🌈 *మహంతుల నిర్వహణలో తిరుమల ఆలయం* 🌈
💫 ఈ విషయాన్ని చెప్పుకునే ముందు, ఆలయ అజమాయిషీ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి నుండి మహంతుల చేతిలోకి మారడం వెనుకనున్న చారిత్రక నేపథ్యాన్ని కొద్దిగా తెలుసుకోవాలి. విజయనగర రాజుల తరువాత, మారుతున్న రాజకీయ పరిణామాలకనుగుణంగా ఆలయ నిర్వహణ క్రమంగా ఆర్కాట్ నవాబుల చేతికి, తరువాత మరాఠా పాలకుల చేతికి మారింది. కాలక్రమేణా 19వ శతాబ్దపు ప్రథమార్థంలో, తిరుపతి-తిరుమలలో ఉండే ఆలయాలన్నీ, తిరుమలలోని ప్రధాన ఆలయంతో సహా ఈస్టిండియా కంపెనీ పరిపాలన పరిధిలోకి వచ్చాయి.
🌈 *తెల్లదొరల పరిపాలనలో తిరుమల* 🌈
💫 దాదాపు అర్థశతాబ్దం పాటు ఆలయనిర్వహణ బాధ్యతను నిర్వహించిన తెల్లదొరలు, వైదిక కార్యక్రమాల కంటే ఆర్థిక వ్యవహారాలకే ప్రాముఖ్యత నిచ్చారు. తిరుమల ఆలయం హైందవమతానికి ఆటపట్టు అన్న విషయాన్ని ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించి, ఈ ఆలయాన్ని ఆదాయవనరుగా భావించేవారు. ఒక పద్ధతి ప్రకారం హిందూమతాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. అంతకుముందు భక్తులకు ఉచితంగా అందించే సేవలకు రుసుము వసూలు చేయడం ప్రారంభించారు. సరుకుల విషయంలో రాజీ పడడం వల్ల, ప్రసాదాల తయారీలో నాణ్యత లోపించింది.
💫 అయితే, ఈస్టిండియా కంపెనీ వారి హయాంలో అనేక లోటుపాట్లు ప్రస్ఫుటంగా కాన వచ్చినప్పటికీ, వారివల్ల ఆలయానికి, అయాచితంగా నైనా కొంత మేలు కూడా జరిగింది.
💫 ఉదాహరణకు, హిందువుల మనోభావాలను గౌరవించిన ఒకరిద్దరు బ్రిటిష్ ఉన్నతాధికారుల చొరవతో, సప్తగిరుల పైకి అన్యమతస్తుల రాకను నిషేధిస్తూ కఠినమైన చట్టాలు చేయబడ్డాయి. హిందూ మతస్తులు అందరికీ ఆ రోజుల్లో నిమ్న కులస్తులుగా భావించబడే వారితో సహా ఆలయం లోనికి ప్రవేశం కల్పించబడింది. ఇంతే కాకుండా ఆలయానికి సంబంధించిన అనేక వ్యవహారాలు, బ్రిటిష్ వారి హయాంలోనే గ్రంథస్తం చేయబడ్డాయి. అంతకు ముందు వరకూ శిలాఫలకాపై, రాగిరేకుల మీద, తాళపత్రాలలో, చేతివ్రాత ప్రతుల యందు ఉన్నట్టి ఆలయ నియమ నిబంధనలను మొట్టమొదటిసారిగా, అచ్చులో ముద్రించి, వాటికి శాశ్వతరూపం కల్పించి భావితరాల వారికి అందజేశారు. ఇందులో వారి స్వార్థం ఎంతో ఉన్నప్పటికీ, నిర్వహణ వ్యవహారాలు వ్రాతపూర్వకమైన ప్రామాణికతను సంతరించు కోవడం వల్ల దేవాలయానికి మాత్రం కొంతలో కొంత మేలే జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వారి హయాంలో 19వ శతాబ్దపు తొలి దశకాల్లో ఆలయానికి సంబంధించి వెలువడిన ముద్రిత గ్రంథాలలో ఈ ఐదింటినీ ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.
