🙏 శ్రీవారి భక్తాగ్రేసరులు -3 🙏
🙏 తిరుమల నంబి 🙏
💫 తిరుమలక్షేత్రంలో జన్మించి, సాక్షాత్తు శ్రీమద్రామానుజు లంతటి వారిని శిష్యునిగా పొంది, తన జీవితకాలమంతా శ్రీవారి సేవకే అర్పించారు తిరుమలనంబి. ఆ ధన్యజీవి జీవితవిశేషాలను ఇప్పుడు పరికిద్దాం.
🌈 తిరుమలకు ఆగమనం 🌈
💫 పదవ శతాబ్దంలో, మూడు వైష్ణవదివ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీరంగంలో యామునాచార్యులు అనే వైష్ణవభక్తుడు శ్రీరంగనాథస్వామికి కైంకర్యసేవలు కొనసాగిస్తూ, తన శిష్యులకు శ్రీవైష్ణవ మతబోధ కావించేవాడు. ఒకనాడు ఆయన శిష్యులతో సంభాషిస్తూ, శ్రీ వేంకటాచల క్షేత్రంలో శ్రీనివాసునికి అభిషేక, తీర్థ, పుష్ప కైంకర్యాది సపర్యలు చేయటం భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్యంగా నమ్మాళ్వార్ (పన్నెండుమంది వైష్ణవ ఆళ్వార్లలో ఐదవ మరియు అత్యంత ప్రభావశాలియైన ఆళ్వార్) పేర్కొన్నట్లు చెబుతాడు.
💫 అయితే, వ్యక్తిగత కారణాల వల్ల అతికొద్ది కాలం మాత్రమే తానా కైంకర్యాలు చేయగలిగాననీ, తన శిష్యుల్లో ఎవరైనా, వేంకటాచలం మీద ఉండే, ఎముకలు కొరికే చలి, క్రిములు, క్రూరజంతువుల బాధలు తట్టుకుంటూ, శాశ్వతంగా అక్కడే ఉండి శ్రీవారికి సేవా కైంకర్యాదులు నిర్వహిస్తే, వారి కృపకు పాత్రులవుతురాని మరియు గురుతుల్యుడైన నమ్మాళ్వార్ ఆదేశం శిరసావహించినట్లవుతుందని శెలవిస్తాడు. ఆ రోజుల్లో తిరుమల నిర్జనారణ్యంగా, ప్రమాదభరితంగా ఉండడం వల్ల మిగిలిన శిష్యులెవ్వరూ అక్కడ నివాసమేర్పరుచు కోవడానికి సాహసించలేదు.
💫 యామునాచార్యుని ప్రియశిష్యుడు, మనుమడు అయిన శ్రీశైలపూర్ణుడు మాత్రం గురువుగారి ఆదేశానుసారం తిరుమలలో స్థిరనివాస మేర్పరుచుకుని, శ్రీవారికి నిత్యసేవలందించే లక్ష్యంతో, గురువుగారి ఆశీర్వాదంతో వేంకటాచలక్షేత్రానికి చేరుకుంటాడు. తిరుమలలో నివాసం ఏర్పరుచు కోవడం వల్ల ఆయన తిరుమలనంబి గా ప్రసిద్ధి కెక్కాడు.
🌈 పాపనాశనం తీర్థం 🌈
💫ఆయన అనునిత్యం స్వామివారి మూలవిరాట్ కు, ఉత్సవమూర్తులకు సేవా కైంకర్యం చేసేవాడు. అంతే కాక, ప్రతిరోజూ, శ్రీవారి ఆలయానికి అరుమైళ్ళ దూరంలో ఉన్న పాపవినాశనం వెళ్ళి, పవిత్ర తీర్థ జలాన్ని శిరస్సు పైనున్న ఒక మట్టికుండలో నింపుకుని, భగవన్నామ సంకీర్తన చేస్తూ, ఆ జలాన్ని తెచ్చి అర్చకులకు పూజాదికాల నిమిత్తం సకాలంలో అందించేవాడు.
