🙏 *శ్రీ హాథీరామ్ బావాజీ* 🌈
💫 స్వామివారి భక్తాగ్రేసరులలో అత్యంత ప్రముఖుడైన శ్రీ హాథీరామ్ బావాజీని స్మరించుకోకుండా తిరుమల క్షేత్ర చరిత్ర కానీ, శ్రీవేంకటేశ్వరుని ఇతిహాసం కానీ అసంపూర్తిగానే మిగిలిపోతాయంటే అతిశయోక్తి కాదు. వందల ఏళ్ళక్రితం, ఎక్కడో వేలమైళ్ళ దూరంలోనున్న హిమాచల్ ప్రదేశ్ నుంచి కాలినడకన వచ్చి, తిరుమలకొండపై జనావాసాలు ఏమాత్రం లేని రోజుల్లో స్థిరనివాసమేర్పరచుకుని, స్వామివారిని సేవించుకుంటూ, వారితో నిత్యము పాచికలాడిన శ్రీహాథీరామ్ బావాజీ చరిత్ర శ్రీవారి భక్తులందరికీ చిరపరిచితమే!
💫 వారి జీవనగమనం, శ్రీవేంకటేశ్వరునితో వారికున్న ప్రగాఢమైన అనుబంధం, తిరుమలలో బావాజీ జీవితంతో ముడివడి ఈనాటికీ దర్శించుకోదగ్గ ప్రదేశాలు, బ్రిటీషువారి హయాం అనంతరం ఆలయ నిర్వహణను తొంభై సంవత్సరాల పాటు చేపట్టిన మహంతు వ్యవస్థ - మొదలైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
🌈 *పుట్టుపూర్వోత్తరాలు*
💫 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని 'ఉనా' అనబడే గ్రామంలో, వంశపారంపర్యంగా శ్రీరామచంద్రుడి పరమభక్తుడైన 'దేశ్ రాజ్ బల్తోత్' అనే మధ్యతరగతి కుటుంబీనికి కలిగిన నలుగురు పుత్రులలో ఒకరిగా బాబాజీ జన్మించారు. వారి అసలు పేరు 'ఆశారామ్ బల్తోత్'. తరువాతి కాలంలో, 'లంబాడా' గిరిజన తెగకు చెందిన బలౌత్ కుటంబం పంజాబ్ రాష్ట్రానికి వలస వెళ్ళింది.
💫 మరి కొందరు చరిత్రకారులననుసరించి, బావాజీ పూర్వీకులు రాజస్థాన్ లోని 'నాగౌర్' పట్టణానికి చెందినవారు. తిరుమల లోని హాథీరాంజీ మఠంలో ప్రస్తుతం నివాసముంటున్న బావాజీ అనుయాయులు ఈ వాదాన్నే బలపరుస్తున్నారు.
🌈 *తిరుమల యాత్ర*
💫 బల్తోత్ వంశస్థులు, ఆనాడు ఉత్తర భారతదేశంలో ఉధృతంగా ప్రచారంలోనున్న రామానంద భక్తి ఉద్యమానికి చెందిన వైష్ణవులు. ఈనాటి 'ఢిల్లీ' పట్టణానికి కొద్ది దూరంలో 'రామానంద మఠం' ఉండేది. శ్రీరామ భక్తిని వంశపారంపర్యంగా పుణికి పుచ్చుకున్న హథీరాం బాబా ఆ రోజుల్లో రామానంద మఠానికి అధిపతి యైన అభయానంద్ స్వామీజీకి ప్రియశిష్యుడు.
💫 గురువాజ్ఞ మేరకు, కౌమారదశలోనున్న ఆశారామ్ బడ్జత్, ఒక భక్తబృందంలో సభ్యుడిగా దక్షిణ భారతదేశంలోని తీర్ధాలన్నింటిని కాలినడకన దర్శించుకుంటూ, తిరుమల క్షేత్రానికి విచ్చేశారు. కొద్ది రోజులు శ్రీవారిని సేవించుకున్న తరువాత భక్తబృందం లోని సభ్యులందరూ తిరిగి వెళ్ళిపోగా, బావాజీ మాత్రం తిరుమల క్షేత్రం లోని ప్రకృతి సోయగానికి, శ్రీవేంకటేశ్వరుని దివ్యసౌందర్యానికి ముగ్ధుడై సప్తగిరులే తన దీక్షకు అనువైన స్థానమని తలంచి కొండపైనే ఉండిపోయాడు. ఆలయానికి అతి సమీపంలో ఆగ్నేయ దిక్కున ఒక చిన్న ఆశ్రమం ఏర్పరుచుకొని, అనునిత్యం స్వామివారిని సేవించుకునేవాడు. ఆ కాలంలో తిరుమల ప్రాంతమంతా దట్టమైన అడవులతో, క్రూరమృగాలతో, భరింపశక్యం గాని చలితో దుర్గమంగా ఉండడం వల్ల కొండపై వేరెవరూ నివాసముండేవారు కాదు. అర్చకులతో సహా అందరూ కొండ దిగి, చీకటి పడకముందే దిగువ తిరుపతికి చేరుకునే వారు. బావాజీ ఒక్కరే స్వామివారిపై భారం వేసి, ఆశ్రమంలో నివాసముంటూ శ్రీవారిని సేవించుకునేవారు.