💫 *సవాల్-జవాబ్ పట్టీ* అనే పట్టికలో, తిరుమలలోనూ తిరుపతిలోనూ ఉన్నట్టి అనేక ముఖ్యమైన దేవాలయాల సమాచారాన్ని ప్రశ్నోత్తరాల రూపంలో పొందుపరిచారు. శిలాశాసనాల రూపంలో అప్పటికి అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ పట్టిక రూపొందించ బడటం వల్ల, విలువైన చారిత్రక సమాచారం వెలుగు చూసింది. వివిధ ఆలయాలకు ఉన్న మాన్యాల విస్తీర్ణాన్ని, హద్దులను కూడా ఇందులోనే పొందుపరచారు.
💫 *కైంకర్య పట్టి* అనే గ్రంథంలో ఆనాడు దేవాలయంలో సేవలందించే వివిధవర్గాల వారి జీతభత్యాలను, వారి హక్కులను, విధులను, వారికి చెందవలసిన ఆలయ మర్యాదలను క్రోడీకరించారు. ఆనాటికి అమలులో ఉన్న సాంప్రదాయాలు, వివిధవర్గాల వారినుండి రాబట్టిన మౌఖిక సమాచార సంకలనమే ఈ గ్రంథం.
💫 *బ్రూస్ నిబంధనావళి* అనే పుస్తకంలో ఆలయ నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను, స్పష్టంగా నిర్వచించారు. ఆలయవేళలు, ఉన్నతాధికారులకు గల అధికారాలు, ఆలయనిర్వహణలో కంపెనీకి గల పరిమితులు, ఆదాయం పై అజమాయిషీ మొదలగు వాటిని గ్రంథస్థం చేశారు. తిరుమలలో ఈ మధ్యకాలం వరకు అమలులో ఉన్న *మిరాశి వ్యవస్థ* కు ఆలంబనం ఈ నియమావళిలో ఉన్న అంశాలే.
💫 *దిట్టం బుక్కు* గా వ్యవహరించబడే మరో పట్టికలో వివిధ రకాలైన ప్రసాదాలలో ఉపయోగించే దినుసులు, వాటి నాణ్యత, పరిమాణాలను లిఖించారు. ఏఏ సందర్భాలలో ఏఏ ప్రసాదాలను ఎంత మొత్తంలో తయారు చేయాలో కూడా ఇందులో ఉదహరించబడింది.
💫 *పైమాయిషీ* గా పిలువబడే మరో పట్టికలో ఆలయానికి సంబంధించిన వివిధ మంటపాలు, ఇతర కట్టడాలు, విగ్రహమూర్తులు మొదలగు వాటికి సంబంధించిన వివరాలను, వాటిని నిర్మించిన దాతలను గురించిన సమగ్రమైన సమాచారాన్ని అందజేశారు.
💫 ఇప్పుడు ఆలయనిర్వహణ బాధ్యత ఈస్టిండియా కంపెనీ అధికారుల నుండి మహంతుల చేతిలోకి ఎందుకు, ఎలా వచ్చిందో పరిశీలిద్దాం.
🌈 *పరాయి చెరనుండి ఆలయానికి విముక్తి* 🌈
💫 హిందూ దేవాలయాల, ధార్మిక సంస్థల, మరీ ముఖ్యంగా, కుల వర్గ ప్రాంతీయ బేధాల కతీతంగా హిందువులందరూ ఆరాధించే తిరుమల ఆలయ వ్యవహారాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి జోక్యం మితిమీరడంతో; హిందూ సాంప్రదాయ వాదుల్లో తీవ్రమైన అసంతృప్తి ప్రబలింది. క్రమంగా వారి సహనం హద్దులు దాటి, బ్రిటీష్ ప్రభుత్వంపై వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా వేగంగా విస్తరించడంతో; ముందుచూపు కలిగిన, వివేకవంతులైన కొందరు బ్రిటిష్ అధికారులు కళ్ళు తెరిచారు. లండన్ లోనూ, కలకత్తా లోనూ ఉన్న ఈస్టిండియా కంపెనీ ఉన్నతాధికారులకు అనేక రహస్య నివేదికలు పంపారు. ఈ వ్యవహారాన్ని తెగే వరకు లాగవద్దని, తిరుమల ఆలయ వ్యవహారాలలో మితిమీరిన జోక్యం పనికిరాదని సందేశాలు ఇచ్చారు. ఇండియా లోని గవర్నర్ జనరల్ కు దాదాపుగా అన్ని హిందూ మరియు మహమ్మదీయ ధార్మిక సంస్థలకు సంబంధించి ఇలాంటి నివేదికలే అందాయి. వాటన్నింటిని సమీక్షించిన ఆంగ్లేయ పాలకవర్గం, భారతదేశంలోని అన్ని మతపరమైన సంస్థలలో క్రమంగా జోక్యం తగ్గించుకోవాలని తీర్మానించింది.
