శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమలలోని మాడవీథులలోకి ప్రవేశించే భక్తులకు, ప్రధానగోపురానికి కుడివైపు ఒక మఠం కనిపిస్తుంది. దానిమీద శ్రీ వేంకటేశ్వరుడు ఎవరో భక్తునితో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది. ఆ మఠమే హాథీరాం మఠం. ఆ భక్తుడే బావాజి! బావాజి బంజారా తెగకు చెందినవారు. కొన్ని వందల ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుంచి తిరుమలకు చేరుకున్నారు.
అయితే శ్రీ వేంకటేశ్వరుని దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది. తోటి యాత్రికులంతా వెళ్లిపోయినా, ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వేంకటేశ్వరుని దర్శించుకునేవారు. అలా ఎంతసేపు ఆ మానుషమూర్తిని చూసుకున్నా బావాజీకి తనివి తీరేది కాదట.
ఆలయంలో గంటల తరబడి బావాజీ నిలబడి ఉండటం, అర్చకులకు కంటగింపుగా మారింది. అతనెవరో తెలియదు, అతని భాషేమిటో అర్థం కాదు. అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండటం అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటకు గెంటివేశారు. ఇకమీదట ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేశారు.
శ్రీనివాసుని దర్శనభాగ్యం కరువైన బావాజి చిన్నపిల్లవాడిలా విలపించాడు. సాక్షాత్తూ ఆ దేవుడే తనని గెంటివేసినంతగా బాధపడ్డాడు. అలా రాత్రింబగలు కన్నీరుమున్నీరుగా తడుస్తున్న బావాజీని ఓదార్చేందుకు ఆ శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు.
నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం! నేనే రోజూ నీతో సమయం గడిపేందుకు వస్తుంటానని బావాజీకి అభయమిచ్చాడు. అలా నిత్యం రాత్రిపూట పవళింపు సేవ ముగిసిన తరువాత, ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు బాలాజీ.
పొద్దుపొడిచేవరకూ వారిద్దరూ కబుర్లతో కాలం గడిపేవారు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలూ ఆడుకునేవారు. అలా ఒకసారి....
బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనేలేదు. సాక్షాత్తూ ఆ కాలస్వరూపుడే సమయాన్ని మర్చిపోయాడు.
సుప్రభాతవేళ సమీపించింది. జగన్నాథునికి మేల్కొలుపు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు. ఆ చప్పుళ్లను విన్న వేంకటేశ్వరుడు దిగ్గున లేచి ఆలయం లోపలికి వెళ్లిపోయాడు. ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి బావాజి మఠంలోనే ఉండిపోయింది.
ఆ ఉదయం మూలవిరాట్టుని అలంకరిస్తున్న అర్చకులు, ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవ్వడం గమనించారు.
అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలకి ప్రవేశించాడు. బావాజీ చేతిలో ఉన్న ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించలేదు. ఆ ఆభరణాన్ని లాక్కొని ఆయనను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు.
సాక్షాత్తూ ఆ దేవుడే తనతో పాచికలాడేవాడంటే నమ్మేది ఎవరు! నవాబూ నమ్మలేదు.
బావాజీని కారాగారంలో పడేశారు. నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రీ నీకోసం వచ్చే మాట నిజమే అయితే... నీకు ఒక పరీక్షను పెడుతున్నాం. ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం. ఉదయం సూర్యుడు పొడిచే వేళకి అవన్నీ పొడిపొడిగా మారిపోవాలి. అని హుంకరించాడు నవాబు.
ఆ అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు ఘీంకారాలు వినిపించాయి. అవేమిటా అని లోపలికి తొంగిచూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు, బండెడు చెరుకుగడలను సునాయాసంగా పిప్పి చేయసాగింది. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. ఎక్కడి కావలివాళ్లు అక్కడే ఉన్నారు.
అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది. ఆ కార్యక్రమం జరుగుతున్నంతవరకూ బావాజీ రామనామస్మరణ చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచీ ఆయనకు హాథీరాం బావాజీ అన్న పేరు స్థిరపడిపోయింది.
హాథీరాం భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయ అధికారిగా నియమించాడు.
హాథీరాంజీతో పాచికలాడి స్వామి తిరుమలలో తన ఆస్తున్నింటినీ పందెంగా పెట్టి ఓడిపోయాడని, అప్పటినుండి తిరుమల ఆలయం అతని వారసుల అధీనంలో ఉన్నదనీ కూడా ఒక కథనం ఉంది.
ఈస్టిండియా కంపెనీవారు దేవాలయాల నిర్వహణలో జోక్యం కలుగ జేసుకోకూడదని నిర్ణయించుకొన్న తరువాత (ఈ కథనం ఆధారంగా కావచ్చును) 1843లో ఆర్కాటు జిల్లా కలెక్టరు సనదు (ఉత్తర్వు) తో తిరుమల నిర్వహణను హాథీరాంజీ మఠం అధిపతికి అప్పగించారు
*శ్రీ విశ్వ తేజా గోవిందా, శ్రీ గిరి నిలయ గోవిందా, నిర్గుణ రూప* *గోవిందా, తిరుమల వాస గోవిందా; |*
*గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా.*
🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