🙏 వేంకటేశుని సేవలో విజయనగర సామ్రాట్టులు 🙏
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"
💫. "తిరుమల" చరిత్రలో స్వర్ణయుగంగా చెప్పుకోబడే "విజయనగర" రాజుల పరిపాలనా కాలంలో దేవాలయం సర్వతోముఖాభివృద్ధి చెందింది. మనం ఈనాడు తిరుమలలో చూస్తున్న యాత్రికుల వసతి, మంచినీటి, భోజన సదుపాయాలు, రహదారులు, నిఘావ్యవస్థ, కట్టడాలు, మొదలైన వాటన్నింటికీ, అప్పటికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో, ఆ రాజుల కాలంలోనే శ్రీకారం చుట్టబడింది. వారు స్వామివారి నిత్యకైంకర్యాలకు, ప్రత్యేక ఉత్సవాలకు, ప్రసాదాలకు, అర్చకస్వాముల ఉదరపోషణకు లెక్కలేనన్ని మడులు, మాన్యాలు సమర్పించుకున్నారు. ఇక వారు స్వామివారికిచ్చిన నగలు, వజ్రవైఢూర్యాలు, వెండి, బంగారు పాత్ర-పూజా సామగ్రిలకైతే లెక్కేలేదు. నూతనసేవలు, ఉత్సవాలు, తిరుణాళ్ళూ ప్రవేశపెట్టి, అవకాశం వచ్చినప్పుడల్లా మంత్రులు, సేనాధిపతులు, దండనాయకులు, సామంతరాజులు, సిబ్బంది, పరివారజన సమేతంగా తిరుమలకు విచ్చేసి, తమకు లభించిన ప్రతి విషయాన్నీ స్వామివారికి అకితం చేసి, స్వామివారి ప్రాభవం దక్షిణభారత దేశమంతా వ్యాప్తి చెందటానికి ఎంతగానో దోహదపడ్డారు. తరచూ పాలకులు సందర్శించటం వల్ల ఆలయ అధికారగణం అప్రమత్తమై ఉండటంతో దేవాలయ నిర్వహణ, పూజావిధానాలు ఏ విధమైన లోటుపాట్లు లేకుండా సక్రమంగా జరిగేవి.
🌈 శ్రీకృష్ణదేవరాయలు 🌈
💫 విజయనగర సామ్రాజ్య చక్రవర్తులందరికీ మకుటాయమానంగా చెప్పుకోబడే, సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు 1509-1530 సంవత్సరాల మధ్యకాలంలో కటకం (నేటి ఒరిస్సాలో భాగం) మొదలు కన్యాకుమారి వరకు విస్తరించియున్న సువిశాల సామ్రాజ్య పరిపాలనలో వ్యస్తుడై ఉండి కూడా; తిరుమల క్షేత్రాన్ని ఏడు సార్లు దర్శించుకుని, స్వామివారికి అమూల్యమైన కానుకలు సమర్పించి తన భక్తితత్పరతను చాటుకున్నాడు. తిరుమలలో లభ్యమైన దాదాపు 50 కు పైగా శాసనాల్లో రాయలు వారు, ఆయన కుటుంబసభ్యుల ప్రస్తావన ఉందంటే, ఆలయానికి, ఆయనకు ఎంత ప్రగాఢ అనుబంధం ఉందో చెప్పుకోవచ్చు. రాయలవారు తిరుమలను సందర్శించిన ప్రతి సందర్భంలో ఏమేమి విజయాలు సాధించాడో, ఎన్నెన్ని కానుకలు సమర్పించాడో ఇప్పుడు వివరంగా చూద్దాం.
