేడ" అనే మంటపాన్ని తర్వాతికాలంలో నిర్మించడం వల్ల, వైకుంఠ ప్రదక్షిణ మార్గం తూర్పు దిక్కున మూసివేయబడింది.
💫 ఈ ప్రదక్షిణ మార్గం శ్రీవారికి అత్యంత సమీపంగా, గర్భాలయానికి ఆనుకొని ఉండే ప్రదక్షిణమార్గం! ప్రతి ఏడాది ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి-ద్వాదశి దినాలలో మాత్రమే ఈ ప్రదక్షిణమార్గం తెరిచి ఉంటుంది. అంటే దశమి నాటి ఉదయం సుప్రభాతసేవ నుండి, ద్వాదశి నాటి అర్ధరాత్రి ఏకాంతసేవ వరకు మాత్రమే తెరచి ఉండి, మిగిలిన సమయాల్లో మూసి ఉంచ బడుతుంది. అత్యంత అరుదుగా లభించే ముక్కోటి ప్రదక్షిణ భాగ్యం జన్మజన్మల సుకృతం అని, శ్రీవారి సంపూర్ణకటాక్షం తోనే అది సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
*శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే*
*రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్*
💐 *ఇక్కడితో "బ్రహ్మాండనాయకుని బంగారు మేడ" వైభవాన్ని వర్ణించటం పూర్తయింది.*
💫 శ్రీవారి ఆనందనిలయాన కొలువుండే "విమానప్రదక్షిణమార్గ" విశేషాలను భక్తితో చదివిన భక్తులందరికీ స్వామివారి కటాక్షం సంపూర్ణంగా సిద్ధించాలని కోరుకుంటున్నాం!
No comments :