💫 తదనుగుణంగా, అప్పుడు తిరుమల దేవాలయం యొక్క వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టరుకు ఆలయ నిర్వహణ విధుల నుండి తప్పుకొని; ఆ బాధ్యతను తగిన వ్యక్తులకు గానీ, వ్యవస్థకు గానీ అప్పగించ వలసిందిగా తాఖీదు అందింది.
🌈 *ఎవరు సమర్థులు?* 🌈
💫 అయితే, అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఆలయ వ్యవహారాలపై ఆధిపత్యం బ్రిటీష్ వారినుండి ఎవరికి సంక్రమించాలి? ఇంతటి గురుతరమైన బాధ్యతను అత్యంత సమర్ధవంతంగా ఎవరు నిర్వహించగలరు? తిరుమల క్షేత్రం లోనే కాకుండా తిరుపతి పట్టణంలోనూ, దాదాపు చిత్తూరు జిల్లా మరియు పరిసర ప్రాంతమంతటా అప్పట్లోనే శ్రీవారికి లెక్కలేనన్ని మడులు, మాన్యాలు ఉన్నాయి. వాటన్నింటిని సంరక్షించడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఇటువంటి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం అంత సులభంగా దొరకలేదు. దానికోసం పెద్ద కసరత్తే జరిగింది.
💫 అప్పట్లో స్వామివారినే తమ సర్వస్వంగా భావించి, తమ జీవితాలను శ్రీవారిసేవకు అంకితం చేసిన వైష్ణవులలో అంకితభావానికి, సేవానిరతికి ఏమాత్రం కొరత లేదు. వారి నీతి-నిజాయితీలను, చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించ నవసరం లేదు. అయితే, తంగళ్, వడగళ్ అంటూ ఇరువర్గాలుగా చీలిపోయిన వైష్ణవులలో ఐకమత్యం లోపించి, పరస్పరం కలహించుకునే వారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం శాయశక్తులా ప్రయత్నించే వారు. కాబట్టి వారికి అధికారం అప్పగిస్తే, పరస్పర స్పర్ధల కారణంగా వారు ఆలయ పరిపాలనా భారాన్ని సజావుగా నిర్వహించ గలగటం సందేహాస్పదమే!
💫 అలాగే, ఆలయంలో మరో బలమైన వర్గం అనూచానంగా స్వామివారిని సేవించుకుంటున్నట్టి వంశపారంపర్య అర్చకులు. ఎల్లవేళలా పూజా పునస్కారాలలో మునిగి ఉండే అర్చకులలో పాలనా పాటవం అంతగా లేదు. పైగా, వారికి పాలనపగ్గాలు అప్పజెబితే వైదిక కార్యకలాపాలకు అంతరాయమేర్పడి, భక్తులలో ఆలయం పట్ల నిర్లిప్తత కలిగితే కానుకల ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.
💫 జియ్యంగార్లు కూడా వైదికవిధుల నిర్వహణ, కైంకర్యాలకే పరిమితమయ్యేవారు కానీ, ఆర్థిక వ్యవహారాలలో ఏమాత్రం ఆసక్తి కనపరిచేవారు కాదు. పైగా ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా; వారి పాత్ర, పాలకవర్గానికి అర్చకగణాలకు మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరించేంత వరకే పరిమితం. వారికి ఇతరత్రా విధులు అప్పగిస్తే, జియ్యంగార్ల వ్యవస్థ యొక్క ముఖ్యోద్దేశం నెరవేరదు.
💫 ఇలా ఆలయానికి సంబంధమున్న వారందరి సామర్థ్యాన్ని, వారివల్ల దేవాలయానికి కంపెనీ వారికి కలిగే లాభనష్టాలను బేరీజు వేసిన తర్వాత బ్రిటిష్ వారి దృష్టి *మహంతులపై* పడింది. కొన్ని సానుకూలమైన అంశాలు వారికి సహకరించాయి.