💫 బావాజీ స్వతహాగా, వంశపారంపర్యంగా శ్రీరాముడి భక్తుడవ్వడంతో; శ్రీవేంకటేశ్వరుని ముఖారవిందంలో కూడా స్వామివారి త్రేతాయుగ అవతారమైన శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకునే వాడు. 'కౌసల్యా సుప్రజా రామా' అంటూ స్వామి వారిని శ్రీరాముని వలెనే కీర్తించే వారు.
🌈 *ఆలయ బహిష్కరణ*
💫 ఆశ్రమం ఆలయానికి అతి సమీపంలో ఉండటంతో, బావాజీ ప్రతి దినము పెక్కుమార్లు శ్రీవారిని దర్శించుకునే వారు. ఆలయానికి వచ్చినప్పుడల్లా శ్రీనివాసుణ్ణి తదేకంగా చూస్తూ, శ్రీరాముణ్ణి తలపుకు తెచ్చుకుంటూ, తన్మయత్వంతో చాలా సేపు నిలుచుండి పోయేవారు. స్థానికంగా మాట్లాడే తెలుగు, తమిళ భాషలు ఏమాత్రం తెలియని ఒక ఉత్తరదేశపు వ్యక్తి తిరుమల క్షేత్రంలో స్థిరనివాసం ఏర్పరచుకొని; తరచూ ఆలయం లోనికి ప్రవేశించడం, వచ్చినప్పుడల్లా చాలాసేపు స్వామివారిని తదేకంగా చూస్తుండడంతో ఆలయ ఉద్యోగులు ఆయనను అనుమానించసాగారు. ఆ విషయాన్ని వారు ఆలయ యాజమాన్యం దృష్టికి తీసుకొని రాగా, మరునాడు హథీరాం బాబాకు ఆలయంలోకి ప్రవేశం నిరాకరించబడింది. భక్తి పారవశ్యం తప్ప మరే విషయము తెలియని హాథీరాం బాబా, తనను తన రాముడి నుండి వేరు చేయవద్దని, దర్శనానికి అనుమతించమని పదేపదే వేడుకున్నాడు. అయితే, 'పరదేశి' అయిన బావాజీ విన్నపం అరణ్యరోదనగానే మిగిలిపోయింది.
💫 స్వామివారితో విరహం ఏమాత్రం భరించలేని హథీరాం బాబా చింతాక్రాంతుడై తన ఆశ్రమానికి తిరిగి చేరుకున్నాడు. నిద్రాహారాలు మాని తన ఇష్టదైవమైన శ్రీరామునికి తన గోడును విన్నవించుకున్నాడు. తాను చిన్నతనం నుంచి శ్రీరాముడికి పరమ భక్తుడనని, నిత్యము స్వామివారిని దర్శించుకోకుండా తాను ఉండలేనన్న విషయం తెలిసి కూడా తనను నీ నుండి ఎందుకలా దూరం చేస్తున్నావని, సత్వరమే నిన్ను దర్శించుకోలేని పక్షంలో తనకు ప్రాణత్యాగం తప్ప మార్గాంతరం లేదని స్వామివారితో చనువుగా నిష్టూరమాడు. రోజంతా ఉపవాసదీక్షలో నుండి, స్వామివారితో తన వేదనను పంచుకున్న బావాజీ మరునాటి ఉదయం యథావిధిగా స్నాన సంధ్యావందనాదికాలు ముగించుకుని, స్వామివారి దర్శనార్థం ఆలయద్వారం వద్దకు మరలా చేరుకున్నాడు. అప్పుడు కూడా నిరాశే ఎదురైంది. ఆలయ కాపలాదార్లు అధికారుల ఆదేశాల మేరకు బావాజీని నిర్దాక్షిణ్యంగా గెంటి వేశారు. తీవ్రమైన నిరాశతో వెనుదిరిగి మఠానికి వచ్చిన బావాజీకి ఏం చేయాలో తోచలేదు.