🌈 బోయవాని రూపంలో శ్రీవారు 🌈
💫 పెక్కు సంవత్సరాల పాటు, అత్యంత నిష్ఠతో, భక్తిశ్రద్ధలతో అందిస్తున్న ఈ సేవకు శ్రీవారు తిరుమలనంబి యెడ సంతుష్ఠులవుతారు. ఒక రోజు యథాప్రకారం, అభిషేకజలం నెత్తిన పెట్టుకుని, వేళ మించకుండా ఆలయానికి చేరుకోవాలనే ఆతృతతో నడుస్తున్న శ్రీశైలపూర్ణుడుని, విల్లంబులు ధరించి, యువకుడైన బోయవాని రూపంలో స్వామివారు వెంబడిస్తారు. తనను తాతా, తాతా అని పిలుస్తూ వెంట వస్తున్న ఆ అందమైన బోయ యువకుణ్ణి, అరణ్యమధ్యంలో చూసిన శ్రీశైలపూర్ణుడు ఆశ్చర్యచకితుడవుతాడు.
💫 తాను చాలా దప్పికతో ఉన్నాననీ, ఆ కుండలోని నీళ్ళతో తన దాహం తీర్చమని ఆ బోయవాడు తిరుమలనంబిని వేడుకొంటాడు. అయితే, శ్రీవారిసేవకు వినియోగ మవ్వాల్సిన పవిత్రజలాన్ని ససేమిరా ఇవ్వనంటాడు తిరుమలనంబి. ఇప్పటికే ఆలస్యమైనందున, తన దారికి అడ్డు రాక దూరంగా వెళ్ళమని, ఆ బోయవాణ్ణి కసురుకుంటాడు.
💫 తనను కాదని వేగంగా నడక సాగించిన తిరుమలనంబిని అనుసరిస్తున్న ఆ బోయవాడు తన బాణప్రయోగంతో కుండకు రంధ్రం చేసి, ధారగా వస్తున్న నీటితో దాహం తీర్చుకుంటాడు.
💫 కొంత సేపటికి కుండ తేలిక పడడంతో వెను దిరిగిన తిరుమలనంబి కోపోద్రిక్తుడై, బోయవానితో పరుషంగా మాటలాడి, సమయానికి అభిషేకజలం సమకూర్చలేని తన అశక్తతను మన్నించమంటూ, శ్రీవారిని క్షమాభిక్ష అర్థిస్తాడు.
🌈 ఆకాశగంగ ఆవిర్భావం 🌈
💫 అంత ఆ బోయవాడు, "తాతా! నువ్వెంత మాత్రం విచారించకు. నా వెంట వస్తే దగ్గరలోనే ఉన్న మరో పవిత్ర తీర్థాన్ని చూపిస్తాను" అంటూ తిరుమలనంబిని ప్రక్కనే ఉన్న ఓ లోయలోనికి తీసుకు వెళతాడు. ఆ బోయవాడు తన పదునైన బాణంతో ఒక కొండరాతిని ఛేదించగా, స్వచ్ఛమైన పేయజలం పెల్లుబికింది. ఇకనుండి ఈ జలాన్నే నా అభిషేకానికి ఉపయోగించమని శెలవిచ్చి బోయవాని రూపంలో ఉన్న స్వామి అంతర్జానమవుతారు. అదే తరువాతి కాలంలో, తిరుమలలోని సుప్రసిద్ధ తీర్థాల్లో ఒకటైన ఆకాశగంగ గా వినుతికెక్కింది.
💫 కొంత సేపటికి సంభ్రమాశ్చర్యానందాల నుండి తేరుకున్న తిరుమలనంబి అసలు విషయం గ్రహించి, వడివడిగా ఆలయాన్ని చేరుకుంటాడు. అదే సమయంలో శ్రీవారు తన అర్చకుల నుద్దేశించి, ఇక నుండి శాశ్వతంగా తిరుమలనంబి తెచ్చే ఆకాశగంగ తీర్థాన్నే తన అభిషేక జలంగా ఉపయోగించాలని ఆదేశిస్తాడు.