✅ వీరు సుదూర ప్రాంతానికి చెందిన ఉత్తరభారతీయులు. స్థానికంగా బలము, బలగము లేనివారు. అలాంటివారికి అధికారం అప్పగిస్తే కంపెనీవారు పరోక్షంగా తమ పెత్తనాన్ని కొనసాగించవచ్చు.
✅ పైగా మఠానికి ప్రథమ మహంతు అయిన హాథీరామ్ బాబాజీ పట్ల ఆలయ అధికారులకు, అర్చకులకు, జియ్యంగార్లకు, భక్తులకు ఇలా ఆలయంతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధం ఉన్న వారందరికీ బావాజీ పట్ల విశేషమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. తదనంతర కాలంలో వారి శిష్యులు, అనుచరులు కూడా అదే రకమైన ఆదరాన్ని చూరగొన్నారు. కాబట్టి వారికి అధికారాన్ని అప్పగిస్తే, ఆలయం లోని ఇతరవర్గాల వారికి కూడా సమ్మతంగానే ఉంటుంది.
✅ అంతే గాకుండా, మహంతు లందరూ సన్యాసాశ్రమం స్వీకరించిన వారే కాబట్టి, అధికారం వారసులకు సంక్రమించే అవకాశం లేదు.
✅ మహంతులకు అప్పటికే విస్తృతంగా ధార్మిక కార్యకలాపాలు చేపట్టగలిగినటువంటి పటిష్ఠమైన వ్యవస్థ, అన్ని హంగులతో కూడుకున్న సువిశాలమైన మఠం, ఆ మఠాన్ని ఎన్నో ఏళ్ళుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న అనుభవం సమర్థత ఉన్నాయి.
💫 ఈ విషయాలన్నింటినీ అంతర్గతంగా చర్చించుకొన్న ఆంగ్లేయులు కొంత వారి స్వార్థాన్ని, మరికొంత ఆలయ బాగోగులను దృష్టిలో ఉంచుకొని; ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతులకే అప్పజెప్పాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
💫 బ్రిటిష్ వారు ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతులకు అప్పజెప్పాలని తీర్మానించుకున్న అనంతరం చకచకా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
💫 మహంతులకు అప్పటికే విస్తృతంగా ధార్మిక కార్యకలాపాలు చేపట్టగలిగినటువంటి పటిష్ఠమైన వ్యవస్థ, అన్ని హంగులతో కూడుకున్న సువిశాలమైన మఠం, ఆ మఠాన్ని ఎన్నో ఏళ్ళుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న అనుభవం సమర్థత ఉన్నాయి.
💫 ఈ విషయాలన్నింటినీ అంతర్గతంగా చర్చించుకొన్న ఆంగ్లేయులు కొంత వారి స్వార్థాన్ని, మరికొంత ఆలయ బాగోగులను దృష్టిలో ఉంచుకొని; ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతులకే అప్పజెప్పాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
💫 బ్రిటిష్ వారు ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతులకు అప్పజెప్పాలని తీర్మానించుకున్న అనంతరం చకచకా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
🌈 *అధికారాల బదిలీ* 🌈
💫 ఆ ఉత్తర్వులను అనుసరించి, 1843వ సంవత్సరం జూలై నెలలో మహంతు మఠానికి ఆ సమయంలో నేతృత్వం వహిస్తున్న 'మహంతు సేవాదాస్' గారు 'విచారణకర్త' గా నియమింపబడ్డారు. విచారణకర్త అంటే దాదాపుగా ఈనాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తో సమాన మన్నమాట. ఆలయ సక్రమ నిర్వహణకుకు, ఆర్థిక వ్యవహారాలకు ఆయనే జవాబుదారీ. ఈ విధంగా మహంతుమఠానికి విశేష అధికారాలు దఖలు పడ్డాయి. అదే నెల 16వ తేదీనాడు, దక్షిణాయన సంక్రాంతి పర్వదినాన అప్పటివరకు ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఈస్టిండియా కంపెనీ వారి నుండి, ఆలయానికి సంబంధించిన సమస్త స్థిర చరాస్తుల ధర్మకర్తృత్వం మహంతు సేవాదాసుకు బదిలీ చేయబడింది. శ్రీవారి ఆభరణాలు, వాహనాలు, వెండి బంగారు పాత్రలు, ఇతర కైంకర్య సామాగ్రి, రొక్ఖం మొదలైనవన్నీ; పలువురి సమక్షంలో వ్రాతపూర్వకంగా మహంతుకు అప్పజెప్పడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం జూలై 16వ తేదీన జరిగే *ఆణివార ఆస్థానం* అనే సంవత్సరోత్సవం గురించి ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఈ మధ్య కాలం వరకు ఆలయ ఆర్థిక సంవత్సరం ఆ దినం నుండే ప్రారంభమయ్యేది. అలా దేవాలయ పాలనా బాధ్యతలు చేపట్టిన, బాబాజీ శిష్యులైన, మహంతులు విష్వక్సేనముద్రను తమ అధికారిక ముద్రగా ఎన్నుకొన్నారు. శ్రీవేంకటేశ్వరునికి సర్వసైన్యాధిపత్యం వహించే విష్వక్సేనుడు వారికి అన్ని రకాలుగా దన్నుగా ఉంటాడని వారి విశ్వాసం.