🌈 *స్వామివారితో పాచికలాట*
💫 పరిపరి విధాలుగా ఆలోచించి, స్వామివారిపై ధ్యాసను మరల్చుకోలేని బావాజీ, తన ఆశ్రమాన్నే ఆలయంగా ఊహించుకుని, మనసులోనే స్వామివారిని ఆవాహన చేసుకొని, స్వామివారితో పాచికలాడుతున్నట్లుగా ఊహించుకోసాగాడు. పాచికలాడే పటాన్ని నేలపై పరచి, తన తరఫున, స్వామివారి తరఫున తానే స్వయంగా పాచికలు వేయడం ప్రారంభించాడు. చాలా సేపు ఆ విధంగా పాచికలాడిన తరువాత, రాత్రిసమయమవ్వడంతో నిద్రకు ఉపక్రమించాడు. స్వామివారి ఎడబాటుతో విలపిస్తున్న బావాజీకి, అలా పాచికలాడటం ఎంతో ఉపశమనాన్నిచ్చింది. స్వామివారితో చాలాసేపు పాచికలాడి, తృప్తితో నిదురించిన బావాజీ గాఢనిద్రలో ఉన్నప్పుడు వారికి, మంద్రస్వరంలో శ్రీరామచంద్రుని తీయని పిలుపు వినిపించింది. హఠాత్తుగా నిద్ర లేచిన బావాజీకి తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రుడి ముగ్ధ మనోహర రూపం సాక్షాత్కరించింది. బావాజీ ఒక్కక్షణం పాటు దానిని స్వప్నంగా భ్రమించాడు. మహిమ గల సిద్ధులకు, మునిపుంగవులకు సైతం సాధ్యంకాని శ్రీరాముని నిజరూపదర్శనం తనబోటి సాధారణ భక్తునికెలా సాధ్యం? ఇది తప్పనిసరిగా కలయే! స్వామి స్వప్నంలోనికి వచ్చి తనతో పరిహాసమాడుతున్నాడు! ఇలా పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఉద్విగ్న మనస్కుడై, చేష్టలుడిగిన బావాజీ ఆంతరంగాన్ని పసిగట్టిన శ్రీరామచంద్రుడు అతనిని సంబోధిస్తూ, అది కల కాదని, తన ఇష్టసఖుడైన బావాజీతో పాచికలాడ డానికి వైకుంఠం నుంచి దిగి వచ్చానని సర్దిచెప్పి పాచికలాట ప్రారంభించాడు.
💫 మహిమ గల సిద్ధులకు, మునిపుంగవులకు సైతం సాధ్యంకాని శ్రీరాముని నిజరూపదర్శనం తనబోటి సాధారణ భక్తునికెలా సాధ్యం? ఇది తప్పనిసరిగా కలయే! స్వామి స్వప్నంలోనికి వచ్చి తనతో పరిహాసమాడుతున్నాడు! ఇలా పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఉద్విగ్న మనస్కుడై, చేష్టలుడిగిన బావాజీ ఆంతరంగాన్ని పసిగట్టిన శ్రీరామచంద్రుడు అతనిని సంబోధిస్తూ, అది కల కాదని, తన ఇష్టసఖుడైన బావాజీతో పాచికలాడ డానికి వైకుంఠం నుంచి దిగి వచ్చానని సర్దిచెప్పి పాచికలాట ప్రారంభించాడు.
🙏 *భగవంతుని ఐచ్ఛిక ఓటమి* 🌈
💫 భక్తులచేతిలో పరాజయం పొందటాన్ని అమితంగా ఇష్టపడే శ్రీవారు, పాచికలాటలో స్వచ్ఛందంగా పరాజితులయ్యారు. తాను ఓటమిపాలై, బావాజీ విజేతగా నిలచినందున ఏదైనా వరాన్ని కోరుకొమ్మని పలికారు. సంతోషాంతరంగుడైన బావాజీ శ్రీరామచంద్రుని దర్శనభాగ్యంతో తన చిరకాల వాంఛ యీడేరి జన్మ ధన్యమైందని, అంతకుమించిన సంపద మరేమీ లేదని, శ్రీరాముని పాదాల చెంత కొంచెం చోటిమ్మని, ఇకమీదట తనను దూరం చేయవద్దని విన్నవించుకున్నాడు.
💫 బావాజీ నిస్వార్థ భక్తికి ముగ్ధుడైన శ్రీరామచంద్రుడు బావాజీకి తగిన ఆభయం ఇవ్వడమే కాకుండా, ప్రతిరోజు రాత్రి బావాజీతో పాచికలాడే నిమిత్తం ఆశ్రమానికి విచ్చేస్తానని శెలవిచ్చి అంతర్థానమయ్యాడు. బాబాజీ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మరునాటి ఉదయం శ్రీవారి దర్శనం నిమిత్తం ఆలయానికి విచ్చేసిన బావాజీకి పరమాశ్చర్యకరంగా, ఏ విధమైన అడ్డంకులు ఎదురు కాలేదు. చాలా సేపు శ్రీవారిని తనివితీరా దర్శించుకుని, తిరిగి ఆశ్రమానికి వచ్చి, సూర్యాస్తమయం కోసం ఆతృతగా ఎదురు చూడసాగాడు. 'ఎప్పుడెప్పుడు శ్రీవారితో పాచికలాడదామా' అని ఒక ప్రక్కన బావాజీ; ప్రియభక్తునితో భేటీ కోసం మరో ప్రక్కన శ్రీరామచంద్రుడు ఇరువురూ ఉవ్విళ్ళూరుతున్నారు.
