🙏 విమానప్రదక్షిణం 🙏
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"
💫 శ్రీవారి ఆలయ మహాద్వారం మరియు వెండివాకిలి దాటి లోనికి ప్రవేశించగానే, మొట్టమొదటగా కనిపించే మార్గమే "విమానప్రదక్షిణమార్గం" లేదా "పథం".
💫 స్వామివారి ప్రధాన ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ ప్రదక్షిణ మార్గం, సంపంగిప్రాకారానికి మరియు విమానప్రాకారానికి మధ్యలో ఉంటుంది. మునుపటి ప్రకరణాలలో శ్రీవారి ఆలయ కుడ్యాలకు చుట్టూ, బాహ్యంగా ఉన్న మహాప్రదక్షిణాన్ని; ఆలయం లోనికి ప్రవేశించగానే ఉన్న సంపంగి ప్రదక్షిణాన్ని; ముగించుకొని పరమపవిత్రమైన ధ్వజస్తంభ ప్రదక్షిణగా; వెండివాకిలి దాటి, విమానప్రదక్షిణ మార్గంలోనికి చేరుకున్నాం.
💫 శ్రీవారి దర్శనానంతరం ఈ మార్గంలో ఉన్న విశేషాలన్నింటిని ఏ విధమైన అవరోధాలు లేకుండా దర్శించుకోవచ్చు. శతాబ్దాల చరిత్ర గల ఈ మార్గంలో నడయాడుతూ ఉన్నప్పుడు ఎడమప్రక్కగా, ఎత్తయిన అరుగులతో ఉన్న అనేక మండపాలు మనను ఆకట్టుకుంటాయి. మన కుడిప్రక్కన శోభాయమానంగా వెలుగుతున్న ఆనందనిలయ గోపురాన్ని లేదా విమానాన్ని కూడా కన్నులారా వీక్షించవచ్చు.
💫 ఒక్కో మంటపానికి ఒక్కో చరిత్ర! ఆయా రాజుల దాతృత్వానికి, శ్రీవారి పట్ల వారికున్న అచంచల భక్తికి నిలువెత్తు నిదర్శనం! ఆనందనిలయ విమాన వైశిష్ట్యాన్నైతే ఎంత చెప్పుకున్నా తక్కువే!
💫 ఆ చరిత్రపుటలను, ఆధ్యాత్మిక సొబగులను ఒక్కొక్కటిగా ఇప్పుడు అవలోకిద్దాం.
🙏 శ్రీరంగనాథస్వామి 🙏
💫 విమానప్రదక్షిణ మార్గంలో ప్రవేశించగానే, మొట్టమొదటగా, మనకు ఎదురుగా శేషతల్పంపై శయనించివున్న శ్రీరంగనాథుడు దర్శనమిస్తాడు. ఈ కుడ్యశిల్పం గరుడాళ్వార్ సన్నిధికి వెనుకభాగాన ఉంటుంది. బంగారుపూతతో ధగధగ లాడుతున్న శ్రీరంగనాధునికి పైభాగంలో వరదరాజస్వామి, క్రిందిభాగంలో శ్రీవెంకటేశ్వరుని ప్రతిమలు, ఒకే ఫలకంపై చెక్కబడి ఉంటాయి. అంటే శ్రీరంగపు రంగనాథస్వామిని, కాంచీపుర వరదరాజస్వామిని, తిరుమల వేంకటేశ్వరుణ్ణి, మూడు వైష్ణవ దివ్యక్షేత్రాలను ఏకకాలంలో దర్శించి తరించుకున్నామన్నమాట. వైష్ణవులందరి చిరకాల స్వప్నం, ఈ మూడు వైష్ణవ దివ్యక్షేత్రాల సందర్శనం!
💫 1991వ సంవత్సరంలో 55 లక్షల రూపాయలు వెచ్చించి ఈ బంగారు తాపడం చేయించబడింది.
💫 పూర్వం భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనం, టెంకాయలు ఇక్కడే సమర్పించుకునే వారు. భక్తుల రద్దీ కారణంగా ఇప్పుడు కర్పూరహారతులను ఆలయ మహాద్వారానికి ఎదురుగా, బేడి ఆంజనేయస్వామి సన్నిధి ముందున్న "అఖిలాండం" అనబడే ప్రదేశానికి తరలించారు.
