జ : ప్రతి దేవాలయంలో కూడా బలిహరణం కొరకు పీఠాన్ని పెడతారు. అక్కడికి మేళతాళాలతో వచ్చి అన్నాన్ని ఉంచుతారు. దేవాలయం వివిధ స్థాయిలలో సమాజానికి ఉపయుక్తం అవుతుంది. అందుకే దేవాలయ ప్రాంగణంతో సంబంధం లేనివాళ్ళు కానీ, దేవాలయం వల్ల ప్రయోజనం పొందని వాళ్ళు కానీ సమాజంలో ఉండరు. దేవాలయ వ్యవస్థకు అంత గొప్పతనం ఉంటుంది. దేవాలయంలో మూడు రకాలుగా లోక సంక్షేమాన్ని వ్యక్తం చేస్తారు. ఎలా అంటే
1. ప్రసాదము: ఈశ్వరుడికి నివేదన చేసినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. ఆ ప్రసాదాన్ని తీసుకుంటే బుద్ధియందు మన సమస్యకు విరుగుడు తోచేటట్లుగా చేయగలిగినటువంటి శక్తి ప్రచోదనం అవుతుంది. అందుకని ప్రసాద వితరణ కొరకు ఈశ్వరనివేదనమైన పదార్ధం పంచిపెట్టడం.
2. ప్రతిరోజూ హోమం చేస్తారు. అప్పుడు అగ్నిముఖంగా హవిస్సులు ఇస్తారు. ఆయా దేవతలు హవిస్సు అందుకుని ప్రసన్నులై ఆ ఊరు అంతటికీ సకాలంలో వర్షాలు పడతాయి. దేవతానుగ్రహంతో ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది. వ్యక్తులు ప్రతిరోజూ యజ్ఞయాగాదులు, హోమాలు, క్రతువులు చేయలేకపోవచ్చు. కానీ అందరికీ అందడం కోసమని చెప్పి హోమ ప్రక్రియ ద్వారా దేవతలకు హవిస్సు ఇవ్వడం అనేది కూడా దేవాలయంలోనే జరుగుతుంది. ఒక్కొక్క పెద్ద పెద్ద దేవాలయం ఉంటే అక్కడ హోమం చేస్తారు. గణపతి దేవాలయం – గణపతి హోమం జరుగుతుంది. అమ్మవారి దేవాలయం – ప్రతిరోజూ దుర్గాహోమమో, చండీ హోమమో, జరుగుతుంది. శివాలయం – ప్రతిరోజూ రుద్రహోమం చేస్తారు. విష్ణ్వాలయం – నారాయణ హోమం చేస్తారు. ఇలా దేవతలను ఉద్దేశించి హోమం చేసి హవిస్సులు ఇస్తారు.
3. ఇక మూడవది బలిహరణ మంటపం. దేవాలయంలో ధ్వజస్తంభం ఎలా ఉంటుందో అలాగే బలిపీఠం అని ఉంటుంది. ఈశ్వరుడికి నైవేద్యం పూర్తయిన తర్వాత మహా నైవేద్యం పెట్టిన పదార్థంలో కొంత తెచ్చి ఆ బలిహరణ మంటపాలపై ఉంచుతారు. అవి దేవాలయాలలో వివిధ ప్రదేశాలలో ఉంటాయి. బలి భుక్కులు అంటారు. అవి ఎవరు తినాలి అంటే అన్నీ ఈశ్వర సృష్టిలో వచ్చినవే. ఉగ్ర భూతములు ఉంటాయి. పిశాచాదులు. అవి కూడా తిరుగుతూ ఉంటాయి. వాటికీ అన్నం కావాలి. అవి తింటాయి. కాకులు మొదలైన పక్షులు తింటాయి. ఒక్కొక్కచో పిల్లులు లాంటివి తిరుగుతూ ఉంటాయి. అవి కూడా తింటాయి. దేవాలయంలో వాటికి స్థానం లేదు అని లేదు. పక్షి కూడా అక్కడికి వచ్చి నాలుగు మెతుకులు తిని వెళ్తుంది. అంటే ఏ మంత్రంతోటీ సంబంధం లేకుండా దానికి అధికారం ఉన్నదా? లేదా అన్న సంబంధం లేకుండా శౌచము దానికి ఉన్నదా లేదా అన్న సంబంధం లేకుండా దేవాలయంలోకి అవి ప్రవేశించవచ్చా? ప్రవేశించ కూడదా? అన్న సంబంధం లేకుండా దానివల్ల దేవాలయానికి పవిత్రత తగ్గుతుంది అన్నా కూడా అది కూడా వచ్చి తినడానికి అమంత్రకంగా ఎక్కడ పదార్ధం పెడతారో దానిని బలిహరణ మంటపాలు అంటారు. అవి వచ్చి తింటాయి. అక్కడ కూర్చుని భక్తులు ప్రదక్షిణాలకు వస్తే దేవాలయం మీదకో, ధ్వజస్తంభం మీదకో వెళ్ళి రెట్టలు వేస్తాయి, అరుస్తాయి. వీటన్నింటి చేత దేవాలయానికి శక్తి తగ్గుతుంది. అప్పుడు కుంభాభిషేకం చేస్తారు మళ్ళీ తప్ప వాటికి ప్రవేశం లేదు అని మాత్రం విడిచిపెట్టరు. ఉగ్రభూతాలు కూడా తినడానికి ఏ మంటపం మీద అన్నం పెడతారో దానిని బలిహరణ మంటపం అంటారు. దేవాలయంలో మేళతాళాలతో వెళ్ళి పెడతారు.