💫 ఆనాటి రాత్రి పవళింపుసేవ అనంతరం ఆలయద్వారాలు మూయగానే, శ్రీవేంకటేశ్వరుడు శ్రీరామచంద్రుని రూపంలో బావాజీ ఆశ్రమానికేతెంచి, అతనితో పాచికలాడి, తన భక్తుని సాన్నిహిత్యంలో మురిసిపోయి, బావాజీని కూడా పరమానంద భరితుణ్ణి గావించాడు. అలా చాన్నాళ్ళు రాత్రివేళల్లో పాచికలాడిన తరువాత, బావాజీ సేవాభావానికి పూర్తిగా సంతృప్తి చెందిన శ్రీవారు, బావాజీ భక్తితత్పరతను లోకానికి చాటిచెప్పాలని భావించారు. తక్షణం వారి మదిలో ఒక ఆసక్తికరమైన పథకం రూపుదిద్దుకుంది. ఆ పథకాన్ని ఆచరణలో పెట్టే ఉద్దేశ్యంతో వెంటనే స్వామివారు కార్యోన్ముఖులయ్యారు.
[స్వామివారి పథకం ఏమిటో, దాన్ని వారు ఏ విధంగా ఆచరణలో పెట్టారో, దానితో బావాజీ పేరుప్రఖ్యాతులు ఏ విధంగా మార్ర్మోగి పోయాయో తెలుసుకుందాం.]
💫 బాబాజీ భక్తి తత్పరతను, నిస్వార్థ సేవాభావాన్ని లోకానికి వెల్లడించే ప్రయత్నంలో శ్రీవారు ఒక మహత్తరమైన పథకానికి నాంది పలికారు.
🌈 *మాయమైన వజ్రాలహారం* 🌈
💫 ఒకనాటి రాత్రి యథావిధిగా బావాజీ ఆశ్రమానికి వచ్చి, దాదాపు రాత్రి సమయమంతా బావాజీతో పాచికలాటలో వ్యస్తులై ఉన్న శ్రీవారు ప్రాతఃసంధ్య వేళలో సుప్రభాతపఠనం వినిపించడంతో, ఆటను మధ్యలోనే ఆపి హుటాహుటిగా ఆనందనిలయానికి బయలుదేరారు. బాబాజీ లాంటి భక్తులెందరికో దర్శనమిచ్చి వారందరినీ స్వామివారు కటాక్షించాలి కదా!
💫 ఆ హడావిడిలో శ్రీవారు తన వజ్రాలహారాన్ని అక్కడే వదలి వెళ్లారు. స్వామివారు నిష్క్రమించిన తర్వాత, వారి వజ్రాలహారాన్ని గమనించిన బాబాజీ దాన్ని తీసి పూజామందిరంలో భద్రపరిచాడు. మరునాటి రాత్రి ఆటకై వచ్చినపుడు దాన్ని భద్రంగా శ్రీవారికి అందజేద్దామని బావాజీ ఆంతర్యం.
💫 ఇంతలో, సుప్రభాతానంతరం గర్భాలయం లోకి విచ్చేసిన అర్చకస్వాములకు, దర్శనార్థమై వచ్చిన అధికారులకు, భక్తులకు స్వామివారు వజ్రాలహారం లేకుండా దర్శనమివ్వడంతో అందరూ విస్తుపోయారు. స్వామివారి అమూల్యమైన హారం చోరీకి గురైందని భావించారు. ఆలయంలో అణువణువునా గాలించారు. చివరికి అర్చకస్వాముల ఇళ్ళలో కూడా సోదాలు జరిగాయి. ఎక్కడా హారం కానరాలేదు.
🌈 *బావాజీపై నేరారోపణ* 🌈
💫 చివరికి ఆలయ అధికారుల దృష్టి బావాజీపై పడింది. ప్రతినిత్యం స్వామివారిని గంటల తరబడి తదేకదీక్షతో గమనిస్తూ ఉండడంతో బావాజీపై అనుమాన బీజం నాటుకుంది. కొద్దిసేపట్లోనే అనుమానం పెనుభూతంగా మారడంతో, రాజభటులు బావాజీ ఆశ్రమం లోకి బలవంతంగా ప్రవేశించి వెతుకులాట ప్రారంభించారు. ఈ విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా దైవచింతనలో మునిగివున్న బావాజీ అమాయకంగా ప్రశ్నించడంతో రాజభటులు శ్రీవారి అమూల్యమైన ఆభరణం తస్కరించబడిందని, అధికారుల ఆనతి మేరకు తాము బావాజీ ఆశ్రమంలో గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అదేదో మామూలు విషయంగా భావించిన బాబాజీ రాత్రి సమయంలో శ్రీరామచంద్రుడు తన ఆశ్రమానికి విచ్చేసి, తనతో పాచికలాడి, సుప్రభాత సమయంలో హడావిడిగా లేచి వెళ్లారని; ఆ తొందరపాటులో వజ్రాలహారాన్ని అక్కడే మరచిపోయారని జరిగింది జరిగినట్లుగా విడమరచి చెప్పాడు.