💫 ప్రతిరోజూ తెల్లవారు ఝామున జరిగే "అంగప్రదక్షిణలు" లేదా "పొర్లుదండాలు" రంగనాథస్వామి విగ్రహం ఎదురుగా మొదలై, విమానప్రాకారాన్ని సవ్యదిశగా ఆసాంతం చుట్టి, మళ్లీ ఇక్కడే పూర్తవుతాయి. అంగప్రదక్షిణ చేయాలనుకున్న భక్తులు సంబంధిత తి.తి.దే. కార్యాలయంలో గానీ లేదా ఆన్లైన్ లో గాని ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. ప్రతిరోజు 750 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. శుక్రవారం మరియు ముఖ్యమైన పర్వదినాల్లో అంగప్రదక్షిణకు అనుమతి లేదు. భక్తులు ముందుగా స్వామిపుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించి, నిర్ణీత సమయానికి క్యూ కాంప్లెక్స్ ను చేరుకొని, ఆలయ నిబంధలననుసరించి, అంగప్రదక్షిణ గావించుకోవచ్చు.
🙏 వరదరాజ స్వామి ఆలయం 🙏
💫 శ్రీరంగనాథునికి ఎదురుగా నిలుచున్నప్పుడు, మనకు ఎడంప్రక్కగా కొద్ది అడుగుల దూరంలో, కాంచీపుర వరదరాజస్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయం విమానప్రదక్షిణానికి ఆగ్నేయదిక్కున, పశ్చిమాభిముఖంగా కొలువై ఉంటుంది. మూడు అడుగుల ఎత్తైన పీఠంపై, చిరునవ్వు చిందిస్తున్న వరదరాజస్వామి విగ్రహం అభయముద్రలో దర్శనమిస్తుంది. ఆలయ పైభాగంలో, ఏకకలశ నిర్మితమైన గర్భాలయ గోపురాన్ని కూడా చూడవచ్చు. ఈ స్వామిని ఇక్కడ ఎప్పుడు, ఎవరు ప్రతిష్ఠించారో చెప్పడానికి చారిత్రక ఆధారాలు లేవు. అయితే, 1354వ సం. ముందు నుండే ఈ ఉపాలయం ఉన్నట్లు తెలుస్తోంది. కాంచీపురంలో కొలువై ఉన్న వరదరాజస్వామి విగ్రహాన్ని మ్లేచ్ఛుల దండయాత్ర నుండి తప్పించే నిమిత్తం ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారని కొందరంటారు. కానీ ఈ విషయాన్ని ధ్రువీకరించే చారిత్రక ఆధారాలు లేవు. క్యూ ప్రతిబంధకాల కారణంగా ఈ స్వామిని దగ్గరనుంచి దర్శించుకోలేము.
👉 పురాణేతిహాసాల ననుసరించి:
🙏 శ్రీరంగనాథుడు
🙏 తిరుమల వేంకటేశుడు
🙏 కంచి వరదరాజస్వామి
💫 ఈ ముగ్గురి మూర్తులు మూడుకోణాలుగా ఏర్పడే త్రిభుజాకారంలో అపారమైన ఆధ్యాత్మిక శక్తి నిక్షిప్తమై ఉంటుంది. మనం వెండివాకిలి దాటినది మొదలు, శ్రీవారి దర్శనం పూర్తయ్యేంత వరకూ ఈ త్రిభుజాకారం లోనే గడుపుతాం. ఎంతో దూరాలోచనతో, మన పూర్వీకులు ఆలయ సందర్శనార్ధం వచ్చే భక్తులకు అపారమైన దైవికశక్తిని ప్రసాదించడం కోసం ఈ మూర్తులను ఆయా ప్రదేశాల్లో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఏర్పాటు చేసిన ఆ ద్రష్టలను మనసులోనే స్మరించుకొని శ్రీవారి దర్శనార్థం ముందుకు సాగుదాం.