💐 మొదటి యాత్ర
💫 రాయలువారు తన పరిపాలన ఆరంభ సమయంలోనే సంగమ, సాళువ రాజుల కాలంలో చిన్నాభిన్నమైన విజయనగర సామ్రాజ్యలక్ష్మిని గజపతుల నుంచి జయించి; తన పాలనను సుస్థిరం చేసుకున్నాడు. దక్షిణాన మైసూరు వరకూ రాజ్యాన్ని విస్తరించుకుని, పెనుగొండ పాలకులను మరియు ఉమ్మత్తూరులో గంగరాజును ఓడించి, ఇక్కేరి రాజుల పరిపాలనలో ఉన్న ప్రాంతాన్ని యుద్ధం చేయకుండానే స్వాధీనం చేసుకున్నాడు. ఆ సందర్భంలో మొదటిసారిగా 1513 సం. ఫిబ్రవరి మాసంలో తిరుమల క్షేత్రాన్ని దేవేరులిద్దరితో సందర్శించుకుని, తన మహత్తర విజయాన్ని స్వామికి అంకితమిస్తూ స్వామివారికి.....
నవరత్నకిరీటం, మూడుపేటల ముత్యాలహారం, వజ్రాలు-రత్నాలు పొదిగిన 15 కంఠాభరణాలు, 5 రకాల మాణిక్యాలతో చేయించిన పతకం, 25 వెండిపళ్ళాలు సమర్పించుకున్నాడు. మహారాణులూ తమవంతుగా స్వామివారికి బంగారు హారతి పళ్ళాలు ఇచ్చారు.
💐 రెండవయాత్ర
💫 మరో మూడు నెలలకల్లా స్వామివారు మళ్ళీ తలంపుకు రాగా అదే సంత్సరం మే నెల మండుటెండల్లో, ఒంటరిగా స్వామివారిని సందర్శించుకున్నారు. అది అంతకు ముందే సాధించిన విజయాలకు కృతజ్ఞతా భావంతోనో లేక ముందు ముందు చేబట్టబోయే విజయయాత్రలకు నాందీ ప్రస్తావన గానో తెలియదు గానీ కానుకలు మాత్రం మునుపటి కంటే భారీగా సమర్పించు కున్నాడు. ఆ కానుకల జాబితా ఇలా ఉంది -
1. 5 వజ్రాలు, 17 అడ్డిగలు, ఇతర మాణిక్యాలు పొదిగిన ఉడుధార నగ
2. వజ్రాలు, మాణిక్యాలు, కెంపులు పొదిగిన ఒరలో చురకత్తి.
3. ముత్యాల ఒరతో వేరొక కత్తి
4. కెంపుల ఒరతో కూడిన ఖడ్గం
5. 87 క్యారట్ల వజ్రాల పతకం
6. వజ్రాలు, రత్నాలు, కెంపులు పొదిగిన ఐదు బంగారు భుజకీర్తులు.
7. రెండు బంగారు గొలుసులు
8. ఉత్సవమూర్తులకు, మూలమూర్తికి, దేవేరులకు నవరత్నఖచిత కిరీటాలు.
💐 మూడవయాత్ర
💫 మరో నెలన్నర కాలంలోనే, అదే సంవత్సరం జూన్ నెల వర్షఋతువులో మళ్ళీ శ్రీవారిని దర్శించుకుని, తన తల్లిదండ్రుల పేరిట బంగారు తాంబూలాలను సమర్పించు కున్నాడు. స్వామివారి సంవత్సర ఉత్సవాల నిమిత్తం - కరకంబాడి (చిత్తూరు జిల్లాకు తలమానికమై, వేలమందికి ఉపాధి కల్పిస్తున్న "అమరరాజా బ్యాటరీస్" కర్మాగారం ప్రస్తుతం ఈ గ్రామం చెంతనే ఉంది), ఛత్రవాడి, తూరూరు గ్రామాలను దేవదేయంగా ఇచ్చాడు. ఈ దానశాసనంలో శ్రీకృష్ణదేవరాయల వంశ వృక్షానికి చెందిన సుదీర్ఘ వర్ణన ఉంది.