🌈 *బావాజీకి వింత శిక్ష* 🌈
💫 ఈ వృత్తాంతాన్నంతా విన్న రాజభటులకు, ఆలయ అధికారులకు బావాజీ చెప్పినదంతా నమ్మశక్యంగా గోచరించలేదు. ఆ హారాన్ని స్వాధీనపరచుకొని, బాబాజీని అప్పటి చంద్రగిరి పాలకుడైన 'గిరిధర రాయలు' వద్ద హాజరు పరిచారు. రాజుగారికి కూడా బావాజీ అదే విషయాన్ని తిరిగి చెప్పాడు. ఇదంతా కట్టుకథగా భావించిన రాజుగారు బాబాజీని గృహనిర్బంధంలో ఉంచి, తదుపరి విచారణ జరుప వలసిందిగా ఆజ్ఞాపించాడు.
💫 అయితే, బావాజీ అదే విషయాన్ని పదే పదే నొక్కి చెప్పడంతో తన నిర్దోషిత్వాన్ని నిరూపించు కోవడానికి రాజుగారు ఒక అవకాశం ఇచ్చారు. బావాజీకి స్వామివారితో అంతటి చనువు ఉన్నట్లైతే, తన మహిమను ప్రత్యక్షంగా చూపించాలి. బాబాజీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కోసం రాజుగారు ఒక పరీక్ష పెట్టారు. దాని ప్రకారం, రాజుగారి ఆజ్ఞ మేరకు బాబాజీని స్వగృహం లో నిర్బంధించి, అందులోనే బండెడు చెరకుగడలను ఉంచారు. మరునాటి ఉదయం లోపు ఆ చెరుకుగడ లన్నింటినీ బాబాజీ తినగలిగితే, వారు చెప్పేది యధార్థమైనట్లు లెక్క! లేకుంటే బాబాజీ తన నేరాన్ని అంగీకరించి, రాజుగారు విధించే శిక్షను అనుభవించాలి. ఆ శిక్ష అత్యంత కఠినంగా ఉండొచ్చు. ఆరోపణ 'దైవద్రోహానికి' సంబంధించినదవ్వడం వల్ల, మరణశిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఆ విధమైన షరతు విధించి, ఆశ్రమం తలుపులను మూసివేసి, కొద్దిమంది భటులతో కట్టుదిట్టమైన కాపలా ఉంచి, మిగిలిన వారందరూ నిష్క్రమించారు.
🌈 *గండం గట్టెక్కించిన గజరాజు* 🌈
💫 బావాజీకి ఏం చేయాలో పాలుపోలేదు. చెయ్యని నేరానికి తనకెందుకీ శిక్ష? ఎందుకీ అగ్నిపరీక్ష ? ఒక్క రాత్రిలో ఆ చెరకుగడల రాశిని భుజించటం మానవమాత్రుడికి సాధ్యమయ్యే పని కాదు. ఆ పని చేయాలంటే కేవలం ఏనుగు వల్లనే సాధ్యం!
💫 ఆ విధంగా ఆలోచించిన బావాజీ, భగవంతునిపై భారం వేసి, స్వామివారిని స్మరించుకుంటూ నిశ్చింతగా ఆ రాత్రి గడపసాగాడు. ఆ స్వామివారే తనను ఎలాగైనా రక్షించుకుంటారని అతని ప్రగాఢ విశ్వాసం. కొద్దిసేపట్లో, బావాజీ భగవన్నామస్మరణలో ఉండగా ఓ మహాద్భుతం జరిగింది. నిశిరాత్రివేళలో శ్వేతవర్ణంలో ఉన్న, ఐరావతం వంటి మత్తగజం, శరీరమంతా చందన లేపనంతో, నుదుటన తిరునామాలు ధరించి, తలుపులు మూసి ఉన్న గృహంలో ప్రత్యక్షమైంది. బావాజీ ఉద్విగ్నుడై చూస్తూ ఉండగా ఆ మత్తగజం గృహం లోని చెరుకుగడలన్నింటిని తన తొండంతో తీసుకొని, తృప్తిగా ఆరగించి, సారం లేని చెరకు పిప్పిని గుట్టగా పోసింది.
🌈 *రాజుగారి పశ్చాత్తాపం* 🌈
💫 మదపుటేనుగు ఘీంకారానికి మెలకువ వచ్చిన రాజభటులు ఏనుగు చెరకుగడలను భుజించటం చూసి విస్తుపోయారు. మూసిన గృహద్వారాలు మూసినట్లే ఉండటంతో, నమ్మశక్యం కాని ఈ వింతను రాజు గారికి వివరించారు. ప్రత్యక్ష సాక్షుల ద్వారా ఈ కథనాన్ని వినడంతో జ్ఞానోదయమైన రాజుగారు బాబాజీ చెప్పిన శ్రీవారి పాచికలాట ఉదంతాన్ని విశ్వసించి, అతణ్ణి శ్రీవారి పరమభక్తుడిగా గుర్తించి, బావాజీకి అనుచరుడిగా మారిపోయాడు. అంతటితో, 'గిరిధర రాయలు', 'గిరిధర దాసు' గా మారి, బావాజీకి ప్రథమ శిష్యుడయ్యాడు. బావాజీ ఆశ్రమానికి లెక్కలేనన్ని కానుకలనిచ్చి తన భక్తిని చాటుకున్నాడు. అప్పటి నుండి ఆశారామ్ బలౌత్ 'హాథీరా బాబా' గా వినుతికెక్కారు.