🙏 గరుడాళ్వార్ సన్నిధి 🙏
💫 శ్రీరంగనాథస్వామి కుడ్యప్రతిమకు ఎడంప్రక్కన ఉన్న కటాంజన ద్వారంలో ప్రవేశించి, క్యూ మార్గంలో కుడిప్రక్కకు తిరగగానే, కొన్ని అడుగుల దూరంలో మనకు తూర్పుదిశగా, పంచభూతాల సమ్మేళనం గా భావించబడే "గరుడు" ని ఆలయం కనబడుతుంది. అదే "గరుడాళ్వార్ సన్నిధి".
💫 1512వ సం. లో ఎవరో అజ్ఞాతభక్తుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింప జేశాడు. శ్రీమహావిష్ణువు పరివారదేవత, వారి సేవకులలో ముఖ్యుడైన గరుత్మంతుని గురించి ఇంతకుముందే "శ్రీవారి బ్రహ్మోత్సవాలు – గరుడవాహనం" ప్రకరణంలో విస్తారంగా తెలుసుకున్నాం.
💫 సరిగ్గా శ్రీవారి బంగారువాకిలికి ఎదురుగా, శ్రీవారిని సతతం దర్శించుకుంటూ, నమస్కారభంగిమలో, రెక్కలు విప్పార్చుకున్నట్టి ఆరు అడుగుల గరుత్మంతుని విగ్రహం నేత్రపర్వంగా దర్శనమిస్తుంది. ఈ సన్నిధి గోపురంపైన ఉన్న మూడు బంగారు కలశాలను మనం విమానప్రదక్షిణ మార్గంలో ప్రవేశించగానే, శ్రీరంగనాథుని మూర్తి ఉపరితలభాగంపై చూడవచ్చు. శ్రీవారి ముల్లోకవిహారానికి ఎల్లవేళలా సన్నద్ధుడై, అబద్ధునిగా ఉండే గరుత్మంతుణ్ణి మనఃపూర్వకంగా నమస్కరించుకుని, ఆ తరువాతే తన దర్శనం చేసుకోవడం శ్రీనివాసునికి సంతోషదాయక మని చెప్పబడుతుంది.
🙏 మహామణి మండపం లేదా, తిరుమామణిమండపం 🙏
💫 క్యూ మార్గంలో నడుస్తూనే గరుత్మంతుని దర్శనం చేసుకుని, ఆనందనిలయానికి ప్రధాన ద్వారమైన బంగారువాకిలి ఎదురుగా ఉన్న "ఘంటామండపం" లేదా "మహామణిమండపం" లోనికి ప్రవేశించాము.
💫 ఈ మంటపం ఈ క్రింది విధంగా అనుసంధానిస్తూ, దాదాపుగా చతురస్రాకారంలో ఉంటుంది.
💐తూర్పుదిక్కున గరుడాళ్వార్ సన్నిధిని,
💐పడమరదిక్కున బంగారువాకిలిని,
💐ఉత్తరదిక్కున హుండీని,
💐తూర్పుదిక్కున విమానప్రదక్షిణాపథాన్ని.
💫 ఈ మండపం పైకప్పుకు ఆధారంగా ఉన్న 16 శిలా స్తంభాలపై శ్రీమహావిష్ణువు, శ్రీవేంకటేశ్వరుడు, వరదరాజస్వామి, ఆదివరాహస్వామి యొక్క ఆకృతులు కడు రమణీయంగా చెక్కబడి ఉంటాయి. పైకప్పు అంతా అత్యద్భుతమైన పౌరాణిక ఘట్టాలు మలచబడి, బంగారు తాపడంతో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తుంది. 15వ శతాబ్దం ప్రారంభంలో, చంద్రగిరికి చెందిన ఓ విజయనగర పాలకుని ద్వారా నిర్మింపబడ్డ ఈ మండపంలోనే, ప్రతిరోజు సుప్రభాత సమయంలో స్వామివారికి మేలుకొలుపులు పాడుతారు. ప్రతి బుధవారం, ఈ మంటపంలోనే, ఆర్జిత సేవయైన "సహస్రకలశాభిషేకం" కూడా జరుగుతుంది. ఈ మండపంలో, బంగారువాకిలికి ఎడమప్రక్కగా రెండు పెద్ద ఘంటలు వ్రేలాడదీయబడి ఉంటాయి. తమిళంలో "మహామణి" అంటే "పెద్దఘంట" అని అర్థం. అందువల్లనే ఈ మంటపానికి ఆ పేర్లు వచ్చాయి. ఈ ఘంటలను మ్రోగించే ఆలయ పరిచారకులను "ఘంటాపాణి" గా పిలుస్తారు. ఈ ఘంటానాదం విన్న తరువాతనే, చంద్రగిరిలో నివసించే స్వామివారి వీరభక్తులైన విజయనగర రాజులు ఆహారాన్ని స్వీకరించేవారట. ఆ సాంప్రదాయం చాలామంది తిరుమల వాసులు నేటికీ కొనసాగిస్తున్నారు.