💫 ఆయన చంద్రవంశస్థుడనీ; చంద్రుడు, బుధుడు, పురూరవుడు, నహుషుడు ఆయన పూర్వీకులనీ, వీరనరశింహేంద్రుడు-నాగలదేవి ఆయన తల్లిదండ్రులని ఆ శాసనంలో పొందుపరచబడి ఉంది. ఆమె తల్లిగారైన "నాగలదేవి" పేరుమీద "నాగులాపురం" అనే గ్రామం నిర్మించి, అందులో విస్త్రుతమైన ప్రాకారాలతో, అత్యద్భుత శిల్పసౌందర్యం ఉట్టిపడే "వేదనారాయణస్వామి" ఆలయాన్ని నిర్మించాడు. తిరుపతికి 60 కి. మీ. దూరంలో ఉన్న ఈ దేవాలయాన్ని నేడూ చూసి తరించవచ్చు.
💫 తిరుమలలో అప్పటికే ఏడు బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా, రాయలు వారు మూడవసారి తిరుమలయాత్రలో ఎనిమిదవ బ్రహ్మోత్సవాన్ని ప్రవేశపెట్టాడు.
💐 నాల్గవయాత్ర
💐 సరిగ్గా సంవత్సరం తరువాత, ఉదయగిరిదుర్గాన్ని స్వాధీనం చేసుకుని, ఉభయదేవేరులతో 1514 సం. జూన్ నెలలో నాల్గవసారి ఆలయాన్ని సందర్శించుకుని, అన్నమయ్య జన్మస్థలమైన "తాళ్ళపాక" గ్రామాన్ని దేవదేయంగా ఇచ్చి, ఆ ఆదాయంతో స్వామివారి ప్రత్యేక నైవేద్యానికి ఏర్పాట్లు చేశాడు. 30,000 వరహాలతో కనకాభిషేకం చేసి, మూడుపేటల ముత్యాలహారం, రెండు బంగారు కడియాలు కానుకగా ఇచ్చాడు.
💫 ఆ యాత్రలో చిన్నమ్మ, పెద్దమ్మ కూడా పెద్ద ఎత్తున బంగారు కానుకలు సమర్పించుకుని - ముదియారు, పిరాట్టి, కులత్తూరు – అనే గ్రామాలను దేవదేయంగా ఇచ్చుకున్నారు. తిరుమలలో యాత్రికుల సౌకర్యార్థం ఓ సత్రం కూడా ఏర్పాటు చేశారు.
💫 ఆ తరువాత 15 నెలల కాలం అద్దంకి, వినుకొండ కోటల ముట్టడిలో గడిపి, వాటిని వశం చేసుకుని; ధరణికోటలో విజయోత్సవ సంబరాలు అట్టహాసంగా జరుపుకుని; కృతజ్ఞతా సూచకంగా, 1515 సం. అక్టోబరు నెలలో శ్రీవారికి - ఓ నవరత్న ప్రభావళిని, మకరకంటినీ రాజలాంఛనాలతో పంపించారు.
💐 ఐదవయాత్ర
💫 కొండపల్లి, అనంతగిరి, ఉర్లకొండ దుర్గాల్ని జయించి, హంపి-విజయనగరం నుండి బయలుదేరి, 1517 సం. జూలై నెలలో ఐదవసారి తిరుమలను ఒంటరిగా సందర్శించుకుని, స్వామివారికి ఓ కంఠమాల, పచ్చల పతకం బహూకరించాడు. అంతే కాకుండా, ఆలయ విమానానికి నాలుగవ సారి బంగారు పూత పూయించడానికి 30,000 వరహాలు ఇచ్చాడు. సెప్టెంబరు నెల, 1517 సం. నాటికి ఆ బృహత్తర కార్యక్రమం పూర్తయ్యింది.
💐 ఆరవయాత్ర
💫 తాను చేపట్టిన బంగారుతాపడం పని పూర్తయిన నలభై రోజులకల్లా, మేలిమి బంగారు కాంతులతో మెరిసిపోతున్న విమానగోపురాన్ని కళ్ళారా చూసుకోవాలని; అక్టోబరు నెల, 1519 లో భార్య తిరుమలదేవమ్మ నెలల కొడుకుతో మళ్ళీ తిరుమలకు వచ్చాడు. అప్పటికి రెండవభార్య స్వర్గస్తురాలయ్యింది. తన కుమారునికి "తిరుమలరాయలు" అని నామకరణం చేసి, అతని పేరున ఉన్న కొన్ని భూములు దేవదేయం చేశాడు. ఇలా, తన కుటుంబం మొత్తాన్ని స్వామిసేవలో తరింప జేశాడు.