🌈 *షరతులతో కూడిన బదిలీ* 🌈
💫 అయితే, యాజమాన్య మార్పిడి కొన్ని షరతులకు లోబడి జరిగింది. అప్పటి వరకు ఆలయం నందు అమలులో ఉన్న కైంకర్యాలలోనూ, వైఖానస ఆగమ పద్ధతుల్లోనూ ఏ విధమైన మార్పులు చేయరాదు. మనం ఇంతకు ముందు చెప్పకున్నట్టి, బ్రిటీష్ వారి హయాంలో రూపుదిద్దుకున్న అయిదు గ్రంథాలలో పేర్కొన్న విధివిధానాలననుసరించే దేవాలయ నిర్వహణ అంతా జరగాలి. వంశపారంపర్య అర్చకులకు, మిరాశీదారులకు, ఆచార్యపురుషులకు, జియ్యంగార్లకు, అన్నమాచార్యులు మరియు తరిగొండ వెంగమాంబ వంశస్తులకు పరంపరాగతంగా లభించే ఆలయ మర్యాదల విషయంలో గాని, కానుకల విషయంలో గాని, ప్రసాదాల విషయంలో గాని, ఏ విధమైన లోటుపాట్లు జరగరాదు. అవన్నీ యథాతథంగా కొనసాగుతూ ఉండవలసిందే!
💫 మహంతుల ఆధ్వర్యంలోని తొలి దశకాల్లో నిధులకు విపరీతమైన కొరత ఉండేది. అయినప్పటికీ, మహంతుల అంకితభావం వల్ల ఉన్న అరకొర వనరులతోనే ఆలయ నిర్వహణ ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా, సజావుగా సాగిపోయేది.
💫 ఆలయంలో అప్పటికే వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న హక్కుదారులు (అర్చకులు, ఆచార్యపురుషులు, జియ్యంగార్లు, మొదలగు వారు) అందరికీ, మహంతులకు ఏకపక్షంగా అధికారం దక్కటం అంతగా రుచించనప్పటికీ, వారిలో వారికి ఐకమత్యం లేకపోవడం వల్ల, కంపెనీ వారి నిర్ణయానికి ఎదురు చెప్పే ధైర్యం లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మహంతుల ఆధిపత్యాన్ని అంగీకరించటమే కాకుండా, వారికి దేవాలయ నిర్వహణలో అన్ని రకాలుగా సహకరించారు కూడా!
🌈 *మహంతుల కృషి* 🌈
💫 దేవాలయానికి మొట్టమొదటి విచారణకర్తగా 1843వ సంవత్సరంలో బాధ్యతలు చేపట్టిన సేవాదాస్ జీ స్వామిపుష్కరిణిని పునరుద్ధరించి, అందులో వైభవోపేతంగా స్వామివారి తెప్పోత్సవం నిర్వహించే సాంప్రదాయానికి నాంది పలికారు. వీరి హయాంలో మహంతువ్యవస్థ ఏ విధమైన ఆటుపోట్లకు గురికాకుండా, సజావుగా 21 సంవత్సరాల పాటు సాగిపోయింది.