ఆంతరంగా ఆ బలిహరణ మంటపం ఎందుకు ఉంచుతారు అంటే దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఆ బలి పీఠం మీద యొక బలి ఇచ్చి లోపలి వెళ్ళాలి. ఏది బలి ఇవ్వాలి అంటే అరిషడ్వర్గములను బలి ఇవ్వాలి. అరి శత్రువు. ఏవి మనలను బాధ పెడుతున్నాయో ఆ ఆరు – కామక్రోధలోభమోహమదమాత్సర్యములు. ఈ ఆరింటిని బలిపీఠం మీద విడిచిపెట్టేసి దేవాలయంలోకి వెళ్ళాలి. ఈ ఆరు విడిచి పెట్టి దేవాలయంలోకి వెళ్ళడం అన్న మాటకు అర్థం దేవాలయంలో నా వెనక వాడికన్నా, నా ముందు వాడికన్నా అధికుడిని అన్న భావన నీకు కలగరాడు. అందరూ ఎంతో నేనూ అంతే.
ఆయన బిడ్డలలో నేనూ ఒక బిడ్డని అన్న భావనతో లోపలకు వెళతారు. దేవాలయమే ప్రత్యేకంగా ఆహ్వానించి తీసుకువెడితే పూర్ణకుంభం పెట్టి తీసుకువెళ్తారు. కాబట్టి బలిమంటపం మీద ఏది బలి ఇచ్చి వెళ్ళాలి అంటే మన అరిషడ్వర్గాలను బలి ఇవ్వాలి. అందుకే దేవాలయ ఆగమంలో బలిపీఠానికి అత్యంత ప్రధానమైన స్థానం. శైవాగమంలో శివాలయం ఉంటే ఆ ఆలయంలో శివలింగం ఉన్న గోపురానికి స్థూల లింగము అని పేరు. పైకి గోపురం వంక చూస్తే చాలు శివుని దర్శనం ఫలితంలో ఎనిమిదవ వంతు ఫలితం ఇస్తారు. మూలలింగం అంటారు. ఆలయం లోపల ఉన్నటువంటి లింగం – ఆ లింగాన్ని చూస్తే సూక్ష్మ లింగం అంటారు. ఆలయ దర్శనం ఫలితంలో ఎనిమిదవ వంతు ఫలితాన్ని సూక్ష్మ లింగ దర్శనానికి ఇస్తారు. పైన ఉన్న స్థూల లింగము, ఆలయంలో ఉన్న సూక్ష్మ లింగము కాకుండా మూడవది భద్రలింగము. బలిహరణ మంటపం భద్రలింగం. దాని ఉద్దేశ్యం ఏమిటంటే అది నాకెందుకు అని విడిచిపెట్టి వెళ్ళవలసింది కాదు. అక్కడ ఆగి ఒక నమస్కారం చేసి మనస్సులో ఏవిధమైన రాగద్వేషాలకీ తావు లేకుండా అరిషడ్వర్గములను అక్కడ విడిచిపెట్టేసి దేవాలయంలోకి వెళ్ళాలి.
అంటే దేవాలయంలోకి వెళ్ళి దెబ్బలాడడం గానీ, అక్కడకు వెళ్ళి గట్టిగా అరవడం గానీ, దేనివల్ల వస్తుంది అంటే ఏదో కోరిక ఉండి అది తీరకపోతే కోపం. లోపలికి వెళ్ళి అరటిపండు ఇవ్వండి అంటారు అలా ఇవ్వకూడదు బయట ప్రసాదం ఇస్తున్నారు అంటారు.