💐 ఏడవయాత్ర
1521 సం. ఫిబ్రవరి నెలలో భార్య తిరుమలదేవమ్మతో కలిసి చివరిసారిగా తిరుమల క్షేత్రానికి విచ్చేసి; నవరత్నాలు పొదిగిన పట్టు పీతాంబరం, ముత్యాలు, కెంపులు పొదిగిన తలపాగా, ఆణిముత్యాలు పొదిగిన రెండు చామరాలూ సమర్పించాడు.
💫 తరువాతి కాలంలో అనేకసార్లు తిరుమల యాత్రకు ప్రయత్నించినప్పటికీ, ఎడతెరిపి లేని యుద్ధాలతో గడిచిపోయింది. అయితే, తరచుగా శ్రీవారికి ఘనమైన కానుకలు సమర్పించు కోవడం మాత్రం జీవితాంతం కొనసాగింది.
💫 స్వతహాగా తెలుగు, కన్నడ భాషల్లో విశేషపాండిత్యం కలిగిన రాయలవారు శ్రీనివాసునికి చేసిన సాహిత్యసేవ కూడా తక్కువేం కాదు. విజయవాడ వద్ద ఉన్న శ్రీకాకుళంలో రాయలవారు ఆంధ్రమహావిష్ణువు దర్శనం చేసుకున్నప్పుడు, ఆయనకు స్వప్నంలో శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చి తనపై "ఒక రచన చేసి తిరుమల వేంకటేశునికి అంకితమివ్వ" వలసిందిగా ప్రేరేపించాడు. స్వామి ఆదేశానుసారం, రంగనాథస్వామి ఆండాళ్ కథను "ఆముక్తమాల్యద" అనే ప్రబంధంగా రచించి శ్రీనివాసునికి అంకితమిచ్చాడు. "ఆముక్తమాల్యద" అంటే "ముడిచి విడిచిన దండలను ఇచ్చే అమ్మ". గోదాదేవి ముందుగా తానలంక రించుకున్న పూమాలలను దేవునికి సమర్పించేది.
💫 500 వందల ఏళ్ళ క్రితం శ్రీకృష్ణదేవరాయలు పునరిద్ధరించిన "శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు" దేవాలయాన్ని విజయవాడకు 30 కి. మీ. దూరంలో నేటికీ దర్శించుకోవచ్చు.
💫 నేటి ప్రకరణం ఆధ్యాత్మిక వాతావరణం నుండి కొద్దిగా వైదొలగి, చరిత్రపుటల్లోకి తొంగి చూచింది. సహృదయంతో అర్థం చేసుకోగలరు. తెలుగువారి ఇలవేలుపు శ్రీవేంకటేశుని ఆలయాభివృద్ధికి విశేషంగా పాటుపడి, దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాచీన దేవాలయాలను పునరుద్ధరించి, తిరుమల క్షేత్రంలో భక్తులకు ఆనాడే తగిన వసతులు కల్పించి, అష్టదిగ్గజాలనబడే కవిపుంగవులను ఆదరించి తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతగానో పాటుపడిన రాయలవార్ని స్మరించుకోక పోతే, "తిరుమల సర్వస్వం" సంపూర్ణం కాదనిపించి ఈ ప్రకరణాన్ని రాయలవారికి అంకితమవ్వటం జరిగింది.