🌈 'హాథీ' అనగా ఏనుగు. ఆయన రామభక్తికి గుర్తుగా 'రాం' అనే పదం, ఉత్తరభారతదేశం లో సాధుపురుషులను సంబోధించే 'బాబా' లేదా 'బావా' అనే పదం వెరసి 'హాథీరామ్ బాబాజీ' గా అవతరించారు.
💫 ఈ ఉదంతంతో బావాజీ భక్తిప్రపత్తులు లోకప్రసిద్ధమై, వారిని దర్శించుకోవడానికి భక్తులు ఎగబడేవారు. ఉత్తరాది నుండి కూడా భక్తులు వెల్లువెత్తడం మొదలైంది. శ్రీవారి దర్శనానంతరం తప్పనిసరిగా బావాజీ ఆశ్రమానికి వచ్చి, వారిని కూడా భక్తిశ్రద్ధలతో నమస్కరించుకుని, కానుకలు సమర్పించుకునే వారు. అలా భక్తుల విరాళాలతో, రాజుగారి ప్రాపకంతో బాబాజీ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపట్టేవారు. దేవాలయానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం అనేక దానధర్మాలు నిర్వహించేవారు. బ్రహ్మోత్సవాల వంటి సందర్భాల్లో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు గావించేవారు. ఆ విధంగా భక్తుల విరాళాలతో, రాజుగారి అండదండలతో; అనతికాలంలోనే బాబాజీ నివాసముంటున్న చిన్న ఆశ్రమం ఈనాడు మనం చూస్తున్న పెద్దమఠం గా రూపు దిద్దుకుంది. ఎందరెందరో భక్తులు గృహస్తాశ్రమాన్ని త్యజించి, బావాజీ అనుచరులుగా, శిష్యులుగా మారారు. వారికి ప్రతిరాత్రి, బావాజి ఎవరితోనో సంభాషిస్తున్నట్లు, పాచికలు వేసిన సవ్వడి వినిపించేవి.
💫 తరువాతి కాలంలో బాబాజీ, తదనంతరం వారి అనుచరులు 'మహంతుమఠం' పేరిట ఒక ధార్మికసంస్థను ఏర్పరచి, దాని ద్వారా ఆలయాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేశారు. ఈ ఆశ్రమంలో నిరాశ్రయులకు, సాధువులు సన్యాసులకు, బైరాగులకు నిత్యాన్నదానం జరిగేది. 'మహంతు' అనే ఉత్తరభారత పదానికి 'సాధువు' లేదా 'సన్యాసి' అని అర్థం. కొందరి కథనం ప్రకారం, బావాజీ వల్లనే శ్రీవేంకటేశ్వరునికి 'బాలాజీ' అనే నామాంతరం వచ్చింది. అయితే, ఈ విషయం ధృవీకరించటానికి బలమైన ఆధారాలు లేవు. దేవాలయంలో పలు ఉత్తరభారత దేశ సాంప్రదాయాలకు మహంతుల కాలం లోనే శ్రీకారం చుట్టబడింది.
🙏 *బాబాజీ జ్ఞాపకాలు* 🌈
💫 బాబాజీ జీవితచరిత్రతో ముడివడియున్న అనేక జ్ఞాపకాలను నేడు కూడా తిరుమల క్షేత్రంలో దర్శించుకోవచ్చు. వాటిలో ముఖ్యమైన వాటిని గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
🌈 *హాథీరామ్ బాబా మఠం* 🌈
💫 అలయ మహాద్వారానికి ఎదురుగా నిలబడితే, మనకు ఎడం ప్రక్కగా పాత సహస్రదీపార్చన మంటపం పైభాగంలో, స్వామివారితో పాచికలాడుతున్న హాథీరామ్ బాబా కుడ్యశిల్పం నయన మనోహరంగా దర్శనమిస్తుంది. సరిగ్గా, దానికి వెనుకభాగంలోనే, ఎత్తైన గుట్టపై హాథీరామ్ బాబా మఠం ఉంది. దక్షిణ మాడవీధి లో, తిరుమలనంబి ఆలయం దాటిన తరువాత, 'సుపథం' ప్రక్కన ఉన్న సన్నటి మార్గం ద్వారా వెళ్ళి, కొన్ని మెట్లెక్కి ఈ మఠాన్ని చేరుకోవచ్చు. ఆ ప్రదేశం లోనే బాబాజీ ఒకప్పుడు నివసించేవారు. బావాజీ ఒక రాత్రి నిర్బంధించబడింది కూడా ఆ ప్రదేశంలోనే!