💫 ముదిమి మీరుతున్న తిరుమలనంబి అత్యంత ప్రయాసతో ప్రతిరోజూ ఆరు మైళ్ళదూరం నుంచి పాపనాశన తీర్థజలాన్ని తేవడం గమనించి దయార్దుడైన శ్రీనివాసుడు, అతని నిత్యకృత్యాన్ని సులభతరం చేయడమే కాకుండా, అతని అనన్యభక్తిని లోకానికీ రీతిగా చాటిచెప్పాడు!
🌈 శ్రీపాదములు 🌈
💫 తిరుమలనంబి శ్రీవారి మహాభక్తుడే కాకుండా విద్వాంసుడు, వేదవేదాంగ పారంగతుడు కూడా!
💫 భగవద్రామానుజులవారు తిరుపతిలో ఉన్న సంవత్సర కాలంలో, తిరుమలనంబి వద్ద శ్రీమద్రామాయణం లోని రహస్యాలను ఆకళింపు చేసుకున్నారు. తిరుమలనంబి ప్రతిరోజూ ప్రాతఃకాలంలో స్వామివారిని సేవించుకుని, కొండదిగి, అలిపిరి వద్దనున్న తలయేరుగుండు సమీపానికి చేరుకునేవారు.
💫 అదే సమయంలో, రామానుజులవారు కూడా, తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామిని సేవించుకుని, ఆ ప్రదేశానికి వేంచేసేవారు. తిరుమలనంబి, రామాయణ రహస్యాలను, పదహారు సార్లు, పదహారు రకాల భాష్యంతో, పునరావృతం గాకుండా, రామానుజులవారికి అవగతం చేశారు. ప్రతిరోజూ వ్యాఖ్యానం పూర్తయిన తరువాత, తిరుమలనంబి తిరిగి కొండపైకి చేరుకొని శ్రీవారికి సాయంకాల కైంకర్యం చేసుకునేవారు. అయితే, అలిపిరిలో ఉండిపోయిన కారణంగా, మధ్యాహ్న సమయంలో శ్రీవారిని దర్శించుకో లేకపోతున్నానని తిరుమలనంబి చింతించేవాడు. వారి మనోగతాన్ని గుర్తెరిగిన శ్రీనివాసుడు తన పాదాలను తలయేరుగుండు వద్ద ప్రతిష్ఠింపజేసి, మధ్యాహ్న సమయంలో కూడా తిరుమలనంబి శ్రీవారి పాదపద్మాలను సేవించుకునే అవకాశం కల్పించాడు. ఆ పాదాలను అలిపిరి నడకమార్గంలో, తలయేరుగుండు సమీపాన నేడు కూడా దర్శించుకోవచ్చు.
🙏👉 కొండపై మనం దర్శించుకునే "శ్రీవారి పాదాలు" వేరు.
💫 అయితే, ఈ రామాయణ వ్యాఖ్యానం అలిపిరి నడకదారిలోని మోకాళ్ళపర్వతం నందున్న "త్రోవభాష్యకార్ల సన్నిధి" లో జరిగిందని కొందరు అభిప్రాయ పడతారు.
💫 శ్రీరామానుజాచార్యులువారు శ్రీగోవింద భట్టారకులు సోదరులు. భట్టారకుల వారు కొంతకాలం శ్రీకాళహస్తిలో నివసించి శైవమతాన్ని అవలంబించారు. శ్రీరామానుజుల వారు తన సోదరుడిని వైష్ణవమతం లోకి మార్చడానికి విశ్వప్రయత్నం కావించి విఫలమయ్యాడు. తిరుమలనంబి సహాయంతో 40 రోజులు వాదించి, తన సోదరుడిని వైష్ణవమతం లోకి మార్చగలిగాడు.