💫 వారి తదనంతరం, 1864వ సంవత్సరంలో మహంతు ధర్మదాస్ జీ రెండవ విచారణకర్తగా నియమింపబడ్డారు. వీరు శేషాచల పర్వత పాదభాగంలో, తిరుపతి శివారులో ఉన్న కపిలతీర్థం పుష్కరిణికి, దాని చుట్టూ ఉన్న సంధ్యావందన మంటపాలకు; మహాద్వార గోపురానికి మరమ్మత్తులు గావించి, కొత్త సొగసులు తీర్చిదిద్దారు. వీరి హయాంలో కొన్ని మంటపాల నిర్మాణం కూడా జరిగింది.
💫 వారి తరువాత భగవాన్ దాస్ జీ మూడవ విచారణకర్తగా బాధ్యతలు చేపట్టారు. వారి హయాం వివాదాలకు నెలవుగా మారింది. అప్పటివరకు అరకొర నిధులతో ఆలయ నిర్వహణను చేపట్టిన మహంతులు ఒక్కసారిగా ఆర్థిక వనరులను పెంపొందించు కోవడంపై దృష్టిపెట్టారు. సహజంగానే వైదిక కార్యక్రమాలు, ఇతర ధార్మిక కలాపాలపై శ్రద్ధ కొద్దిగా తగ్గింది. తత్ఫలితంగా అవసరానికంటే ఎక్కువ నిధులు సమకూరాయి. కొన్ని దశాబ్దాల పాటు ఆలయ నిర్వహణను సమర్ధవంతంగా నిర్వహించడంతో మహంతు వ్యవస్థపట్ల భక్తులలో గౌరవాభిమానాలు ఇనుమడించాయి. దాంతో పాటుగా భక్తుల రద్దీ కూడా పెరగడంతో మహంతులు తమ విశేషాధికారాన్ని, ఆలయవర్గాలలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి; ప్రముఖులకు శీఘ్రంగా దర్శనం కలిగించటం మొదలుపెట్టారు. రాను రానూ ఆలయం యొక్క సాధన సంపత్తులన్నింటికీ తాము తిరుగులేని పెత్తందార్లమన్న మితిమీరిన విశ్వాసం మహంతులలో నెలకొంది. నిధుల దుర్వినియోగం ఆరోపణలు కూడా వచ్చాయి. ఆలయనిధులను తన సొంతానికి మళ్లించుకున్న ఆరోపణపై అప్పటి న్యాయస్థానం మహంతుకు జరిమానా కూడా విధించింది. అంతే గాకుండా, వారు ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ జరిపే సమయంలో; పాత ధ్వజస్తంభం యొక్క పాదపీఠం క్రింద ఉన్న నిధులను అపహరించారన్న అపవాదును మూటగట్టుకున్నారు. వీరి హయాంలోనే, మహంతుల నివాసం ఇప్పుడు ప్రధానాలయానికి ఆగ్నేయమూలలో ఉన్న, హంగు ఆర్భాటాలతో యాదవ రాజులు కట్టించిన మహంతుమఠానికి మారింది. అప్పటివరకు వైరాగ్యజీవితాన్ని గడిపిన మహంతులకు భిన్నంగా తరువాతి వారు మహంతుమఠంలో సర్వసౌఖ్యాలు అనుభవించారు. సర్వసంగపరిత్యాగులకు సౌధాలెందుకన్న ప్రశ్న భక్తుల మదిలో మెదిలింది. అప్పటి మహంతుల అతిశయం ఎంతగా వెర్రితలలు వేసిందంటే తిరుమల యాత్రికులు ముందుగా మహంతును దర్శించుకుని, కట్నకానుకలు సమర్పించుకున్న తర్వాతనే స్వామివారిని దర్శించుకునే సాంప్రదాయానికి నాంది పలికారు. అప్పటివరకు ఏ విధమైన తరతమ భేదాలకు తావులేని ఆలయంలో జమీందారులకు, ధనికులకు, రాచకుటుంబీకులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. పరపతి గలవారికి త్వరితగతిన దర్శనాలు జరిగేవి. ఇవన్నీ ఒక ఎత్తయితే, అన్యమతస్తుల విషయంలో మహంతు అవలంబించిన వైఖరి మరో ఎత్తు. అప్పటికి దాదాపు వంద సంవత్సరాల క్రితమే, ఆంగ్లేయులు, తిరుమల క్షేత్రం మరియు మీదకి హైందవేతరుల రాకపోకలపై కఠినమైన ఆంక్షలు విధించారు. దానికి భిన్నంగా ప్రస్తుత మహంతులు, యూరోపియన్ అధికారుల ప్రాపకం సంపాదించుకోవడం కోసం వారికి కొండపై ప్రత్యేకంగా వసతి సౌకర్యాలు కల్పించారు. సాంప్రదాయానికి విరుద్ధంగా దేవాలయ నిధులను, భూముల పూచీకత్తుపై కొంతమంది జమీందార్లకు రుణంగా ఇచ్చారు. అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు గానీ వాటన్నింటిలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అపవాదును మూటగట్టుకున్నారు. కొన్ని మహమ్మదీయ సంస్థలకు విరాళాలిచ్చారు.