🌈 అచ్యుతరాయలు 🌈
💫 శ్రీకృష్ణదేవరాయల అనంతరం, అతని సోదరుడైన అచ్యుతరాయలు శ్రీవేంకటేశ్వరుని సమక్షంలో ఆలయశంఖంతో సంప్రోక్షణ గావించుకుని విజయనగర సామ్రాజ్యాన్ని చేపట్టాడు. రాజ్యాభిషిక్తుడైన వెంటనే, జీర్ణ దశలో ఉన్న, మనందరికీ సుపరిచితమైన "కపిలతీర్థం" ఆలయాన్ని పునరుద్ధరించి; తీర్థానికి ఇరు ప్రక్కలా (కోనేటి చుట్టూ) సంధ్యావందన మండపాలు నిర్మించాడు. ఈ తీర్థానికి పూర్వకాలంలో చక్రతీర్థమనే పేరుండడం వల్ల, ఆలయానికి నాలుగు దిక్కులా చక్రచిహ్నాలను చెక్కించాడు. తిరుపతి పట్టణం నందు తిరుమల ఘాట్ రోడ్డు ప్రారంభంలో, నంది సర్కిల్ వద్ద ఆ కపిలతీర్థాన్ని, పొడవాటి మండపాలను నేడూ మనం చూడవచ్చు. ఆ సువిశాలమైన మంటపాలన్నీ నేటికీ, మరీ ముఖ్యంగా కార్తీకమాసంలో, కపిలేశ్వరుని దర్శనార్థం వచ్చి తీర్థస్నాన మాచరించే భక్తులతో క్రిక్కిరిసి ఉంటాయి.
💫 మూడు పర్యాయాలు తిరుమలను దర్శించుకున్న అచ్యుతరాయలు మొదటిసారి 1533 సం. లో కపిలగోవులతో బాటుగా మరెన్నో ఆభరణాలు, దుస్తులు స్వామివారికి దానం చేసి, స్వామివారికి కనకాభిషేకం కావించాడు. అర్చకులు సహస్రనామాలు చదువుతూంటే, స్వామికి స్వయంగా అర్చన చేసేవాడు.
💫 అలాగే 1535 లో రెండవసారి, 1537 లో మూడవసారి తిరుమలకు విచ్చేసినప్పుడు అనేక ధార్మిక కార్యక్రమాలు చేపట్టి ఆలయ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
💫 తిరుమల క్షేత్రంలో అనేక ఉత్సవాలు ఊరేగింపులు ప్రవేశపెట్టి, వాటికి తగినంత ప్రచారం కల్పించి, భక్తులు ఎక్కువగా తిరుమలను దర్శించుకునేట్లు చేయగలిగాడు. రాజధాని పట్టణమైన హంపి-విజయనగరం నుండి నర్తకీమణుల్ని రప్పించి తిరుమల ఉత్సవాల్లో నాట్యాలను కూడా ప్రవేశపెట్టాడు. నిత్యపూజానంతరం మనం చేసే "షోడశోపచారాల్లో" నాట్యోపచారం కూడా ఒకటి. "నృత్యం దర్శయామి" అని కూడా చదువుతాం కదా!!
💫 శ్రీకృష్ణదేవరాయలి కాలంలో విజయనగర సామ్రాజ్యానికి మంత్రియైన "మహామంత్రి తిమ్మరుసు" కూడా, వేకటేశ్వరుడికి వీరభక్తుడే. భార్యాసమేతంగా తిరుమలను సందర్శించుకుని, అనేక కానుకలతో పాటు "పరాంతలూరు" అనే గ్రామాన్ని దేవదేయంగా సమర్పించుకున్నాడు. అలాగే విజయనగర రాజులకు మంత్రిగా, సేనాధిపతిగా పని చేసిన సాళువనరశింహుడు; విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సదాశివరాయలు, అళియరామరాజు మొదలగు చక్రవర్తులు కూడా ఆలయాభివృద్ధికి విశేష కృషి చేశారు. కొండ మీదకు వచ్చిన భక్తులకు, కానీ ఖర్చు లేకుండా భోజన, వసతి, దర్శనం లాంటి సదుపాయాలన్నీ విజయనగర సామ్రాజ్య పాలనలోనే ప్రారంభమై నేటికీ కొనసాగుతున్నాయి.
💫 ఆ విధంగా తిరుమల ఆలయంతో విజయనగర రాజులకున్న అనుబంధం 1365 సం. లో మొదటి బుక్కరాయలుతో ప్రారంభమై, 300 సంవత్సారాలు అప్రతిహతంగా కొనసాగి, 1665 సం. లో శ్రీరంగరాయల తిరుమల దర్శనంతో ముగిసింది. తరువాత ఆలయ నిర్వహణ అనేక చేతులు మారి, చివరిగా 1933 సం. లో తి.తి.దే. చేతికి వచ్చింది.