🌈 తోళప్పాచార్యుల కైంకర్యం 🌈
💫 ఇప్పటికీ, తిరుమలనంబి వంశీయులు ప్రతి శుక్రవారం ఉదయం ఒంటిగంటకు (అంటే తెల్లవారితే శుక్రవారం) రక్షక సిబ్బంది వెంటరాగా, దివిటీల వెలుగులో, కాలినడకన అడవిబాటలో మూడు మైళ్ళు ప్రయాణించి మూడు బిందెలతో ఆకాశగంగతీర్థం నుంచి అభిషేక జలాన్ని తెచ్చి మేళతాళాలతో ఆలయప్రవేశం చేస్తారు. దారి మధ్యలో ఉన్న బాటగంగమ్మకు మ్రొక్కి ఆ దేవత ఆశీర్వచనం తీసుకుంటారు. ఆకాశగంగ తీర్థాన్ని, తీర్థానికి వెళ్ళే అరణ్యమార్గంలో బాటగంగమ్మ ఆలయాన్ని ఈనాడు కూడా చూసి తరించుకోవచ్చు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 తిరుమలనంబి ఆలయం 🌈
💫 శ్రీవారి ఆలయానికి దక్షిణమాడ వీధిలోని మహాప్రదక్షిణ మార్గంలో, సంపంగి వృక్షాలనీడలో, తిరుమలనంబి ఆలయాన్ని మనం చూడవచ్చు. అందులో తిరుమలనంబి మూలమూర్తి ఉత్సవమూర్తులతో బాటుగా, రామానుజాచార్యుల వారిని కూడా దర్శించుకోవచ్చు. మలయప్పస్వామి మాడవీధుల్లో ఊరేగుతున్నప్పుడు ఈ ఆలయం ఎదురుగా నీరాజనం అందుకుంటారు. ఈ ఆలయంలో తిరుమలనంబి వంశీయులే ఇప్పటికీ అర్చకత్వం వహిస్తూంటారు.
💫 వేంకటేశుడు తిరుమలనంబిని తాతా అని పిలవడం వల్ల ఆ వంశస్థులందరూ "తాతాచార్యులు" గా పిలువబడుతున్నారు. అంతే కాకుండా, శ్రీవారు తిరుమలనంబిని "తోళన్" గా సంబోధించడం వల్ల ఈ వంశం వారిని "తోళప్పాచార్యులు" గా కూడా పేర్కొంటారు. తమిళంలో "తోళన్" అంటే స్నేహితుడని అర్థం. ప్రస్తుతం తిరుమలలో కైంకర్యం నిర్వహిస్తున్న తిరుమలనంబి వంశీయులను "తోళప్పాచార్యులు" గానూ; కాంచీపురంలోని తిరుమలనంబి వారసులను "తాతాచార్యులు" గానూ వ్యవహరిస్తారు.
💫 వైకుంఠ ఏకాదశికి పదకొండు రోజుల ముందుగా ప్రారంభమై, ఇరవయ్యైదు రోజులపాటు సాగే అధ్యయనోత్సవాల్లో చివరిరోజున తిరుమలనంబిని బోయవాడు తాతా అంటూ ఆప్యాయంగా పిలిచి, నీళ్ళు త్రాగిన రోజుకు గుర్తుగా తన్నీరుముదు అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
💫 అన్నమయ్య ఈ భక్తుణ్ణి కూడా, ....... "మచ్చిక దొలక తిరుమలనంబితోడుత నిచ్చనిచ్చ మాటలాడి నచ్చినవాడు ||" అంటూ తన పదబంధనంతో అమరుణ్ణి చేశాడు.
💫 తరాలు మారినా, యుగాలు మారినా వేంకటేశుడు తన భక్తుల కష్టనష్టాలను అనుక్షణం గమనిస్తూ, అడగకనే కడగండ్లు తీరుస్తూ ఆపద్బాంధవుడిగా అలరారుతున్నాడనడానికి తిరుమలనంబి వృత్తాంతమే నిలువెత్తు నిదర్శనం!