💫 తరువాతి కాలంలో అధికారంలోకి వచ్చినా రామ్ కిషోర్ దాస్ జీ పై కూడా నిధుల దుర్వినియోగం ఆరోపణలు రావడంతో, న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నప్పుడు ఆకస్మికంగా మరణించారు. ఈ విధంగా మహంతుల నిర్వాకంపై వివిధ న్యాయస్థానాల్లో లెక్కలేనన్ని కేసులు నమోదు కావడంతో; 1898వ సంవత్సరంలో ఉత్తర ఆర్కాట్ జిల్లా ప్రధాన న్యాయస్థానం అప్పటి మహంతును కక్షి దారులైన జియ్యంగార్లు, శ్రీవైష్ణవులు, తిరుమలలో వున్న ఇతర మఠాల వారిని పిలిచి; సయోధ్య కుదిర్చారు. దాని ప్రకారం, న్యాయస్థానం ఆలయనిధుల వినియోగాన్ని పర్యవేక్షించడానికి ఐదుగురు సభ్యులతో ఒక ధర్మాసనాన్ని నియమించింది. దానిపై మహంతులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తరువాతి కాలంలో ఆలయనిర్వహణపై మహంతులకున్న తిరుగులేని అధికారాలకు పరిమితులు విధిస్తూ న్యాయస్థానాలు అనేక తీర్పులిచ్చాయి. వాటన్నింటిపై మహంతులు ఎప్పటికప్పుడు పైకోర్టుల్లో పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. చివరకు లండన్లోని అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ. మహంతులు తప్ప ఆలయంతో సంబంధం ఉన్న మిగిలిన వారందరూ ఒక వర్గంగా ఏర్పడటంవల్ల, మహంతులపై అధికార దుర్వినియోగం ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతుండడం వల్ల తరచూ వారికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతూ ఉండడమే గాకుండా, మహంతు వ్యవస్థ పట్ల తొలినాళ్ళలో భక్తులకున్న గౌరవాభిమానాలు క్రమంగా అంతరించి పోయాయి. ఆ విధంగా, 1900వ సంవత్సరం నాటికి మహంతుల ప్రభావం గణనీయంగా తగ్గింది.
🌈 *ఆఖరి మహంతు కృషి శ్లాఘనీయం* 🌈
💫 అయితే, 1900వ సంవత్సరం నుండి 1933 వరకు 33 ఏళ్ల పాటు విచారణకర్తగా పనిచేసిన చిట్టచివరి విచారణకర్త 'ప్రయాగ్ దాస్ జీ' హయాంలో మహంతువ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. ఏ విధమైన ఆరోపణలకు తావులేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో వారి ప్రతిష్ఠ ఇనుమడించింది. వారి హయాంలోనే ఎంతోకాలం నుండి పరిశీలన దశలోనే ఉన్న అలిపిరి మెట్ల పునర్నిర్మాణం జరిగి, భక్తులకు ఎంతో వెసులుబాటు కలిగింది. జీర్ణదశలోనున్న గాలిగోపురం మరమ్మత్తు గావించబడింది. ఆనందనిలయ గోపురంపై బంగారుమలాం పూత పూయబడింది. రహదారుల విస్తరణ, యాత్రికులకు త్రాగునీరు ఏర్పాటు, ధర్మసత్రాల నిర్మాణం జరిగింది. పరిశుభ్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అనేక నిర్మాణాత్మక కార్యకలాపాలు చేపట్టబడ్డాయి. ఆలయంలో లభించిన అసంఖ్యాక శిలాశాసనాలపై సమగ్ర పరిశీలన జరిగి, విలువైన సమాచారం గ్రంథస్థం చేయబడింది. అన్నమాచార్య సంకీర్తనాభండారం వెలుగులోకి వచ్చి, దానిలో నుండి వెలువడ్డ రాగిరేకులలో లిఖించబడ్డ కీర్తనలను ప్రచురించే కార్యక్రమం అప్పుడే మొదలైంది. అనేక విద్యా, వైద్య సంస్థలకు వారి హయాంలోనే అంకురార్పణ జరిగింది. వేదపాఠశాల, ప్రాచ్యకళాశాల, ఆయుర్వేద కళాశాల ఆనాడు రూపుదిద్దుకున్న సంస్థలే! స్వామివారికి అనేక ఆభరణాలు కూడా తయారు చేయబడ్డాయి. ప్రయాగ్ దాస్ జీ 33 సంవత్సరాలు పాటు మహంతుగా బాధ్యతలు నిర్వహించిన తరువాత, అంతకు ముందెప్పటి నుండో కోర్టులలో ఉన్న కేసులన్నీ ఒక కొలిక్కి రావడంతో, 1933వ సంవత్సరంలో అప్పటి మద్రాస్ గవర్నర్, దేవస్థానానికి ఒక ధర్మకర్తల మండలిని నియమించి, ఆలయాన్ని వారి ఆధీనంలోకి తెచ్చారు.