దెబ్బలాడతాడు. ఒక్కొక్కడు చమత్కారంగా ఇది నేనిచ్చిన కొబ్బరికాయ కాదండీ నాది పెద్ద కొబ్బరికాయ అంటాడు. ఇవన్నీ కామం. కామానికి చెల్లెలు క్రోధం. అది తీరలేదు కాబట్టి కోపం. కోపం వస్తే ఒళ్ళు తెలియదు. ఇంక అక్కడనుంచి దేవాలయంలోనే అరుపులు, కేకలు. లోభం - అక్కడికి వెళ్ళి జీవుడు తరించడానికి నువ్వు ఇస్తున్నావు. ఇక్కడ నువ్వు దాచుకున్నది నీవెంట రాదు. అక్కడ నువ్వు ఇచ్చినది నీ జీవుడిని తరింపజేయడానికి నీవెంట వస్తుంది. ఇవ్వవలసిన చోట లోభం అంతా ప్రదర్శిస్తాడు అప్పుడే. అదొక శత్రువు. మదం – ఇంత బలం ఉన్న వాడిని, అధికారం ఉంది, నేనింత గొప్పవాణ్ణి, ఏదో మనసులో ఒక భావన పెట్టుకుని వెళ్తాడు. మోహం – దేనిమీదో ఆసక్తి. మాత్సర్యం – ఎవరిపట్లో భేదభావన. అందుకని లోపల పక్షపాత బుద్ధి. నిండు హృదయంతో వినడు, చూడడు. పైకి మాట్లాడుతూ ఉన్నా లోపల మాత్రం మనకి పడదండీ అనుకుంటూ ఉంటాడు. ఇది మాత్సర్యం. ఇవి ఉండగా ఈశ్వర దర్శనం మనసునిండా జరుగదు. ఇవి ప్రతిబంధకాలు. ఈ ప్రతిబంధకాలు తొలగి పోతే తప్ప నిండు హృదయంగా నీ మనస్సు ఉండదు. గుడిలోకి వెళ్ళిన వాడి మనస్సు ఎలా ఉండాలి అంటే బాగా నలిపినటువంటి మట్టి ముద్ద చేతితో మెత్తి ఉంచితే ఎలా ఉంటుందో అలా ఉండాలి. అలా ఉంటే దానిమీద మహిషాసుర మర్దిని మూర్తిని నొక్కి తీస్తే ఆ ముద్ర దానిమీద పడిపోతుంది. మళ్ళీ మెత్తి విష్ణు స్వరూపాన్ని నొక్కి తీస్తే దాని ముద్ర పడుతుంది. అలా ముద్ర పడాలి అంటే అది ముద్దగా ఉండాలి. మనస్సు అలా ఉండాలి అంటే ఈ ఆరు వదిలి లోపలికి వెళ్ళాలి.
అప్పుడు ఆ ముద్ర హృదయంలో పడుతుంది. అలా లోపలికి రావాలి. అందువల్ల ఈ బలిహరణ మంటపం మీద ఈ ఆరూ వదలాలి. కామక్రోధలోభమోహ మద మాత్సర్యములను వదిలేసి నమస్కారం చేసి లోపలికి వెళ్ళాలి. అలా వెళ్తే కంటితో చూసింది కంటిలోంచే వచ్చి హృదయంలో పడుతుంది. పడిందా లేదా ఎలా అంటే నీకు నువ్వే సాక్షి. అందుకే గుళ్ళో నుండి బయటికి వచ్చేటప్పుడు తిన్నగా రాకూడదు. కాసేపు కూర్చోవాలి. కూర్చుని కళ్ళు మూసుకుని చూసిన మూర్తిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. అసలు ఏమీ గుర్తు రాలేదు అంటే ముద్ర పడడానికి అడ్డు వచ్చాయి ఏవో. అప్పుడు మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు బలిహరణ మంటపం దగ్గర బాగా నమస్కారం పెట్టి వెళ్ళాలి. ఈశ్వరా ఏదో తేడావచ్చింది పడలేదు ముద్ర. నన్ను నేను పరిశీలించుకొని పునర్దర్శనం చేయాలి. ఇప్పుడైనా జాగరూకుడవై ముద్ర పడిందా లేదా చూసుకోవాలి. అలా ముద్ర పడేవరకూ వెళ్ళాలి. బాగా పడిపోతే ముద్ర నువ్వు వెళ్ళలేని రోజున కళ్ళుమూసుకుంటే హృదయంలోనే దర్శనం అవుతుంది.
అది మానస పూజ. అప్పుడు నువ్వు మానసికంగా దేవాలయంలోకి వెళ్ళిపోగలవు. అలా వెళ్ళిపోయేటటువంటి శక్తిని పొందడానికి ప్రతిబంధకమైనటువంటి కామక్రోధలోభ మోహ మద మాత్సర్యములు ఏవున్నాయో వాటిని విడిచి పెట్టవలసినటువంటి స్థలం ఏదో అది బలిపీఠం.
బాహ్యంలో ప్రసాదాన్ని తీసుకువచ్చి భక్తులకు చేతిలో పెట్టి ఇస్తారు. పిలిచి పెట్టకుండా అవి వచ్చి తినడానికి వీలుగా పెట్టబడే ప్రదేశానికి బలిహరణ మంటపాలు అని పేరు. అందుకని బాహ్యాంతరములయందు దేవాలయాలలో బలిహరణ పీఠాలకి, మంటపాలకి అంత ప్రాధాన్యత ఉంటుంది ఆగమంలో.