💫 విజయనగర చక్రవర్తుల పాలన అంతమైనా, తిరుమలపై ఆధిపత్యం ఎన్ని చేతులు మారినా; వారు ఆలయంలో ప్రవేశ పెట్టిన అనేక సేవలు సాంప్రదాయాలు, భక్తులకు వారు ఏర్పాటు చేసిన సౌకర్యాలు; నేటికీ కొనసాగుతూ, వారు దేవాలయాభివృద్ధికి చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచి పోయింది.
🌈 వ్యాసరాయలు వారు🌈
💫 విజయనగర చక్రవర్తులైన వీరనరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు ఈ ముగ్గురికీ గురువుగా ప్రసిద్ధికెక్కిన వ్యాసరాయలు, ద్వైతసాంప్రదాయ పీఠాధిపతులు. వీరిని "వ్యాసతీర్థులు" గా కూడా పిలుస్తారు. తపఃసంపన్నుడైన ఈ పండితోత్తముడు, సూత్ర భాష్యం, ఋగ్వేదభాష్యం, గీతాతాత్పర్యం లాంటి 37 సర్వమూల గ్రంథాలు రచించాడు. వ్యాసతీర్థులవారు, భగవద్రామానుజార్యుల వలెనే, తిరుమల క్షేత్రాన్ని ఓదివ్యసాలగ్రామంగా భావించి, తిరుమల మెట్లను కాళ్ళతో ఎక్కి అపవిత్రం చేయరాదని తలంచి, మోకాళ్ళతో అధిరోహించినట్లు చెబుతారు.
💫 ఆనందనిలయ విమానంలో వాయువ్యమూలన ఉన్న ఓ చిన్న శ్రీనివాసుని విగ్రహానికి "విమానవేంకటేశ్వరునిగా" ప్రాణప్రతిష్ఠ జరిపించడం ద్వారా "ఏ కారణం చేతనైనా, స్వామివారి దర్శనం చేసుకోలేక పోయినట్లైతే, విమాన వేంకటేశ్వరుణ్ణి దర్శించుకుంటే స్వామివారిని దర్శించుకున్నట్లే" అన్న సాంప్రదాయానికి వ్యాసతీర్థులవారే శ్రీకారం చుట్టారు. వారు 108 పెద్ద సాలగ్రామాలకు బంగారు తొడుగులు చేయించి, "సాలగ్రామమాల" గా తయారుచేసి స్వామివారికి అలంకరింప జేశారు.
💫 కన్నడదేశాన విజయనగర సామ్రాజ్యకాలంలో వైష్ణవాన్ని, వేంకటేశ్వరస్వామినీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వ్యాసరాయలవారే. వీరు ప్రతిష్ఠచేసిన 1,008 ఆంజనేయ విగ్రహాలలో ఒకటైన "కోనేటి గట్టు ఆంజనేయుణ్ణి" ఇప్పుడు కూడా మనం స్వామి పుష్కరిణికి ఉత్తరం దిక్కున దర్శించుకోవచ్చు. ఆ దేవాలయానికి ప్రక్కనే "వ్యాసరాయ ఆహ్నీక మండపంగా" పిలువబడే ఓ కాషాయరంగు లోని ఉన్న మండపాన్ని నేడు కూడా చూడవచ్చు. వ్యాసరాయలు వారు అర్చకత్వం వహించిన రోజుల్లో, వారు ఆ మండపంలోనే నివాసం ఉన్నట్లుగా కొందరు చెబుతారు.