💫 ఈ విధంగా, 1843వ సంవత్సరంలో మొదలైన మహంతుల పాలన, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, 1933వ సంవత్సరం వరకు - అంటే 90 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా కొనసాగి, ఆలయచరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. వారి పాలనపై ఎన్ని వివాదాలు నెలకొన్నప్పటికీ, స్థూలంగా ఆలయం అభివృద్ధిపథంలోనే పయనించింది. 1843వ సంవత్సరంలో కేవలం లక్ష రూపాయలు గా ఉన్న దేవాలయ వార్షిక ఆదాయం 1908వ సంవత్సరంలో సుమారు నాలుగు లక్షలకు పెరిగింది. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తమే! అంతకుముందు అంతంత మాత్రంగానే ఉన్న దేవాలయ ఆర్థిక పరిస్థితి, 1933వ సంవత్సరం నాటికి, బాగా వృద్ధి చెంది, మిగులుబాట పట్టింది. కొందరు మహంతులు స్వార్థబుద్ధితో వ్యవహరించారన్న అపవాదు ఉనప్పటికీ, మిగిలిన వారందరూ ఆలయ అభివృద్ధికి ఎంతో అంకితభావంతో కృషి చేశారు.
🌈 *ప్రస్తుతం మహంతుల పాత్ర* 🌈
💫 ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన మహంతు వ్యవస్థ, కాలగమనంలో అనేక ఒడిదుడుకులకు లోనై; ప్రస్తుతం నామావశేషంగా, లాంఛనప్రాయంగా మిగిలింది. ప్రతిరోజు సుప్రభాత సమయంలో మహంతు మఠం నుండి అప్పుడే పితికిన ఆవుపాలు, వెన్న, పచ్చకర్పూర తాంబూలం ఆనందనిలయానికి చేరుతాయి. ఆ తాంబూల సమర్పణతోనే నవనీతహారతి పూర్తవుతుంది. సుప్రభాతపఠనం తరువాత మహంతులకు తీర్థం, చందనం, శెరారి వంటి ఆలయమర్యాదలు కూడా జరుగుతాయి. స్వామివారికి జరిగే ఉగాది, శ్రీరామనవమి, ఆణివార, దీపావళి ఆస్థానాలలో; బ్రహ్మోత్సవాలలో మహంతులకు ఆలయ లాంఛనాలతో అనేక మర్యాదలు జరుగుతాయి.
💫 ప్రస్తుతం మహంతుమఠం యొక్క శాఖలు తిరుమల, తిరుపతి లోనే కాకుండా; తిరుచానూరు, వేలూరు, చిత్తూరు, తంజావూరు, మధుర, అయోధ్య, ముంబాయి, నాసిక్, పంచవటి, భాగాల్ కోట్ వంటి; సమీప, సుదూర ప్రాంతాలకు కూడా విస్తరించాయి. ఇవన్నీ ఇప్పటికీ తి.తి.దే. ఆధ్వర్యంలో నడుస్తూ, అనేక ధార్మిక కార్యకలాపాలు చేపడుతున్నాయి.
No comments :