💫 కొన్ని వందల ఏళ్ళ క్రితం, శేషాచల అరణ్యాలలో విరివిగా లభ్యమయ్యే ఎర్రచందనం స్తంభాలతో, వివిధ కళాకృతులు అత్యంత మనోహరంగా చెక్కబడిన తలుపులు ద్వారబంధాలతో, పటిష్ఠమైన పైకప్పుతో రాచఠీవి ఉట్టిపడేలా నిర్మించబడ్డ ఈ మఠం నేటికీ చెక్కుచెదరకుండా, తిరుమల యాత్రికులను ఆకట్టుకుంటోంది. దీనికి అనుబంధంగా తరువాతి కాలంలో నిర్మించబడ్డ కట్టడాలు యాత్రికులకు వసతిగృహంలా ఉపయోగ పడుతున్నాయి. ముందస్తుగా ఆరక్షణ (రిజర్వేషన్) చేసుకొని, ఇందులో గదులు పొందవచ్చు. అయితే, దేవాలయానికి అతి దగ్గరగా ఉండటం, సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుడు నడయాడిన ప్రాంతం కావటం వంటి కారణాలవల్ల, ఇందులో వసతి లభించటం కొంచెం కష్టంతో కూడుకున్నది.
💫 ఈ అవరణలోనే, కొత్వాల్ ఆంజనేయస్వామి దేవాలయాన్ని మరియు గణపతి ఆలయాన్ని సందర్శించు కోవచ్చు.
💫 మఠం లోపల ఉన్న కోదండరామాలయంలో చలువరాతితో హృద్యంగా చెక్కబడిన సీతారామలక్ష్మణుల ముగ్ధమనోహరమైన విగ్రహాలను కన్నులారా వీక్షించుకోవచ్చు. ఆ విగ్రహాల చెంతనే, దశావతార సాలగ్రామాలు కూడా తరతరాలుగా పూజలందు కొంటున్నాయి. ఒక్కొక్క సాలగ్రామం పై ఒక్కొక్క దశావతారపు చిహ్నం మత్స్యాకారము, తాబేటి డిప్ప, వరాహమూపురము, మొదలైనవి ప్రకృతిసిద్ధంగా ముద్రాంకితమై, చూపరులకు అచ్చెరువు గొల్పుతుంటుంది.
💫 ఆ ఆలయానికి మూడు ప్రక్కలా ఊయలలో ఊగుతున్న చిన్నికృష్ణునికి, దశావతారాలకు ఉపాలయాలు ఉన్నాయి. ముద్దుల కృష్ణుని వెండి ఊయలను మనం కూడా ఊపి, స్వయంగా వారికి పవళింపు సేవ చేసి తరించవచ్చు.
💫 ఈ మఠంలో అన్నింటి కంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గది హాథీరామ్ బాబాతో, శ్రీవేంకటేశ్వరుడు పాచికలాడిన ప్రదేశం. ఈ ప్రదేశంలో నిర్మించబడిన చిన్న మంటపంలో ఆనాడు పాచికలాడిన, పట్టువస్త్రపు పాచికలపటం మరియు అఖండజ్యోతి నేటికీ నిత్యపూజలందు కొంటున్నాయి. ఈ ప్రదేశం వద్ద, కొన్ని వందల సంవత్సరాలుగా ఎల్లవేళలా, విరామం లేకుండా, రామనామ జపం జరుప బడుతోంది. ఆశ్రమవాసుల కథనం ప్రకారం బావాజీ వారే ఈ రామనామ పారాయణానికి శ్రీకారం చుట్టారు. అప్పటినుండి అది నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఆ రామనామ సంకీర్తన మహాయజ్ఞంలో మనం కూడా కొంతసేపు శృతి కలపి, బాబాజీ కృపకు పాత్రులు కావచ్చు.
💫 బాబాజీ, వారి శిష్యులైన మహంతులు అసీనులై ఉండే గద్దె కూడా ఈ మఠంలో సంరక్షించబడింది. మఠం ప్రాంగణంలో మఠాధిపత్యం వహించిన మహంతుల సమాధులను కూడా పరిరక్షించారు. మఠం యొక్క ప్రహరీగోడకు గల గవాక్షం గుండా దేవాలయ ఉపరితల భాగాన్ని, గోపురాలను కన్నులపండువగా కాంచవచ్చు. ఇప్పటి ప్రధాన మహంతు, మహంతుమఠానికి చెందిన మరికొందరు సభ్యులు ఈ మఠంలోనే నివాసముంటారు. దాదాపు రెండున్నర ఎకరాల సువిశాల ప్రదేశంలో నిర్మితమైన హాథీరామ్ బాబా మఠం, తిరుమల యందు తప్పనిసరిగా దర్శించి తీరవలసిన విశేషాల్లో ఒకటి.
💫 దాదాపుగా ఇలాంటిదే మరొక మహంతు మఠం తిరుపతి పట్టణాన, గోవిందరాజస్వామి ఆలయానికి సమీపంలో ఉంది. ప్రస్తుతం అది మహంతుకు మరొక ఆవాసంగానూ; తిరుపతిని దర్శించుకొనే సాధవులకు, సన్యాసులకు, బైరాగులకు విడిదిగానూ ఉపయోగ పడుతోంది.
💫 తిరుమల క్షేత్రంలో బాబాజీ జీవితంతో ముడివడిన మరికొన్ని విశేషాలను, మహంతుల పరిపాలనాకాలంలో తిరుమల క్షేత్రం తీరుతెన్నులను ఇప్పుడు తెలుసుకుందాం.