💫 వారు హిందూధర్మాన్ని పరిరక్షించి అప్పటివరకూ అగ్రవర్ణాలవారికి మాత్రమే అందుబాటులో ఉన్న పురాణేతిహాసాలను, వైష్ణవప్రబంధాలను, స్వామివారి కీర్తనలను జనబాహుళ్యంలోకి తెచ్చారు. నిమ్నకులస్థుడైన "కనకదాసు" అనే భక్తుణ్ణి చేరదీసి, అయనను శిష్యునిగా స్వీకరించారు. తరువాతి కాలంలో, కనకదాసు కన్నడ వాగ్గేయకారునిగా ప్రసిద్ధికెక్కి, స్వామివారిపై అనేక కీర్తనలు రచించి గానం చేశాడు. కనకదాసు, పురందరదాసు మరి కొందరు దాసభక్తులు రచించిన కీర్తనలను తి.తి.దే. వారు సేకరించి, కన్నడిగులకు "దాసప్రాజెక్టు" గా వెలుగులోకి తెచ్చారు. అలాగే, జాతి, వర్ణ, వర్గాలకు అతీతంగా, భక్తి ఉద్యమం వేళ్ళూనుకుని సర్వ వ్యాపితమవ్వాలనే ఉద్దేశ్యంతో తెలుగువారికి "అన్నమాచార్య" ప్రాజెక్టు, తమిళులకు "దివ్య ప్రబంధ ఆళ్వార్" ప్రాజెక్టులను తి.తి.దే. చేపట్టింది.
💫 తిరుమలలో బ్రహ్మోత్సవాల నిర్వహణ నిమిత్తం 14000 నర్పణాలను, పౌర్ణమినాటి నైవేద్యానికి "బడ్డం పెట్ట" అనే గ్రామాన్ని వ్యాసరాయలవారు దేవదేయంగా ఇచ్చారు.
💫 శ్రీకృష్ణదేవరాయలు ఒకానొకప్పుడు "కుహూ" యోగమనే కాలసర్పదోష గ్రస్తులయ్యారు. అప్పుడు వ్యాసతీర్థులవారు కొన్ని ఘడియలపాటు విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి, శ్రీకృష్ణదేవరాయల వారిని తాత్కాలికంగా సింహాసనాన్నుంచి తప్పించి, తన తపఃశక్తితో రాయలవారికి జాతకరీత్యా కలిగిన సర్పదోషాన్ని తొలగించారు. సింహాసనాన్ని అధిష్ఠించడంతో, ఆయన విజయనగరచక్రవర్తుల వంశనామమైన "రాయలు" బిరుదాంకితులై, "వ్యాసరాయలు" గా పిలువబడ్డారు.
💫 అదే సమయంలో అప్పటి వైఖానస అర్చకుడు స్వామివారి నగలు అపహరించాడనే నేరం మీద దేశ బహిష్కరణకు గురై, అర్చకత్వానికి అనర్హుడయ్యాడు. అతని వారసుడు అప్పటికింకా పసిబాలుడు కావడంతో, వ్యాసరాయలు వారు 12 సంవత్సరాలు శ్రీవారికి అర్చకత్వం వహించారు. దానితో బాటుగా ఆ బాలుణ్ణి సంరక్షించి, ఆగమశాస్త్ర ప్రకారంగా అర్చనావిధానాలను నేర్పించి, యుక్తవయసులో అతనికి అర్చకత్వ బాధ్యతలు తిరిగి అప్పగించారు; శ్రీవారి అర్చన సాంప్రదాయం పరహస్తగతం కాకుండా కాపాడి, వైఖానస అర్చక పరంపర కొనసాగేట్లు చేశారు.
💫 ఆ విధంగా, తిరుమల ఆలయానికి, వ్యాసరాయలు వారికి, విడదీయరాని అనుబంధం ఉంది. శ్రీకృష్ణదేవరాయలను సర్పదోషం నుంచి రక్షించడం, ఆలయంలో స్వయంగా అర్చకత్వం వహించడం, వైఖానస అర్చకసాంప్రదాయం పర హస్తగతం కాకుండా చూడడం, స్వామివారి కీర్తనలను జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళడం వంటి మహత్తరమైన పుణ్యకార్యాల ద్వారా, ఆయన స్వామివారి భక్తులందరికీ పూజనీయుడయ్యాడు.
No comments :