💫 ఈ రెండు ఘంటలలో ఒక దానిని "నారాయణఘంట" గానూ, రెండవ దానిని "గోవిందునిఘంట" గానూ వ్యవహరిస్తారు. ఒకప్పుడు బంగారువాకిలికి ఇరు ప్రక్కలా ఉండే ఈ రెండు ఘంటలను ప్రస్తుతం ఒక పార్శ్వానికి చేర్చి, రెండింటిని ప్రక్క- ప్రక్కనే అమర్చారు.
🙏 జయ విజయులు 🙏
💫 శ్రీవారు కొలువుండే వైకుంఠానికి ఏ విధంగా జయవిజయులు కాపుంటారో, అదేవిధంగా బంగారువాకిలికి దక్షిణాన జయుడు, ఉత్తరాన విజయుడు; శంఖు, చక్ర, గదాధారులై, సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపాల్లా దర్శనమిస్తుంటారు. వీరిని "చండ-ప్రచండులు" అని కూడా వ్యవహరిస్తారు. పది అడుగుల ఎత్తుతో గంభీరంగా ఉండే ఈ పంచలోహ విగ్రహాలు తర్జనితో భక్తులను ఎల్లవేళలా హెచ్చరిస్తుంటాయి. స్వామి పుష్కరిణిలో పవిత్రస్నానమాచరించి, శుచిగా ఆలయంలోకి ప్రవేశించి, ఆలయ నిబంధనలు పాటిస్తూ, క్రమశిక్షణతో మెలుగుతూ, తోటి భక్తులకు ఇబ్బంది కలుగకుండా స్వామి దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నారేమో!
💫 ఈ మూర్తులను జాగ్రత్తగా గమనిస్తే, వారి నోళ్లకు చిన్నచిన్న కోరలుంటాయి. దానికి కారణం పూర్వజన్మలో వారు రాక్షసులుగా జన్మించడమే.
💫 పురాణాల్లోకి వెళితే ఒకప్పుడు వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉండే జయ-విజయులు, కారణాంతాన బ్రహ్మమానస పుత్రులైన సనకసనందనాది మునులచే శపించబడి, కృతయుగంలో హిరణ్యాక్ష-హిరణ్యకశిపులు గానూ, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు గానూ, ద్వాపరయుగంలో శిశుపాల దంతావక్రులు గానూ జన్మించి, వారి వారి దుష్క్రుత్యాల వల్ల శ్రీవారి చేతిలో సంహరింప బడ్డారు. శాపకాలం పూర్తయిన తర్వాత, శ్రీమహావిష్ణువు కటాక్షంతో తిరిగి కలియుగంలో శ్రీనివాసునికి ద్వారపాలకులుగా నియమింపబడ్డారు. ఆదిశేషుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు తరువాత, విష్ణుమూర్తి పరివార దేవతలలో అత్యంత ప్రముఖులు వీరే!
💫 శ్రీవారిసన్నిధి యందున్న బంగారు కటాంజనాలలో నిరంతరం నిలుచుని ఉండే మహద్భాగ్యానికి నోచుకున్న జయవిజయులకు భక్తిపూర్వకంగా నమస్కరించి, వారి అనుమతితో, శ్రీవారి దర్శనార్థం, "బంగారువాకిలి" ముంగిట చేరుకున్నాం.
No comments :