🌈 *కుడ్యశిల్పం* 🌈
💫 హాథీరామ్ జీవన గమనానికి సంబంధించి తిరుమలలో దర్శించుకో దగ్గ మరో ముఖ్య విశేషం ఈ కుడ్యశిల్పం. సంపంగి ప్రదక్షిణ మార్గంలో, ధ్వజస్తంభానికి ఎదురుగా, 'నడిమిపడి కావలి' లేదా 'వెండివాకిలి' ప్రవేశ మార్గంలో, దక్షిణం వైపున ఉన్న కుడ్యంపై; భక్తి పారవశ్యంలో మైమరచి ఉన్న హాథీరామ్ బాబాజీ, శ్రీవేంకటేశ్వరునితో పాచికలాడుతుండగా, అప్పటి చంద్రగిరి రాజైన గిరిధరదాసు వారి సమీపంలో నిలబడి ఆ వినోద క్రీడను ఆసక్తిగా తిలకిస్తున్నట్టున్న ఘట్టం జీవకళ ఉట్టిపడేట్లు చెక్కబడి ఉంది. ఈ శిల్పాన్ని రాజుగారే ప్రతిష్ఠించి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. దీనికి వెండి తాపడం గావించి, అద్దాల అరలో భద్రపరిచారు. వెండి వాకిలి లోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఈ శిల్పాన్ని మనకు ఎడమప్రక్కగా, అతి సమీపంలో నుండి దర్శించుకోవచ్చు. ఈసారి స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ విగ్రహానికి నమస్కరించు కుందాం!
🙏 *హథీరాం బావాజీ సజీవ సమాధి* 💐
💫 బాబాజీకి సంబంధించిన మరో ముఖ్యవిశేషం వారి 'జీవసమాధి'. సుదీర్ఘకాలంపాటు శ్రీవారిని సేవించి తరించిన బాబాజీ తన అవసాన దశలో, ఆలయానికి ఉత్తరదిశగా మూడు మైళ్ల దూరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. గోగర్భం ఆనకట్ట దాటిన తరువాత, ఆకాశగంగ తీర్థానికి ముందుగా, రహదారికి దాదాపు పావు మైలు దూరంలో ఈ ఆశ్రమం ఉంది. బాబాజీ ఈ ఆశ్రమంలో ఏకాంతంగా ఉంటూ, తపోదీక్షలో శేషజీవితాన్ని గడుపుతూ ఉండేవారు. రోజుల తరబడి నిరాహార దీక్షలో ఉండే బాబాజీ అప్పుడప్పుడు ఆశ్రమానికి సమీపంలో ఉన్న 'రామపత్ర వృక్షం' యొక్క ఆకులను మాత్రం భుజించి ప్రాణాలు నిలుపుకునేవారు. తీయని రుచి గల ఆకులతో ఉండే ఈ వృక్షాన్ని, ఆ ఆశ్రమ ప్రాంతంలో నేడు కూడా చూడవచ్చు. సమాధిని దర్శించుకోవడం కోసం వచ్చే భక్తులకు ఈ పత్రాలను ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.
💫 బాబాజీ ఆశ్రమానికి అతి సమీపంలోనే శ్రీవేణుగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించి, అందులో నిత్యపూజలు నిర్వహించేవారు. అలా త్రేతాయుగపు శ్రీరామచంద్రుణ్ణి సేవించడంతో మొదలైన బాబాజీ ప్రస్థానం, శ్రీమహావిష్ణువు కలియుగ అవతారమైన శ్రీవేంకటేశ్వరుణ్ణి కొలుచుకుంటూ, అంత్యదశలో, ద్వాపరయుగపు అవతారమైన శ్రీకృష్ణుని చరణాల చెంత ముగిసింది. బాబాజీ అక్కడే ఒక అఖండజ్యోతిని వెలిగించి, ప్రతి నిత్యము తన తపస్సును ప్రారంభించేవారు. వయోభారం మీదపడటంతో జనసంచారానికి దూరంగా ఉన్న ఆ ఆశ్రమంలో మౌనంగా శ్రీనివాసుణ్ణి స్మరించుకుంటూ కొన్ని సంవత్సరాలు గడిపిన బాబాజీ అదే ప్రదేశంలో సజీవసమాధి అయ్యారు. ప్రస్తుతం ఆ సమాధి మహంతుల సంరక్షణలో ఉంది. వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఈ మధ్యనే ఆధునీకరించారు. ఉత్తర భారతదేశస్తులు, ముఖ్యంగా లంబాడి గిరిజన తెగకు చెందిన భక్తులు, ఈ సమాధిని అధికంగా దర్శించుకుంటారు.
💫 ప్రతి ఏడాది బాబాజీ సజీవసమాధి లోకి ప్రవేశించిన రోజును పురస్కరించుకుని నరకచతుర్దశి నాడు 'హాథీరామ్ బావాజీ సమాధి వార్షికోత్సవం' అత్యంత వైభవంగా జరుగుతుంది.
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
No comments :